film actress
-
వయనాడ్‌లో బీజేపీ అభ్యర్థి ఖుష్బూ!
సాక్షి, న్యూఢిల్లీ: వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో తమ పార్టీ తరఫున సినీనటి ఖుష్బూ సుందర్‌ను బరిలోకి దింపాలని బీజేపీ అధిష్టానం యోచిస్తోందని తెలుస్తోంది. పార్టీ తరఫున పోటీలో నిలిపే అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌లో ఖుష్బూ పేరును సైతం చేర్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకగాంధీకి ఖుష్బూ అయితేనే గట్టిపోటీ ఇవ్వగలరనే భావన వ్యక్తమవుతోంది. వయనాడ్‌లో వచ్చే నెల 13న పోలింగ్ జరగనుంది. పార్టీ సీనియర్లయిన ఎంటీ రమేశ్, శోభా సురేంద్రన్, ఏపీ అబ్దుల్లా కుట్టి, షాన్ జార్జ్ పేర్లను బీజేపీ తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ కసరత్తు కొలిక్కి వస్తున్న వేళ ఖుష్బూ పేరు తెరపైకి వచ్చింది. నిజానికి ఖుష్బూ 2010లో డీఎంకేలో చేరి, అనంతరం 2014లో కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. అనంతరం 2021లో కాంగ్రెస్‌ను వీడి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఆమె ప్రస్తుతం బీజేపీ తమిళనాడు యూనిట్లో భాగంగా ఉన్నారు. తమిళనాడు నేపథ్యం ఉన్న ఆమెను వయనాడ్‌లో పోటీకి నిలిపే విషయమై బీజేపీ అగ్ర నాయకత్వం రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయాలను సేకరిస్తోంది. రాష్ట్ర శాఖ తెలిపే అభిప్రాయం మేరకు అభ్యర్థిత్వంపై పార్టీ తుది నిర్ణయం తీసుకోనుంది. ఒకట్రెండు రోజుల్లోనే పార్టీ అభ్యర్థిని ప్రకటించనుంది. -
గంజాయి మాఫీయాపై బ్రహ్మస్త్రం 'అభినవ్'
శ్రీలక్ష్మి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న బాలల చిత్రం 'అభినవ్'. ఈ చిత్రాన్ని భీమగాని సుధాకర్ గౌడ్ నిర్మాత, దర్శకునిగా తెరకెక్కిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, నిర్మాతల మండలి సెక్రెటరీ ప్రసన్న కుమార్, నిర్మాత దామోదర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్ర ట్రైలర్ ను ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ విడుదల చేశారు.గ్రామీణ ప్రాంతాలలోని హరిజన, గిరిజన విద్యార్థులను సత్య అనే గంజాయి మాఫియాడాన్ విద్యార్థులతో గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటాడు. బంటి అనే గిరిజన బాలుడు స్మగ్లర్ చేతిలో పావుగా మారి గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటాడు. భారతి అనే అభ్యుదయ ఉపాధ్యాయురాలి ద్వారా ప్రేరణ పొందిన అభినవ్, రోహన్, అక్షర, ఇతర బాల బాలికలు ఎన్సీసీ, ఆర్మీ శిక్షణ పొందుతుంటారు. ఎన్ఎస్ ఎస్ ప్రొగ్రాం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళిన గిరిజన విద్యార్థుల స్థితిగతులను గమనించి డ్రగ్ మాఫియాను అంతం చేయడానికి ఆర్మీ తరహా శిక్షణ తీసుకుంటారు. ఈ చిత్రం ప్రధాన ఉద్దేశం బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో సమ్మెట గాంధీ, మాఫియా డాన్‌గా సత్య ఎర్ర, ప్రధాన బాల నటులు మాస్టర్ గగన్, గీతా గోవింద్, అభినవ్, చరణ్, బేబీ అక్షర నటించారు. కెమెరామెన్ సామల భాస్కర్, సంగీతం వందే మాతరం శ్రీనివాస్, ఎడిటర్ నందమూరి హరి, ఈ చిత్రాన్ని సారథి స్టూడియో సహకారంతో పూర్తి చేయడం జరిగిందని నిర్మాత తెలిపారు. -
Lok sabha elections 2024: శ్రీకృష్ణుని గోపికను నేను: హేమమాలిని
మథుర(యూపీ): గోపాలకృష్ణుని 16 వేల గోపికల్లో ఒకరినంటూ సినీ నటి హేమమాలిని తనను తాను అభివర్ణించుకున్నారు. మథురలో బీజేపీ అభ్యరి్థగా బరిలోకి దిగిన హేమమాలిని గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘గోపికల్లో ఒక గోపికగా నన్ను నేను ఊహించుకుంటాను. మథుర చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన బ్రిజ్వాసులంటే శ్రీకృష్ణునికి ఎంతో ప్రేమ, అభిమానం. అందుకే బ్రిజ్వాసులను ఇష్టంతో సేవిస్తే కృష్ణ భగవానుని ఆశీస్సులు లభిస్తాయని నా నమ్మకం. అందుకే వారికి విశ్వాసంతో సేవ చేస్తున్నా’అని ఆమె అన్నారు. పేరు, ప్రఖ్యాతుల కోసమో, మరే ఇతర భౌతిక లాభాపేక్షతోనో రాజకీయాల్లోకి రాలేదన్నారు. మథుర చుట్టుపక్కల 84 కోసుల పరిధి(252 కిలోమీటర్లు)లోని ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని చెప్పారు. -
Lok sabha elections 2024: మాణిక్కం ఠాగూర్ వర్సెస్ రాధిక
సాక్షి, న్యూఢిల్లీ: డీఎంకేతో పొత్తులో భాగంగా తమిళనాడులో పోటీ చేస్తున్న తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తును కాంగ్రెస్ వేగవంతం చేసింది. శుక్రవారం జరిగిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో విరుధునగర్ సహా నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. విరుధునగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ మరోసారి బరిలో దిగుతున్నారు. మరోవైపు ఈ స్థానాన్ని సినీ నటి రాధికా శరత్‌కుమార్‌కు కేటాయిస్తూ బీజేపీ కూడా శుక్రవారమే నిర్ణయం తీసుకుంది! దాంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. 2009లో కూడా ఇక్కడ మాణిక్కం నెగ్గారు. 2014లో డీఎంకే, కాంగ్రెస్ విడిగా పోటీ చేయడంతో అన్నాడీఎంకే అభ్యర్థి టి.రాధాకృష్ణ భారీ గెలుపొందారు. 2019లో కాంగ్రెస్, డీఎంకే కలిసి పోటీ చేయడంతో మాణిక్కం ఠాగూర్ మరోసారి నెగ్గారు. డీఎంకే మద్దతుతో ఈసారీ సునాయాసంగా నెగ్గుతామని కాంగ్రెస్ భావిస్తోంది. -
చౌద్వీ కా చాంద్ హో
‘చౌద్వీ కా చాంద్ హో యా ఆఫ్తాబ్ హో’... ఈ చందమామ తెలుగు నేల మీదే ఉదయించింది. ‘ఏరువాక సాగారోరన్నో చిన్నన్న’... తప్పెట దరువుకు ఆ పాదాలు ఈ నేల మీదే చిందేశాయి. ‘మారాయ్.. మారాయ్... మారాయ్..రోజులు మారాయ్’... తెలుగువారి పుణ్యాన ఒక మహత్తు జరిగి వహిదా రెహమాన్ రోజులే మారిపొయాయి.భారతీయ వెండితెర సౌందర్యమేమారిపొయింది. తనకు ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ప్రకటించారని తెలిశాక ఆ మురిపమైన నటి అనుకునే మాట ఒకటే– ఆజ్ ఫిర్ జీనే కి తమన్నా హై ఆజ్ ఫిర్ మర్నే కా ఇరాదా హై.. విశాఖపట్నంలో ఈపాటికి సంబరాలు జరగాలి.తమ ఊరి నటికి దాదాసాహెబ్ ఫాల్కే వచ్చినందుకు.ఆ సంగతి వారికి తెలుసో లేదో. తెలుగు వారికి వహిదా రెహమాన్ తమ నటి అని తెలుసో లేదో.