disabilities
-
సమాజాన్ని చూసే తీరును నా కూతుళ్లు మార్చేశారు
న్యూఢిల్లీ: దివ్యాంగుల పట్ల, ముఖ్యంగా దివ్యాంగ బాలల పట్ల సమాజం వ్యవహరించే తీరులో మార్పు రావాల్సిన అవసరముందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. దివ్యాంగ బాలలు లైంగిక హింసకు సులువైన లక్ష్యాలుగా మారుతున్నారంటూ ఆవేదన వెలిబుచ్చారు. ఈ దారుణాల నుంచి కాపాడుకోవడం, వాటి బారిన పడేవారి పట్ల సహానుభూతితో వ్యవహరించడం మనందరి బాధ్యత అన్నారు. శనివారం ఆయన దివ్యాంగ బాలల హక్కుల పరిరక్షణపై 9వ జాతీయ సదస్సులో పాల్గొన్నారు. దివ్యాంగుల హక్కులపై సుప్రీంకోర్టు హాండ్‌బుక్‌ను విడుదల చేశారు. అనంతరం ప్రారంభోపన్యాసం చేశారు. ‘‘దివ్యాంగ బాలల భద్రత, సంక్షేమానికి నా హృదయంలో ప్రత్యేక స్థానముంది. నేను దివ్యాంగులైన ఇద్దరు ఆడపిల్లల తండ్రిని. సమాజం పట్ల నా దృక్కోణాన్ని నా కూతుళ్లు పూర్తిగా మార్చేశారు’’ అని చెప్పారు. నైపుణ్యం, సామర్థ్యాలతో నిమిత్తం లేకుండా బాలల హక్కులను పరిపూర్ణంగా పరిరక్షించే ఆదర్శ సమాజమే మనందరి లక్ష్యం కావాలని సూచించారు. ఇందుకోసం పలు కీలకాంశాలపై దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. ‘‘దివ్యాంగ బాలల సమస్యలను గుర్తించాలి. లైంగిక దాడుల వంటి హేయమైన నేరాల బారిన పడే దివ్యాంగ బాలికలను అక్కున చేర్చుకుని వారిలో ధైర్యం నింపాలి. పూర్తిగా కోలుకునేందుకు అన్నివిధాలా దన్నుగా నిలవాలి. పోలీస్‌స్టేషన్ మొదలుకుని కోర్టు దాకా ప్రతి దశలోనూ వారి పట్ల అత్యంత సున్నితంగా, సహానుభూతితో వ్యవహరించాలి. ఇందుకు అవసరమైన మేరకు బాలల న్యాయ వ్యవస్థకు, దివ్యాంగుల హక్కుల చట్టానికి మార్పులు చేయాలి. ఇందుకు అంతర్జాతీయ చట్టాల నుంచి స్ఫూర్తి పొందాలి. వారిపై అకృత్యాలను నివారించడంపై ప్రధానంగా దృష్టి సారించాలి. ఆ బాలలకు నాణ్యతతో కూడిన విద్య, అనంతరం మెరుగైన ఉపాధి తదితర అవకాశాలు కల్పించాలి. తద్వారా అడుగడుగునా అండగా నిలవాలి. ఈ విషయమై వారి తల్లిదండ్రులతో పాటు పోలీసులకు, లాయర్లకు, న్యాయమూర్తులకు కూడా మరింత అవగాహన కల్పించాలి’’ అని సీజేఐ పిలుపునిచ్చారు. -
ప్రభుత్వ ప్రోత్సాహం తోడై.. ఆత్మ విశ్వాసం నీడై
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వ ప్రోత్సాహం తోడైంది. దానిని అందిపుచ్చుకుంటూ వారంతా ఆత్మ విశ్వాసంతో నిలబడుతున్నారు. నాలుగున్నరేళ్లలో విభిన్న ప్రతిభావంతుల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్ర జనాభాలో 2.23 శాతం (సుమారు 11.04లక్షలు) మంది విభిన్న ప్రతిభావంతులు ఉన్నారు. వివిధ వైకల్యాలతో బాధపడుతున్న 21 రకాల వారిని విభిన్న ప్రతిభావంతులుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారంతా సమాజంలో నిలదొక్కుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వీరంతా స్వయం ప్రతిపత్తి, సాధికారత సాధించేలా.. ప్రతిభావంతులుగా నిలబెట్టేందుకు కృషి చేస్తోంది. ప్రత్యేకంగా విద్య, ఉద్యోగం, ఉపాధి కల్పించేందుకు అనేక చర్యలు చేపట్టింది. వారి సమస్యలు గుర్తించి పరిష్కరించే దిశగా రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, వయో వృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ మంత్రి అధ్యక్షతన రాష్ట్రస్థాయి సలహా మండలిని నియమించింది. కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి కమిటీలను సైతం ఏర్పాటు చేసింది. విభిన్న ప్రతిభావంతుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేలా ప్రతి శాఖలోను ప్రత్యేక అధికారిని నియమించింది. ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో వారికి 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏపీ స్టేట్, సబార్డినేట్ రూల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. వైకల్యం ఉందన్న కారణంతో వారికి పదోన్నతి నిరాకరించడం, ఉన్న పోస్టు నుంచి తగ్గించడం, తొలగించడం చేయకూడదని ప్రభుత్వం అన్ని శాఖలకూ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. సదరం ద్వారా వైకల్యం ధ్రువీకరణ పత్రాలు అందించడాన్ని సైతం సులభతరం చేసింది. ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల్లో వారికి 5 శాతం రిజర్వేషన్ కల్పించింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రవేశానికి సైతం గరిష్టంగా ఐదేళ్ల వయోపరిమితిని సడలించింది. దీంతోపాటు విద్యాలయాలు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాలకు విభిన్న ప్రతిభావంతులు వెళ్లి వచ్చేందుకు ఎటువంటి అవాంతరాలు (అడ్డంకులు) లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. పెద్ద మనసుతో ఎన్నో చర్యలు రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులకు విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్ద మనసుతో అనేక చర్యలు చేపట్టారు. ఈ ఏడాది 1,750 మూడు చక్రాల మోటార్ సైకిళ్లు, అనేక సహాయక పరికరాలు అందించాం. అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో వారికి