Mylapore
-
Jayanthi Narayanan: ఒక అమ్మ .. 1000 మంది పిల్లలు
Best Teacher Jayanthi Narayanan: స్పెషల్ చిల్డ్రన్‌కి ఆమె తల్లి, తండ్రి, గురువు. ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం నుంచి బెస్ట్ టీచర్ అవార్డ్ అందుకున్న జయంతి ‘దేవుడు నన్ను ఈ పిల్లల కోసమే పుట్టించినట్టున్నాడు’ అని నమ్ముతుంది. దాదాపు 36 ఏళ్లుగా ఆమె చెన్నై మైలాపూర్‌లోని క్లార్క్స్కూల్లో ఇప్పటికి కనీసం వెయ్యిమంది స్పెషల్ చిల్డ్రన్కు కనీస చదువు, ప్రవర్తన నేర్పించింది. ‘నా జీవితం వారికే అంకితం’ అంటోంది జయంతి. మైలాపూర్‌లో ‘ది క్లార్క్ స్కూల్ ఫర్ ది డెఫ్’లో జయంతిని పిల్లలు ఎవరూ టీచర్‌గా చూడరు. వాళ్లు స్పెషల్ చిల్డ్రన్. కొంతమందికి వినిపించదు. కొందరు చూడలేదు. మరికొందరికి బుద్ధి వికాసంలో లోపం. వారికి ఆమే అమ్మ. గురువు. తండ్రి కూడా. ‘లాక్డౌన్లో నాకు చాలా కష్టమైంది. పిల్లల్ని విడిచి నేను ఉండలేకపోయాను. వాళ్లు నన్ను చూడక ఇరిటేట్ అయ్యి ఇంట్లో తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టారు’ అంటుంది జయంతి. ఆమె చూస్తేనే వారికి సగం స్వస్థత. 1984 నుంచి ఆమె ఆ స్కూల్లో పని చేస్తోంది. ఎందరో పిల్లలు ఆమె చేతుల మీదుగా కనీస అవసర ప్రవర్తనను నేర్చుకుని స్కూలు దాటి పోయారు. వారందరూ ఇలాగే ఆమెకు ప్రేమను పంచి ఆమె ప్రేమను పొంది వెళ్లారు. అందుకే ఆమెను ప్రభుత్వం బెస్ట్ టీచర్‌గా గుర్తించింది. సహనమే శక్తి ఇది ఎడమ చేయి ఇది కుడి చేయి అని మూడేళ్ల పసివాడికి కూడా అర్థమవుతుంది. కాని బుద్ధి వికాసంలో లోపం ఉంటే పదేళ్లు వచ్చినా తెలియదు. ‘మనకు అది చాలా చిన్న విషయం అనిపిస్తుంది. వీళ్లకు ఎందుకు అర్థం కాదు అనిపిస్తుంది. కాని బుద్ధి వికాసం లేని పిల్లలకు అది అతి పెద్ద పనితో సమానం’ అంటుంది జయంతి. ఆమె పని చేస్తున్న స్కూల్లో ప్రతి సంవత్సరం రకరకాల శారీరక, మానసిక లోపాలతో పిల్లలు చేరుతారు. వారి వారి లోపాలను, వాటి స్థాయులను బట్టి తర్ఫీదు ఇవ్వాల్సి వస్తుంది. ‘స్పెషల్ విద్యార్థులకు చదువు చెప్పే డిప్లమా కోర్సు చేశాక ఎం.