వహిదా రెహమాన్‌కు పదీ పదకొండేళ్లు ఉన్నప్పుడు ఆమె తండ్రి రెహమాన్‌కు మునిసిపల్ కమిషనర్‌గా విశాఖ ట్రాన్స్ఫర్ అయ్యింది. మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఉద్యోగి అయిన రెహమాన్ తమిళనాడు, ఆంధ్రాల్లో పని చేసిన దక్కన్ ముస్లిం. ఆమె తల్లిది ఉత్తరాంధ్ర కావచ్చు. ఆమె మేనమామ డాక్టర్ ఫిరోజ్ అలీ గంజాంలో పేరు మోసిన డాక్టరు, సామాజిక కార్యకర్త. సినిమా నటిగా అవకాశం పొందే వరకు అంటే తన 17వ ఏట వరకూ వహిదా రెహమాన్ తొలిప్రాయపు రోజులు విశాఖలోనే గడిచాయి. అక్కడి సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో చదువుకుంది. అది కాదు– ఆమె జీవితాన్ని మార్చిన ఘటన అక్కడే జరిగింది. అదీ– నాటి మద్రాసు ముఖ్యమంత్రి సి.రాజ గోపాలాచారి విశాఖ రావడం. ఆ సందర్భంగా వహిదా రెహమాన్ నాట్య ప్రదర్శన ఇవ్వడం. ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏవో ఒక ప్రదర్శనలు ఏర్పాటు చేయడం ఆనవాయితీ. నాటి వాల్తేరు కలెక్టర్ తన సహోద్యోగైన రెహమాన్‌ను ‘నీ కుమార్తెలు భరతనాట్యం చేస్తారు కదా. వారి ప్రదర్శన ఏర్పాటు చేద్దాం’ అని కోరాడు. అందుకు రెహమాన్ అంగీకరించాడు. అప్పటికే వహిదా, ఆమె సోదరి సయిదా భరతనాట్యం నేర్చుకున్నారు. మొత్తం నలుగురు కూతుళ్లలో అందరి కంటే చిన్నది వహిదా. భరతనాట్యం నేర్చుకోవాలని పట్టుపట్టి నేర్చుకుంది. అయితే గురువు ఆమెకు అంత సులువుగా నేర్పలేదు. ‘ముసల్మానులు ఈ విద్య నేర్చుకోగలరా? ΄రాణిక సందర్భాలను అభినయించగలరా?’ అని సందేహం వ్యక్తం చేశాడు. అయినా వహిదా పట్టు విడువలేదు. మరోవైపు ముస్లింలు భరతనాట్యం నేర్చుకోవడం ఏమిటని అయినవారి ఎత్తి పొడుపులు. ‘కళకు మతం లేదు’ అని తేల్చిన రెహమాన్ కుమార్తెలను భరత నాట్యానికి ప్రోత్సహించాడు. కాని గురువు వినడే. చివరకు వహిదా మొండిపట్టు చూసి ‘నీ జాతకం పట్టుకురా’ అన్నాడు. ముస్లింలలో జాతకాలు ఉండవని తెలిశాక, పుట్టిన రోజు... సమయం తెలుసుకుని ఆ గురువే జాతకం రాసి ఆశ్చర్యపొయాడు. ‘ఈ అమ్మాయి నా చివరి గొప్ప శిష్యురాలు అవుతుంది’ అని ఆ జాతకంతో తేల్చి పాఠాలు నేర్పించాడు. అనుకున్నట్టుగానే జరిగింది. సి.రాజగోపాలాచారి సమక్షంలో వేదిక మీద వహిదా, సయిదాలు అద్భుతమైన నాట్య ప్రదర్శన చేసేసరికి శాస్త్రాలు ఎరిగిన అంతటి రాజగోపాలాచారి కూడా తబ్బిబ్బయ్యి మెచ్చుకున్నాడు. ఆ వార్త మరుసటి రోజు అన్ని ముఖ్యమైన పేపర్లలో మొదటి పేజీల్లో వచ్చింది. వహిదా రెహమాన్ అనే పేరు కళా జగత్తుకు తెలిసింది. సినిమా జగత్తుకు కూడా. వహిదా రెహమాన్‌కు 13 ఏళ్లు ఉన్నప్పుడు ఆమె తండ్రి జబ్బు చేసి మరణించాడు. అతని సమాధి విశాఖలోనే ఉంది. ఇటీవలే వహిదా ఆ సమాధిని దర్శించింది కూడా. తండ్రి జీవించి ఉండగా సినిమా అవకాశాలు వస్తే ‘చిన్నపిల్ల... సినిమాలేమిటి’ అని సున్నితంగా తిరస్కరించాడు కాని వహిదాకు 16 ఏళ్లు వచ్చేసరికి, అప్పటికే ఆమె నాట్యకళకారిణిగా కొనసాగుతూ ఉండటంతో సినిమా అవకాశాలు వస్తూనే ఉండేవి. భర్త అండలేని తల్లి భయంతో వాటిని తిరగ్గొట్టేది. అయితే వహిదాను సినిమా తెరకు పరిచయం చేసే అవకాశం తెలుగువారి ఖాతాలో ఉంటే ఆ విధిని ఎవరు కాదనగలరు? బాంబేలో ఎల్వీ ప్రసాద్‌తో పాటు సినిమా కళను ఆకళింపు చేసుకున్న నిర్మాత సి.వి.ఆర్. ప్రసాద్ మద్రాసు వచ్చి ‘రోజులు మారాయి’ సినిమా తీయదల్చుకున్నాడు. స్క్రిప్ట్ వర్క్ కూడా చేశాడు. అయితే సినిమా అంతా పూర్తయ్యే సమయానికి ఇందులో ఒక సంబరాల పాట ఉండాలి... పల్లెతనపు చిందు ఉండాలి అనిపించిందతనికి. దానికి మంచి డాన్సర్ కావాలంటే వహిదా రెహమాన్ పేరు తెలిసింది. అదృష్టవశాత్తు అంతకు ముందే రెహమాన్‌తో ప్రసాద్‌కు పూర్వ పరిచయం ఉంది. ‘మీవారు నాకు తెలుసు. నేను ఆయన శ్రేయోభిలాషిని. మీ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. స్టేజ్ మీద చేసే డాన్సు కెమెరా ముందు చేయడమే’ అని వహిదా తల్లిని ఒప్పించాడు. ‘రోజులు మారాయి’లో ‘ఐటమ్ సాంగ్’. కొసరాజు రాశాడు. మాస్టర్ వేణు బాణి కట్టాడు. జిక్కి పాడింది. విశాఖ నుంచి మద్రాసు వెళ్లిన వహిదా రెహమాన్ అద్భుతంగా డాన్స్ చేసింది. దేహంతో పాటు హావభావాలను కూడా కదిలించింది. మెరుపు వలే మెరిసింది. ‘ఏరువాక సాగారో రన్నో చిన్నన్న’... సూపర్‌డూపర్ హిట్. ప్రేక్షకులు చిల్లర ఎగరేసిన పాట అది. సినిమా అయిపొయాక ఆపరేటర్ చొక్కా పట్టుకుని మళ్లీ ఆ పాట వేయించుకువారు. గువ్వలాంటి ఆ అమ్మాయి ఎవరు? వహిదా రెహమాన్! ఇంటింటి పేరయ్యింది. నటి సావిత్రి అదృష్టం బాగుంది. వహిదా రెహమాన్ తెలుగు నుంచి పొటీలో తప్పుకుని హిందీలో వెళ్లింది. లేకుంటే ఒకవైపు సావిత్రి, మరోవైపు వహిదా రెహమాన్ తెలుగు సినిమాలను ఒక ఊపు ఊపుతుంటే ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని మనం తన్నుకు చచ్చుండేవాళ్లం. 1955 జనవరిలో ‘మిస్సమ్మ’ విడుదలైంది. అదే సంవత్సరం ఏప్రిల్‌లో ‘రోజులు మారాయి’. ‘మిస్సమ్మ’ సూపర్ హిట్. ‘రోజులు మారాయి’ కూడా. ‘మిస్సమ్మ’ హైదరాబాద్‌లో నెలల తరబడి ఆడుతూనే ఉంటే ఒక డిస్ట్రిబ్యూటరు దాని హిందీ రీమేక్ కోసం దర్శకుడు గురుదత్‌ని బొంబాయి నుంచి హైదరాబాద్‌కు పిలిపించాడు– సినిమా చూడటానికి. మిస్సమ్మ గురుదత్‌కు నచ్చలేదు. కాని వహిదా రెహమాన్‌ను అదే సమయంలో రోజులు మారాయి ప్రమోషన్ కోసం మద్రాసు నుంచి పిలిపిస్తే ఆమె కారు చుట్టూ మూగిన జనాన్ని చూసి ఆశ్చర్యపొయాడు. ‘ఎవరు ఈ అమ్మాయి’ అని అడిగితే ‘వహిదా రెహమాన్’ అని చె΄్పారు. గురుదత్ ఆమెను అదే డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్‌లో కలిశాడు. ‘ఉర్దూ తెలుసా’ అని మాత్రమే అడిగాడు. ‘తెలుసు’ అంది వహిదా. మూడు నెలల తర్వాత బొంబాయి నుంచి పిలుపొచ్చింది. వెళితే రెండేళ్ల పాటు కాంట్రాక్ట్ గురుదత్ బేనర్లో. నెలకు జీతం– 2,500 రూపాయలు. మొదటి సినిమా ‘సి.ఐ.డి’. ‘హీరో ఎవరండీ’ అడిగింది వహిదా రెహమాన్. గురుదత్ జవాబు– దేవ్ ఆనంద్. ‘కహి పే నిగాహె కహిపే నిషానా’... ‘సి.ఐ.డి’ సినిమాలో కొంచెం వేంప్ తరహా వేషం. చిన్న వేషం. కాని ఒక్కపాటతో మొత్తం పేరు కొట్టుకెళ్లింది వహిదా. సి.ఐ.డిలో అసలు హీరోయిన్ షకీలా. ఆమె తుడుచుకునిపొయి వహిదా నిలబడింది. కొద్దిగా మెల్ల కన్ను, లాగేసే చూపు, ఈడ్చేసే నవ్వు... ఈ అమ్మాయిని తీర్చిదిద్దవచ్చు అనుకున్నాడు గురుదత్. వెంటనే ‘ప్యాసా’లో లీడ్ రోల్ ఇచ్చాడు. గురుదత్ ఆమెలోని నటిని చాలా సమర్థంగా తీర్చిదిద్దాడు. తనలాగే అధిక ప్రసంగం చేయకుండా గాఢమైన భావాలను ఎలా పలికించవచ్చో నేర్పించాడు. ప్యాసా ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత గురుతద్, వహిదా కలిసి ‘కాగజ్ కే ఫూల్’, ‘చౌద్వీ కా చాంద్‘, ‘సాహిబ్ బీవీ ఔర్ గులామ్’ సినిమాలలో నటించారు. గురుదత్ ఆగిపొయాడు. వహిదా సాగిపొయింది. సునిల్దత్తో చేసిన ‘ముఝే జీనే దో’, బిశ్వజిత్‌తో ‘బీస్ సాల్ బాద్’ పెద్ద హిట్స్. దిలీప్ కుమార్‌తో ‘దిల్ దియా దర్ద్ లియా’, ‘ఆద్మీ’, ‘రామ్ ఔర్ శ్యామ్’ చేసింది వహిదా. కాని దేవ్ ఆనంద్ మరోసారి ఆమెకు సవాలు విసిరే పాత్రను ఇచ్చాడు ‘గైడ్’లో. ఆర్.కె.నారాయణ్ రాసిన ఈ ప్రఖ్యాత నవలను హాలీవుడ్ వెర్షన్‌గా, బాలీవుడ్ వెర్షన్‌గా తీయాలనుకున్నప్పుడు హిందీ వెర్షన్‌కు చేతన్ ఆనంద్ దర్శకుడు. కాని చేతన్‌కు వహిదా ఇష్టం లేదు. దేవ్ ఆనంద్‌కు వహిదాను తీయడం ఇష్టం లేదు. చేతన్‌ను తీసి విజయ్ ఆనంద్‌ను దర్శకుడిగా పెట్టాడు. విజయ్ ఆనంద్ ‘గైడ్’లో క్లాసిక్‌గా తీర్చిదిద్దాడు. నిజానికి ఆనాటి హీరోయిన్లు ఎంపిక చేసుకునే విలువలున్న పాత్ర లాంటిది కాదు ‘రోజీ’. భర్తను వదిలేసి ప్రియుడితో వెళ్లిపొయే పాత్ర అది. శ్రేయోభిలాషులు చేయొద్దన్నారు. వహిదా రెహమాన్ చేసింది. ఆమెలోని నాట్యాన్ని, నటనను, అభినయ గాఢతను అంత గొప్పగా పట్టి ఇచ్చిన సినిమా మరొకటి లేదు. ‘పత్థర్ కె సనమ్’, ‘నీల్ కమల్’ వంటి హిట్స్ చూసిన వహిదా ఆ తర్వాత చేసిన సినిమాలు అంతగా ఆడలేదు. రాజ్ కపూర్‌తో ‘తీస్రి కసమ్’, సునిల్దత్తో ‘రేష్మా ఔర్ షేరా’, రాజేష్ ఖన్నాతో ‘ఖామోషీ’, అమితాబ్ బచ్చన్‌తో ‘కభి కభి’... ఆమెను మెల్లగా హీరోయిన్ దశ నుంచి తప్పించాయి. వీటి నడుమ అక్కినేనితో ‘బంగారు కలలు’లో తెలుగువారిని పలుకరించింది. వహిదా రెహమాన్ హిందీ సినిమా రంగంలో సాధించిన స్థానం, ఏర్పరుచుకున్న గౌరవం, పొందిన సత్కారాలు, గెలుచుకున్న అభిమానులు తక్కువ కాదు. హుందాగా ఉంటూ, అదే సౌందర్యంతో ఆమె ఆ తర్వాతి రోజుల్లో కూడా అడపా దడపా నటిస్తూనే వచ్చింది. ఆమె నవ్వుకు ఫిదా అయ్యే ప్రేక్షకులను కనికరిస్తూనే ఉంది.గొప్ప ప్రయాణం ఆమెది. ఎన్నో జ్ఞాపకాలు. కొన్ని గాయాలు. నాటి రోజులు మళ్లీ రావు. ఈ ఉత్సవ సమయంలో ముసురుకునేది సువర్ణ తలపొతలే. వక్త్ నే కియా క్యా హసీ సితమ్ తుమ్ రహేన తుమ్ హమ్ రహేన హమ్ జీవితాలను కాల్చిన ప్రేమ వహిదా రెహమాన్, గురుదత్‌ల మధ్య బంధం, అనుబంధం, సంబంధం గురుదత్ జీవితంలో సంక్షోభం తెచ్చింది. వహిదాను హిందీ పరిశ్రమకు పరిచయం చేసిన గురుదత్ ఆమె పట్ల చాలా పొసెసివ్‌గా ఉండేవాడు. వహిదా కూడా గురుదత్ రెక్కల చాటునే ఉండటానికి ఇష్టపడేది. అయితే ఇదంతా గురుదత్ భార్య, ప్రఖ్యాత గాయని గీతా దత్‌ను చాలా గట్టి దెబ్బ తీసింది. గురుదత్, గీతాదత్‌ల మధ్య వహిదా ప్రమేయం వల్ల చాలా ఎడం వచ్చింది. గురుదత్, గీతాదత్లు ఇద్దరూ తాగుడుకు బానిసయ్యారు. అప్పటికే డిప్రెషన్‌తో బాధపడుతున్న గురుదత్ ఆత్మహత్య చేసుకు మరణించాడన్నది ఒక కథనం. నిద్రమాత్రలు ఎక్కువై మరణించాడని మరో కథనం. ఏమైనా అతని జీవితం అర్థంతరంగా ముగిసింది. ఆ తర్వాత గీతాదత్ కూడా నానా బాధలు పడుతూ తాగుడుకు బానిసై మరణించింది. వహిదా ఒకనాటి నటుడు కమల్జిత్ను వివాహం చేసుకుంది. ఆమెకు ఒక కొడుకు, కూతురు. బెంగళూరులో చాలా కాలం ఉన్నాక భర్త మరణం తర్వాత ముంబై వచ్చి నివసిస్తోంది. వహిదా రెహమాన్ హిట్స్ 1. భవరా బడా నాదాన్ హై – సాహిబ్ బీబీ ఔర్ గులామ్ 2. జానే క్యా తూనే కహి – ప్యాసా 3. కహీ దీప్ జలే కహి దిల్ – బీస్ సాల్ బాద్ 4. సాంర్nు ఢలీ దిల్ కి లగీ – కాలా బజార్ 5. ఏ నయన్ డరే డరే – కొహ్రా 6. గాతా రహే మేరా దిల్ – గైడ్ 7. మెహబూబ్ మేరె మెహబూబ్ మేరె – పత్థర్ కె సనమ్ 8. తుమ్ పుకార్ లో తుమ్హారా ఇంతెజార్ హై – ఖామోషీ 9. రంగీలారే తేరె రంగ్ మే – ప్రేమ్ పూజారి 10. జాదుగర్ తెరె నైనా – మన్ మందిర్ పేరు మార్చుకోని నటి ఆ రోజుల్లో హిందీ సినిమాల్లో నటీనటులు కొత్త తరహా పేర్లు పెట్టుకునేవారు. యూసఫ్‌ఖాన్ దిలీప్ కుమార్ అయ్యాడు. మెహజబీన్ మీనా కుమారి అయ్యింది. అలాగే వహిదా రెహమాన్‌ని కూడా పేరు మార్చుకోమని గురుదత్ సూచించాడు. గురుదత్ అసిస్టెంట్లు కూడా పేరు మార్పుకోసం పట్టుబట్టారు. వహిదా రెహమాన్ పేరులో గ్లామర్ లేదని, మధుబాల లాగా ఏదో ఒక బాల వచ్చేలాగా పెట్టుకోమని కోరారు. అయితే ‘మా అమ్మా నాన్నలు పెట్టిన పేరు నేను మార్చుకోను. దానితోనే కొనసాగుతాను. మీకిష్టమైతే తీసుకోండి, లేకుంటే మానుకోండి’ అని వహిదా రెహమాన్ హఠం చేసింది. చివరకు అందరూ దిగిరాక తప్పలేదు. వహిదా రెహమాన్ తన పేరుతోనే ఖ్యాతి గడించింది. వహిదా రెహమాన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే సినిమా రంగంలో విశేష సేవలకుగాను భారత ప్రభుత్వం ప్రకటించే సర్వోన్నత పురస్కారం ‘దాదాసాహెబ్ ఫాల్కే’ 2021 సంవత్సరానికి సుప్రసిద్ధ నటి వహిదా రెహమాన్ (85)ను వరించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి అనురాగ్ ఠాకుర్ మంగళవారం ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ వార్త విన్న వెంటనే వహిదా రెహమాన్ ‘దేవ్ ఆనంద్ శతజయంతి నాడు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. నిజానికి ఈ అవార్డు ఆయనకు అందాలి. నాకు అందింది’ అని సంతోషం వ్యక్తం చేశారు. అవార్డుకు ఎంపిక చేసిన కమిటిలో ఆశాపరేఖ్, చిరంజీవి, పరేష్ రావెల్, ప్రసేజ్జిత్ చటర్జీ, శేఖర్ కపూర్ ఉన్నారు. వహిదా రెహమాన్‌ను ఇది వరకే పద్మశ్రీ, పద్మభూషణ్ వరించాయి. ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కేతో తనకు రెట్టింపు సంబరం కలుగుతున్నదని ఆమె అన్నారు. కాగా వహిదాకు ఫాల్కే పురస్కారం లభించడం పట్ల ప్రధాని మోడి హర్షం వెలిబుచ్చారు. సినిమా రంగంపై ఆమె ముద్ర చెరగనిది అని కొనియాడారు. హైదరాబాద్, విశాఖ, చెన్నైలతో అనుబంధం కలిగిన వహిదా రెహమాన్ తెలుగు సినిమా ‘రోజులు మారాయి’తో సినిమా రంగంలో ప్రవేశించారు. ఆ తర్వాత హిందీ సినిమాల్లో ఆగ్రతారగా వెలుగొందారు. భారతీయ సినిమాల్లో అత్యుత్తమ నటీమణుల్లో ఒకరిగా ఆమెను పరిగణిస్తారు. వహిదా రెహమాన్ అక్కినేని సరసన ‘బంగారు కలలు’ సినిమాలో నటించారు. ‘పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి’ హిట్ సాంగ్ ఆమెపై చిత్రీకరించినదే. -
తిరుమలలో సినీనటి అర్చనా గౌతమ్ వీరంగం
-
నా కూతురు గర్వపడే సినిమాలు చేయాలనుకుంటున్నాను