సీట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవడంతో పాటు, బడికి వెళ్లేలా సౌకర్యాలు కల్పించాం. చెవిటి, మూగ వారికి, అంధ విద్యార్థులకు 640 మందికి ప్రత్యేకంగా ఆరు ప్రత్యేక విద్యాసంస్థల్ని నిర్వహిస్తున్నాం. జగనన్న వసతి దీవెన, స్కాలర్షిప్లు అందిస్తున్నాం. ప్రత్యేక భర్తీతో 691 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. – కేవీ ఉషశ్రీ చరణ్, మహిళా, శిశు, వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల శాఖ మంత్రి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది విభిన్న ప్రతిభావంతులను అన్నివిధాల ఆదుకోవడంలో ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమంలో వారి పట్ల వైఎస్ జగన్ అభిమానం చాటుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ సెలవులు 15 రోజులు ఉంటే.. విభిన్న ప్రతిభావంతులకు మరో 7 రోజులు అదనంగా స్పెషల్ క్యాజువల్ లీవ్స్ ఇస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.సామాజిక భద్రత పెన్షన్లు అందించడంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఈ ఏడాది బడ్జెట్లో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.4,201.26 కోట్లు కేటాయించింది. – బి.రవిప్రకాశ్‌రెడ్డి, సంచాలకుడు, వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ -
హిమాచల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా దివ్యాంగ మహిళలు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో ఇద్దరు దివ్యాంగ మహిళలు అరుదైన ఘనత సాధించారు. అంధులైన వీరిద్దరూ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమితులయ్యారు. పట్టుదల, అంకితభావంతో తమ కలలను నిజం చేసుకున్నారు. రైతు కుటుంబంలో జని్మంచిన ముస్కాన్ ప్రముఖ గాయకురాలు. హిమాచల్‌ప్రదేశ్ నుంచి ఎన్నికల సంఘం యూత్ ఐకాన్‌గా ఇప్పటికే గుర్తింపు పొందారు. దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. 2013లో రాజ్‌కియా కన్య మహావిద్యాలయలో సంగీతంలో ప్రవేశం పొందారు. ఇప్పుడు అదే విద్యాసంస్థలో సంగీతంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ముస్కాన్ చురుగ్గా ఉంటున్నారు. సాధారణమధ్య తరగతి కుటుంబంలో జని్మంచిన ప్రతిభా ఠాకూర్ సైతం అంధురాలు. పీహెచ్డీ పూర్తిచేశారు. విద్యా రంగంలో సేవలు అందించాలన్నది ఆమె చిన్నప్పటి కల. రాజీవ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితురాలైంది. -
‘ప్రత్యేక అవసరాల’ పిల్లలకు ప్రవేశాలు ఇవ్వాల్సిందే..
సాక్షి, అమరావతి: ప్రత్యేక అవసరాల(దివ్యాంగ) విద్యార్థులకు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించని పాఠశాలలు, ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. వైకల్యాన్ని సాకుగా చూపి తమ పిల్లలకు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించడం లేదని రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన తల్లిదండ్రుల నుంచి సమగ్ర శిక్ష, విద్యా శాఖ ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదుల మేరకు సమగ్ర శిక్ష ఈ నిర్ణయం తీసుకుంది. కొన్నిచోట్ల ప్రభుత్వ పాఠశాలలు, అత్యధికంగా ప్రైవేటు పాఠశాలలపై ఈ తరహా ఫిర్యాదులు అందుతున్నాయి. దివ్యాంగ విద్యార్థులనూ సాధారణ విద్యార్థులతో సమానంగా పరిగణించాలని, సమాన హక్కులు కల్పించాలని సమగ్ర శిక్ష ఉత్తర్వుల్లో ఉంది. సమగ్ర శిక్ష రాష్ట్ర విభాగం లెక్కల ప్రకారం రాష్ట్రంలో 93 వేల మంది దివ్యాంగ విద్యార్థులు ఒకటి నుంచి 10వ తరగతి చదివే వయసుగలవారున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో కొన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు ప్రవేశాలిచ్చేందుకు నిరాకరించడంతో సమగ్ర శిక్ష రాష్ట్రాధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. అయితే ఇటీవల ప్రయివేటు పాఠశాలలపై కూడా ఇదే తరహా ఫిర్యాదులు అందడంతో విచారణ చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖను సమగ్ర శిక్ష ఆదేశించింది. వారి ప్రవేశాలను అడ్డుకుంటే చర్యలు కొన్ని పాఠశాలల్లో దివ్యాంగ విద్యార్థులకు ప్రవేశాలు ఇవ్వడం లేదని ఫిర్యాదులందాయి. ఇలాంటి ప్రయివేటు పాఠశాలలపైన, ప్రభుత్వ పాఠశాలల్లో అయితే ప్రధానోపాధ్యాయులపైనా విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలిచ్చాం. రాష్ట్రంలో ఉన్న 93 వేల మంది దివ్యాంగ పిల్లల్లో పాఠశాల వయసువారే అధికం. ప్రభుత్వ స్థాయిలో 672 భవిత సెంటర్లలో సుమారు 900 మంది ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్‌ను నియమించి పిల్లలకు ప్రాథమిక స్థాయిలో సౌకర్యాలు కల్పించి ఎలిమెంటరీ విద్యనందిస్తున్నాం. ఉన్నత పాఠశాలల్లోనూ 652 మంది స్పెషల్ ఎడ్యుకేటర్స్ దివ్యాంగుల కోసం పనిచేస్తున్నారు. – బి.శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ దివ్యాంగ విద్యార్థుల ప్రవేశాలకు మార్గదర్శకాలు ► ఆరు నుంచి 18 ఏళ్ల వయసు గల ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలపై వివక్ష చూపకుండా తప్పనిసరిగా వయసు ప్రకారం ఆయా తరగతుల్లో ప్రవేశం కల్పించాలి. ► వైకల్యాన్ని సాకుగా చూపి ప్రవేశాన్ని నిరాకరించకూడదు. ► విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా వీరికి ప్రవేశాలు కల్పించొచ్చు. ► నూరు శాతం వైకల్యం గల పిల్లలకు హాజరు నుంచి మినహాయింపునివ్వాలి. -
