సాక్షి, న్యూఢిల్లీ: వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో తమ పార్టీ తరఫున సినీనటి ఖుష్బూ సుందర్‌ను బరిలోకి దింపాలని బీజేపీ అధిష్టానం యోచిస్తోందని తెలుస్తోంది. పార్టీ తరఫున పోటీలో నిలిపే అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌లో ఖుష్బూ పేరును సైతం చేర్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకగాంధీకి ఖుష్బూ అయితేనే గట్టిపోటీ ఇవ్వగలరనే భావన వ్యక్తమవుతోంది.
వయనాడ్‌లో వచ్చే నెల 13న పోలింగ్ జరగనుంది. పార్టీ సీనియర్లయిన ఎంటీ రమేశ్, శోభా సురేంద్రన్, ఏపీ అబ్దుల్లా కుట్టి, షాన్ జార్జ్ పేర్లను బీజేపీ తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ కసరత్తు కొలిక్కి వస్తున్న వేళ ఖుష్బూ పేరు తెరపైకి వచ్చింది. నిజానికి ఖుష్బూ 2010లో డీఎంకేలో చేరి, అనంతరం 2014లో కాంగ్రెస్‌లో చేరారు.
పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. అనంతరం 2021లో కాంగ్రెస్‌ను వీడి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఆమె ప్రస్తుతం బీజేపీ తమిళనాడు యూనిట్‌లో భాగంగా ఉన్నారు. తమిళనాడు నేపథ్యం ఉన్న ఆమెను వయనాడ్‌లో పోటీకి నిలిపే విషయమై బీజేపీ అగ్ర నాయకత్వం రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయాలను సేకరిస్తోంది. రాష్ట్ర శాఖ తెలిపే అభిప్రాయం మేరకు అభ్యర్థిత్వంపై పార్టీ తుది నిర్ణయం తీసుకోనుంది. ఒకట్రెండు రోజుల్లోనే పార్టీ అభ్యర్థిని ప్రకటించనుంది.
Comments
Please login to add a commentAdd a comment