ఎస్సీ సైకాలజీ చేశాను. ఆ తర్వాత ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు చేశాను. పిల్లల పట్ల సానుభూతి, కరుణతో ఉండాల్సిన టీచర్‌గా మారిపోయాను’ అంటుంది జయంతి. ఆమె కుటుంబం ఆమెను ఈ పనిలో ప్రోత్సహిస్తుంది. కాకపోతే వారికి ఒకటే సందేహం. ఇంత ఓపిక ఎలా? అని. ‘ఈ స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లల తల్లిదండ్రులే ఒక్కోసారి విసిగిపోయి డస్సిపోతారు. తమ పిల్లల మీద తామే చిరాకు పడతారు. కాని నేను పొరపాటున కూడా వారిని విసుక్కోను. ఎన్నిసార్లు అర్థం కాకపోయినా చెబుతాను. ఒక పిల్లవాడు ప్లేటు కింద పడకుండా భోజనం ప్లేటు తీసుకుంటే, తనకు తాను వాష్‌రూమ్‌కు వెళ్లి వస్తే అదే ఆ పిల్లవాడికి నాకూ కూడా పెద్ద ఘనవిజయంగా భావిస్తాను’ అంటుంది జయంతి. ఈ మహమ్మారి రోజుల్లో స్కూళ్లు తిరిగి తెరిచాక ఆ పిల్లలకు సరిగ్గా మాస్క్ ధరించేలా చేయడం పెద్ద పనిగా ఉంది. వారికి దానిని పెట్టుకోవడం కూడా పెద్ద పనే. కాని జయంతి ఓపిగ్గా చేస్తుంది. వీడియో పాఠాలు కొందరు తమది ఉద్యోగం మాత్రమే అనుకుంటారు. కొందరు తమది కర్తవ్యం అనుకుంటారు. అందుకే ఎన్ని విధాలుగా పని చేయవచ్చో అన్ని విధాలుగా చేస్తూ పోతారు. లాక్డౌన్ సమయంలో స్పెషల్ చిల్డ్రన్కు ఆన్లైన్ క్లాసులు తీసుకునే సాహసం చేసింది జయంతి. వారికి ఫోన్, లాప్టాప్ ఉపయోగించడం కష్టం. కాని ప్రయత్నించి తన పిల్లలతో కాంటాక్ట్‌లో ఉంది. అంతే కాదు స్పెషల్ పిల్లల తల్లిదండ్రులకు, వారికి పాఠాలు చెప్పే టీచర్లకు ఉపయోగపడేలా వీడియో పాఠాలు తయారు చేసి యూట్యూబ్‌లో పెట్టింది. ఈమె తయారు చేసిన 34 వీడియోలు ప్రశంసలు పొందాయి. ఎన్నో చేయాలి స్పెషల్ చిల్డ్రన్కు అవసరమైన ప్రత్యేక స్కూళ్లు, క్లాస్రూమ్ లు ప్రతి ఊళ్లో ఉండాలని అంటుంది జయంతి. ‘వారికి ఇండివిడ్యుయెల్ కోర్సులు ఉండాలి. వాళ్లు ఉపయోగించాల్సిన సాఫ్ట్వేర్లతో కంప్యూటర్లు ఉండాలి. బ్రెయిలీ ప్రింటర్లు ఉండాలి. స్పెషల్ పిల్లలు చదువును ఎంజాయ్ చేసే వాతావరణం ఏర్పాటు చేయాలి. వారికీ అన్ని సౌకర్యాలు పొందే హక్కు ఉంది’ అంటుంది జయంతి. ఇలాంటి మంచి మనసున్న టీచర్, అమ్మలాంటి టీచర్ ప్రతి స్పెషల్ చైల్డ్‌కు దక్కాలని కోరుకుందాం. -
నేనే సిఫారసు చేశా!
చెన్నై: మైలాపూర్ అభ్యర్థిగా కరాటే త్యాగరాజన్ ఎంపికకు తానే సిఫారసు చేసినట్టు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఖుష్బూ ట్వీట్ చేశారు. డీఎంకే నుంచి కాంగ్రెస్‌లో చేరిన సినీ నటి కుష్భుకు అధికార ప్రతినిధి పదవి దక్కిన విషయం తెలిసిందే. ఈ సారి ఎన్నికల బరిలో దిగాలని ఖుష్బూ భావించారు. కాంగ్రెస్‌కు మైలాపూర్‌ను డీఎంకే కేటాయించడంతో ఆ స్థానం నుంచి పోటీచేయాలని ఆమె భావించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు తగ్గ ప్రయత్నాల్లో ఉన్నట్టుగా ప్రచారం సాగింది. అయితే, ఆ స్థానం తనకే అన్న దీమాతో ఇప్పటికే ప్రచారంలో కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం మద్దతు ఉన్న నాయకుడు కరాటే త్యాగరాజన్ ఉరకలు తీస్తున్నారు. అదే సమయంలో టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు తంగబాలు సైతం పోటీ పడ్డారు. అయితే, ఆ నియోజకవర్గంలో అన్నాడిఎంకే అభ్యర్థిగా మాజీ డీజీపీ రేసులో ఉండటంతో ఆయన్ను ఢీ కొట్టేందుకు బలమైన వ్యక్తిగా కరాటే త్యాగరాజన్‌ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. దీంతో ఖుష్బూ ఢీలా పడ్డట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. తనపై వస్తున్న వార్తలపై ఆమె ట్విటర్ ద్వారా స్పందించారు. ఎవరెవరో ఏదెదో అంటున్నారని, తన మదిలో ఉన్నది మాత్రం ఒక్కటే ఎన్నికలకు దూరంగా ఉంటానని ఆమె పేర్కొన్నారు. మైలాపూర్ అభ్యర్థిగా కరాటే త్యాగరాజన్ పేరును సిఫారసు చేసింది తానేనని ఆమె పేర్కొనడం గమనార్హం. ఊహించి ఏదేదో చెప్పేస్తున్నారని, రాసేస్తున్నారని.. మైలాపూర్ సీటుకు కరాటే త్యాగరాజన్ అర్హుడని సీనియర్ నేత తంగబాలు వద్ద పట్టుబట్టి మరీ ఆ పేరును సిఫారసు చేసిన కమిటీలో తానూ ఉన్నట్లు ఆమె వెల్లడించారు. ఇక, తనకు సీటు రావడంతో రాయపురం కాంగ్రెస్ అభ్యర్థి రాయపురం మనో... ఖుష్బూకు కృతజ్ఞత పూర్వకంగా కలిశారు. అలాగే, తన నియోజకవర్గంలో ప్రచారం చేపట్టాలని ఖుష్బూను ఆయన కోరారు. -
మైలాపూర్ నుంచి కుష్బు
చెన్నై, సాక్షి ప్రతినిధి: కాంగ్రెస్ అధికార ప్రతినిధి, నటి కుష్బు మైలాపూరు నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నట్లు సమాచారం. అన్నాడీఎంకే అభ్యర్థిగా ఇప్పటికే ఖరారైన మాజీ డీజీపీ నటరాజ్‌పై ఆమె పోటీకి దిగనున్నారు. నటిగా తమిళ ప్రేక్షకుల ఆరాధ్యురాలిగా ఎదిగిన కుష్బు డీఎంకేలో చేరడం ద్వారా రాజకీయ ప్రస్తానం ప్రారంభించారు. అయితే పార్టీలో అన్నదమ్ముల మధ్య ఆధిపత్యపోరు, వారసత్వ కీచులాటల మధ్య నలిగిపోయిన కుష్బు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగెస్ అధికార ప్రతినిధిగా అనతికాలంలో అందలం ఎక్కిన కుష్బు క్రమేణా పార్టీ కార్యకలాపాల్లో కీలకపాత్ర పోషించడం ప్రారంభించారు. ప్రతిపక్షాల