నిజం దివ్యభారతికే ఎరుక!
అప్పుడెప్పుడో జరిగిపోయిన సంఘటన.. తలచుకుంటే నేటికీ మనసుని మెలిపెడుతుంది. వేలాది హృదయాలను కదిలిస్తుంది. ఆమె సజీవంగా ఉంటే బాగుండు కదా.. అనిపిస్తుంది. ఊహ తెలియని వయసులోనే స్టార్‌డమ్, ప్రపంచాన్ని అర్థం చేసుకునేలోపే అనంతలోకాలకు పయనం.. వెరసి, అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చిందామె. నేలపై నడిచినప్పుడే ఆమెను స్టార్ అన్నారంతా.. నింగికెగిశాక అనకుండా ఉండగలరా..? కానీ, ఆ స్టార్‌డమ్‌ను పూర్తిగా ఆస్వాదించకుండానే వెళ్లిపోయింది టీనేజ్ స్టార్ దివ్యభారతి. ఎన్నో అనుమానాలకు తెరలేపిన ఆమె మరణానికి కారణమేంటి..? ఇంతకీ ఆరోజేం జరిగింది..?
1993.. ఏప్రిల్ 5.. మరో అరవై నిమిషాలు గడిస్తే తేదీ మారుతుందనగా ముంబైని సునామీ లాంటి వార్త ఒక్కసారిగా ముంచెత్తింది. టీనేజ్ సంచలనం, అందాల నటి దివ్యభారతి ఆత్మహత్య చేసుకుందన్నదే ఆ వార్త! పంతొమ్మిదేళ్ల వయసు, మోయలేనంత స్టార్‌డమ్, అసాధారణ భవిష్యత్తు ఉన్న అమ్మాయి ఎందుకు మరణిస్తుంది..? ఎవరో కావాలనే ఆమెను హతమార్చారు అంటూ కొందరు అనుమానాలు లేవనెత్తారు. సక్సెస్ కిక్కును తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుందేమో అంటూ కొందరు నిట్టూర్చారు. ఏళ్లు గడిచినా ముంబై పోలీసులు మాత్రం ఎలాంటి ఆధారాలూ సంపాదించలేకపోయారు. ఆమె మరణం నేటికీ మిస్టరీనే!
కానీ, ఆ రోజు దివ్యభారతి చాలా హుషారుగా ఉందని చెబుతారు దగ్గరనుంచి చూసినవాళ్లు. చెన్నై నుంచి షూటింగ్ పూర్తి చేసుకుని ముంబై చేరుకున్న ఆమె.. తన సంపాదనతో ఓ అపార్ట్‌మెంట్‌లోని ఇంటిని కొనుగోలు చేయాలని భావించింది. అందులో భాగంగానే సోదరుడు కునాల్‌తో కలిసి ఆ నాలుగు పడకగదుల ఇంటిని సందర్శించింది. ముంబైలాంటి ఖరీదైన ప్రాంతంలో ఇల్లు సొంతం చేసుకోవాలనే కోరిక ఎవరికి మాత్రం ఉండదు..? అందుకే, డీల్ పూర్తి కాగానే అందరికీ సంబరంగా చెప్పుకొచ్చింది. కానీ, ఆ ఫ్లాట్ ఆమె కోసం కాదు. ఆమె తల్లిదండ్రుల కోసం! అవును, అప్పటికే దివ్య భారతికి వివాహమయింది. భర్త, ప్రముఖ నిర్మాత సాజిద్ నదియాడ్‌వాలాతో కలిసి అంధేరీ ప్రాంతంలోని తులసీ అపార్ట్‌మెంట్లో నివసిస్తోంది. ఆమెకు ప్రత్యేకంగా ఇంటి అవసరం ఏముంటుంది..?