Jayanthi Narayanan: ఒక అమ్మ .. 1000 మంది పిల్లలు
Best Teacher Jayanthi Narayanan: స్పెషల్ చిల్డ్రన్‌కి ఆమె తల్లి, తండ్రి, గురువు. ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం నుంచి బెస్ట్ టీచర్ అవార్డ్ అందుకున్న జయంతి ‘దేవుడు నన్ను ఈ పిల్లల కోసమే పుట్టించినట్టున్నాడు’ అని నమ్ముతుంది. దాదాపు 36 ఏళ్లుగా ఆమె చెన్నై మైలాపూర్‌లోని క్లార్క్స్కూల్లో ఇప్పటికి కనీసం వెయ్యిమంది స్పెషల్ చిల్డ్రన్కు కనీస చదువు, ప్రవర్తన నేర్పించింది. ‘నా జీవితం వారికే అంకితం’ అంటోంది జయంతి. మైలాపూర్‌లో ‘ది క్లార్క్ స్కూల్ ఫర్ ది డెఫ్’లో జయంతిని పిల్లలు ఎవరూ టీచర్‌గా చూడరు. వాళ్లు స్పెషల్ చిల్డ్రన్. కొంతమందికి వినిపించదు. కొందరు చూడలేదు. మరికొందరికి బుద్ధి వికాసంలో లోపం. వారికి ఆమే అమ్మ. గురువు. తండ్రి కూడా. ‘లాక్డౌన్లో నాకు చాలా కష్టమైంది. పిల్లల్ని విడిచి నేను ఉండలేకపోయాను. వాళ్లు నన్ను చూడక ఇరిటేట్ అయ్యి ఇంట్లో తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టారు’ అంటుంది జయంతి. ఆమె చూస్తేనే వారికి సగం స్వస్థత. 1984 నుంచి ఆమె ఆ స్కూల్లో పని చేస్తోంది. ఎందరో పిల్లలు ఆమె చేతుల మీదుగా కనీస అవసర ప్రవర్తనను నేర్చుకుని స్కూలు దాటి పోయారు. వారందరూ ఇలాగే ఆమెకు ప్రేమను పంచి ఆమె ప్రేమను పొంది వెళ్లారు. అందుకే ఆమెను ప్రభుత్వం బెస్ట్ టీచర్‌గా గుర్తించింది. సహనమే శక్తి ఇది ఎడమ చేయి ఇది కుడి చేయి అని మూడేళ్ల పసివాడికి కూడా అర్థమవుతుంది. కాని బుద్ధి వికాసంలో లోపం ఉంటే పదేళ్లు వచ్చినా తెలియదు. ‘మనకు అది చాలా చిన్న విషయం అనిపిస్తుంది. వీళ్లకు ఎందుకు అర్థం కాదు అనిపిస్తుంది. కాని బుద్ధి వికాసం లేని పిల్లలకు అది అతి పెద్ద పనితో సమానం’ అంటుంది జయంతి. ఆమె పని చేస్తున్న స్కూల్లో ప్రతి సంవత్సరం రకరకాల శారీరక, మానసిక లోపాలతో పిల్లలు చేరుతారు. వారి వారి లోపాలను, వాటి స్థాయులను బట్టి తర్ఫీదు ఇవ్వాల్సి వస్తుంది. ‘స్పెషల్ విద్యార్థులకు చదువు చెప్పే డిప్లమా కోర్సు చేశాక ఎం.ఎస్సీ సైకాలజీ చేశాను. ఆ తర్వాత ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు చేశాను. పిల్లల పట్ల సానుభూతి, కరుణతో ఉండాల్సిన టీచర్‌గా మారిపోయాను’ అంటుంది జయంతి. ఆమె కుటుంబం ఆమెను ఈ పనిలో ప్రోత్సహిస్తుంది. కాకపోతే వారికి ఒకటే సందేహం. ఇంత ఓపిక ఎలా? అని. ‘ఈ స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లల తల్లిదండ్రులే ఒక్కోసారి విసిగిపోయి డస్సిపోతారు. తమ పిల్లల మీద తామే చిరాకు పడతారు. కాని నేను పొరపాటున కూడా వారిని విసుక్కోను. ఎన్నిసార్లు అర్థం కాకపోయినా చెబుతాను. ఒక పిల్లవాడు ప్లేటు కింద పడకుండా భోజనం ప్లేటు తీసుకుంటే, తనకు తాను వాష్‌రూమ్‌కు వెళ్లి వస్తే అదే ఆ పిల్లవాడికి నాకూ కూడా పెద్ద ఘనవిజయంగా భావిస్తాను’ అంటుంది జయంతి. ఈ మహమ్మారి రోజుల్లో స్కూళ్లు తిరిగి తెరిచాక ఆ పిల్లలకు సరిగ్గా మాస్క్ ధరించేలా చేయడం పెద్ద పనిగా ఉంది. వారికి దానిని పెట్టుకోవడం కూడా పెద్ద పనే. కాని జయంతి ఓపిగ్గా చేస్తుంది. వీడియో పాఠాలు కొందరు తమది ఉద్యోగం మాత్రమే అనుకుంటారు. కొందరు తమది కర్తవ్యం అనుకుంటారు. అందుకే ఎన్ని విధాలుగా పని చేయవచ్చో అన్ని విధాలుగా చేస్తూ పోతారు. లాక్డౌన్ సమయంలో స్పెషల్ చిల్డ్రన్కు ఆన్లైన్ క్లాసులు తీసుకునే సాహసం చేసింది జయంతి. వారికి ఫోన్, లాప్టాప్ ఉపయోగించడం కష్టం. కాని ప్రయత్నించి తన పిల్లలతో కాంటాక్ట్‌లో ఉంది. అంతే కాదు స్పెషల్ పిల్లల తల్లిదండ్రులకు, వారికి పాఠాలు చెప్పే టీచర్లకు ఉపయోగపడేలా వీడియో పాఠాలు తయారు చేసి యూట్యూబ్‌లో పెట్టింది. ఈమె తయారు చేసిన 34 వీడియోలు ప్రశంసలు పొందాయి. ఎన్నో చేయాలి స్పెషల్ చిల్డ్రన్కు అవసరమైన ప్రత్యేక స్కూళ్లు, క్లాస్రూమ్ లు ప్రతి ఊళ్లో ఉండాలని అంటుంది జయంతి. ‘వారికి ఇండివిడ్యుయెల్ కోర్సులు ఉండాలి. వాళ్లు ఉపయోగించాల్సిన సాఫ్ట్వేర్లతో కంప్యూటర్లు ఉండాలి. బ్రెయిలీ ప్రింటర్లు ఉండాలి. స్పెషల్ పిల్లలు చదువును ఎంజాయ్ చేసే వాతావరణం ఏర్పాటు చేయాలి. వారికీ అన్ని సౌకర్యాలు పొందే హక్కు ఉంది’ అంటుంది జయంతి. ఇలాంటి మంచి మనసున్న టీచర్, అమ్మలాంటి టీచర్ ప్రతి స్పెషల్ చైల్డ్‌కు దక్కాలని కోరుకుందాం. -
దివ్యాంగ్జన్‌కు సంపూర్ణ సహకారం: గవర్నర్