విమర్శలకు దీటైన జవాబులు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్‌ల తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే విజయధరణి గొడవల్లో రాష్ట్ర అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు మద్దతు పలికి తన క్రమశిక్షణను చాటుకున్నారు. అలాగే అన్నాడీఎంకే అధినేత్రి కనుసన్నల్లో మెలిగి డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించిన నటరాజ్ ఉద్యోగ విరమణ తరువాత అదే పార్టీలో చేరిపోయారు. టీఎన్పీఎస్సీ చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించిన నటరాజ్‌కు ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థిగా మైలాపూరు నుంచి పోటీచేసే అవకాశం లభించింది. పోలీస్ అధికారి కావడంతో ప్రజలకు ఆయన ఎంతోకొంత చిరపరిచితుడు. అటువంటి వ్యక్తిపై తగిన ప్రాచుర్యం కలిగిన వ్యక్తిని పోటీకి పెట్టాలని భావిస్తున్న కాంగ్రెస్ కుష్బు పేరును గట్టిగా పరిశీలిస్తోంది. మైలాపూరు నియోజకవర్గ పరిధిలోని శాంతోమ్హైరోడ్డులో కుష్బు నివాసం ఉంటున్నారు. డీఎంకే, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా కుష్పును నిలబెట్టడం దాదాపు ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఈ సందర్బంగా కుష్బు మాట్లాడుతూ, తన అనుచరులు సైతం మైలాపూరు నుంచి పోటీ చేయాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారని, అయితే అధిష్ఠానం అదేశాల మేరకే నడుచుకుంటానని తెలిపారు. నటరాజ్‌పై పోలీసుకు ఫిర్యాదు: ఇదిలా ఉండగా, మాజీ డీజీపీ నటరాజ్ పలు మోసాలకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ నంగనల్లూరు దిల్లైనగర్ నివాసి, అన్నాడీఎంకే నేత శరవణన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నటరాజ్, అతని కుమారుడు నితీష్ తనతో స్నేహంగా మెలిగారని అన్నారు. ప్రముఖ దర్శకులు శంకర్, నిర్మాత మురుగదాస్ తనకు స్నేహితులు, సినిమాల్లో విలన్ వేషాలు ఇప్పిస్తానని రూ.28.5 లక్షలు తీసుకున్నాడని చెప్పాడు. అయితే సినిమా అవకాశాలు ఇప్పించలేదు, డబ్బు తిరిగి ఇవ్వలేదని అన్నాడు. నగదు మోసానికి పాల్పడిన నటరాజ్, అతని కుమారుడు నితీష్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
రూ. 2 కోట్ల గడియారాల చోరీ : ఒకరి అరెస్ట్
కేకే.నగర్ : మైలాపూర్ దుకాణంలో రూ.2 కోట్ల విలువైన గడియారాలను చోరీ చేసిన సంఘటనలో బీహార్‌కు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై మైలాపూర్ రాధాకృష్ణన్ రోడ్డుపై గడియారాల దుకాణం ఉంది. ఇందులో గత నెల 29వ తేదీ రాత్రి భారీ చోరీ జరిగింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దుకాణం తాళాలను బద్దలుకొట్టి రూ.2 కోట్ల విలువైన చేతి గడియారాలను పట్టుకెళ్లారు. ఈ చోరీకి సంబంధించి రాయపేట