‘‘సినిమాల పట్ల నా ఆలోచనా ధోరణి మారింది. నా కుటుంబం, నా కూతురు రాధ నా సినిమాలను చూసి గర్వపడేలా చాలెంజింగ్ రోల్స్ చేయాలనుకుంటున్నాను. మనసుకు నచ్చిన పాత్రలే చేస్తాను’’ అని శ్రియ అన్నారు. శ్రియ, శివ కందుకూరి, ప్రియాంకా జవాల్కర్ ప్రధాన పాత్రల్లో నిత్యా మీనన్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘గమనం’. సంజనా రావు దర్శకత్వంలో రమేశ్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రియ చెప్పిన విశేషాలు. ∙‘గమనం’ చిత్రంలో దివ్యాంగురాలు కమల పాత్రలో కనిపిస్తాను. కమలకు వినపడదు. కానీ మాట్లాడుతుంది. ఇందులో మూడు కథలు ఉన్నాయి. ఈ మూడు కథలూ ఓ ప్రకృతి విపత్తు (భారీ వర్షం) కారణంగా కనెక్ట్ అవుతాయి. ‘గమనం’ కథ విన్నప్పుడు ఏడ్చాను. కథకు, కమల పాత్రకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. నిస్సహాయతతో ఉన్న ఓ మహిళ సాగించే ప్రయాణమే కమల జీవితం. ఈ పాత్ర కోసం బట్టలు కుట్టడం నేర్చుకున్నాను. ∙మహిళా దర్శకులతో వర్క్ చేయడం నాకు కొత్త కాదు. దీపా మెహతా, కన్నడంలో ఓ సినిమా చేశాను. అయితే తెలుగులో లేడీ డైరెక్టర్ తెరకెక్కించిన సినిమా చేయడం నాకిదే తొలిసారి. ఒకప్పుడు సెట్స్‌లో నేను, నా మేకప్ ఉమన్ తప్ప ఎవరూ మహిళలు ఉండేవారు కాదు. అయినా నా ప్రైవసీకి ఏ ఇబ్బంది కలగలేదు. కానీ మహిళా దర్శకులు అయితే ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ధైర్యంగా చెప్పుకోగలం. కాస్త చనువు కూడా ఉంటుంది. ఈ సినిమాకు ఇళయరాజాగారితో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నా తర్వాతి సినిమా ‘మ్యూజిక్ స్కూల్’కి కూడా ఆయనే సంగీత దర్శకులు. ∙నేను ఇండస్ట్రీకి వచ్చి ఇరవయ్యేళ్లయింది. నా తొలి సినిమా ‘ఇష్టం’ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. నా సుదీర్ఘమైన ప్రయాణానికి ప్రేక్షకుల ప్రేమే కారణమని నమ్ముతాను. మరో ఇరవయ్యేళ్లు ప్రేక్షకుల ప్రేమను పొందాలని ఉంది. అందుకు కష్టపడతాను. అక్కినేని నాగేశ్వరరావుగారు చివరి క్షణం వరకు నటించారు. ‘మనం’ సినిమా సమయంలో ‘ఒకవేళ నేను చనిపోతే ఈ సినిమా చేసే చనిపోతాను’ అని ఆయన అన్న మాటలు నాకు గుర్తున్నాయి. ఆయనలా నాక్కూడా చివరి క్షణం వరకూ నటించాలని ఉంది. ∙పదినెలల క్రితమే బార్సిలోనాలో నేను ఓ పాపకు జన్మనిచ్చాను. నాకు పాప పుట్టాలనే కోరుకున్నాను. ‘రాధారాణి’ పేరును మా అమ్మగారు సూచించారు. రష్యన్ భాషలో రాధ అంటే హ్యాపీ అని మా ఆయన ఆండ్రీ అన్నారు. సంస్కృతంలో కూడా హ్యాపీ అనే అర్థం వస్తుంది. అందుకని ‘రాధ’ అని పెట్టాం. రాధ వచ్చిన తర్వాత మా లైఫ్ మారిపోయింది. పాప జాగ్రత్తల గురించి ప్రత్యేకంగా ఆలోచించాలి. ఈ ఫీలింగ్ చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ∙బయోపిక్స్ అని కాదు కానీ కథక్ డ్యాన్స్ నేపథ్యంలో ఏదైనా సినిమా వస్తే చేయాలని ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి మరో సందర్భంలో మాట్లాడతాను. -
ఓల్డ్ ఈజ్ గోల్డ్: ఈ నటీమణుల డైట్ ఏంటో తెలుసా?
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఆ తరం.. దీనికి నిదర్శనం వారి ఆరోగ్యకర జీవన విధానం.. ప్రస్తుతం మనిషి జీవిత కాలం క్షీణిస్తూ, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న తరుణంలో పాతకాలపు ఆహార పద్ధతులను అన్వేస్తున్నారు. నేడు ‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఆ తరం నటీమణుల ఆహార అలవాట్లు, వారి జీవన విధానాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం.. – సాక్షి, సిటీబ్యూరో గంజినే సూప్‌గా తాగేవాళ్లం.. 66 ఏళ్ల వయస్సులో కూడా ఆరోగ్యంతో ఉన్నానంటే చిన్నప్పుడు నేను పెరిగిన విధానం మాత్రమే. ఇంట్లో అమ్మ చేసిన ఆహారం తప్ప బయటి చిరుతిల్లు ఉండేవి కావు. మా తరంలో పుట్టుసారం బాగుండేది. మా అమ్మ 8 నెలల గర్భిణిగా ఉండే వరకు మొదటి పాపకు పాలను ఇచ్చేది. అప్పుడు బియ్యం, జొన్నల నుంచి తీసిని గంజిని సూప్‌గా ఇచ్చేవారు. చెట్టుపైనే మగ్గిన పండ్లను తినేవాళ్లం. నేను తులసి, కరివేపాకు, వాము, సొంటి, మిరియాలు, ధనియాలు, జిలకర్ర మిశ్రమాల పొడితో కాచిన డికాషన్ మాత్రమే తాగుతాను. – క్రిష్ణవేణి, హిట్లర్ గారి పెళ్లాం సీరియల్ బతకడానికి తినాలి.. నేను ఆరి్టస్ట్ని.. ఎప్పుడూ ఆక్టివ్‌గా ఉండాలి. దీనికి నా బాల్యంలోని ఆహార పద్ధతులే సహకరించాయి. ఇప్పటికీ నాకు బీపీ, షుగర్లాంటి సమస్యలు లేవు. పస్తుతం నీళ్లు, పాలు, నూనె, కూరగాయలు, బియ్యం ఏది చూసినా కల్తే.. ప్రస్తుతం పలువురు ఆరోగ్య నిపుణులు అధికంగా అన్నం తినకూడదని చెబుతుంటారు. మేమైతే అన్నీ తినేవాళ్లం. దానికి తగ్గ శారీరక శ్రమ చేసేవాళ్లం. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. అన్నం తగ్గించి చిరుధాన్యాలను అధికంగా తీసుకోవాలి. బతకడానికి తినాలి.. తినడానికి బతకకూడదు. – శివపార్వతి. ఇంటి గుట్టు సీరియల్ సౌత్ ఇండియన్ ఫుడ్.. నా ఫిట్నెస్కి ముఖ్య కారణం వర్క్‌హాలిక్‌గా, నాన్ఆల్కాహాలిక్గా ఉండటం. ముఖ్యంగా నాకు ఇష్టమైన దక్షినాదిలోని ఆహారపు అలవాట్లు మంచి ఆరోగ్యాన్నిచ్చాయి. సౌత్ ఇండియన్ ఫుడ్ అయిన ఇడ్లి ఇంటర్నేషనల్ లైట్ బ్రేక్‌ఫాస్ట్ మారింది. మొదటి నుంచి శాఖాహారిని కావడం వలన మానసికంగా శారీరకంగా ఫిట్‌గా ఉన్నాను. స్వచ్ఛమైన నెయ్యిని ఫుడ్‌లో వాడుతుంటాను. ఇది ఆరోగ్యాన్నే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నాలోని డాన్స్ స్కిల్స్ నేను ఫిట్‌గా, గ్లామర్‌గా ఉండటానికి మరో కారణం. – సుధా చంద్రన్, నెంబర్ వన్ కోడలు సీరియల్ మానసిక ఆరోగ్యం అవసరమే.. శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యం ముఖ్యం. ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంటూ అన్ని పనులను ఉత్సాహంగా చేస్తున్నానంటే అనవసర విషయాలను పట్టించుకోకపోవడమే. ఈ మానసిక ధృడత్వానికి కారణం నా ఆహార అలవాట్లే. విటమిన్లు, ప్రొటీన్స్ అధికంగా అందించే బొప్పాయి వంటి పండ్లను అధికంగా తింటాను. ఎలాంటి డైట్‌ను పాటించను. జంక్ ఫుడ్‌కి దూరంగా ఉంటూ అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలకు ప్రాధాన్యం ఇస్తాను. ఫ్రూట్, వెజిటేబుల్ జ్యూస్‌లు తాగుతూ వ్యాయామం చేస్తాను. – లక్ష్మీ ప్రియ, నాగభైరవి సీరియల్ -
కూతురుతో సహా సినీ నటి అదృశ్యం
సాక్షి, చెన్నై: కుమార్తెతో సహా సినీ నటి అదృశ్యం కావడంతో ఆమె భర్త పోలీసుల్ని ఆశ్రయించాడు. ‘చిన్న పూవే మేల్ల’ చిత్రం ద్వారా నర్మద వెండితెరకు హీరోయిన్గా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో నటుడు రాంకీ, ప్రభు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. 1987 విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. నర్మద కూడా మంచి పేరు తెచ్చి పెట్టింది. అయితే ఆ ఒక్క చిత్రంతోనే నర్మద సినిమాలకు గుడ్‌బై చెప్పారు. అనంతరం స్థానిక తారాపురంకు చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని గృహిణిగా స్థిరపడ్డారు. అయితే నర్మద తన 15 ఏళ్ల కూతురుతో సహా కనిపించకపోవడంతో ఆమె భర్త బంధువులు పలుచోట్ల వారి కోసం గాలించినా ఆచూకీ దొరకలేదు. దీంతో నర్మద భర్త గురువారం తారాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: హీరోయిన్‌తో బిగ్‌బాస్ విన్నర్ పెళ్లి!) -
‘డబ్బుల కోసం ఇంత దిగజారాలా?’
