నేడు అన్ని జిల్లాకేంద్రాల్లో సమావేశాలు
మార్గదర్శకాలు జారీ చేసిన విద్యాశాఖ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా జూన్ 3 నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఏ రోజున ఎవరేం చేయాలనే మార్గదర్శకాలను బుధవారంరాత్రి విద్యాశాఖ విడుదల చేసింది. నిర్ణయించిన తేదీల్లో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఉపాధ్యాయులు తమ పరిధిలోని గ్రామాలు, శివారు గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది.
చదువుకోని పిల్లలను గుర్తించి, వారిని సమీపంలోని అంగన్‌వాడీలు, స్కూళ్లలో చేర్పించడం, ప్రభుత్వ స్కూళ్లల్లో ప్రవేశాలు పెంచడం, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై అవగాహన కల్పించడం బడిబాట ఉద్దేశం. ఈ క్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక బృందాలు, ఎన్‌జీఓల తోడ్పాటు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. 3 నుంచి 19వ తేదీ వరకు ఏ రోజు ఏం చేయాలనే వివరాలతో కూడిన షెడ్యూల్‌ను కూడా విద్యాశాఖ ప్రకటించింది.
కలెక్టర్ల నేతృత్వంలో కార్యాచరణ
» జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో డీఈఓలు, ఎంఈఓలు, స్కూల్ ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఈ నెల 30వ తేదీన వివిధ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహిస్తారు. బడిబాట కార్యక్రమ ప్రణాళిక ఖరారు చేస్తారు. జూన్ 10వ తేదీ నాటికి ప్రభుత్వ స్కూళ్లల్లో నోట్‌బుక్స్, టెక్ట్స్‌బుక్స్, యూనిఫాం పంపిణీకి సిద్ధం చేస్తారు.
» సామాజిక సేవాసంస్థలు, ఎన్‌జీఓలు వివిధ వర్గాలను డీఈఓలు సమన్వయపరిచి, బడిబాటను ముందుకు తీసుకెళ్లాలి. ఎంఈఓలు, హెచ్‌ఎంలకు, టీచర్లకు బడిబాట దిశానిర్దేశం చేస్తారు. కార్యక్రమంపై విస్తృత ప్రచారం కల్పిస్తారు. మండలపరిషత్ అధికారులు, ఎస్‌ఐ, వివిధ వర్గాల నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేస్తారు.
»మండలస్థాయి కమిటీలను ఎంఈఓలు ఏర్పాటు చేస్తారు. ఏరోజు ఏం చేయాలనే కార్యాచరణను మండల పరిధిలో ఎంఈఓలు రూపొందిస్తారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారు.
» గ్రామస్థాయిలో కమిటీలు, బడిబాటపై అవగాహన, ప్రచార కార్యక్రమాన్ని స్కూల్ హెచ్‌ఎంలు నిర్వహిస్తారు. స్థానిక నేతల భాగస్వామ్యాన్ని తీసుకోవడంలో కీలక భూమిక పోషిస్తారు. బడిబాట ద్వారా గుర్తించిన విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియ చేపడతారు.
Comments
Please login to add a commentAdd a comment