కంటోన్మెంట్: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజేబులిటీస్ (దివ్యాంగ్జన్)కు అవసరమైన సహకారం రాజ్‌భవన్ నుంచి అందిస్తామని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బోయిన్‌పల్లిలోని దివ్యాంగ్జన్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మానసిక వైకల్యాన్ని చిన్నతనంలోనే గుర్తిస్తే తగిన చికిత్స ద్వారా మా మూలు స్థితికి తెచ్చే అవకాశం ఉంటుందన్నారు. సంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, శిక్షకులను ప్రత్యేకంగా అభినందించారు. దివ్యాంగ్జన్లో చదువుతున్న, చికిత్స పొందుతున్న విద్యార్థులు ప్రదర్శి ంచిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. తోచిన సాయం చేయండి సాక్షి, హైదరాబాద్: డిజిటల్ అంతరాలను నివారించాలంటే అందరూ తోచిన సాయం చేయాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. అవసరమైన వారికి, అణగారిన వర్గాలకు డిజిటల్ పరికరాలు దూరం కావడం మంచిది కాదని, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లవంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పేదలకు కూడా అందాలని ఆమె అన్నారు. రాజ్‌భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన ‘డొనేట్ ఏ డివైస్’కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. రామ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ అందజే సిన 20 ల్యాప్‌టాప్‌లు, 2 ట్యాబ్‌లను ఉన్నత విద్య చదువుకుంటున్న పేదలకు ఆమె అందజేశారు. -
సియాచిన్ హిమ శిఖరాన్ని అధిరోహించి ...రికార్డు సృష్టించిన వికలాంగులు
న్యూఢిల్లీ: కొందరూ అన్ని సక్రమంగా ఉండి ఏం సాధించలేక నిరాశ నిస్ప్రుహలకి లోనైన ఆత్మనూన్యత భావంతో బాధపడుతుంటారు. అలాంటి వారికి కనువిప్పు కలిగించేలా వికలాంగులు ప్రంపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన హిమ శిఖరాలలో ఒకటైన సియాచిన్ హిమశిఖరాన్ని అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించారు. వివరాల్లోకెళ్లితే.... ఎనిమిది మంది వికలాంగుల బృందం ఆదివారం 15 వేల అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ హిమ శిఖరం దగ్గర కుమార్ పోస్ట్ వద్దకు చేరుకుని ప్రపంచ రికార్డ్ సృష్టించారు. ప్రపంచంలోనే క్లిష్టమైన హిమనీనదాల్లో ఒకటైన సియాచిన్ హిమనీనదాన్ని అధిరోహించిన తొలి వికలాంగ బృందంగా నిలిచింది. భారత సైన్యం కాంకర్ ల్యాండ్ వాటర్ ఎయిర్(క్లావ్)ని ట్రెక్కింగ్ చేయడానికీ సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. దీంతో క్లావ్, మాజీ ఆర్మీ అధికారులు ఏప్రిల్ నెలలో ఈ ట్రెక్కింగ్‌లో వికలాంగులు పాల్గొనేలా దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. మాజీ పారా ఆఫీసర్ మేజర్ వివేక్ జాకబ్ నేతృత్వంలో 20 మందికి శిక్షణ ఇచ్చి ఎనిమిది మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసినట్లు భారత సైన్యం పేర్కొంది(చదవండి: 70 ఏళ్లుగా అడవిలోనే.. కర్పూరమే ఆహారంగా) ఈ మేరకు స్వాతంత్య్ర దినోత్సవం రోజున "ఆపరేషన్ బ్లూ" పేరుతో ఈ యాత్ర ప్రారంభించారు. దీన్ని క్లావ్ టీమ్, భారతసైనిక దళలు వికాంగుల సాధికారత దిశగా ప్రోత్సహించేలా ఈ ఆపరేషన్ని అమలు చేశారు. ఆపరేషన్ బ్లూ విజయవంతమవ్వడమే కాక ప్రపంచ రికార్డు సృష్టించారంటూ ...భారత సైన్య్ం ట్వీట్ చేసింది. (చదవండి: పని చేస్తున్న చోటే తింటే చాలా ప్రమాదమట..!) -
దేశ తొలి రాష్ట్రపతికి సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి : భారతదేశ తొలి రాష్ట్రపతి భారతరత్న డా. బాబూ రాజేంద్ర ప్రసాద్ 135వ జయంతి సందర్భంగా ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సీఎం గుర్తుచేశారు. దేశ నిర్మాణంలో రాజేంద్ర ప్రసాద్ ప్రముఖ పాత్రను పోషించారని అభిప్రాయపడ్డారు. నేటి తరం ఆయన సేవలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని, స్వాతంత్య్ర పోరాటంలో ఆయన చూపిన తెగువ స్పూర్తిదాయకమైందని స్మరించుకున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మంగళవారం ఓ ప్రకటన వెలువడింది. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ‘విభిన్న సామర్థ్యం గల సోదరులు, సోదరీమణులు అభివృద్ధి చెందడానికి సహకరిస్తాం. అన్ని రంగాల్లో సమాన హక్కులు, అవకాశాలతో అనుకూలమైన వాతావరణాన్ని నిర్మించడం ద్వారా మంచి ఫలితాల వైపు వారి దృష్టిని ఆకర్షించవచ్చు. వారిలోని ఆత్మ సైర్థ్యం మనకు ఎంతో ప్రేరణ’ అని ఓ ప్రకటన ద్వారా తెలిపారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన దివ్యాంగులు
-
సంక్షేమానికి వైకల్యం