న్యూయార్క్ : తన సోషల్ మీడియా అకౌంట్‌ను ప్రమోట్ చేసుకోవటానికి ఏకంగా కిడ్నాప్ డ్రామా ఆడిందో అమెరికన్ నటి. తనను కొందరు కిడ్నాప్ చేశారంటూ, తన అకౌంట్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుంటేనే దుండగులు వదలిపెడతారంటూ తెగ బాధపడింది. అది ఫేక్ అని కనుగొన్న అభిమానులు, తోటి నటీ,నటులు విమర్శలు చేయటంతో వీడియో డిలీట్ చేసి మరో కొత్త నాటకానికి తెరతీసింది. వివరాల్లోకి వెళితే.. అమెరికన్ నటి, రియాలిటీ స్టార్ మసిక కలైశాకు ‘ఓన్లీఫ్యాన్స్’ అనే సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలో అకౌంట్ ఉంది. తన అకౌంట్‌ను ప్రమోట్ చేసుకోవటానికి ఓ వినూత్న పద్ధతిని వెతుక్కుంది మసిక. తనను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ ఓ వీడియోను తన ట్విటర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్ట్ చేసింది. ( జీవితంలో అది తల్చుకోకుండా వంట చేయను) ఒంటిపై పలు చోట్ల గాయాలైనట్లు ఉన్న ఆ వీడియోలో ‘‘నాకెంత సమయం ఉందో నాకు తెలియదు. నేను బాగా దెబ్బలు తిన్నా.. వాళ్లు నన్ను వెంబడిస్తున్నారు. నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం లాక్కున్నారు. నాకు సహాయం చేయండి. నా ఓన్లీఫ్యాన్స్ అకౌంట్‌ను వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే వాళ్లు నన్ను వదిలేస్తారు’’ అని కన్నీరు పెట్టుకుని ప్రార్థించింది. ఈ వీడియోను చూసిన అభిమానులు, తోటి నటీ,నటులు ఆమెపై ఫైర్ అయ్యారు. ‘డబ్బుల కోసం ఇంత దిగజారాలా?’ అంటూ మండిపడ్డారు. దీంతో వెనక్కు తగ్గిన మసిక, వీడియోను డిలీట్ చేసింది. తాను మహిళల అక్రమ రవాణాపై అవగాహన కల్పించటానికే ఆ వీడియో చేశానని చెప్పుకొచ్చింది. రోస్ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ తరపున పనిచేస్తున్నానని, అందుకే అలా వీడియో చేయవల్సి వచ్చిందని చెప్పింది. తన వీడియో ఎవరినైనా భయపెట్టి ఉంటే క్షమించాలని కోరింది. -
సినీనటి రాధ ప్రశాంతిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: సినీనటి రాధ ప్రశాంతిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. రాధా ప్రశాంతి తనపై దురుసుగా ప్రవర్తించారంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిల్డింగ్ సెక్యూరిటీగా పని చేస్తున్న లక్ష్మీ అనే మహిళను రాధ ప్రశాంతి కారు ఢీ కొట్టింది. శబ్దం వినిపించడంతో స్థానికంగా ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్ బయటికి వచ్చి చూడగా... రాధ ప్రశాంతితో పాటు ఉన్న మరో వ్యక్తి ఆ మహిళపై దాడి చేస్తుండగా తన మొబైల్లో చిత్రీకరించారు. దీంతో సాప్ట్వేర్ ఇంజనీర్ మొబైల్ లాక్కొని ధ్వంసం చేసి, అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలిసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు రాధ ప్రశాంతితో పాటు మరో వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తారా దీపం
చీకటిని అంతం చేసేది వెలుగు. కోవిడ్–19తో ప్రపంచాన్ని ఒకలాంటి చీకటి ఆవహించింది. మన దేశంలో ఈ చీకటిని పోగొట్టడానికి ‘దీపం వెలిగిద్దాం’ అని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ఆదివారం రాత్రి సరిగ్గా 9 గంటలకు దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల దీపాలు వెలిగాయి. సినిమా స్టార్స్ కూడా దీపాలు వెలిగించి ‘‘మేము సైతం’’ అన్నారు. ఆ వెలుగులు చూద్దాం. వెంకటేష్, నాగార్జున, అమల, అఖిల్, మహేశ్ బాబు పాయల్ రాజ్‌పుత్, విష్ణు, గోపీచంద్, శ్రీయ పూజా హెగ్డే, రాశీ ఖన్నా, రాజశేఖర్, జీవిత, శివాని, శివాత్మిక అర్జున్, ఐశ్వర్య, సాయి కుమార్, సురేఖ -
బీజేపీలోకి నమిత, రాధారవి
సాక్షి, చెన్నై: సినీ నటులు నమిత, రాధారవి బీజేపీలో చేరారు. శనివారం చెన్నైకి వచ్చిన బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో వీరు కాషాయం కండువా కప్పుకున్నారు. రాధారవికి బీజేపీ నేత, సినీ నటుడు ఎస్వీ శేఖర్ అభినందనలు తెలియజేశారు. అయితే సినీ నేపథ్య గాయని చిన్మయి మాత్రం తీవ్రంగా విరుచుకుపడ్డారు. మహిళలను కించ పరిచే రీతిలో స్పందించే రాధారవిని పార్టీలో చేర్చుకోవడంతో నష్టం తప్పదని అన్నారు. -
కృష్ణమ్మతో అనుబంధం ఈనాటిది కాదు
విజయవాడ కల్చరల్: ‘బెజవాడ కృష్ణమ్మ నా కళా జీవితానికి పునాది’ అని అలనాటి ప్రముఖ నటీమణి, కళాభినేత్రి వాణిశ్రీ అన్నారు. మహానటి సావిత్రి సాహిత్య, సాంస్కృతిక కళాపీఠం నిర్వహణలో గాంధీనగర్‌లోని శ్రీరామ ఫంక్షన్ హాలులో శుక్రవారం సాయంత్రం వాణిశ్రీకి ఘనంగా పౌరసత్కారం జరిగింది. వాణిశ్రీ మాట్లాడుతూ కృష్ణా జిల్లాతో నా అనుబంధం ఈ నాటిది కాదని, నా కళాజీవితంలో అనేక సంఘటనలు ఇక్కడే ముడివేసుకున్నాయని వివరించారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు వేదికగా విజయవాడ నగరం నిలిచిపోయింది, విజయవాడ ప్రేక్షకుల ఆదరణ మరువలేమని వివరించారు. మహానటి సావిత్రి నటజీవితం తనకు ఆదర్శమని ఆమె ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకున్నానన్నారు. కృష్ణవేణి చిత్రంలో నటించటం తన నట జీవితంలో మరచిపోలేని సంఘటనగా ఆమె పేర్కొన్నారు. కళాపీఠం నిర్వాహకురాలు పరచూరి విజయలక్ష్మి సావిత్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తోందని అభినందించారు. వాణిశ్రీ తెలుగు నవలా నాయకి డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ మాట్లాడుతూ తెలుగు సినిమా ఆణిముత్యం వాణిశ్రీ, అమె నట జీవితం భావి నటులకు ఆదర్శమని అన్నారు. ఆమె నట జీవితం స్వర్ణయుగంతో ప్రారంభమైందన్నారు. సీనియర్ పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావు మాట్లాడుతూ వాణిశ్రీ తెలుగు నవలా నాయకియని అభినందించారు. ఆమె సంభాషణలో చురుకుదనం, నటలో పరిపక్వత తెలుగు ప్రేక్షులు మరచిపోలేరన్నారు. పారిశ్రామిక వేత్త కోగంటి సత్యం మాట్లాడుతూ మహానటి సావిత్రికి వారసురాలు వాణిశ్రీ అని అభివర్ణించారు. 2016 సంవత్సరానికి గానూ హైదరాబాద్‌కు చెందిన నాట్యకళాకారిణి గుర్రం లాలినిధికి మహానటి సావిత్రి అమరావతి పురస్కారాన్ని అందించారు. కార్యక్రమంలో సావిత్రి కళాపీఠం వ్యవస్థాపకురాలు పరచూరి విజయలక్ష్మి, గౌరవాధ్యక్షుడు ప్రబల శ్రీనివాస్ , న్యాయవాది అక్కిపెద్ది వెంకటరమణ, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చోడిశెట్టి మన్మథరావు తదితరులు ప్రసంగించారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఘంటసాల పవన్‌కుమార్ బృందం పలు నృత్యాంశాలను ప్రదర్శించింది. నేరెళ్ళ సురేష్‌కుమార్ బృందం సంగీత విభావరి ఆకట్టుకుంది. పెద్దసంఖ్యలో కళాభిమానులు హాజరయ్యారు. -
నిజం దివ్యభారతికే ఎరుక!
