సాక్షి, అమరావతి: ప్రత్యేక అవసరాల(దివ్యాంగ) విద్యార్థులకు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించని పాఠశాలలు, ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. వైకల్యాన్ని సాకుగా చూపి తమ పిల్లలకు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించడం లేదని రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన తల్లిదండ్రుల నుంచి సమగ్ర శిక్ష, విద్యా శాఖ ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదుల మేరకు సమగ్ర శిక్ష ఈ నిర్ణయం తీసుకుంది. కొన్నిచోట్ల ప్రభుత్వ పాఠశాలలు, అత్యధికంగా ప్రైవేటు పాఠశాలలపై ఈ తరహా ఫిర్యాదులు అందుతున్నాయి.
దివ్యాంగ విద్యార్థులనూ సాధారణ విద్యార్థులతో సమానంగా పరిగణించాలని, సమాన హక్కులు కల్పించాలని సమగ్ర శిక్ష ఉత్తర్వుల్లో ఉంది. సమగ్ర శిక్ష రాష్ట్ర విభాగం లెక్కల ప్రకారం రాష్ట్రంలో 93 వేల మంది దివ్యాంగ విద్యార్థులు ఒకటి నుంచి 10వ తరగతి చదివే వయసుగలవారున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో కొన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు ప్రవేశాలిచ్చేందుకు నిరాకరించడంతో సమగ్ర శిక్ష రాష్ట్రాధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. అయితే ఇటీవల ప్రయివేటు పాఠశాలలపై కూడా ఇదే తరహా ఫిర్యాదులు అందడంతో విచారణ చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖను సమగ్ర శిక్ష ఆదేశించింది.
వారి ప్రవేశాలను అడ్డుకుంటే చర్యలు
కొన్ని పాఠశాలల్లో దివ్యాంగ విద్యార్థులకు ప్రవేశాలు ఇవ్వడం లేదని ఫిర్యాదులందాయి. ఇలాంటి ప్రయివేటు పాఠశాలలపైన, ప్రభుత్వ పాఠశాలల్లో అయితే ప్రధానోపాధ్యాయులపైనా విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలిచ్చాం. రాష్ట్రంలో ఉన్న 93 వేల మంది దివ్యాంగ పిల్లల్లో పాఠశాల వయసువారే అధికం. ప్రభుత్వ స్థాయిలో 672 భవిత సెంటర్లలో సుమారు 900 మంది ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్‌ను నియమించి పిల్లలకు ప్రాథమిక స్థాయిలో సౌకర్యాలు కల్పించి ఎలిమెంటరీ విద్యనందిస్తున్నాం. ఉన్నత పాఠశాలల్లోనూ 652 మంది స్పెషల్ ఎడ్యుకేటర్స్ దివ్యాంగుల కోసం పనిచేస్తున్నారు.
– బి.శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ
దివ్యాంగ విద్యార్థుల ప్రవేశాలకు మార్గదర్శకాలు
► ఆరు నుంచి 18 ఏళ్ల వయసు గల ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలపై వివక్ష చూపకుండా తప్పనిసరిగా వయసు ప్రకారం ఆయా తరగతుల్లో ప్రవేశం కల్పించాలి.
► వైకల్యాన్ని సాకుగా చూపి ప్రవేశాన్ని నిరాకరించకూడదు.
► విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా వీరికి ప్రవేశాలు కల్పించొచ్చు.
► నూరు శాతం వైకల్యం గల పిల్లలకు హాజరు నుంచి మినహాయింపునివ్వాలి.
Comments
Please login to add a commentAdd a comment