దివ్యాంగులకు చంద్రబాబు సర్కారు మొండిచేయి... పింఛన్ కోసం నాలుగు లక్షలమంది ఎదురుచూపు ధ్రువీకరణ ఉన్నా 2.5 లక్షల మందికి పింఛన్ లేదు పరీక్షల కోసం మరో లక్షన్నరమంది పడిగాపులు మెడికల్ క్యాంపులకు నిధులివ్వని రాష్ర్ట ప్రభుత్వం సర్కారు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వికలాంగులు రెండున్నరేళ్లలో తగ్గిన వికలాంగ పింఛన్లు సాక్షి, అమరావతి అసలే వైకల్యం.. కాళ్లు, చేతులు సరిలేక, శరీరం సహకరించక.. ఒక చోట నుంచి మరో చోటకు కదలాలంటే నరకయాతన.. అలాంటి దివ్యాంగులు ప్రతిరోజూ ఎంపీడీవో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. బాధనంతటినీ పంటిబిగువున భరిస్తున్నారు. వైకల్య సర్టిఫికెట్ కోసం అవసరమైన వైద్య పరీక్షల కోసం కొంత మంది.... సర్టిఫికెట్ ఉన్నా పింఛన్ ఇచ్చే నాథుడు కానరాక మరికొంతమంది... సర్కారు కార్యాలయాల బైట పడిగాపులు పడుతున్నారు. ఈ రెండు కేటగిరీల సంఖ్య చూస్తేనే నాలుగులక్షలు దాటిందంటే ఆశ్చర్యం కలగక మానదు. సర్కారు సరిగ్గా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తే ఇంకా ఎన్నో లక్షల మంది గురించి తెలిసే అవకాశం ఉంది. కానీ నిధులివ్వని కారణంగా మెడికల్ క్యాంపులే జరగడం లేదు. రెండున్నరేళ్లుగా రాష్ర్టంలో దివ్యాంగుల దీనావస్థ ఇది. వారి సంఖ్య ఎంత ఉన్నా పెన్షన్ పొందేవారి సంఖ్య మాత్రం పెరగడమే లేదు. పైగా తగ్గింది కూడా... అలాగే అన్నిరకాల పింఛన్లదీ అదే పరిస్థితి. పెరగాల్సిందిపోయి తగ్గాయి. రెండున్నరేళ్ల క్రితం 43 లక్షలున్న పింఛన్లు ఇపుడు 42 లక్షలకు తగ్గిపోయాయి. రెండేళ్లుగా తిరుగుతున్న వికలాంగులు.. వికలాంగ పింఛను పొందాలంటే 40శాతానికి పైబడి అంగవైకల్యం ఉండాలనే నిబంధన ఉంది. రాష్ర్టంలోని 13 జిల్లాల్లో వైకల్య ధృవపత్రాల కోసం 11,39,829 మంది ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం నిర్వహించిన మెడికల్ క్యాంపులలో 9,83,977 మందికి వైద్య పరీక్షలు జరిగాయి. ఇంకా లక్షన్నరమందికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. మొత్తం దరఖాస్తు చేసుకున్న 11.39 లక్షల మందిలో 7,71,281 మందికి 40 శాతం పైబడి అంగవైకల్యం ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే వీరిలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 5,36,223 మందికి మాత్రమే పింఛన్లు మంజూరు చేస్తోంది. 40 శాతం పైగా అంగవైకల్యం ఉన్నట్లుగా సర్టిఫికెట్లు పొందిన 2,35,058 మంది గత రెండేళ్లుగా కొత్త పింఛన్ల కోసం మండల పరిషత్ కార్యాలయాల చుట్టూ నిత్యం తిరుగుతూనే ఉన్నారు. పరీక్షల కోసం 1.55 లక్షల మంది ఎదురుచూపు అంగవైకల్య సర్టిఫికెట్ల జారీ చేయడానికి ఉద్దేశించిన మెడికల్ క్యాంపుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా నిధులు విడుదల చేయడం లేదు. దాంతో లక్షలాదిమంది దివ్యాంగులకు వైద్య పరీక్షలు చేయించుకునే వెసులుబాటే లేకుండా పోయింది. అంగవైకల్య సరిఫికెట్ల కోసం దరఖాస్తుచేసుకున్న వారిలో 9,83,977 మందికి మాత్రమే మెడికల్ క్యాంపుల ద్వారా ప్రభుత్వం వైద్య పరీక్షలు నిర్వహించింది. ఇంకా 1.55 లక్షల మంది ఇప్పటికీ వైద్య పరీక్షల కోసం ఎదురుచూస్తున్నారు. తమ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఎప్పుడు ఏర్పాటు చేస్తారో, ఎవరిని సంప్రదించాలో తెలియక అవస్థలు పడుతున్నారు. ఎవరన్నా చనిపోతేనే కొత్తవారికి పింఛన్ పింఛన్ తీసుకుంటున్నవారు ఎవరన్నా చనిపోతేనే కొత్తవారికి పింఛన్ మంజూరు చేయాలనేది చంద్రబాబు గత తొమ్మిదేళ్ల హయాంలో అనుసరించిన పద్ధతి. ఇపుడు మరలా అదే పునరావృతమైనట్లు కనిపిస్తోంది. వృద్ధులు, వికలాంగులు, వింతంతువులకు కొత్త పింఛన్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలపకపోతుండడంతో అధికారులు ప్రస్తుతం ఉన్న పింఛనుదారుల్లో ఎవరైనా చనిపోతేనే వారి స్థానంలో కొత్త పించన్లు మంజూరు చేస్తున్నారు. అయితే వికలాంగుల పింఛన్లు అలా ఖాళీ ఏర్పడిన సందర్భంలోనూ గ్రామాల్లో ఉండే జన్మభూమి కమిటీల రాజకీయాలతో ఆయా ఫించన్లను కొత్తగా వికలాంగులకు కాకుండా వృద్ధులకో, వితంతువులకో మంజూరు చేయిస్తున్నారన్న విమర్శలున్నాయి. తగ్గిన వికలాంగ పింఛన్లు రాష్ర్టంలో రెండున్నరేళ్లలో వికలాంగుల పింఛన్ల సంఖ్య పెరగకపోగా తగ్గింది. అదెలాగ అనుకుంటున్నారా? రెండున్నరేళ్ల క్రితం చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినపుడు 5.37లక్షల మంది వికలాంగులకు పింఛన్లు అందేవి. ప్రస్తుతం 5.36 లక్షల మంది వికలాంగులకు మాత్రమే ఫ్రభుత్వం నెలవారీ పింఛన్లు అందజేస్తోంది.అంటే వెయ్యికి పైగా వికలాంగ పింఛన్లు తగ్గిపోయాయన్నమాటేగా.. గత నెలలో.. అంటే సెప్టెంబర్‌లోనూ రాష్ట్ర ప్రభుత్వం 5.36 లక్షల మందికి మాత్రమే పింఛన్లు విడుదల చేసింది. -
సెప్టెంబర్ 26న బస్‌భవన్ ముట్టడి
తమ సమస్యలు తీర్చకపోతే సెప్టెంబర్ 26న హైదరాబాద్‌లోని బస్‌భవన్‌ను ముట్టడిస్తామని దివ్యాంగులు హెచ్చరించారు. చిక్కడ్‌పల్లిలోని ఎంఆర్‌పీడీ కార్యాలయంలో 'వికలాంగ హక్కుల జాతీయ వేదిక' ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తమ న్యాయమైన హక్కులు తీర్చాలని డిమాండ్ చేశారు. మెట్రో, హైటెక్ బస్సుల్లో పాసులు అనుమతించాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగ నియామకాల్లో 3 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులను వెంట నే భర్తీ చేసి, బస్సుస్టేషన్లలో ర్యాంపులు, వీల్చైర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 70 శాతం వైకల్యం ఉన్న వారికి ఎస్కార్డ్ సౌకర్యం కల్పించాలని, 40 శాతం వైకల్యం ఉన్న వారందరికీ బస్సు పాసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఆర్టీసీ బస్సు స్టేషన్‌లోని షాపింగ్ మాల్స్‌ను దివ్యాంగులకు కేటాయించాలని కోరుతూ ఎంఆర్‌పీడీ కార్యాలయంలో బస్‌భవన్ ముట్టడికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. -