పోలీసులు విచారణ ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా వా టిని ఆధారంగా పోలీసులు దుండగుల కోసం వెతకడం ప్రారంభించారు. వారి ముఖాలు ఉత్తర దేశానికి చెందిన వారని తెలిసింది. దీంతో బీహార్ పోలీసులకు చెన్నై పోలీసుల సమాచారం పంపారు. వారు ఇచ్చిన వివరాల మేరకు చెన్నై నుంచి ప్రత్యేక బృందం పోలీసులు బీహార్‌కు వెళ్లారు. అక్కడ నిందితుల్లో ఒకరైన మనోజ్‌ను బీహార్ పోలీసుల సహాయంతో అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.80 వేల విలువైన గడియారాలను మాత్రమే పోలీసు లు స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద పోలీసులు తమ దైన శైలిలో విచారణ జరపగా ఇంకనూ అతనితో పాటు పదిమంది సహచరులు ఉన్నట్లు తెలిసింది. వారందరిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా పట్టుబడిన మనోజ్ ఎనిమిదేళ్ల క్రితం పూనేలో జరిగిన చోరీలో పట్టుబడి జైలు శిక్ష అనుభవించాడని పోలీసులు తెలిపారు. -
చెన్నై సెంట్రల్
తెలుగువారి కబుర్లు తెలుగువారి త్యాగసభ వాణీమహల్ లేదా శ్రీత్యాగబ్రహ్మ గానసభ... ఈ సభ నిర్మాణంలో తెరవెనుక తెలుగువారు ఉన్నారు...ఈ నిర్మాణం జరగడానికి పెద్ద కథే ఉంది... స్వర్ణయుగంగా పిలువబడే నాటి ప్రముఖ తెలుగు చలన చిత్ర నటుడే దీనికి అంకురార్పణ చేశారు... లీజ్‌కి తీసుకున్న స్థలాన్ని కొనుగోలు చేసే స్థాయికి తెచ్చారు... ఎందరో చలనచిత్ర రంగ ప్రముఖులు ఇక్కడ అరంగేట్రం చేశారు... మరెందరో సంగీత ప్రముఖులు ఈ సభకు వన్నె తెచ్చారు... చెన్నైలో తెలుగువారి ఖ్యాతికి శాశ్వత చిరునామాగా సమున్నతంగా నిలిపారు... 1944 నాటి సంఘటన. ఆరోజు... ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు హోరున వాన కురుస్తోంది. సాధారణంగానైతే ఎవ్వరూ గడప దాటి బయటకు రాలేని పరిస్థితి అది. అందుకు విరుద్ధంగా ఆ రోజు టి. నగర్ బస్ స్టాప్‌లో జనంతో కిటకిటలాడిపోతోంది. గొడుగులు ధరించినవారు, ధరించని వారు కూడా ఆ కుంభవృష్టిలో తడుస్తూ నిలబడ్డారు. సరిగ్గా అదే సమయానికి కారులో అటుగా వెళ్తున్నారు నాగయ్య. జి.ఎన్. బాలసుబ్రహ్మణ్యం కచేరీకి వెళ్లడం కోసమే వారంతా వానను సైతం లెక్కచేయట్లేదని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. చెన్నైలోని మైలాపూర్ కర్ణాటక సంగీతానికి పట్టుకొమ్మ. సంగీతామృతాన్ని ఆస్వాదించేవారంతా మైలాపూర్ వెళ్లాల్సిందే. వానక జడిసి ఇంట్లో కూర్చుంటే కచేరీని వినలేకపోతామనేంత నిబద్ధత వీరికి సంగీతం పట్ల. సంగీత ప్రేమికులైన వీరందరికీ టి.నగర్లోనే అందుబాటులో ఒక సభ నిర్మిస్తే ఏ ఒడిదొడుకులు లేకుండా సంగీతంలో తన్మయులు కావచ్చు కదా! అని నాగయ్య మదిలో ఆలోచన తళుక్కుమంది. ఆలోచన వచ్చినదే తడవుగా ఆచరణలో పెట్టేశారు. నాగయ్యగారి శ్రమ వృథా పోలేదు. ఆయన సదుద్దేశానికి చేయూత లభించింది. జిఎన్.