అప్పుడెప్పుడో జరిగిపోయిన సంఘటన.. తలచుకుంటే నేటికీ మనసుని మెలిపెడుతుంది. వేలాది హృదయాలను కదిలిస్తుంది. ఆమె సజీవంగా ఉంటే బాగుండు కదా.. అనిపిస్తుంది. ఊహ తెలియని వయసులోనే స్టార్డమ్, ప్రపంచాన్ని అర్థం చేసుకునేలోపే అనంతలోకాలకు పయనం.. వెరసి, అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చిందామె. నేలపై నడిచినప్పుడే ఆమెను స్టార్ అన్నారంతా.. నింగికెగిశాక అనకుండా ఉండగలరా..? కానీ, ఆ స్టార్‌డమ్‌ను పూర్తిగా ఆస్వాదించకుండానే వెళ్లిపోయింది టీనేజ్ స్టార్ దివ్యభారతి. ఎన్నో అనుమానాలకు తెరలేపిన ఆమె మరణానికి కారణమేంటి..? ఇంతకీ ఆరోజేం జరిగింది..? 1993.. ఏప్రిల్ 5.. మరో అరవై నిమిషాలు గడిస్తే తేదీ మారుతుందనగా ముంబైని సునామీ లాంటి వార్త ఒక్కసారిగా ముంచెత్తింది. టీనేజ్ సంచలనం, అందాల నటి దివ్యభారతి ఆత్మహత్య చేసుకుందన్నదే ఆ వార్త! పంతొమ్మిదేళ్ల వయసు, మోయలేనంత స్టార్డమ్, అసాధారణ భవిష్యత్తు ఉన్న అమ్మాయి ఎందుకు మరణిస్తుంది..? ఎవరో కావాలనే ఆమెను హతమార్చారు అంటూ కొందరు అనుమానాలు లేవనెత్తారు. సక్సెస్ కిక్కును తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుందేమో అంటూ కొందరు నిట్టూర్చారు. ఏళ్లు గడిచినా ముంబై పోలీసులు మాత్రం ఎలాంటి ఆధారాలూ సంపాదించలేకపోయారు. ఆమె మరణం నేటికీ మిస్టరీనే! కానీ, ఆ రోజు దివ్యభారతి చాలా హుషారుగా ఉందని చెబుతారు దగ్గరనుంచి చూసినవాళ్లు. చెన్నై నుంచి షూటింగ్ పూర్తి చేసుకుని ముంబై చేరుకున్న ఆమె.. తన సంపాదనతో ఓ అపార్ట్మెంట్లోని ఇంటిని కొనుగోలు చేయాలని భావించింది. అందులో భాగంగానే సోదరుడు కునాల్‌తో కలిసి ఆ నాలుగు పడకగదుల ఇంటిని సందర్శించింది. ముంబైలాంటి ఖరీదైన ప్రాంతంలో ఇల్లు సొంతం చేసుకోవాలనే కోరిక ఎవరికి మాత్రం ఉండదు..? అందుకే, డీల్ పూర్తి కాగానే అందరికీ సంబరంగా చెప్పుకొచ్చింది. కానీ, ఆ ఫ్లాట్ ఆమె కోసం కాదు. ఆమె తల్లిదండ్రుల కోసం! అవును, అప్పటికే దివ్య భారతికి వివాహమయింది. భర్త, ప్రముఖ నిర్మాత సాజిద్ నదియాడ్వాలాతో కలిసి అంధేరీ ప్రాంతంలోని తులసీ అపార్ట్మెంట్లో నివసిస్తోంది. ఆమెకు ప్రత్యేకంగా ఇంటి అవసరం ఏముంటుంది..? కొనుగోలు వ్యవహారాల్లో ఆ రోజంతా తలమునకలై ఉండటంతో తర్వాతి రోజు హైదరాబాద్‌లో చేయాల్సిన షూటింగ్‌ను వాయిదా వేసుకుంది. నిర్మాతలకు ఫోన్ చేసి, తాను అలసిపోయానని.. ఒకరోజు విశ్రాంతి తీసుకుని వస్తానని చెప్పింది. అలా రాత్రి పదిగంటలకు తులసీ అపార్ట్‌మెంట్‌కు చేరుకుంది. అప్పటికి పనిమనిషి అమృత మాత్రమే ఇంట్లో ఉంది. చిన్ననాటి నుంచీ దివ్యభారతి ఆలనాపాలనా చూసుకుంటోంది ఆమే. దివ్యభారతి బెడ్రూమ్లోకి చేరి, కాసేపు నడుం వాల్చగానే ప్రముఖ డిజైనర్ నీతా లుల్లా నుంచి ఫోన్ వచ్చింది. తన భర్త డా.శ్యామ్ లుల్లాతో కలిసి తులసీ అపార్ట్‌మెంట్‌కు వస్తున్నానని చెప్పిందామె. దీంతో వారికి వెల్కమ్ చెప్పేందుకు మద్యం బాటిల్లతో సిద్ధమైంది దివ్యభారతి. ముగ్గురూ కలిసి ఆమె బెడ్రూమ్లోనే మద్యం సేవించారు. కొద్దిసేపు డ్రెస్సుల గురించీ, డిజైన్ల గురించీ చర్చించారు. అమృత వారికి ఇష్టమైన ఆహారాన్ని వండిపెడుతోంది. ఓవైపు వంట చేస్తూనే, మరోవైపు కిచెన్ నుంచే దివ్యభారతితో మాట్లాడుతోందామె. హీరోయిన్ కూడా బిగ్గరగా అరుస్తూ ఆమెకు సమాధానాలిస్తోంది. అలా మాట్లాడుతూనే బాల్కనీ వైపు నడుచుకుంటూ వెళ్లింది దివ్యభారతి. మరోవైపు నీతా, శ్యామ్ లుల్లాలు టీవీ చూస్తూ ఉండిపోయారు. బాల్కనీలోని తలుపుల్లేని కిటికీ ముందు నిల్చుంది దివ్యభారతి. అక్కడి నుంచే స్వచ్ఛమైన గాలికోసమన్నట్టుగా తలను బయట పెట్టి చూస్తూ పనిమనిషితో బిగ్గరగా మాట్లాడసాగింది. ఏం జరిగిందో ఏమో.. పదకొండు గంటల సమయంలో ఒక్కసారిగా ఆమె కాళ్లు పట్టుతప్పాయి. ముందుకు కూలబడిపోయింది. ఐదో అంతస్తు నుంచి పెద్ద శబ్దం చేస్తూ కింద పడిపోయింది. ఆ శబ్దానికి చుట్టుపక్కలవారు లేచి చూశారు. అంతే.. రక్తపు మడుగులో దివ్యభారతి కొట్టుమిట్టాడుతోంది. ఆలస్యం చేయకుండా అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అలా కొద్ది సమయంలోనే దగ్గర్లోని కూపర్ ఆస్పత్రికి ఆమెను చేర్చారు. అయితే, హాస్పిటల్లోకి అడుగుపెట్టగానే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఇదే ఇప్పటివరకూ ఆమె మరణం విషయంలో వినిపిస్తోన్న కథనం. దీనిపై నీతా, శ్యామ్ లుల్లాలు ఏరోజూ నోరు మెదపలేదు. భర్త సాజిద్ కూడా మౌనాన్నే ఆశ్రయించాడు. వంటమనిషి అమృత.. దివ్యభారతి మరణాన్ని తట్టుకోలేక నెలరోజులకే గుండె ఆగి చనిపోయింది. దీంతో ఇది హత్య అన్న వాదనలకు బలం దొరకలేదు. కానీ, ఈ మరణం వెనక దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ గ్యాంగ్ ప్రమేయం ఉందనే పుకార్లు హల్చల్ చేశాయి. సాజిద్ ఉద్దేశపూర్వకంగానే భార్యను హత్య చేయించాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముంబై పేలుళ్ల కేసు నుంచి బయటపడేందుకే ఇలా చేశాడనీ కొంతమంది సిద్ధాంతీకరించారు. కానీ, ముంబై పోలీసులు ఆ దిశగా ఎలాంటి ఆధారాలూ సంపాదించలేకపోయారు. దీంతో 1998 వరకూ కొనసాగిన విచారణ.. ఆ ఏడాది ముగిసిపోయింది. మరణ కారణం ఏంటో ప్రపంచానికి స్పష్టంగా చెప్పకుండానే పోలీసులు కేసును మూసివేశారు. ఇంతకీ ఆమెది హత్యా, ఆత్మహత్యా, ప్రమాదమా..? నిజం దివ్యభారతి మాత్రమే చెప్పగలదు..! -
శ్రీవారి సేవలో నటి నమిత
తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. తమిళ, తెలుగు నటి, అన్నాడీఎంకే నాయకురాలు నమిత తన కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అలాగే, ఇస్రో డెరైక్టర్ వి.జయరామన్, డీఐజీ ప్రభాకర్‌రావు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
తమిళనాట తెలుగు ముద్ర