రిమ్స్‌లో వికలాంగుల సర్టిఫికెట్ల మంజూరు
కడప అర్బన్: జిల్లాలోని వికలాంగులు తమ వైకల్య ధ్రువీకరణ పత్రాలను తీసుకునే ప్రక్రియను రిమ్స్‌లో గురువారం ప్రారంభించారు. కడపలోని డీఆర్డీఏ కార్యాలయం సిబ్బంది రిమ్స్‌లో ఉదయం 9 గంటల నుంచే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. గురువారం చాపాడు, వల్లూరు, సిద్ధవటం, రాజంపేట, ఓబులవారిపల్లె మండలాల నుంచి వికలాంగుల ధ్రువీకరణ పత్రాల మంజూరును కోరుతూ దరఖాస్తు చేసుకున్న వారిని రిమ్స్‌కు రావాలని ఆయా మండలాల అభివృద్ధి అధికారుల ద్వారా సూచనలు చేశారు. వీరిలో కొంతమంది వచ్చి ఆయా విభాగాల ద్వారా పరీక్షలు చేయించుకుని వెళ్లారు. – పోటీపరీక్షలు, ఉద్యోగాల నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యతను కల్పిస్తామని, వారు కూడా ఆయా మండల అభివృద్ధి అధికారి వద్ద కచ్చితంగా తమ పేరును నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. – కేటాయించిన తేదీల్లో (గురు, శుక్ర )వారాల్లో మాత్రమే ఉదయం 9 గంటలలోపు రిమ్స్ ఓపీ విభాగం వద్దకు చేరుకోవాలన్నారు. గతంలో లాగా ప్రతిరోజు కాకుండా, వారానికి రెండు రోజులు చొప్పున గురు, శుక్రవారాల్లో మాత్రమే ఈ సర్టిఫికెట్లను ఇవ్వనున్నారు. -
నేటినుంచి ‘సదరం’
ప్రగతినగర్ : వికలాంగులకు సదరం సర్టిఫికెట్లు ఇప్పించే విషయంలో కలెక్టర్ రొనాల్డ్ రోస్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం నుంచి వారం పాటు నియోజకవర్గాల వారీగా శిబిరాలు నిర్వహించనున్నారు.వికలాంగులకు సదరం సర్టిఫికెట్ల జారీ విషయంలో జాప్యం జరుగుతుండడంపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. సదరం ధ్రువీకరణ పత్రాలు జారీ కాకపోవడం, జారీ అయిన వాటిలోనూ వైద్యుల సంతకాలు లేకపోవడం వంటి పొరపాట్లు దొర్లాయి. దీంతో వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని గమనించిన కలెక్టర్.. నియోజకవర్గాల వారీగా సదరం ప్రత్యేక శిబిరాల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారంనుంచి 16వ తేదీ వరకు శిబిరాలు కొనసాగుతాయి. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని ఆస్పత్రులలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. అయితే గతంలో మాదిరిగా నామమాత్రంగా కాకుండా పకడ్బందీగా క్యాంపులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈసారి సదరం క్యాంపులకు సూపర్వైజర్లను, క్యాంపు ఇన్చార్జి వైద్యుడిని, కోఆర్డినేటర్లును నియమించారు. క్యాంప్‌ల సూపర్వైజర్లు, ఇన్చార్జి వైద్యులు, కోఆర్డినేటర్లుగా నియమితులైనవారు తప్పనిసరిగా ఆయా క్యాంపులను సందర్శించాలని కలెక్టర్ సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్యాంపులు, అధికారులు వీరే.. నిజామాబాద్ మండలంలోని వికలాంగులకోసం జిల్లా ఆస్పత్రిలో సదరం క్యాంపు ఏర్పాటు చేశారు. క్యాంపు సూపర్వైజర్గా జడ్పీ సీఈఓ రాాజారాం, క్యాంప్ ఇన్చార్జి వైద్యుడిగా రజనీకాంత్, కోఆర్డినేటర్‌గా ఐకేపీ ఏపీఎం మోహన్ వ్యవహరిస్తారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని నిజామాబాద్ మండలం మినహా మిగిలిన మండలాల వికలాంగుల కోసం డిచ్పల్లి సీహెచ్‌సీలో శిబిరం ఏర్పాటు చేశారు. క్యాంప్ సూపర్వైజర్గా డీపీఓ కృష్ణమూర్తి, ఇన్చార్జి వైద్యుడిగా రాథోడ్, కోఆర్డినేటర్ రవీందర్ సేవలందిస్తారు. బోదన్ నియోజకవర్గంలో బోధన్ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన క్యాంప్‌లో మెప్మా పీడీ సత్యనారాయణ సూపర్వైజర్గా, ఇన్చార్జి వైద్యుడిగా భానుప్రసాద్, కోఆర్డినేటర్‌గా సాయిలు ఉంటారు. బాన్సువాడ నియోజకవర్గంలో బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో సదరం క్యాంప్ ఏర్పాటు చేశారు. సూపర్వైజర్గా డీసీహెచ్ఎస్ శివదాస్, ఇన్చార్జి డాక్టర్‌గా శ్రీనివాస్, కోఆర్డినేటర్‌గా రవీందర్ సేవలందిస్తారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఆర్మూర్‌లో ఏర్పాటుచేసిన క్యాంప్ సూపర్వైజర్గా డీఎంహెచ్ఓ గోవింద్ వాగ్మారే, ఇన్చార్జి వైద్యుడిగా నారాయణ, కోఆర్డినేటర్ నీలిమ వ్యవహరిస్తారు. కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో సదరం క్యాంప్ ఏర్పాటు చేశారు. సూపర్వైజర్గా డీఆర్డీఏ పీడీ వెంకటేశం, ఇన్చార్జి వైద్యుడిగా అజయ్‌కుమార్, కోఆర్డినేటర్‌గా సుధాకర్ ఉంటారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి సీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన క్యాంప్ కోఆర్డినేటర్‌గా మండల ప్రత్యేకాధికారి గంగాధర్, ఇన్చార్జి వైద్యుడిగా బాలోజీ, కోఆర్డినేటర్‌గా రచ్చయ్య వ్యవహరిస్తారు. బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ సీహెచ్‌సీ క్యాంప్ సూపర్వైజర్గా డీఎంహెచ్ఓ గోవింద్ వాగ్మారే, ఇన్చార్జి డాక్టర్‌గా మోహన్‌బాబు, కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఉంటారు. జుక్కల్ నియోజకవర్గంలో జుక్కల్ పీహెచ్సీలో సదరం క్యాంప్ ఏర్పాటు చేశారు. క్యాంప్ సూపర్వైజ ర్గా డీసీహెచ్ఎస్ శివదాస్, ఇన్చార్జి డాక్టర్‌గా బాల మురళి, కోఆర్డినేటర్‌గా రవీందర్ వ్యవహరిస్తారు. -
వికలాంగుల సాంస్కృతిక కార్యక్రమాలు, నిరసనలు
-
పింఛన్లలో కోత విధిస్తే ఉద్యమిస్తాం
నల్లగొండ టౌన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వేల పేరుతో వికలాంగులు, వితంతువులు, వృద్ధుల పింఛన్లలో కోత విధిస్తే ఉద్యమిస్తామని వికలాంగులహక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జేరిపోతుల పరుశరాం హెచ్చరించారు. గురువారం స్థానిక టౌన్హాల్లో నిర్వహించిన.. సమితి నల్లగొండ డివిజన్ సదస్సులో ఆయన మాట్లాడారు. పింఛన్లను పెంచుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులను విభజించి 40 శాతం నుంచి 79 శాతం వికలత్వం ఉన్నవారికి రూ.1000, 80 శాతం నుంచి 100 శాతం వికలత్వం ఉన్నవారికి రూ.1500 పింఛన్ ఇస్తామని చెప్పడం అన్యాయమన్నారు. శాతాలతో సంబంధంలేకుండా అర్హులైన వికలాంగులందరికీ రూ.1500 పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎలాంటి షరతులు లేకుండా గతంలో ఉన్న వృద్ధులు,వితంతువులు, ఒంటరి స్త్రీల పెన్షన్లను యథావిధిగా కొనసాగించాలన్నారు. కలెక్టర్ బంగ్లా ఎదుట ధర్నా సమావేశం అనంతరం వికలాంగులు, వితంతువులు, వృద్ధులు కలిసి కలెక్టర్ బంగ్లా ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. రెండు గంటల పాటు ఆందోళన చేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. హైదరాబాద్‌లో ఉన్న కలెక్టర్ చిరంజీవులు ఫోన్‌ద్వారా వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులతో మాట్లాడారు. అర్హులైన వికలాంగుల పెన్షన్లను ఒక్కటి కూడా తొలగించమని కలెక్టర్ హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో సమితి రాష్ట్ర కార్యదర్శి పువ్వాల్ వెంకట్‌సింగ్, జిల్లా అధ్యక్షుడు చింతల సైదులు, గడ్డం కాశీం, బొల్లెపల్లి గోపరాజు, సైదులు, జలందర్, ఇందిర, సుధాకర్, యాదగిరి, బోగరి రవి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
అసలు వైకల్యం ఎవరిది?!
అంతర్దృష్టి లేకపోవడం అంధత్వం కంటే అధమమైనదని విఖ్యాత రచయిత్రి హెలెన్ కెల్లర్ అంటారు. మన పాలకులకు అలాంటి లోచూపు లోపించింది కనుకనే వికలాంగులకు ప్రభుత్వోద్యోగాల్లో 3శాతం రిజర్వేషన్లు కల్పించే పద్దెనిమిదేళ్ల నాటి చట్టాన్ని ప్రభుత్వాలన్నీ అమలు చేసి తీరాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించాల్సి వచ్చింది. ఉద్యోగాల్లో ఇచ్చే కోటా 50 శాతం మించరాదని గతంలో సుప్రీంకోర్టే ఆదేశించింది గనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని అమలుచేయడం సాధ్యంకాదన్న కేంద్ర ప్రభుత్వ వాదనను న్యాయమూర్తులు తోసిపుచ్చారు. అలాగే, గుర్తించిన కొన్ని పోస్టుల్ని మాత్రమే వికలాంగులకు కేటాయించాలని 2005లో కేంద్ర ప్రభుత్వం ఒక మెమో ద్వారా చేసిన సూచనను కూడా న్యాయమూర్తులు తిరస్కరించారు. గ్రూప్ ఏ, గ్రూప్ బీ పోస్టులకు కూడా వికలాంగ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని వారు తెలిపారు. ఖాళీ అయిన మొత్తం పోస్టుల సంఖ్యలో 3 శాతం వికలాంగులకు కేటాయించాలితప్ప, ఎంపికచేసిన కొన్నింటిని మాత్రమే వారికి ఇస్తామనడం న్యాయబద్ధం కాదని స్పష్టంచేశారు. సాంకేతిక అభివృద్ధి పర్యవసానంగా వైకల్యం ఉన్నవారు సైతం ఇతరులతో సమానంగా అన్ని పనులనూ చేయగలిగే పరిస్థితులు వచ్చాయని... ఇలాంటి పరిస్థితుల్లో వారికి పరిమితులు విధించాలని చూడటం సరైన విధానం కాబోదని వారన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు కారణంగా కంటిచూపు కరువైనవారికి లేదా పాక్షికంగా చూపుదెబ్బతిన్నవారికి... వినికిడిలోపం ఉన్నవారికి... సెరిబ్రల్ పాల్సీ వ్యాధిగ్రస్తులకు ఇకపై ఒక్కోశాతం చొప్పున ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ... ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ, ప్రభుత్వ సంస్థల్లోనూ అలాంటివారికి ఇకపై ఉద్యోగావకాశాల్లో కోటా ఉంటుంది. దేశ జనాభాలో వివిధ రకాల వైకల్యంతో బాధపడుతున్నవారి సంఖ్య 2.1 శాతం ఉంటుందని 2001 జనాభా లెక్కలు చెబుతున్నాయి. 