కొనుగోలు వ్యవహారాల్లో ఆ రోజంతా తలమునకలై ఉండటంతో తర్వాతి రోజు హైదరాబాద్‌లో చేయాల్సిన షూటింగ్‌ను వాయిదా వేసుకుంది. నిర్మాతలకు ఫోన్ చేసి, తాను అలసిపోయానని.. ఒకరోజు విశ్రాంతి తీసుకుని వస్తానని చెప్పింది. అలా రాత్రి పదిగంటలకు తులసీ అపార్ట్‌మెంట్‌కు చేరుకుంది. అప్పటికి పనిమనిషి అమృత మాత్రమే ఇంట్లో ఉంది. చిన్ననాటి నుంచీ దివ్యభారతి ఆలనాపాలనా చూసుకుంటోంది ఆమే. దివ్యభారతి బెడ్‌రూమ్‌లోకి చేరి, కాసేపు నడుం వాల్చగానే ప్రముఖ డిజైనర్ నీతా లుల్లా నుంచి ఫోన్ వచ్చింది. తన భర్త డా.శ్యామ్ లుల్లాతో కలిసి తులసీ అపార్ట్‌మెంట్‌కు వస్తున్నానని చెప్పిందామె. దీంతో వారికి వెల్‌కమ్ చెప్పేందుకు మద్యం బాటిల్లతో సిద్ధమైంది దివ్యభారతి. ముగ్గురూ కలిసి ఆమె బెడ్రూమ్‌లోనే మద్యం సేవించారు. కొద్దిసేపు డ్రెస్సుల గురించీ, డిజైన్ల గురించీ చర్చించారు. అమృత వారికి ఇష్టమైన ఆహారాన్ని వండిపెడుతోంది. ఓవైపు వంట చేస్తూనే, మరోవైపు కిచెన్ నుంచే దివ్యభారతితో మాట్లాడుతోందామె.
హీరోయిన్ కూడా బిగ్గరగా అరుస్తూ ఆమెకు సమాధానాలిస్తోంది. అలా మాట్లాడుతూనే బాల్కనీ వైపు నడుచుకుంటూ వెళ్లింది దివ్యభారతి. మరోవైపు నీతా, శ్యామ్ లుల్లాలు టీవీ చూస్తూ ఉండిపోయారు. బాల్కనీలోని తలుపుల్లేని కిటికీ ముందు నిల్చుంది దివ్యభారతి. అక్కడి నుంచే స్వచ్ఛమైన గాలికోసమన్నట్టుగా తలను బయట పెట్టి చూస్తూ పనిమనిషితో బిగ్గరగా మాట్లాడసాగింది. ఏం జరిగిందో ఏమో.. పదకొండు గంటల సమయంలో ఒక్కసారిగా ఆమె కాళ్లు పట్టుతప్పాయి. ముందుకు కూలబడిపోయింది. ఐదో అంతస్తు నుంచి పెద్ద శబ్దం చేస్తూ కింద పడిపోయింది. ఆ శబ్దానికి చుట్టుపక్కలవారు లేచి చూశారు. అంతే.. రక్తపు మడుగులో దివ్యభారతి కొట్టుమిట్టాడుతోంది. ఆలస్యం చేయకుండా అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అలా కొద్ది సమయంలోనే దగ్గర్లోని కూపర్ ఆస్పత్రికి ఆమెను చేర్చారు. అయితే, హాస్పిటల్‌లోకి అడుగుపెట్టగానే ఆమె ప్రాణాలు కోల్పోయింది.
ఇదే ఇప్పటివరకూ ఆమె మరణం విషయంలో వినిపిస్తోన్న కథనం. దీనిపై నీతా, శ్యామ్ లుల్లాలు ఏరోజూ నోరు మెదపలేదు. భర్త సాజిద్ కూడా మౌనాన్నే ఆశ్రయించాడు. వంటమనిషి అమృత.. దివ్యభారతి మరణాన్ని తట్టుకోలేక నెలరోజులకే గుండె ఆగి చనిపోయింది. దీంతో ఇది హత్య అన్న వాదనలకు బలం దొరకలేదు. కానీ, ఈ మరణం వెనక దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ గ్యాంగ్ ప్రమేయం ఉందనే పుకార్లు హల్‌చల్ చేశాయి. సాజిద్ ఉద్దేశపూర్వకంగానే భార్యను హత్య చేయించాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముంబై పేలుళ్ల కేసు నుంచి బయటపడేందుకే ఇలా చేశాడనీ కొంతమంది సిద్ధాంతీకరించారు.
కానీ, ముంబై పోలీసులు ఆ దిశగా ఎలాంటి ఆధారాలూ సంపాదించలేకపోయారు. దీంతో 1998 వరకూ కొనసాగిన విచారణ.. ఆ ఏడాది ముగిసిపోయింది. మరణ కారణం ఏంటో ప్రపంచానికి స్పష్టంగా చెప్పకుండానే పోలీసులు కేసును మూసివేశారు. ఇంతకీ ఆమెది హత్యా, ఆత్మహత్యా, ప్రమాదమా..? నిజం దివ్యభారతి మాత్రమే చెప్పగలదు..!