► సత్తా చాటిన అభ్యర్థులు ► మాతృ భాషలో గళం విప్పేది డౌటే అసెంబ్లీకి ముగ్గురు: తమిళనాట చెన్నై మహానగరం పరిధిలో ఎక్కువ శాతం మంది స్థిర పడ్డ తెలుగు సంతతికి చెందిన వారే ఉన్నారన్న విషయం తెలిసిందే. అలాగే, ఉద్యోగ రీత్యా ఇక్కడే ఉంటూ ఓటు హక్కును కల్గిన వారూ ఎక్కువే. అందుకే తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకు తగట్టుగా తెలుగు సంతతికి చెందిన అభ్యర్థులుగా శేఖర్ బాబు(హార్బర్), రంగనాథన్(విల్లివాక్కం), మోహన్ (అన్నానగర్), ఎం సుబ్రమణియన్(సైదాపేట)లను డీఎంకే, కాంగ్రెస్ కూటమి రేసులో దించాయి. రాజకీయంగా పార్టీల బలం, వ్యక్తిగత చరిష్మా, తెలుగు ఓటరు అండగా నిలబడడం వెరసి ఈ ముగ్గురు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పల్లావరానికి అన్నాడీఎంకే అభ్యర్థిగా తెలుగు ప్రముఖురాలు, సినీ నటి సీఆర్ సరస్వతిపోరాడి చివరకు ఓటమి చవి చూశారు. సాక్షి, చెన్నై: తమిళనాట ఏ రంగంలో నైనా సరే తెలుగువారి ముద్ర కచ్చితంగా కన్పిస్తుంది. ఆ దిశగా అసెంబ్లీ ఎన్నికల్లోనూ తెలుగు అభ్యర్థులు పలువురు విజయ కేతనం ఎగురవేశారు. తెలుగు వారిగా, తెలుగు సంతతికి చెందిన వారుగా పలువురు డిఎంకే, అన్నాడీఎంకేల నుంచి అసెంబ్లీ మెట్లు ఎక్కినా మాతృభాషలో తమ గళాన్ని విన్పించడం అనుమానమే. ఈ సారి తెలుగు సంతతికి చెందిన అత్యధిక శాతం మంది డీఎంకే అభ్యర్థులుగా గెలవడం గమనార్హం. విభిన్న జాతుల సమాహారంతో నిండిన రాష్ట్రంలో మాతృ భాషం తమిళం అయినా, తెలుగు వారి సంఖ్య ఎక్కువే. అందుకే ఉభయ సంయుక్త రాష్ట్రాలుగా ఉన్నప్పుడు గానీయండి, ప్రత్యేక మద్రాసు నగరంలోని గానీయండి తెలుగు వారు హవా నాటి నుంచి నేటి వరకు కొనసాగుతూ వస్తున్నది. అందుకే ఇక్కడ తెలుగును అణగదొక్కే ప్రయత్నాలు సాగాయి. సాగుతున్నాయి. ఈ సమయంలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పక్షాలకు తెలుగు ఓటరు కీలకం అయ్యాడు. అందుకే తెలుగు బలం ఉన్న చోట్ల తెలుగు వారినే రాజకీయ పక్షాలు అభ్యర్థిగా ప్రకటించాయి. ఇందులో డిఎంకే, అన్నాడీఎంకేలు ముందంజలో నిలిచాయి. సరిహద్దుల్లో సత్తా: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లోని తిరువళ్లూరు, వేలూరు, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల్లో అయితే, పలు నియోజకవర్గాల్లో తెలుగు అభ్యర్థుల మధ్య సమరం సాగింది. ఇంకా చెప్పాలంటే, తెలుగు ఓటర్లను చీల్చేందుకు తగ్గట్టుగా రాజకీయ ఎత్తుగడ సాగిందని పరిగణించాల్సిందే. ఇందులో గుమ్మిడి పూండి, హోసూరు , త లిలను ముందు వరసులో తదుపరి వేపనహల్లిలను పరిగణించాలి. గుమ్మిడిపూండి డిఎంకే అభ్యర్థిగా శేఖర్, అన్నాడీఎంకే అభ్యర్థిగా విజయకుమార్‌లు ఢీ కొట్టి, చివరకు తెలుగు ఓట్లు చీలడంతో విజయకుమార్ అసెంబ్లీ మెట్లు ఎక్కారు. తిరుత్తణిలో అయితే, అచ్చ తెలుగు నాయకుడుగా, బీజేపీ రాష్ట్ర ఉపాథ్యక్షుడు చక్రవర్తి నాయుడు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమించినా, చివరకు ఐదు వేలకు పై చిలుకుల ఓట్లతో సరి పెట్టుకోక తప్పలేదు. ఇక, హోసూరు విషయానికి వస్తే, ఇద్దరు తెలుగు ఉద్దండులు ఢీ కొట్టారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన గోపినాథ్‌ను అన్నాడీఎంకే తరఫున పోటీ చేసిన బాలకృష్ణారెడ్డి ఓడించి, తెలుగు మద్దతు తనకే అని చాటుకున్నారు. తలి నియోజకవర్గంలడీఎంకే అభ్యర్థిగా అచ్చ తెలుగు అబ్బాయి వై ప్రకాష్ సత్తా చాటుకున్నాడు. ఇక్కడ సీపీఐ అభ్యర్థిగా తెలుగు సంతతికి చెందిన రామచంద్రన్ ఓటమి పాలు కాక తప్పలేదు. వేపన హల్లి రేసులో అన్నాడీఎంకే అభ్యర్థి దిగిన అచ్చ తెలుగు అబ్బాయి మధుకు తెలుగు కార్డు పనిచేయనట్టుంది. ఓటమి చవి చూడక తప్పలేదు. మరి కొన్ని చోట్ల: వేలూరు, తిరువణ్ణామలై, వాణియం బాడి, జోళార్ పేట, కాట్పాడి, రాణి పేట,కీల్ పెన్నాత్తూర్, గుడియాత్తంలలోనూ తెలుగు వారు అధికం అన్న విషయం తెలిసిందే. అయితే, వీళ్లు తెలుగు చదవడం, రాయడం రాదు. తమిళంలో చదువుకున్న వాళ్లే. అయినా తెలుగు సరళంగా మాట్లాడ గలరు. అందుకే తెలుగు సంతతికి చెందిన వారైన, రాణి పేటలో డిఎంకే నేత గాంధి, తిరువణ్ణామలైలో డిఎంకే నేత ఏవి వేలులకు మద్దతు పలికారు. కీల్ పెన్నాత్తూర్లో డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసిన తెలుగు సంతతికి చెందిన పిచ్చాండి విజయం సాధించడం విశేషం. తిరుచ్చి తూర్పులో తెలుగు సంతతికి చెందిన కే ఎన్ నెహ్రు, అరుప్పుకోట్టైలో కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్‌లు విజయ కేతనం ఎగుర వేయగా రాశిపురంలో తెలుగు సంతతికి చెందిన దురై స్వామి, మదురై పశ్చిమంలో దళపతి ఓటమి చవి చూడక తప్పలేదు. ఇక, తెలుగు నినాదంతో సీఎం జయలలిత పోటీ చేసిన ఆర్కేనగర్, తెలుగు ఓటర్లు అత్యధికంగా ఉన్న హొసూరులో పోటీ చేసిన తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కొన్ని ఓట్లు దక్కడం గమనార్హం. హొసూరులో 265, ఆర్కేనగర్లో 57 ఓట్లను ఆయన ద క్కించుకున్నారు. కాగా, తెలుగు వారుగా, తెలుగు సంతతికి చెందిన వారుగా డీఎంకే, అన్నాడీఎంకేలకు చెందిన పైన పేర్కొన్న అభ్యర్థులు గెలిచినా, మాతృ భాషలో తమిళ అసెంబ్లీలో గళం విప్పేది మాత్రం డౌటే. ఇన్నాళ్లు, తమిళ అసెంబ్లీలో తెలుగు వాణి విన్పిస్తూ వచ్చిన గోపినాథ్ ఈ సారి ఓటమి చవి చూశారు. ఆయన ప్రశ్నలకు ఇది వరకు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తెలుగులోనే సమాధానాలు ఇచ్చే వారు. అయితే, ఇప్పుడు ఎన్నికైన వారిలో ఎవరైనా ఒక్కరు తెలుగు పదాలు పలికేనా అన్నది అనుమానమే. ఇందుకు కారణం, అన్నాడీఎంకే తరఫున ఎన్నికైన వాళ్లు, ఎక్కడ అమ్మ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందోనన్న భయం, డీఎంకే తరఫున గెలిచిన వాళ్లలో మౌనం పాటించే వాళ్లు తప్పని సరి. ఈ దృష్ట్యా, తెలుగు వారుగా అసెంబ్లీలో అడుగు పెట్టినా, మాతృ భాషలో గళాన్ని విప్పలేని పరిస్థితి...! -
కృష్ణాష్టమితో ‘మలుపు’ ఖాయం..
