Special Children Teacher Jayanthi Inspirational Life Story In Telugu - Sakshi
Sakshi News home page

Jayanthi Narayanan Life Story: ఒక అమ్మ .. 1000 మంది పిల్లలు

Published Wed, Dec 15 2021 1:01 AM | Last Updated on Wed, Dec 15 2021 3:06 PM

Special education and educator JayanthI inspiration story - Sakshi

స్పెషల్‌ ఛైల్డ్‌తో సంభాషిస్తున్న జయంతి

Best Teacher Jayanthi Narayanan: స్పెషల్‌ చిల్డ్రన్‌కి ఆమె తల్లి, తండ్రి, గురువు. ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం నుంచి బెస్ట్‌ టీచర్‌ అవార్డ్‌ అందుకున్న జయంతి ‘దేవుడు నన్ను ఈ పిల్లల కోసమే  పుట్టించినట్టున్నాడు’ అని నమ్ముతుంది. దాదాపు 36 ఏళ్లుగా ఆమె చెన్నై మైలాపూర్‌లోని క్లార్క్‌స్కూల్‌లో ఇప్పటికి కనీసం వెయ్యిమంది స్పెషల్‌ చిల్డ్రన్‌కు కనీస చదువు, ప్రవర్తన నేర్పించింది. ‘నా జీవితం వారికే అంకితం’ అంటోంది జయంతి.

మైలాపూర్‌లో ‘ది క్లార్క్‌ స్కూల్‌ ఫర్‌ ది డెఫ్‌’లో జయంతిని పిల్లలు ఎవరూ టీచర్‌గా చూడరు. వాళ్లు స్పెషల్‌ చిల్డ్రన్‌. కొంతమందికి వినిపించదు. కొందరు చూడలేదు. మరికొందరికి బుద్ధి వికాసంలో లోపం. వారికి ఆమే అమ్మ. గురువు. తండ్రి కూడా. ‘లాక్‌డౌన్‌లో నాకు చాలా కష్టమైంది. పిల్లల్ని విడిచి నేను ఉండలేకపోయాను.

వాళ్లు నన్ను చూడక ఇరిటేట్‌ అయ్యి ఇంట్లో తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టారు’ అంటుంది జయంతి. ఆమె చూస్తేనే వారికి సగం స్వస్థత. 1984 నుంచి ఆమె ఆ స్కూల్‌లో పని చేస్తోంది. ఎందరో పిల్లలు ఆమె చేతుల మీదుగా కనీస అవసర ప్రవర్తనను నేర్చుకుని స్కూలు దాటి పోయారు. వారందరూ ఇలాగే ఆమెకు ప్రేమను పంచి ఆమె ప్రేమను పొంది వెళ్లారు. అందుకే ఆమెను ప్రభుత్వం బెస్ట్‌ టీచర్‌గా గుర్తించింది.

సహనమే శక్తి
ఇది ఎడమ చేయి ఇది కుడి చేయి అని మూడేళ్ల పసివాడికి కూడా అర్థమవుతుంది. కాని బుద్ధి వికాసంలో లోపం ఉంటే పదేళ్లు వచ్చినా తెలియదు. ‘మనకు అది చాలా చిన్న విషయం అనిపిస్తుంది. వీళ్లకు ఎందుకు అర్థం కాదు అనిపిస్తుంది. కాని బుద్ధి వికాసం లేని పిల్లలకు అది అతి పెద్ద పనితో సమానం’ అంటుంది జయంతి. ఆమె పని చేస్తున్న స్కూల్‌లో ప్రతి సంవత్సరం  రకరకాల శారీరక, మానసిక లోపాలతో పిల్లలు చేరుతారు. వారి వారి లోపాలను, వాటి స్థాయులను బట్టి తర్ఫీదు ఇవ్వాల్సి వస్తుంది. ‘స్పెషల్‌ విద్యార్థులకు చదువు చెప్పే డిప్లమా కోర్సు చేశాక ఎం.ఎస్సీ సైకాలజీ చేశాను. ఆ తర్వాత ఎన్నో ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌లు చేశాను.

పిల్లల పట్ల సానుభూతి, కరుణతో ఉండాల్సిన టీచర్‌గా మారిపోయాను’ అంటుంది జయంతి. ఆమె కుటుంబం ఆమెను ఈ పనిలో ప్రోత్సహిస్తుంది. కాకపోతే వారికి ఒకటే సందేహం. ఇంత ఓపిక ఎలా? అని. ‘ఈ స్పెషల్‌ నీడ్స్‌ ఉన్న పిల్లల తల్లిదండ్రులే ఒక్కోసారి విసిగిపోయి డస్సిపోతారు. తమ పిల్లల మీద తామే చిరాకు పడతారు. కాని నేను పొరపాటున కూడా వారిని విసుక్కోను. ఎన్నిసార్లు అర్థం కాకపోయినా చెబుతాను. ఒక పిల్లవాడు ప్లేటు కింద పడకుండా భోజనం ప్లేటు తీసుకుంటే, తనకు తాను వాష్‌రూమ్‌కు వెళ్లి వస్తే అదే ఆ పిల్లవాడికి నాకూ కూడా పెద్ద ఘనవిజయంగా భావిస్తాను’ అంటుంది జయంతి. ఈ మహమ్మారి రోజుల్లో స్కూళ్లు తిరిగి తెరిచాక ఆ పిల్లలకు సరిగ్గా మాస్క్‌ ధరించేలా చేయడం పెద్ద పనిగా ఉంది. వారికి దానిని పెట్టుకోవడం కూడా పెద్ద పనే. కాని జయంతి ఓపిగ్గా చేస్తుంది.

వీడియో పాఠాలు
కొందరు తమది ఉద్యోగం మాత్రమే అనుకుంటారు. కొందరు తమది కర్తవ్యం అనుకుంటారు. అందుకే ఎన్ని విధాలుగా పని చేయవచ్చో అన్ని విధాలుగా చేస్తూ పోతారు. లాక్‌డౌన్‌ సమయంలో స్పెషల్‌ చిల్డ్రన్‌కు ఆన్‌లైన్‌ క్లాసులు తీసుకునే సాహసం చేసింది జయంతి. వారికి ఫోన్, లాప్‌టాప్‌ ఉపయోగించడం కష్టం. కాని ప్రయత్నించి తన పిల్లలతో కాంటాక్ట్‌లో ఉంది. అంతే కాదు స్పెషల్‌ పిల్లల తల్లిదండ్రులకు, వారికి పాఠాలు చెప్పే టీచర్లకు ఉపయోగపడేలా వీడియో పాఠాలు తయారు చేసి యూట్యూబ్‌లో పెట్టింది. ఈమె తయారు చేసిన 34 వీడియోలు ప్రశంసలు పొందాయి.

ఎన్నో చేయాలి
స్పెషల్‌ చిల్డ్రన్‌కు అవసరమైన ప్రత్యేక స్కూళ్లు, క్లాస్‌రూమ్‌ లు ప్రతి ఊళ్లో ఉండాలని అంటుంది జయంతి. ‘వారికి ఇండివిడ్యుయెల్‌ కోర్సులు ఉండాలి. వాళ్లు ఉపయోగించాల్సిన సాఫ్ట్‌వేర్లతో కంప్యూటర్లు ఉండాలి. బ్రెయిలీ ప్రింటర్లు ఉండాలి. స్పెషల్‌ పిల్లలు చదువును ఎంజాయ్‌ చేసే వాతావరణం ఏర్పాటు చేయాలి. వారికీ అన్ని సౌకర్యాలు పొందే హక్కు ఉంది’ అంటుంది జయంతి.
ఇలాంటి మంచి మనసున్న టీచర్, అమ్మలాంటి టీచర్‌ ప్రతి స్పెషల్‌ చైల్డ్‌కు దక్కాలని కోరుకుందాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement