- ‘చౌద్‌వీ కా చాంద్ హో యా ఆఫ్‌తాబ్ హో’...
- ఈ చందమామ తెలుగు నేల మీదే ఉదయించింది.
- ‘ఏరువాక సాగారోరన్నో చిన్నన్న’...
- తప్పెట దరువుకు ఆ పాదాలు ఈ నేల మీదే చిందేశాయి.
- ‘మారాయ్.. మారాయ్... మారాయ్..రోజులు మారాయ్’...
- తెలుగువారి పుణ్యాన ఒక మహత్తు జరిగి వహిదా రెహమాన్ రోజులే మారిపొయాయి.భారతీయ వెండితెర సౌందర్యమేమారిపొయింది.
- తనకు ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ప్రకటించారని తెలిశాక ఆ మురిపమైన నటి అనుకునే మాట ఒకటే–
- ఆజ్ ఫిర్ జీనే కి తమన్నా హై
- ఆజ్ ఫిర్ మర్‌నే కా ఇరాదా హై..
విశాఖపట్నంలో ఈపాటికి సంబరాలు జరగాలి.తమ ఊరి నటికి దాదాసాహెబ్ ఫాల్కే వచ్చినందుకు.ఆ సంగతి వారికి తెలుసో లేదో. తెలుగు వారికి వహిదా రెహమాన్ తమ నటి అని తెలుసో లేదో.వహిదా రెహమాన్‌కు పదీ పదకొండేళ్లు ఉన్నప్పుడు ఆమె తండ్రి రెహమాన్‌కు మునిసిపల్ కమిషనర్‌గా విశాఖ ట్రాన్స్‌ఫర్ అయ్యింది. మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఉద్యోగి అయిన రెహమాన్ తమిళనాడు, ఆంధ్రాల్లో పని చేసిన దక్కన్ ముస్లిం.
ఆమె తల్లిది ఉత్తరాంధ్ర కావచ్చు. ఆమె మేనమామ డాక్టర్ ఫిరోజ్ అలీ గంజాంలో పేరు మోసిన డాక్టరు, సామాజిక కార్యకర్త. సినిమా నటిగా అవకాశం పొందే వరకు అంటే తన 17వ ఏట వరకూ వహిదా రెహమాన్ తొలిప్రాయపు రోజులు విశాఖలోనే గడిచాయి. అక్కడి సెయింట్ జోసెఫ్ కాన్వెంట్‌లో చదువుకుంది. అది కాదు– ఆమె జీవితాన్ని మార్చిన ఘటన అక్కడే జరిగింది. అదీ– నాటి మద్రాసు ముఖ్యమంత్రి సి.రాజ గోపాలాచారి విశాఖ రావడం. ఆ సందర్భంగా వహిదా రెహమాన్ నాట్య ప్రదర్శన ఇవ్వడం.
ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏవో ఒక ప్రదర్శనలు ఏర్పాటు చేయడం ఆనవాయితీ. నాటి వాల్తేరు కలెక్టర్ తన సహోద్యోగైన రెహమాన్‌ను ‘నీ కుమార్తెలు భరతనాట్యం చేస్తారు కదా. వారి ప్రదర్శన ఏర్పాటు చేద్దాం’ అని కోరాడు. అందుకు రెహమాన్ అంగీకరించాడు. అప్పటికే వహిదా, ఆమె సోదరి సయిదా భరతనాట్యం నేర్చుకున్నారు. మొత్తం నలుగురు కూతుళ్లలో అందరి కంటే చిన్నది వహిదా. భరతనాట్యం నేర్చుకోవాలని పట్టుపట్టి నేర్చుకుంది.
అయితే గురువు ఆమెకు అంత సులువుగా నేర్పలేదు. ‘ముసల్మానులు ఈ విద్య నేర్చుకోగలరా? ΄రాణిక సందర్భాలను అభినయించగలరా?’ అని సందేహం వ్యక్తం చేశాడు. అయినా వహిదా పట్టు విడువలేదు. మరోవైపు ముస్లింలు భరతనాట్యం నేర్చుకోవడం ఏమిటని అయినవారి ఎత్తి పొడుపులు. ‘కళకు మతం లేదు’ అని తేల్చిన రెహమాన్ కుమార్తెలను భరత నాట్యానికి ప్రోత్సహించాడు. కాని గురువు వినడే. చివరకు వహిదా మొండిపట్టు చూసి ‘నీ జాతకం పట్టుకురా’ అన్నాడు.
ముస్లింలలో జాతకాలు ఉండవని తెలిశాక, పుట్టిన రోజు... సమయం తెలుసుకుని ఆ గురువే జాతకం రాసి ఆశ్చర్యపొయాడు. ‘ఈ అమ్మాయి నా చివరి గొప్ప శిష్యురాలు అవుతుంది’ అని ఆ జాతకంతో తేల్చి పాఠాలు నేర్పించాడు. అనుకున్నట్టుగానే జరిగింది. సి.రాజగోపాలాచారి సమక్షంలో వేదిక మీద వహిదా, సయిదాలు అద్భుతమైన నాట్య ప్రదర్శన చేసేసరికి శాస్త్రాలు ఎరిగిన అంతటి రాజగోపాలాచారి కూడా తబ్బిబ్బయ్యి మెచ్చుకున్నాడు. ఆ వార్త మరుసటి రోజు అన్ని ముఖ్యమైన పేపర్లలో మొదటి పేజీల్లో వచ్చింది. వహిదా రెహమాన్ అనే పేరు కళా జగత్తుకు తెలిసింది. సినిమా జగత్తుకు కూడా.
వహిదా రెహమాన్‌కు 13 ఏళ్లు ఉన్నప్పుడు ఆమె తండ్రి జబ్బు చేసి మరణించాడు. అతని సమాధి విశాఖలోనే ఉంది. ఇటీవలే వహిదా ఆ సమాధిని దర్శించింది కూడా. తండ్రి జీవించి ఉండగా సినిమా అవకాశాలు వస్తే ‘చిన్నపిల్ల... సినిమాలేమిటి’ అని సున్నితంగా తిరస్కరించాడు కాని వహిదాకు 16 ఏళ్లు వచ్చేసరికి, అప్పటికే ఆమె నాట్యకళకారిణిగా కొనసాగుతూ ఉండటంతో సినిమా అవకాశాలు వస్తూనే ఉండేవి.
భర్త అండలేని తల్లి భయంతో వాటిని తిరగ్గొట్టేది. అయితే వహిదాను సినిమా తెరకు పరిచయం చేసే అవకాశం తెలుగువారి ఖాతాలో ఉంటే ఆ విధిని ఎవరు కాదనగలరు? బాంబేలో ఎల్వీ ప్రసాద్‌తో పాటు సినిమా కళను ఆకళింపు చేసుకున్న నిర్మాత సి.వి.ఆర్. ప్రసాద్ మద్రాసు వచ్చి ‘రోజులు మారాయి’ సినిమా తీయదల్చుకున్నాడు. స్క్రిప్ట్ వర్క్ కూడా చేశాడు. అయితే సినిమా అంతా పూర్తయ్యే సమయానికి ఇందులో ఒక సంబరాల పాట ఉండాలి... పల్లెతనపు చిందు ఉండాలి అనిపించిందతనికి. దానికి మంచి డాన్సర్ కావాలంటే వహిదా రెహమాన్ పేరు తెలిసింది. అదృష్టవశాత్తు అంతకు ముందే రెహమాన్‌తో ప్రసాద్‌కు పూర్వ పరిచయం ఉంది. ‘మీవారు నాకు తెలుసు. నేను ఆయన శ్రేయోభిలాషిని.
మీ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. స్టేజ్ మీద చేసే డాన్సు కెమెరా ముందు చేయడమే’ అని వహిదా తల్లిని ఒప్పించాడు. ‘రోజులు మారాయి’లో ‘ఐటమ్ సాంగ్’. కొసరాజు రాశాడు. మాస్టర్ వేణు బాణి కట్టాడు. జిక్కి పాడింది. విశాఖ నుంచి మద్రాసు వెళ్లిన వహిదా రెహమాన్ అద్భుతంగా డాన్స్ చేసింది. దేహంతో పాటు హావభావాలను కూడా కదిలించింది. మెరుపు వలే మెరిసింది. ‘ఏరువాక సాగారో రన్నో చిన్నన్న’... సూపర్‌డూపర్ హిట్. ప్రేక్షకులు చిల్లర ఎగరేసిన పాట అది. సినిమా అయిపొయాక ఆపరేటర్ చొక్కా పట్టుకుని మళ్లీ ఆ పాట వేయించుకువారు. గువ్వలాంటి ఆ అమ్మాయి ఎవరు? వహిదా రెహమాన్! ఇంటింటి పేరయ్యింది.
నటి సావిత్రి అదృష్టం బాగుంది. వహిదా రెహమాన్ తెలుగు నుంచి పొటీలో తప్పుకుని హిందీలో వెళ్లింది. లేకుంటే ఒకవైపు సావిత్రి, మరోవైపు వహిదా రెహమాన్ తెలుగు సినిమాలను ఒక ఊపు ఊపుతుంటే ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని మనం తన్నుకు చచ్చుండేవాళ్లం. 1955 జనవరిలో ‘మిస్సమ్మ’ విడుదలైంది. అదే సంవత్సరం ఏప్రిల్‌లో ‘రోజులు మారాయి’.
‘మిస్సమ్మ’ సూపర్ హిట్. ‘రోజులు మారాయి’ కూడా. ‘మిస్సమ్మ’ హైదరాబాద్‌లో నెలల తరబడి ఆడుతూనే ఉంటే ఒక డిస్ట్రిబ్యూటరు దాని హిందీ రీమేక్ కోసం దర్శకుడు గురుదత్‌ని బొంబాయి నుంచి హైదరాబాద్‌కు పిలిపించాడు– సినిమా చూడటానికి. మిస్సమ్మ గురుదత్‌కు నచ్చలేదు. కాని వహిదా రెహమాన్‌ను అదే సమయంలో రోజులు మారాయి ప్రమోషన్ కోసం మద్రాసు నుంచి పిలిపిస్తే ఆమె కారు చుట్టూ మూగిన జనాన్ని చూసి ఆశ్చర్యపొయాడు. ‘ఎవరు ఈ అమ్మాయి’ అని అడిగితే ‘వహిదా రెహమాన్’ అని చె΄్పారు.
గురుదత్ ఆమెను అదే డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్‌లో కలిశాడు. ‘ఉర్దూ తెలుసా’ అని మాత్రమే అడిగాడు. ‘తెలుసు’ అంది వహిదా. మూడు నెలల తర్వాత బొంబాయి నుంచి పిలుపొచ్చింది. వెళితే రెండేళ్ల పాటు కాంట్రాక్ట్ గురుదత్ బేనర్‌లో. నెలకు జీతం– 2,500 రూపాయలు. మొదటి సినిమా ‘సి.ఐ.డి’. ‘హీరో ఎవరండీ’ అడిగింది వహిదా రెహమాన్. గురుదత్ జవాబు– దేవ్ ఆనంద్.
‘కహి పే నిగాహె కహిపే నిషానా’...
‘సి.ఐ.డి’ సినిమాలో కొంచెం వేంప్ తరహా వేషం. చిన్న వేషం. కాని ఒక్కపాటతో మొత్తం పేరు కొట్టుకెళ్లింది వహిదా. సి.ఐ.డిలో అసలు హీరోయిన్ షకీలా. ఆమె తుడుచుకునిపొయి వహిదా నిలబడింది. కొద్దిగా మెల్ల కన్ను, లాగేసే చూపు, ఈడ్చేసే నవ్వు... ఈ అమ్మాయిని తీర్చిదిద్దవచ్చు అనుకున్నాడు గురుదత్. వెంటనే ‘ప్యాసా’లో లీడ్ రోల్ ఇచ్చాడు. గురుదత్ ఆమెలోని నటిని చాలా సమర్థంగా తీర్చిదిద్దాడు. తనలాగే అధిక ప్రసంగం చేయకుండా గాఢమైన భావాలను ఎలా పలికించవచ్చో నేర్పించాడు. ప్యాసా ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత గురుతద్, వహిదా కలిసి ‘కాగజ్ కే ఫూల్’, ‘చౌద్‌వీ కా చాంద్‘, ‘సాహిబ్ బీవీ ఔర్ గులామ్’ సినిమాలలో నటించారు. గురుదత్ ఆగిపొయాడు. వహిదా సాగిపొయింది.
సునిల్‌దత్‌తో చేసిన ‘ముఝే జీనే దో’, బిశ్వజిత్‌తో ‘బీస్ సాల్ బాద్’ పెద్ద హిట్స్. దిలీప్ కుమార్‌తో ‘దిల్ దియా దర్ద్ లియా’, ‘ఆద్మీ’, ‘రామ్ ఔర్ శ్యామ్’ చేసింది వహిదా. కాని దేవ్ ఆనంద్ మరోసారి ఆమెకు సవాలు విసిరే పాత్రను ఇచ్చాడు ‘గైడ్’లో. ఆర్.కె.నారాయణ్ రాసిన ఈ ప్రఖ్యాత నవలను హాలీవుడ్ వెర్షన్‌గా, బాలీవుడ్ వెర్షన్‌గా తీయాలనుకున్నప్పుడు హిందీ వెర్షన్‌కు చేతన్ ఆనంద్ దర్శకుడు. కాని చేతన్‌కు వహిదా ఇష్టం లేదు. దేవ్ ఆనంద్‌కు వహిదాను తీయడం ఇష్టం లేదు.
చేతన్‌ను తీసి విజయ్ ఆనంద్‌ను దర్శకుడిగా పెట్టాడు. విజయ్ ఆనంద్ ‘గైడ్’లో క్లాసిక్‌గా తీర్చిదిద్దాడు. నిజానికి ఆనాటి హీరోయిన్లు ఎంపిక చేసుకునే విలువలున్న పాత్ర లాంటిది కాదు ‘రోజీ’. భర్తను వదిలేసి ప్రియుడితో వెళ్లిపొయే పాత్ర అది. శ్రేయోభిలాషులు చేయొద్దన్నారు. వహిదా రెహమాన్ చేసింది. ఆమెలోని నాట్యాన్ని, నటనను, అభినయ గాఢతను అంత గొప్పగా పట్టి ఇచ్చిన సినిమా మరొకటి లేదు.
‘పత్థర్ కె సనమ్’, ‘నీల్ కమల్’ వంటి హిట్స్ చూసిన వహిదా ఆ తర్వాత చేసిన సినిమాలు అంతగా ఆడలేదు. రాజ్ కపూర్‌తో ‘తీస్రి కసమ్’, సునిల్‌దత్‌తో ‘రేష్మా ఔర్ షేరా’, రాజేష్ ఖన్నాతో ‘ఖామోషీ’, అమితాబ్ బచ్చన్‌తో ‘కభి కభి’... ఆమెను మెల్లగా హీరోయిన్ దశ నుంచి తప్పించాయి. వీటి నడుమ అక్కినేనితో ‘బంగారు
కలలు’లో తెలుగువారిని పలుకరించింది.
వహిదా రెహమాన్ హిందీ సినిమా రంగంలో సాధించిన స్థానం, ఏర్పరుచుకున్న గౌరవం, పొందిన సత్కారాలు, గెలుచుకున్న అభిమానులు తక్కువ కాదు. హుందాగా ఉంటూ, అదే సౌందర్యంతో ఆమె ఆ తర్వాతి రోజుల్లో కూడా అడపా దడపా నటిస్తూనే వచ్చింది. ఆమె నవ్వుకు ఫిదా అయ్యే ప్రేక్షకులను కనికరిస్తూనే ఉంది.గొప్ప ప్రయాణం ఆమెది. ఎన్నో జ్ఞాపకాలు. కొన్ని గాయాలు. నాటి రోజులు మళ్లీ రావు. ఈ ఉత్సవ సమయంలో ముసురుకునేది సువర్ణ తలపొతలే.
వక్త్ నే కియా క్యా హసీ సితమ్
తుమ్ రహేన తుమ్ హమ్ రహేన హమ్
జీవితాలను కాల్చిన ప్రేమ
వహిదా రెహమాన్, గురుదత్‌ల మధ్య బంధం, అనుబంధం, సంబంధం గురుదత్ జీవితంలో సంక్షోభం తెచ్చింది. వహిదాను హిందీ పరిశ్రమకు పరిచయం చేసిన గురుదత్ ఆమె పట్ల చాలా పొసెసివ్‌గా ఉండేవాడు. వహిదా కూడా గురుదత్ రెక్కల చాటునే ఉండటానికి ఇష్టపడేది. అయితే ఇదంతా గురుదత్ భార్య, ప్రఖ్యాత గాయని గీతా దత్‌ను చాలా గట్టి దెబ్బ తీసింది. గురుదత్, గీతాదత్‌ల మధ్య వహిదా ప్రమేయం వల్ల చాలా ఎడం వచ్చింది.
గురుదత్, గీతాదత్‌లు ఇద్దరూ తాగుడుకు బానిసయ్యారు. అప్పటికే డిప్రెషన్‌తో బాధపడుతున్న గురుదత్ ఆత్మహత్య చేసుకు మరణించాడన్నది ఒక కథనం. నిద్రమాత్రలు ఎక్కువై మరణించాడని మరో కథనం. ఏమైనా అతని జీవితం అర్థంతరంగా ముగిసింది. ఆ తర్వాత గీతాదత్ కూడా నానా బాధలు పడుతూ తాగుడుకు బానిసై మరణించింది. వహిదా ఒకనాటి నటుడు కమల్‌జిత్‌ను వివాహం చేసుకుంది. ఆమెకు ఒక కొడుకు, కూతురు. బెంగళూరులో చాలా కాలం ఉన్నాక భర్త మరణం తర్వాత ముంబై వచ్చి నివసిస్తోంది.
వహిదా రెహమాన్ హిట్స్
1. భవరా బడా నాదాన్ హై – సాహిబ్ బీబీ ఔర్ గులామ్
2. జానే క్యా తూనే కహి – ప్యాసా
3. కహీ దీప్ జలే కహి దిల్ – బీస్ సాల్ బాద్
4. సాంర్nు ఢలీ దిల్ కి లగీ – కాలా బజార్
5. ఏ నయన్ డరే డరే – కొహ్రా
6. గాతా రహే మేరా దిల్ – గైడ్
7. మెహబూబ్ మేరె మెహబూబ్ మేరె – పత్థర్ కె సనమ్
8. తుమ్ పుకార్ లో తుమ్హారా ఇంతెజార్ హై – ఖామోషీ
9. రంగీలారే తేరె రంగ్ మే – ప్రేమ్ పూజారి
10. జాదుగర్ తెరె నైనా – మన్ మందిర్
పేరు మార్చుకోని నటి
ఆ రోజుల్లో హిందీ సినిమాల్లో నటీనటులు కొత్త తరహా పేర్లు పెట్టుకునేవారు. యూసఫ్‌ఖాన్ దిలీప్ కుమార్ అయ్యాడు. మెహజబీన్ మీనా కుమారి అయ్యింది. అలాగే వహిదా రెహమాన్‌ని కూడా పేరు మార్చుకోమని గురుదత్ సూచించాడు. గురుదత్ అసిస్టెంట్లు కూడా పేరు మార్పుకోసం పట్టుబట్టారు. వహిదా రెహమాన్ పేరులో గ్లామర్ లేదని, మధుబాల లాగా ఏదో ఒక బాల వచ్చేలాగా పెట్టుకోమని కోరారు. అయితే ‘మా అమ్మా నాన్నలు పెట్టిన పేరు నేను మార్చుకోను. దానితోనే కొనసాగుతాను. మీకిష్టమైతే తీసుకోండి, లేకుంటే మానుకోండి’ అని వహిదా రెహమాన్ హఠం చేసింది. చివరకు అందరూ దిగిరాక తప్పలేదు. వహిదా రెహమాన్ తన పేరుతోనే ఖ్యాతి గడించింది.
వహిదా రెహమాన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే
సినిమా రంగంలో విశేష సేవలకుగాను భారత ప్రభుత్వం ప్రకటించే సర్వోన్నత పురస్కారం ‘దాదాసాహెబ్ ఫాల్కే’ 2021 సంవత్సరానికి సుప్రసిద్ధ నటి వహిదా రెహమాన్ (85)ను వరించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి అనురాగ్ ఠాకుర్ మంగళవారం ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ వార్త విన్న వెంటనే వహిదా రెహమాన్ ‘దేవ్ ఆనంద్ శతజయంతి నాడు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. నిజానికి ఈ అవార్డు ఆయనకు అందాలి. నాకు అందింది’ అని సంతోషం వ్యక్తం చేశారు.
అవార్డుకు ఎంపిక చేసిన కమిటిలో ఆశాపరేఖ్, చిరంజీవి, పరేష్ రావెల్, ప్రసేజ్‌జిత్ చటర్జీ, శేఖర్ కపూర్ ఉన్నారు. వహిదా రెహమాన్‌ను ఇది వరకే పద్మశ్రీ, పద్మభూషణ్ వరించాయి. ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కేతో తనకు రెట్టింపు సంబరం కలుగుతున్నదని ఆమె అన్నారు. కాగా వహిదాకు ఫాల్కే పురస్కారం లభించడం పట్ల ప్రధాని మోడి హర్షం వెలిబుచ్చారు. సినిమా రంగంపై ఆమె ముద్ర చెరగనిది అని కొనియాడారు.
హైదరాబాద్, విశాఖ, చెన్నైలతో అనుబంధం కలిగిన వహిదా రెహమాన్ తెలుగు సినిమా ‘రోజులు మారాయి’తో సినిమా రంగంలో ప్రవేశించారు. ఆ తర్వాత హిందీ సినిమాల్లో ఆగ్రతారగా వెలుగొందారు. భారతీయ సినిమాల్లో అత్యుత్తమ నటీమణుల్లో ఒకరిగా ఆమెను పరిగణిస్తారు. వహిదా రెహమాన్ అక్కినేని సరసన ‘బంగారు కలలు’ సినిమాలో నటించారు. ‘పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి’ హిట్ సాంగ్ ఆమెపై చిత్రీకరించినదే.
Comments
Please login to add a commentAdd a comment