2011 జనాభా గణాంకాల్లో వికలాంగులకు సంబంధించిన వివరాలు ఇప్పటికింకా లభ్యంకాలేదు గానీ వారి శాతం జనాభాలో 5నుంచి 6 శాతం ఉండొచ్చని ఒక అంచనా. మన ప్రణాళికా సంఘం, ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగాల లెక్క ప్రకారం ఇది 10 శాతం వరకూ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ లెక్కలన్నీ ఎంతవరకూ సరైనవో చెప్పలేం. ఎందుకంటే... జనాభా లెక్కలు సేకరించేవారికి, ఇతరత్రా సర్వేలు చేసేవారికి వైకల్యానికి సంబంధించి ప్రత్యేక అవగాహన కల్పించకపోతే సరైన గణాంకాలు లభ్యంకావు. కనుక మన జనాభా లెక్కలు వెల్లడించే సంఖ్యను మించి వికలాంగులు ఉండే అవకాశం లేకపోలేదు. అధికారిక గణాంకాలను గమనించినా మన దేశంలో వికలాంగుల సంఖ్య కొన్ని దేశాల జనాభా కంటే ఎక్కువ! వికలాంగుల్లో అధికశాతంమంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారూ, దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నవారే. బిడ్డ కడుపులో ఉండగా తల్లికి సరైన పోషకాహారం అందకపోవడంవల్లా... తల్లిదండ్రులకు ఆరోగ్యంపై అవగాహన కొరవడటంవల్లా, పోలియో, మశూచి వగైరా అంటువ్యాధులవల్లా, రకరకాల ప్రమాదాలవల్లా వైకల్యం సంభవిస్తుంది. సమాజానికి చోదకశక్తిగా ఉండవలసిన ప్రభుత్వాలు ఇలాంటివారి బాధ్యతను స్వీకరించి ఆదుకోవాల్సి ఉంటుంది. అది వాటి బాధ్యత. కానీ, ఏవో పైపై చర్యలు తప్ప ప్రభుత్వాలేవీ వికలాంగుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషిచేయడంలేదు. వికలాంగుల సంక్షేమానికి సంబంధించిన చేపట్టే పథకాల్లో కూడా ఏకరూపత లేదు. ఒకచోట ఉండే సంక్షేమ పథకం మరో రాష్ట్రంలో లభించదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వికలాంగుల సంక్షేమానికి సంబంధించి ఎన్నో చర్యలు తీసుకున్నారు. వికలాంగులకు అంతక్రితం నెలకు రూ.75 మాత్రమే పింఛనుగా ఇవ్వగా, అధికారంలోకి వచ్చినవెంటనే దాన్ని ఆయన రూ. 200కు పెంచారు. 2007లో దాన్ని రూ. 500 చేశారు. వైకల్యాన్ని బట్టి దీన్ని పెంచే ఏర్పాటుకూడా చేశారు. వికలాంగుల సంక్షేమం కోసమని ప్రత్యేక నిధిని ఏర్పర్చడం, వేర్వేరు గృహ పథకాల్లో వారికి ప్రాధాన్యతనివ్వడం, ఉన్నత చదువులు చదివే వికలాంగులకు పూర్తి ఫీజును ప్రభుత్వమే చెల్లించడం... బధిర, మూగ పిల్లలకు లక్షల రూపాయలు ఖర్చయ్యే కాక్లియర్ ఆపరేషన్లను ఆరోగ్యశ్రీద్వారా ఉచితంగా చేయించడంవంటి ఎన్నో చర్యలకు ఆయన శ్రీకారం చుట్టారు. కానీ, ఆయన కనుమరుగయ్యాక అలాంటి సంక్షేమ కార్యక్రమాలు మందగించాయి. పింఛన్ల పంపిణీ సక్రమంగా లేకపోవడంవల్ల ప్రతి నెలా వికలాంగులకు అగచాట్లు తప్పడంలేదు. వైకల్యం శాతాన్ని తగ్గించి చూపి పింఛన్లు తొలగించడమూ మొదలైంది. దాదాపు 2 లక్షలమంది ఈరకంగా అనర్హులయ్యారు. ప్రభుత్వాలు ఇలా వికలాంగుల సంక్షేమానికి క్రమేపీ తూట్లు పొడుస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు తీర్పు ఆశావహమైనది. రాజ్యాంగంకిందగానీ, మానవ హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారంగానీ వికలాంగుల హక్కులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉండగా... ఎన్నడో 1995లో రూపొందించిన వికలాంగుల చట్టం ఇంతవరకూ అమల్లోకి రాకపోవడం సిగ్గుచేటైన విషయం. ఉద్యోగమనేది నిజంగా ఒక యోగం. అందునా వికలాంగులకు అది అందరికన్నా మించిన జీవితావసరం. ఒకరిపై ఆధారపడే స్థితిని తప్పించే ముఖ్యావసరం. కానీ, ప్రభుత్వాలు తమ అచేతనత్వంతో అలాంటివారందరికీ 18 ఏళ్లపాటు ఆ యోగాన్ని దక్కకుండా చేశాయి. ప్రజల ద్వారా అధికారంలోకొచ్చే ప్రభుత్వాలు నిజానికి తమంతతామే ఇలాంటి సమస్యలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉండగా... అందుకు భిన్నంగా సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని చెప్పాల్సివచ్చింది. ఇకనైనా పాలకులు తాము ఎంతగా మొద్దుబారుతున్నామో, బండబారుతున్నామో తెలుసుకోవాలి. ఎలాంటి వైకల్యం తమను ఇలా మార్చిందో గుర్తెరగాలి. గుర్తించి సరిదిద్దుకోవాలి. -
మా హయాంలోనే వికలాంగులకు పెద్దపీట
వేలూరు, న్యూస్‌లైన్: అన్నాడీఎంకే ప్రభుత్వంలోనే వికలాంగులకు పెద్ద పీట వేశామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేసీ వీరమణి అన్నారు. వేలూరు కలె క్టరేట్‌లో ఎమ్మెల్యేల నిధి నుంచి వికలాంగులకు స్కూటర్లు, వికలాంగ పరికరాలు, చెవిటి వారికి మిషన్లను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం వికలాంగులకు విద్య, ఉద్యోగాల్లో మూడు శాతం రిజర్వేషన్ కల్పించిందన్నారు. వివాహ నిధి, పెట్రోల్ వాహనాలను అందజేస్తున్నామన్నారు. వీటిని సద్విని యోగం చేసుకోవాలన్నారు.గత రెండు బడ్జెట్లలో ఒక్కో ఎమ్మెల్యే నిధి నుంచి రూ.1.30 లక్షలు కేటాయించామన్నారు. మొదటి విడతగా 250 మందికి రూ.28,54,160 విలువ చేసే పరికరాలను అందజేస్తున్నామన్నారు. వికలాంగులను ఆదుకునేందుకు పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టామన్నారు. బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి దుకాణాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిం చామని చెప్పారు. అమ్మ ప్రవేశ పెడుతున్న పథకాలను చూసి ఇతర రాష్ర్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఆశ్చర్య పోతున్నారన్నారు. అనంతరం వికలాంగులకు పెట్రోల్ వాహనాలు, ఇతర పరికరాలు, వివాహ సహాయ నిధి అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శంకర్, ఎమ్మెల్యేలు మహ్మద్‌జాన్, డాక్టర్ విజయ్, రవి, మేయర్ కార్తియాయిని, డెప్యూటీ మేయర్ ధర్మలింగం, వికలాంగుల సంక్షేమ శాఖాధికారి చార్లెస్ ప్రభాకరన్, జిల్లా రెవెన్యూ అధికారి బలరామన్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు అధికారి శ్రీనివాసన్ పాల్గొన్నారు.