వయసుతో ముసిరే సమస్యలు..! | Women's Day 2025: Most Common Women Health Issues | Sakshi
Sakshi News home page

వయసుతో ముసిరే సమస్యలు..!

Published Tue, Mar 4 2025 11:10 AM | Last Updated on Tue, Mar 4 2025 11:28 AM

Women's Day 2025: Most Common Women Health Issues

చాలా సమస్యలు స్త్రీ, పురుషులిద్దరిలోనూ కామన్‌గానే ఉన్నా... కొన్ని సమస్యలు మాత్రం మహిళల్లో చాలా  ప్రత్యేకం. వాళ్లలో స్రవించే హార్మోన్లూ, సంక్లిష్టమైన సైకిళ్ల వల్ల వాళ్లకు కొన్ని సమస్యలిలా ప్రత్యేకంగా వస్తుంటాయి. ఈ నెల 8న ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలూ, పరిష్కారాలను సూచించే ఈ ప్రత్యేక కథనమిది...

రుతుస్రావం మొదలుకాగానే ఓ బాలిక బాలుర నుంచి వేరుగా కనిపించడం మొదలువుతుంది.రుతుస్రావం నుంచే అమ్మాయిల్లో కొన్ని సమస్యలు కనిపించడం మొదలువుతుంది. చాలామంది అమ్మాయిలు ఇంకా ఈ విషయమై మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంటారు. 

ఇందులో బిడియపడాల్సిందేమీ లేదు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్‌ను సంప్రదించి తగిన సూచనలతోపాటు అవసరమైతే తగిన  వైద్య చికిత్స కూడా తీసుకోవాలి.
తొలుత యువతల్లో కనిపించే రుతుసంబంధమైన సమస్యలను తెలుసుకుందాం.

రుతుసంబంధిత సమస్యలను ఇంగ్లిష్‌లో మెన్‌స్ట్రువల్‌ డిజార్డర్స్‌గా చెబుతారు. వీటిల్లో కొన్ని ప్రధాన సమస్యలిలా ఉంటాయి.  

ప్రైమరీ అమెనోరియా : సాధారణంగా అమ్మాయిల్లో 12 నుంచి 16 ఏళ్ల మధ్య రుతుస్రావం మొదలువుతుంది. కానీ కొందరు యువతుల్లో 16 ఏళ్లు దాటినా  రుతుక్రమం మొదలుకాదు. ఈ కండిషన్‌ను ‘ప్రైమరీ అమెనోరియా’ అంటారు.   ఇందుకు చాలా కారణాలుంటాయి. వీళ్లు డాక్టర్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించి, కారణాలు తెలుసుకోవాలి. ఆ కారణాన్ని బట్టి చికిత్స అందించాల్సి ఉంటుంది. 

డిస్‌మెనూరియా: రుతుసంబంధిత సమస్యల్లో ప్రధానమైనదీ, దాదాపు 80 శాతం మంది అమ్మాయిల్లో కనిపించేది రుతు సమయాల్లో నొప్పి. దీన్నే  ‘డిస్‌మెనూరియా’ అంటారు. వీళ్లు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించాక, వారి సలహాతో రుతుసమయంలో  నొప్పి వచ్చినప్పుడల్లా వారు సూచించిన మోతాదులో నొప్పి నివారణ మందులు వాడుకోవచ్చు. అయితే వీటిని ఎక్కువగా వాడటం వల్ల మరికొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి డాక్టర్‌ సూచించిన మోతాదుకు మించకుండా వాడాలి. 

పరిష్కారం :  రుతు సమయంలో వచ్చే ఈ నొప్పి ఒక వయసుకు వచ్చాక చాలామందిలో దానంతట అదే తగ్గిపోతుంది. ఇలాంటివారికి డాక్టర్లు కొన్ని న్యూట్రిషనల్‌ సప్లిమెంట్లు కూడా సూచిస్తారు. సంతానం కలిగిన తర్వాత చాలామందిలో ఈ నొప్పి రావడం ఆగిపోతుంది. కొందరిలో నొప్పి రావడం ఆగకపోవచ్చు. వాళ్లు డాక్టర్‌ను సంప్రదించి, తగిన మందులు వాడాలి.  

