మైలాపూర్ నుంచి కుష్బు
చెన్నై, సాక్షి ప్రతినిధి: కాంగ్రెస్ అధికార ప్రతినిధి, నటి కుష్బు మైలాపూరు నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నట్లు సమాచారం. అన్నాడీఎంకే అభ్యర్థిగా ఇప్పటికే ఖరారైన మాజీ డీజీపీ నటరాజ్‌పై ఆమె పోటీకి దిగనున్నారు. నటిగా తమిళ ప్రేక్షకుల ఆరాధ్యురాలిగా ఎదిగిన కుష్బు డీఎంకేలో చేరడం ద్వారా రాజకీయ ప్రస్తానం ప్రారంభించారు. అయితే పార్టీలో అన్నదమ్ముల మధ్య ఆధిపత్యపోరు, వారసత్వ కీచులాటల మధ్య నలిగిపోయిన కుష్బు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
కాంగెస్ అధికార ప్రతినిధిగా అనతికాలంలో అందలం ఎక్కిన కుష్బు క్రమేణా పార్టీ కార్యకలాపాల్లో కీలకపాత్ర పోషించడం ప్రారంభించారు. ప్రతిపక్షాల విమర్శలకు దీటైన జవాబులు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్‌ల తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే విజయధరణి గొడవల్లో రాష్ట్ర అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు మద్దతు పలికి తన క్రమశిక్షణను చాటుకున్నారు.
అలాగే అన్నాడీఎంకే అధినేత్రి కనుసన్నల్లో మెలిగి డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించిన నటరాజ్ ఉద్యోగ విరమణ తరువాత అదే పార్టీలో చేరిపోయారు. టీఎన్‌పీఎస్‌సీ చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించిన నటరాజ్‌కు ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థిగా మైలాపూరు నుంచి పోటీచేసే అవకాశం లభించింది. పోలీస్ అధికారి కావడంతో ప్రజలకు ఆయన ఎంతోకొంత చిరపరిచితుడు.
అటువంటి వ్యక్తిపై తగిన ప్రాచుర్యం కలిగిన వ్యక్తిని పోటీకి పెట్టాలని భావిస్తున్న కాంగ్రెస్ కుష్బు పేరును గట్టిగా పరిశీలిస్తోంది. మైలాపూరు నియోజకవర్గ పరిధిలోని శాంతోమ్‌హైరోడ్డులో కుష్బు నివాసం ఉంటున్నారు. డీఎంకే, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా కుష్పును నిలబెట్టడం దాదాపు ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఈ సందర్బంగా కుష్బు మాట్లాడుతూ, తన అనుచరులు సైతం మైలాపూరు నుంచి పోటీ చేయాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారని, అయితే అధిష్ఠానం అదేశాల మేరకే నడుచుకుంటానని తెలిపారు.
నటరాజ్‌పై పోలీసుకు ఫిర్యాదు:
ఇదిలా ఉండగా, మాజీ డీజీపీ నటరాజ్ పలు మోసాలకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ నంగనల్లూరు దిల్లైనగర్ నివాసి, అన్నాడీఎంకే నేత శరవణన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నటరాజ్, అతని కుమారుడు నితీష్ తనతో స్నేహంగా మెలిగారని అన్నారు. ప్రముఖ దర్శకులు శంకర్, నిర్మాత మురుగదాస్ తనకు స్నేహితులు, సినిమాల్లో విలన్ వేషాలు ఇప్పిస్తానని రూ.28.5 లక్షలు తీసుకున్నాడని చెప్పాడు. అయితే సినిమా అవకాశాలు ఇప్పించలేదు, డబ్బు తిరిగి ఇవ్వలేదని అన్నాడు. నగదు మోసానికి పాల్పడిన నటరాజ్, అతని కుమారుడు నితీష్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొన్నాడు.