సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలోనే టీచర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రెండు రోజుల్లో ప్రకటిస్తామని విద్యా శాఖ మంత్రి పి.సబితారెడ్డి వెల్లడించారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఆమె గురువారం ఎస్‌సీఈఆర్‌టీ సమావేశ మందిరంలో మీడియాతో మాట్లాడారు.‘‘రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నేరుగా భర్తీ చేసేందుకు 6,612 ఖాళీలు ఉన్నాయి.
వాటిలో 5,089 పోస్టులు సాధారణ పాఠశాలల్లో, 1,523 పోస్టులు ప్రత్యేక అవసరాలుగల పిల్లల కోసం నిర్దేశించినవి. వీటిని త్వరగా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించా రు. 2017లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) నిర్వహించి 8,792 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాం. కానీ ఇప్పుడు డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ)ల ద్వారా భర్తీ చేయాలని ముఖ్య మంత్రి ఆదేశించారు. దీనితో గతంలో నిర్వహించినట్టుగా డీఎస్సీల ద్వారా నియామకాలు చేపట్టనున్నాం..’’ అని మంత్రి సబితారెడ్డి వివరించారు.
9,979 పోస్టులకు పదోన్నతులు
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 1,22,386 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా.. వీటిలో 1,03,343 పోస్టుల్లో టీచర్లు పనిచేస్తున్నారని మంత్రి సబితారెడ్డి తెలిపారు. ప్రస్తుతం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో 6,612 పోస్టులను భర్తీ చేస్తుండగా.. పదోన్నతుల ద్వారా మరో 9,979 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని చెప్పారు. పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సిన కేటగిరీలో గెజిటెడ్ హెచ్‌ఎం ఖాళీలు 1,947 ఉన్నాయని, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం పోస్టులు 2,162 ఉన్నాయని.. స్కూల్ అసిస్టెంట్ స్థాయి టీచర్లకు పదోన్నతుతో వీటిని భర్తీ చేయాల్సి ఉంటుందని వివరించారు. మరో 5,870 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లోకి ఎస్జీటీ టీచర్లకు పదోన్నతులు కల్పించాల్సి ఉంటుందని తెలిపారు.
వచ్చే నెల 15న టెట్
డీఎస్సీ ద్వారా చేపట్టాల్సిన నియామకాలకు టెట్ కీలకమని.. ఇందుకోసం వచ్చే నెల 15వ తేదీన టెట్ పరీక్ష నిర్వహిస్తామని సబితారెడ్డి ప్రకటించారు. టెట్ ఫలితాలను వచ్చేనెల 27వ తేదీన ప్రకటిస్తామని.. ఆ తర్వాత ఉపాధ్యాయ నియామకాల ప్రకటన జారీ చేస్తామని తెలిపారు. పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సిన ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి కోర్టులో కేసు కొనసాగుతోందని, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే తక్షణమే వాటిని కూడా భర్తీ చేస్తామని చెప్పారు. ఇటీవల కేజీబీవీల్లో 1,264 పోస్టుల భర్తీ ప్రక్రియ జరిగిందని.. కొత్తగా 20 కేజీబీవీల ఏర్పాటుతో మరో 160 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని తెలిపారు.
వీటిని కూడా వీలైనంత త్వరగా భర్తీ చేస్తామన్నారు. ఇక వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ద్వారా విద్యాశాఖలో 3,896 మందికి లబ్ధి చేకూరిందని, ఇందులో అత్యధికులు విద్యాశాఖ వారే ఉన్నారని మంత్రి చెప్పారు. గురుకుల విద్యాసంస్థల్లో కూడా పలువురు ఉద్యోగులను క్రమబద్ధీకరించామన్నారు. మొత్తంగా విద్యాశాఖ పరిధిలో 8,792 పోస్టులు, కాలేజీల్లో 3,149 పోస్టుల భర్తీ ప్రక్రియలు టీఎస్‌పీఎస్సీ ద్వారా కొనసాగుతున్నాయని తెలిపారు.
భర్తీ చేసే టీచర్ పోస్టులు ఇవీ..
మొత్తం ఉపాధ్యాయ ఖాళీలు: 6,612
జనరల్ టీచర్లు: 5,089
వీరిలో స్కూల్ అసిస్టెంట్లు: 1,739
సెకండరీ గ్రేడ్ టీచర్లు: 2,575
భాషా పండితులు: 611
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు: 164
స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు: 1,523
వీటిలో ప్రాథమిక స్థాయిలో 796 పోస్టులు
– ప్రాథమికోన్నత స్థాయిలో 727 పోస్టులు
‘డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ’ ఇలా..
ప్రతి జిల్లాకు ఒక ‘డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ)’ ఉంటుంది. దీనికి సదరు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. వైస్ చైర్మన్‌గా అదనపు కలెక్టర్, కార్యదర్శిగా జిల్లా విద్యాశాఖ అధికారి, సభ్యులుగా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (జెడ్పీ సీఈఓ) వ్యవహరిస్తారు. గతంలో డీఎస్సీ ద్వారానే ఉపాధ్యాయ నియామకాలు జరిగేవి. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామంటూ డీఎస్సీలను ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా వీటిని తిరిగి ఏర్పాటు చేయనుంది.
6,612 టీచర్ పోస్టుల భర్తీ
Published Fri, Aug 25 2023 3:12 AM | Last Updated on Fri, Aug 25 2023 3:12 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment