సాక్షి, విశాఖపట్నం: పెంగల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో మరో 24 గంటల పాటు తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పలు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఫెంగల్ తుపాన్ టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకుంది. ఈ నేపథ్యంలో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ సందర్భంగా వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరో 24 గంటల పాటు తుపాను ప్రభావం ఉంటుంది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలి.
మరోవైపు, నెల్లూరు జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. పంట పొలాలు నీటి మునిగి చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో జనాలు బయట అడుగుపెట్టాలంటే భయపడుతున్నారు. ఇక, కృష్ణపట్నంలో సముద్రం పది మీటర్లు ముందుకు వచ్చింది.
ఇదిలా ఉండగా.. ఫెంగల్ తుపాను కారణంగా తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ విధించింది వాతావరణ శాఖ. ఇక, పుదుచ్చేరిలో పలు కాలనీలు వరద ముంపులోనే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment