నేనే సిఫారసు చేశా!
చెన్నై: మైలాపూర్ అభ్యర్థిగా కరాటే త్యాగరాజన్ ఎంపికకు తానే సిఫారసు చేసినట్టు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఖుష్బూ ట్వీట్ చేశారు. డీఎంకే నుంచి కాంగ్రెస్‌లో చేరిన సినీ నటి కుష్భుకు అధికార ప్రతినిధి పదవి దక్కిన విషయం తెలిసిందే. ఈ సారి ఎన్నికల బరిలో దిగాలని ఖుష్బూ భావించారు. కాంగ్రెస్‌కు మైలాపూర్‌ను డీఎంకే కేటాయించడంతో ఆ స్థానం నుంచి పోటీచేయాలని ఆమె భావించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు తగ్గ ప్రయత్నాల్లో ఉన్నట్టుగా ప్రచారం సాగింది.
అయితే, ఆ స్థానం తనకే అన్న దీమాతో ఇప్పటికే ప్రచారంలో కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం మద్దతు ఉన్న నాయకుడు కరాటే త్యాగరాజన్ ఉరకలు తీస్తున్నారు. అదే సమయంలో టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు తంగబాలు సైతం పోటీ పడ్డారు. అయితే, ఆ నియోజకవర్గంలో అన్నాడిఎంకే అభ్యర్థిగా మాజీ డీజీపీ రేసులో ఉండటంతో ఆయన్ను ఢీ కొట్టేందుకు బలమైన వ్యక్తిగా కరాటే త్యాగరాజన్‌ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. దీంతో ఖుష్బూ ఢీలా పడ్డట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. తనపై వస్తున్న వార్తలపై ఆమె ట్విటర్ ద్వారా స్పందించారు. ఎవరెవరో ఏదెదో అంటున్నారని, తన మదిలో ఉన్నది మాత్రం ఒక్కటే ఎన్నికలకు దూరంగా ఉంటానని ఆమె పేర్కొన్నారు.
మైలాపూర్ అభ్యర్థిగా కరాటే త్యాగరాజన్ పేరును సిఫారసు చేసింది తానేనని ఆమె పేర్కొనడం గమనార్హం. ఊహించి ఏదేదో చెప్పేస్తున్నారని, రాసేస్తున్నారని.. మైలాపూర్ సీటుకు కరాటే త్యాగరాజన్ అర్హుడని సీనియర్ నేత తంగబాలు వద్ద పట్టుబట్టి మరీ ఆ పేరును సిఫారసు చేసిన కమిటీలో తానూ ఉన్నట్లు ఆమె వెల్లడించారు. ఇక, తనకు సీటు రావడంతో రాయపురం కాంగ్రెస్ అభ్యర్థి రాయపురం మనో... ఖుష్బూకు కృతజ్ఞత పూర్వకంగా కలిశారు. అలాగే, తన నియోజకవర్గంలో ప్రచారం చేపట్టాలని ఖుష్బూను ఆయన కోరారు.