చెట్టి, డా. నాయర్ రోడ్ల సంగమ స్థానంలో ఉన్న 24000 చదరపు అడుగుల ఖాళీ స్థలాన్ని ఆ యజమాని అయిన ప్రముఖ న్యాయవాది టిఏ రంగాచారి నామమాత్రపు ధరకు లీజ్‌కి ఇచ్చారు. నాగయ్య నాయకత్వంలో అనేకమంది సభ్యుల సహాయ సహకారాలతో సభానిర్మాణం జరిగింది. ఈ సభా నిర్మాణానికి నిధుల కోసం 16 రోజుల పాటు నాటకోత్సవాలు నిర్వహించారు. ప్రారంభోత్సవం హిందీప్రచారసభ ప్రాంగణంలో జరిగింది. కొంతకాలం సభలన్నీ ఆ ప్రాంగణంలోనే జరిగాయి. సభకు ప్రాచుర్యం విస్తృతంగా పెరగడంతో ఈ సభల నిర్వహణకు ఒక శాశ్వత వేదిక ఉంటే మంచిదని భావించారు. ఆ తరువాత ప్రస్తుతం ఉన్న స్థలాన్ని సంపాదించుకున్నారు. నాగయ్య కారణంగా ఈ సభ రూపుదిద్దుకుంది కనుక ఈ సభకు ఆయన పేరును నిర్ణయిద్దామనుకున్నారు. అయితే ఆయన సున్నితంగా తిరస్కరించి, ‘శ్రీత్యాగ బ్రహ్మ గానసభ’ పేరు స్థిరపరిచారు. దీని రూపకర్త వి. గణపతి అయ్యర్. దీనిని ట్రావన్‌కోర్ దివాన్ రామస్వామి అయ్యర్ నవంబరు18, 1945న ప్రారంభించారు. తమ ప్రారంభోపన్యాసంలో ‘త్యాగరాయనగర్‌లోని కొందరు స్థానికుల చందాలతో ఈ సభ నిర్మాణం జరిగింది. ఈ సభను నాటక, సంగీత ప్రదర్శనల కోసం ప్రారంభించారు. ఈ సభ కళలను అభివృద్ధి చేయడానికి ప్రారంభించబడింది’ అంటూ రామస్వామి అయ్యర్ రిబ్బన్ కట్ చేశారు. ఆయన సంగీతాభిమాని. 1944లో చిత్తూరు వి నాగయ్య ప్రారంభించిన ఈ సభలో జరిగిన మొట్టమొదటి కచేరీ శ్రీ అరియకూడి రామానుజ అయ్యంగార్ది. ఇందులో వయొలిన్ మీద శ్రీపప్పు కె.ఎస్. వెంకట్రామయ్య, మృదంగం మీద పాలఘాట్ టి.ఎస్.మణి అయ్యర్ సహకరించారు. మొట్టమొదటి కచేరీకి అయిన ఖర్చు 5000. ఆ మొత్తాన్ని చిత్తూరు నాగయ్య విరాళంగా ఇచ్చారు. 1930 నాటికి పెద్ద సరస్సు ప్రాంతం సంగీత నిలయంగా మారిపోయింది. ఈ సభ గోడల దగ్గర నుంచి అన్నీ ఆకర్షణీయంగా అందంగా రూపొందించారు. ఈ కొత్త వేదిక మీద గోపీనాథ్ - తంగమణి ‘వాణీ మహల్’ అనే పేరున తమ బ్యాలేతో మొట్టమొదటి ప్రదర్శన ఇచ్చారు. 1973లో ‘వాణీ మహల్’ అనే పేరును ఈ సభకు జత చేశారు. వాణీమహల్ అంటే సరస్వతీదేవి నివాసం అని అర్థం. ప్రముఖ హాస్య నటుడు నగేశ్, హిందీ చలన చిత్ర కథానాయిక వహీదా రెహమాన్ ఇక్కడే వారి కళా యాత్ర ప్రారంభించారు. ఓరియంటల్ డ్యాన్సెస్’ శీర్షికన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె.జయలలిత ఇక్కడ నాట్య ప్రదర్శన ఇచ్చారు. చెన్నపట్టణంలో ఇది అత్యంత ప్రాచీనమైనసభ. సంగీత ప్రేమికులకు ఇదొక ప్రియమైన వేదిక. ఎం.ఎల్. వసంతకుమారి, కె.జె.