
తక్కువ కాలమే నటించినా, యావద్భారత సినీ ప్రేక్షకులు మరీ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఏ మాత్రం మరచిపోలేని కధాయికల్లో నెం1 గా నిలుస్తుంది దివ్యభారతి. చిరంజీవితో రౌడీఅల్లుడు, వెంకటేష్‌తో బొబ్బిలిరాజా, మోహన్‌బాబుతో అసెంబ్లీ రౌడీ వంటి చిత్రాలలో నటించిన దివ్యభారతి అందాన్ని చూసేందుకు తెరకు కళ్లప్పగించిన ప్రేక్షకులెందరో. అటువంటి అందాల నటి, ఎంతో భవిష్యత్తు ఉన్న యువనటి అకస్మాత్తుగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఆ తర్వాత అప్పటి ఆమె సహనటీనటులు ఆమె గురించి అడపాదడపా తలచుకుంటూ ఆవేదన చెందడం చూస్తున్నాం. అదే క్రమంలో తాజాగా అప్పటి దివ్యభారతి సహ నటి, అత్యంత ఆత్మీయ నేస్తం అయిన ఆయేషా ఝుల్కా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దివ్యభారతి గురించి కొన్ని విశేషాలు పంచుకుంది.
దివ్యతో తనకున్న బంధం గురించి అయేషా మాట్లాడుతూ, ‘మేము రంగ్ షూటింగ్‌లో ఉండగా.. ఈ సంఘటన మొత్తం జరిగింది. నేను ఆ చిత్రానికి డబ్బింగ్ చెప్పేటప్పుడు–ఆమె అందులో నా చెల్లెలిగా నటించింది–మేమిద్దరం చాలా సన్నిహితంగా ఉండేవాళ్లం. ఇతర సెట్‌లలో చేస్తున్నప్పుడు కూడా ఆమె వచ్చి నాతోనే కబుర్లు చెబుతూ ఉండేది’’ అంటూ తమ అనుబంధం గురించి వివరించింది.
ఆయేషా జుల్కా దివ్య భారతి 1993లో రొమాంటిక్ చిత్రం రంగ్‌లో కలిసి నటించారు. ఈ చిత్రంలో కమల్ సదానా, జీతేంద్ర, అమృతా సింగ్, ఖాదర్ ఖాన్ బిందు కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో అయేషా, దివ్య సిస్టర్స్‌గా నటించారు. అయితే సినిమా విడుదలకు ముందే దివ్య కన్నుమూసింది.
సినిమా స్క్రీనింగ్ సమయంలో దివ్య తో అనుబంధాన్ని తలచుకుంటూ... ఆ దురదృష్ఖకర సంఘటన తర్వాత తాను చాలా రాత్రులు నిద్రపోలేకపోయానని ఆయేషా గుర్తు చేసుకుంది. ‘‘ మా మధ్య ఫ్రెండ్స్‌ని మించిన బంధం ఉంది, ఆ సంఘటన తర్వాత నేను ఆ చిత్రానికి డబ్బింగ్ చెప్పేటప్పుడు, చేయలేకపోయాను, డబ్బింగ్ చెప్పడానికి బదులు నేను భోరున ఏడ్చాను దాంతో డబ్బింగ్ వాయిదా వేయవలసి వచ్చింది. కాబట్టి అదంతా జరిగింది, ఆపై మేము ఫిల్మ్ సిటీలో ఆ సినిమా ప్రివ్యూ వేసినప్పుడు... దివ్య తెరపై కనిపించిన క్షణంలో, స్క్రీన్ ఒక్కసారిగా పడిపోయినట్టయింది.. దివ్య నా చెంతనే ఉన్నట్టు ఓ ఫీలింగ్...బాధ అనుభవించాను దాంతో ఆ రాత్రి నేను చాలా సేపు నిద్రపోలేకపోయాను’’ అంటూ దివ్యభారతి మరణం తర్వాత కూడా తనతోనే ఉందని ఆమె చెప్పింది.
గత 1991లో వచ్చిన కుర్బాన్ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన అయేషా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది, ఆమెను లైమ్‌లైట్‌లోకి తీసుకెళ్లింది... అక్షయ్ కుమార్ సరసన ఖిలాడీలో ఆమె నటన ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది, ఆ తర్వాత అమీర్ ఖాన్ సరసన జో జీతా వోహీ సికందర్, మిథున్ చక్రవర్తి సరసన దలాల్ లతో పాటు మరిన్ని విజయవంతమైన చిత్రాలు వచ్చాయి.
మూడు దశాబ్దాల పాటు సాగిన ఆమె కెరీర్‌లో, 60 చిత్రాలకు పైగా పనిచేసింది. తెలుగులో అక్కినేని నాగార్జున సరసన నేటి సిద్ధార్ధ సినిమాలో ఆమె నటించి తన గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకుల్ని ఆకర్షించింది. ఈ సినిమాలో నాగ్‌తో ఆమె లిప్‌లాక్ కూడా చేయడం విశేషం.