తాను నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదలకు సిద్ధం కావడం ఆనందంగా ఉందని సినీనటి నిక్కీ గర్లాని అన్నారు. సునీల్‌తో కలిసి ఆమె నటించిన ‘కృష్ణాష్టమి’ చిత్రం ప్రమోషన్లో భాగంగా సోమవారం బంజారాహిల్స్‌లోని రేడియో సిటీలో సందడి చేశారు. ఆ సినిమా విశేషాలను శ్రోతలతో పంచుకున్నారు. తాను నటించిన మరో చిత్రం ‘మలుపు’ కూడా రిలీజ్‌కు సిద్ధమైందని, రెండూ హిట్ గ్యారంటీ అంటూ ధీమా వ్యక్తం చేశారు. తాను బెంగళూరుకు చెందిన అమ్మాయినే అయినా ఈ చిత్రాల కోసం తెలుగు నేర్చుకున్నానని చెప్పారు. - బంజారాహిల్స్ -
సినీ నటి అరెస్టు
కర్నూలు : ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో తప్పించుకు తిరుగుతున్న సినీ నటి నీతూ అగర్వాల్‌ను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రచందనం స్మగ్లర్ మస్తాన్‌వలీతో నీతూ అగర్వాల్ సహజీవనం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీతూ అగర్వాల్ ఖాతాల నుంచి నగదు లావాదేవీలు జరిగినట్టు గుర్తించిన సీసీఎస్ పోలీసులు ఆమెను కర్నూలు జిల్లా ఓర్వకల్లులో అదుపులోకి తీసుకున్నారు. ఆమెను రేపు కోర్టుకు హాజరు పరుస్తారని సమాచారం. కాగా అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. -
స్పెక్ట్రమ్ షో అదుర్స్...
-
లండన్‌లో రమ్య
* రాజకీయ శిక్షణ కోసం * డిసెంబర్ మొదటి వారంలో తిరిగి రాక * రమ్య తల్లి రంజితా వెల్లడి మండ్య : రాజకీయ రంగంలో మరిన్ని మెళకువలను నేర్చుకోవడానికి సినీనటి, మండ్య మాజీ ఎంపీ రమ్య లండన్‌కు వెళ్లినట్లు ఆమె తల్లి రంజితా తెలిపారు. గురువారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. అక్కడ మూడు నెలల కోర్సు చేస్తోందని, డిసెంబర్ నెల మొదటి వారంలో తిరిగి మండ్యకు వస్తుందని చెప్పారు. రమ్య కర్ణాటకను వీడి ఎక్కడికీ వెళ్లలేదని స్పష్టం చేశారు. విదేశాలకు వెళ్లిన రమ్య ఇక తిరిగి రారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. త్వరలోనే రమ్య కార్యకర్తలకు అందుబాటులోకి వస్తారని చెప్పారు. రమ్య ఎంపీగా ఉన్న సమయంలో మండ్య జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రజల కష్టాలు తెలుసుకున్నారని, అనేక అభివృద్ధి కార్యక్రమాలనూ చేపట్టారని వివరించారు. గత ఎన్నికల్లో ఓడినా రమ్య బాధపడలేదని, కార్యకర్తలపై ఆపార నమ్మకంతో మళ్లీ తిరిగి వస్తోందని చెప్పారు. -
వ్యభిచార కూపంలో సినిమా నటీమణులు!
సినిమా నటీమణులు వ్యభిచారం చేస్తూ పట్టుబడుతున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువై పోతున్నాయి. అన్ని భాషల నటీమణులు, దేశవ్యాప్తంగా చిక్కుతూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాలలో ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా ఇతర ప్రాంతాలలో కూడా దొరుకుతున్నారు. ఈ సంఘటనలు ఇలాగే కొనసాగితే సమాజంపై చెడుప్రభావం చూపే ప్రమాదం ఉంది. అవకాశాలు తగ్గిపోయిన సినిమా నటీమణులు వ్యభిచార కూపంలోకి ఎందుకు దిగుతున్నారు? ఆర్థిక పరిస్థితులు కారణమా? విలాసాలకు అలవాటుపడటమా? వీరిని ఎవరైనా ప్రేరేపిస్తున్నారా? మానసిక దౌర్భల్యమా? నైతిక విలువలు లేకనా? తేలికగా డబ్బు సంపాదించవచ్చని అనుకోవడమా? ఇదొక ప్రధాన సామాజిక సమస్య అయినందున అన్ని కోణాలలో దీని గురించి ఆలోచన చేయవలసి ఉంది. మన దేశంలో వ్యభిచారం చట్టవ్యతిరేకం అని తెలిసి కూడా ఇంత మంది ప్రముఖులు ఈ వృత్తిలోకి ఎందుకు దిగుతున్నారో సామాజిక శాస్త్రవేత్తలతోపాటు మేథావులు, ప్రభుత్వం తీవ్రంగా ఆలోచన చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అవకాశాలు తగ్గిపోతే బతకడానికి మరో మార్గంలేదా? ఈ వృత్తిలోకే దిగాలా? విలువలకు కట్టుబడి చట్టబద్దమైన మార్గంలో అనేక పనులు చేసుకొని బతకవచ్చు. ఆ మార్గాలను ఎందుకు ఆలోచించరు? పండు ముసలివాళ్లు కూడా బుట్టలో పల్లీలు అమ్ముతూ బతుకుతున్నారు. కూలి పని చేసుకొని బతుకుతున్నారు. శరీరంలో శక్తి, మెదడులో ఆలోచనలు, సెలబ్రిటీగా పలువురితో పరిచయాలు ఉండి కూడా ఇటువంటి చట్టవ్యతిరేకమైన వ్యభిచార వృత్తిలోకి దిగడం ఎందుకు? అని ఆలోచన చేయరా? బతకడానికి ఇతర చట్టబద్దమైన మార్గాలను ఎందుకు ఎన్నుకోరు? సాధారణంగా ఇటువంటి సందర్భాలలో పట్టుబడిన ఆ నటీమణులపై కొందరు జాలి చూపుతారు. ఇంత చిన్న నేరానికే ఇంత ప్రచారమా? అని అంటుంటారు. మరి కొందరు తిట్టిపోస్తారు. బతకడానికి ఈ పనే దొరికిందా? అని ప్రశ్నిస్తుంటారు. మరికొందరు ఆ విటుల గురించి ప్రశ్నిస్తుంటారు. నటీమణులు గానీ, ఇతర యువతులు గానీ వ్యభిచార కూపంలోకి దిగడానికి ప్రధానంగా ఆర్థిక పరిస్థితులతోపాటు విలాసవంతమైన జీవితానికి అలవాటుపడటం, నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వడం, మానసిక దౌర్భల్యం ...ఇవన్నీ ప్రధాన కారణాలుగా భావించవచ్చు. స్వచ్ఛంద సంస్థలు, సామాజిక శాస్త్రవేత్తలు, ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంది. వారికి ఉపాధి అవకాశాలు మెరుగు పరచడం, నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వకుండా, మానసిక స్థితి దిగజారకుండా వారికి కౌన్సిలింగ్ ఇప్పించవలసి ఉంది. మహిళా సంక్షేమ శాఖ ద్వారా ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక పథకాలను రూపొందించవలసిన అవరసం ఉంది. ఇటువంటి సంఘటనలు అధికమవుతూ ఉంటే సమాజాం మీద చెడు ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అందువల్ల వ్యభిచారం ఎక్కువగా జరిగే ప్రాంతాలలో చాలా పెద్ద ఎత్తున విస్తృత స్థాయిలో కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. - శిసూర్య -
సుధకు సువర్ణ కంఠాభరణం
సినీ నటి సుధ భీమవరం ప్రజల ఆత్మీయ సత్కారం అందుకున్నారు. మావుళ్లమ్మ ఆలయ స్వర్ణోత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీ, నీరుల్లి, కూరగాయ, పండ్ల వర్తక సంఘం ప్రతినిధులు గురువారం రాత్రి ఆమెను సువర్ణ కంఠాభరణంతో సత్కరించారు. ఈ సందర్భంగా సుధ మాట్లాడుతూ.. తల్లి పాత్రలు చేస్తున్నందుకు గర్వపడుతున్నా అన్నారు. ఎంతో పుణ్యం చేసుకుంటేనే తల్లి పాత్రలు వస్తాయన్నారు. మావుళ్లమ్మ ఆలయ స్వర్ణోత్సవాల్లో తనను సత్కరించడం జీవితాంతం మర్చిపోలేనని అన్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షుడు అడ్డాల రంగారావు, అధ్యక్షుడు మానే పేరయ్య, నీరుల్లి, కూరగాయ, పండ్ల వర్తక సంఘం గౌరవాధ్యక్షుడు కాగిత వీరమహంకాళిరావు, అధ్యక్షుడు రామాయణం గోవిందరావు, గన్నాబత్తుల నాగేశ్వరరావు, సినీ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కంబాల రామారావు, నల్లం సూర్యచక్రధరరావు, దాయన సురేష్‌చంద్రజీ పాల్గొన్నారు. - న్యూస్‌లైన్/భీమవరం కల్చరల్