ఏసుదాసు వంటి ప్రముఖుల కచేరీలు వాణీ మహల్లో సర్వసాధారణం. ప్రతి సంవత్సరం వాణీ మహల్లో డిసెంబరు మాసంలో మార్గళి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. వివిధ కళలలో నిష్ణాతులైనవారికి ‘వాణీ కళా సుధాకర’ బిరుదు, లక్ష రూపాయల నగదుబహుమతి ప్రదానం చేస్తున్నారు. చెన్నై సభలలో మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్ ఉన్న సభ వాణీమహల్. ఆమె లేడీ వెంకటసుబ్బారావు. చిత్తూరు వి. నాగయ్య సుమారు 70 సంవత్సరాల క్రితం నాటిన విత్తనం నేడు మహావృక్షమై ఎందరికో నీడను, ఫలాలను అందిస్తోంది. నాగయ్య చేసిన నిస్వార్థ సేవకు నిలువెత్తు సాక్ష్యంగా చెన్నై మహానగరంలో ఠీవిగా కనపడుతుంది వాణీమహల్. సంభాషణ: డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై -
కొత్త రేషన్ కార్డుకు ఓకే
సాక్షి, చెన్నై: మైలాపూర్‌లో పౌరసరఫరాల విభాగం కార్యాలయాన్ని మంత్రి కామరాజ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఉన్న సరుకుల నిల్వ, పంపిణీ గురించి ఆరా తీశారు. కార్డుదారులను ప్రశ్నించారు. ఏదేని సమస్యలు ఉంటే వినతి పత్రంగా సమర్పించాలని సూచించారు. కాసేపు అక్కడే ఉండి మరీ వినతి పత్రాల్ని ఆయన స్వీకరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, రేషన్ కార్డుల్లో ఏదేని సవరణలు, చిరునామాల మార్పు వంటి ప్రక్రియలు త్వరితగతిన ముగించి, లబ్ధిదారులకు అందజేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ఆలస్యమయ్యే కొద్దీ కార్డు దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కుటుంబ కార్డు కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. తొమ్మిది లక్షల మందికి త్వరలో కార్డులు పంపిణీ చేయనున్నామన్నారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించడం, స్వయంగా దరఖాస్తుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి మరీ విచారించి, పకడ్బందీ ఏర్పాట్లతో కొత్త రేషన్ కార్డుల మంజూరు చేస్తామన్నారు. కొత్త రేషన్ కార్డులు 60 రోజుల్లోపు మంజూరు చేయనున్నట్లు వివరించారు. 8,82,740 మంది దరఖాస్తు చేసుకుని ఉన్నారని, మరి కొద్ది రోజుల్లో వీరికి కొత్త కార్డులు పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఫిర్యాదులు: చెన్నైలోని వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుని ఉన్నామన్నారు. నగరంలో 1,723 రేషన్ దుకాణాలు ఉన్నాయని వివరించారు. నగరంలో 21,46,627 రేషన్ కార్డుదారులు ఉన్నారని గుర్తు చేశారు. వీరికి ఏదేని సమస్యలు తలెత్తినా, రేషన్ సరకు లు సక్రమంగా అందకున్నా 9445464748, 729900 8002 నెంబర్లకు ఎస్ఎంఎస్ల ద్వారా ఫిర్యాదు చేయొచ్చని ప్రకటించారు. అంబత్తూరు, థౌజండ్‌లైట్స్, సైదా పేట ల్లోని కార్యాలయాల్ని రూ.2.5 కోట్ల వ్యయం తో ఆధునీకరించినట్లు వివరించారు. ప్రతినెలా మొదటి శని వారం, రెండో శుక్రవారం ఫిర్యాదుల స్వీకరణ శిబి రాల్ని నిర్వహిస్తున్నామన్నారు. కొన్నేళ్ల నుంచి కొత్త కార్డులు మంజూరు చేయనందున, మంత్రి చేసిన ప్రకటనతో దరఖాస్తుదారుల్లో ఆనందం నెలకొంది.