అది 6 ఆగస్టు 1995, సమయం దాదాపు అర్ధరాత్రి. శివార్లలోని గుల్బర్గ్ ప్రాంతం నుంచి లాహోర్ వైపు వెళ్లే మార్గం నిర్మానుష్యంగా ఉంది. వీథి దీపాలు కూడా వెలగకపోవడంతో దారంతా చీకటిగా ఉంది.రెస్టరెంట్‌లో భోజనం ముగించుకుని, నాదిరా దంపతులు ఇంటికి వెళుతున్నారు.తోవలో కొందరు దుండగులు తుపాకులు చూపించి, కారును అడ్డగించారు. కారు నుంచి దిగమని డ్రైవ్ చేస్తున్న నాదిరా భర్త మాలిక్ ఇజాజ్ హుస్సేన్‌ను గద్దించారు.దుండగుల చేతిలో తుపాకులు చూసి భయపడిన నాదిరా, ఆమె భర్త ఇజాజ్ కారు నుంచి కిందకు దిగారు.
దుండగులు వాళ్లను పక్కకు నెట్టేసి, కారు తాళాలను గుంజుకోవడానికి ప్రయత్నించారు. ఇజాజ్ వారిని ప్రతిఘటించాడు. దుండగులకు, ఇజాజ్‌కు మధ్య కొంత ఘర్షణ జరిగింది. దుండగుల్లో ఒకడు రివాల్వర్ కాల్చాడు. పక్కనే ఉన్న నాదిరా మెడలోంచి తూటా దూసుకుపోయింది. నాదిరా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నాదిరా భర్త ఇజాజ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దుండగుల కోసం గాలింపు ప్రారంభించారు.
ఈ సంఘటన పాకిస్తాన్‌లో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. నాదిరా మాజీ సినీతార కావడంతో ఆమె హత్యవార్త పత్రికల్లోని పతాక శీర్షికలకెక్కింది. పోలీసులు దుండగుల కోసం గాలించినా, ఎలాంటి ఆచూకీ దొరకలేదు. దుండగులు ఎవరో తెలుసుకునేందుకు తగిన ఆధారాలు కూడా దొరకలేదు. మీడియా ఒత్తిడి పెరగడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
నాదిరా తన పద్దెనిమిదేళ్ల వయసులో 1986లో సినీరంగంలోకి అడుగుపెట్టింది. అనేక సూపర్‌హిట్ సినిమాల్లో నటించింది. తన అందచందాలతో ప్రేక్షకులకు మతులు పోగొట్టిన ఆమెను అభిమానులు ‘వైట్ రోజ్’గా పిలుచుకునేవారు. సినీరంగంలో ఒకవైపు వెలుగుతుండగానే, సంపన్నుల ఇళ్లల్లో జరిగే వేడుకల్లో ముజ్రా కార్యక్రమాల్లో నాట్యం చేసేది. ముజ్రాలో నాట్యానికి ఆమె అప్పట్లోనే రూ.52 లక్షలు పారితోషికంగా తీసుకునేది.
సినీరంగంలోకి అడుగుపెట్టిన రెండేళ్లలోనే ఆమె అనూహ్యంగా ఎదిగింది. అప్పట్లోనే ఆమె షూటింగ్ కోసం స్టూడియోలకు అత్యంత ఖరీదైన కార్లలో వచ్చేది. అదేకాలంలో ఆమెతో పాటు సినిమాల్లోకి అడుగుపెట్టిన నటీనటులు కొందరు సాధారణమైన కార్లలోను, ఇతరుల వాహనాల్లోను, ఇంకొందరు రిక్షాల్లోను స్టూడియోలకు వచ్చేవారు. అతి తక్కువ కాలంలోనే పంజాబీ, ఉర్దూ, పాష్తో భాషల్లో 52 సినిమాల్లో నటించింది. వాటిలో పాతిక సినిమాలు సిల్వర్‌జూబ్లీలు చేసుకున్నాయి. సినీరంగంలో వైభవం కొడిగట్టక ముందే పెళ్లి చేసుకుని, కెరీర్‌కు స్వస్తి పలికింది.
సినీరంగంలో నాదిరా పట్టుమని పదేళ్లు కూడా కొనసాగలేదు. అనతికాలంలోనే ఇబ్బడిముబ్బడిగా సంపాదించుకుంది. లాహోర్‌లోని బంగారు వర్తకుడు మాలిక్ ఇజాజ్ హుస్సేన్‌తో పెద్దలు పెళ్లి కుదర్చడంతో 1993లో అతణ్ణి పెళ్లాడింది. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం మానుకుంది. ఆ దంపతులకు ఒక కూతురు, ఒక కొడుకు కలిగారు.
పెళ్లయిన కొన్నాళ్లకు భర్త ఇజాజ్‌తో కలసి నాదిరా రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించింది. నాదిరా సినిమాల్లో సంపాదించినదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టింది. కొద్ది కాలంలోనే ఆ వ్యాపారం బాగా పుంజుకుంది. స్థిరాస్తుల కొనుగోళ్లు, అమ్మకాల వ్యవహారాల్లో భర్త ఇజాజ్ అవకతవకలకు పాల్పడుతూ, తన వ్యక్తిగత విలాసాల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయసాగాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.
నాదిరా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆమె ఇంటి ఇరుగు పొరుగువారిని విచారించారు. నాదిరాకు, ఆమె భర్తకు తరచు కీచులాటలు జరుగుతూ ఉండేవని, తన డబ్బును అతడు విచ్చలవిడిగా తగలేస్తున్నాడని ఆమె వాపోతుండేదని వాళ్లు చెప్పారు.
ఇరుగు పొరుగులు చెప్పిన సమాచారం ప్రకారం నాదిరా ఆస్తి కోసం ఆమె భర్తే ఈ హత్య చేయించి ఉంటాడని పోలీసులు అనుమానించారు. వెంటనే అతణ్ణి అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే, నేరంలో అతడికి ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలనూ కనుక్కోలేకపోయారు. దీంతో అతణ్ణి విడిచిపెట్టారు.
పోలీసులు నాదిరా భర్తను అదుపులోకి తీసుకోగానే, ఆమెను భర్తే హత్య చేయించాడంటూ కథనాలు వచ్చాయి. అతణ్ణి పోలీసులు విడిచిపెట్టిన తర్వాత కూడా నాదిరా హత్యపై ఊహాగానాలతో కూడిన పలు కథనాలు వెలువడ్డాయి. ఏళ్లు గడిచినా పోలీసులు ఈ కేసును ఛేదించలేకపోయారు. కొన్నాళ్లకు మీడియా కూడా ఈ ఉదంతాన్ని పట్టించుకోవడం మానేసింది. నాదిరా హత్య ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది.
Comments
Please login to add a commentAdd a comment