Tamilnadu Congress leader
-
నేనే సిఫారసు చేశా!
చెన్నై: మైలాపూర్ అభ్యర్థిగా కరాటే త్యాగరాజన్ ఎంపికకు తానే సిఫారసు చేసినట్టు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఖుష్బూ ట్వీట్ చేశారు. డీఎంకే నుంచి కాంగ్రెస్‌లో చేరిన సినీ నటి కుష్భుకు అధికార ప్రతినిధి పదవి దక్కిన విషయం తెలిసిందే. ఈ సారి ఎన్నికల బరిలో దిగాలని ఖుష్బూ భావించారు. కాంగ్రెస్‌కు మైలాపూర్‌ను డీఎంకే కేటాయించడంతో ఆ స్థానం నుంచి పోటీచేయాలని ఆమె భావించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు తగ్గ ప్రయత్నాల్లో ఉన్నట్టుగా ప్రచారం సాగింది. అయితే, ఆ స్థానం తనకే అన్న దీమాతో ఇప్పటికే ప్రచారంలో కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం మద్దతు ఉన్న నాయకుడు కరాటే త్యాగరాజన్ ఉరకలు తీస్తున్నారు. అదే సమయంలో టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు తంగబాలు సైతం పోటీ పడ్డారు. అయితే, ఆ నియోజకవర్గంలో అన్నాడిఎంకే అభ్యర్థిగా మాజీ డీజీపీ రేసులో ఉండటంతో ఆయన్ను ఢీ కొట్టేందుకు బలమైన వ్యక్తిగా కరాటే త్యాగరాజన్‌ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. దీంతో ఖుష్బూ ఢీలా పడ్డట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. తనపై వస్తున్న వార్తలపై ఆమె ట్విటర్ ద్వారా స్పందించారు. ఎవరెవరో ఏదెదో అంటున్నారని, తన మదిలో ఉన్నది మాత్రం ఒక్కటే ఎన్నికలకు దూరంగా ఉంటానని ఆమె పేర్కొన్నారు. మైలాపూర్ అభ్యర్థిగా కరాటే త్యాగరాజన్ పేరును సిఫారసు చేసింది తానేనని ఆమె పేర్కొనడం గమనార్హం. ఊహించి ఏదేదో చెప్పేస్తున్నారని, రాసేస్తున్నారని.. మైలాపూర్ సీటుకు కరాటే త్యాగరాజన్ అర్హుడని సీనియర్ నేత తంగబాలు వద్ద పట్టుబట్టి మరీ ఆ పేరును సిఫారసు చేసిన కమిటీలో తానూ ఉన్నట్లు ఆమె వెల్లడించారు. ఇక, తనకు సీటు రావడంతో రాయపురం కాంగ్రెస్ అభ్యర్థి రాయపురం మనో... ఖుష్బూకు కృతజ్ఞత పూర్వకంగా కలిశారు. అలాగే, తన నియోజకవర్గంలో ప్రచారం చేపట్టాలని ఖుష్బూను ఆయన కోరారు. -
నటి కుష్బుకు మొండిచేయి
చెన్నై: డీఎంకే కూటమిలో ప్రధానమైన కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్దుల తుది జాబితాను శుక్రవారం రాత్రి విడుదల చేసింది. ఎన్నికల వాతావరణం మొదలు కాగానే అందరికంటే ముందుగా డీఎంకేతో పొత్తుకు ఉరకలేసిన కాంగ్రెస్ పార్టీ అనేక తర్జన భర్జనల నడుమ 41 సీట్లను దక్కించుకుంది. తమిళ కాంగ్రెస్ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్‌ను తీవ్రంగా విభేదించే కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం, తదితరులను కాదని 33 మందితో తొలి జాబి తాను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఇక మిగిలిన 8 మంది అభ్యర్దుల పేర్లతో కూడిన తుది జాబితా శుక్రవారం విడుదలైంది. కుష్బుకు మొండిచేయి: మైలాపూర్ స్థానం నుండి పోటీచేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, నటి కుష్బు ఎంతగానో ఆశించారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలితపై పోటీపెట్టనున్నారని మరికొందరు విశ్వసించారు. ఎన్నికల్లో ఎలాగైనా పోటీచేయాలనే పట్టుదలతో ఉన్న కుష్బు కాంగ్రెస్ అధిషానాన్ని సైతం కలిసి వచ్చారు. డీఎంకేతో విభేధించి కాంగ్రెస్ పంచన చేరిన రెండేళ్ల తరువాత మరలా కరుణానిధి ఇంటికి వెళ్లారు. మిత్రపక్ష కూటమి నేత హోదాలో కరుణ ఆశీస్సులు పొంది ఎలాగైనా సీటు దక్కించుకోవాలని గట్టి ప్రయత్నమే చేశారు. అయితే కుష్బుకు కాంగ్రెస్ మొండి చేయి చూపింది. ఆమె ఆశిస్తున్న మైలాపూరు నియోజకవర్గానికి కరాటే త్యాగరాజన్ పేరును ఖరారు చేసింది. కుష్బు ఆశించిన మైలాపూరును మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, నటి నగ్మా కూడా ఆశించారు. ఈ విషయంలో ఇద్దరు నటీమణులు పోటీపడగా స్వల్పంగా మనస్పర్దలు చోటుచేసుకున్నాయి. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో అధిష్టానానికి దగ్గరగా ఉన్న నగ్మానే కుష్బు ప్రయత్నాలకు గండికొట్టి ఉంటారని కాంగ్రెస్‌నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.