మెనొరేజియా: కొంతమంది యువతుల్లో రుతు సమయంలో రక్తస్రావం చాలా ఎక్కువగా అవుతుంటుంది. ప్రధానంగా చిన్న వయసు (తరుణ వయస్కులైన అడాలసెంట్‌) బాలికల్లో  అలాగే పాతిక ముఫ్ఫై ఏళ్లు వరకు యువతుల్లోనూ ఈ సమస్య కాస్త ఎక్కువే. ఇలా ఎక్కువ మోతాదులో రక్తం పోతుండటం వల్ల రక్తహీనతతో పాటు మరెన్నో ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.  

పరీక్షలూ, పరిష్కారం:  ఈ సమస్య ఉన్నవారు డాక్టర్‌ సలహా మేరకు కొన్ని హార్మోనుల పరీక్షలు చేయించుకొని, అవసరాన్ని బట్టి మందులు వాడాల్సి ఉంటుంది. కొన్ని సార్లు ఈ రక్తస్రావం ఫైబ్రాయిడ్స్‌ వల్ల కావచ్చు. వైద్యపరీక్షల ఫలితాలను బట్టి చికిత్స ఉంటుంది. 

ప్రి మెనుస్ట్రువల్‌ సిండ్రోమ్‌ :  కొంతమంది మహిళల్లో రుతుస్రావం మొదలు కావడానికి కొద్ది రోజులు ముందర నుంచే కొన్ని శారీరక సమస్యలు కనిపిస్తుంటాయి. ఉదాహరణకు... ఆ సమయంలో వాళ్లకు రొమ్ముల్లో సలపరం, బాధ /నొప్పి, భావోద్వేగాలు వెంటవెంటనే మారి΄ోవడం (మూడ్స్‌ స్వింగ్స్‌) వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమస్యను ప్రీ–మెనుస్ట్రువల్‌ సిండ్రోమ్‌ అంటారు. 

పరిష్కారం : ఈ సమయంలో కలిగే బాధల నివారణ కోసం తగినన్ని నీళ్లు తాగుతుండాలి. అలాగే ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరలు, కాయగూరలతో కూడిన పౌష్టికాహారం ఎక్కువగా తీసుకోవాలి. ఒత్తిడికి లోనుకాకూడదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఎండార్ఫిన్‌ అనే హార్మోన్‌లు విడుదలై, మంచి ఉపశమనం కలగజేస్తాయి. ఈ సమస్య ఉన్నవారు పొగతాగడం,  కెఫిన్‌ డ్రింక్స్‌ (కాఫీ, కూల్‌డ్రింక్స్‌లో కోలా డ్రింక్స్‌ వంటివి), ఆల్కహాల్‌ వంటి వాటికి దూరంగా ఉండాలి. 

ఆహారంలో ఉప్పు బాగా తగ్గించాలి. ఉప్పు ఎక్కువగా ఉండే బేకరీ ఐటమ్స్‌కు దూరంగా ఉండాలి. కొవ్వులు, చక్కెరలు ఎక్కువగా ఉండే ఆహారాలను చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. అప్పటికీ ప్రయోజనం కనిపించక΄ోతే డాక్టర్‌ను సంప్రదించి, కొన్ని హార్మోన్‌ పరీక్షలు చేయించుకుని, ఆ వైద్య పరీక్షల ఫలితాలను బట్టి అవసరమైన చికిత్స తీసుకోవాలి. 

మూత్ర సంబంధ సమస్యలు
మహిళల శరీర నిర్మాణం కారణంగా పురుషులతో ΄ోలిస్తే... మహిళల్లో మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్లు చాలా ఎక్కువ. మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్స్‌తో తరచూ వస్తుండేవారు నీళ్లూ, ద్రవాహారం ఎక్కువగా  తీసుకుంటూ ఉండటం, ప్రతి మూడు గంటలకోసారి మూత్రవిసర్జనకు వెళ్లి, మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ అయ్యేలా జాగ్రత్త తీసుకోవడం, భార్యాభర్త కలయిక తర్వాత మూత్ర విసర్జనకు వెళ్లడం (ఈ సమయంలో కాస్త వేగంగా మూత్రవిసర్జన చేయాలి), ప్రైవేటు పార్ట్స్‌ శుభ్రంగా కడుక్కోవడం, ప్రైవేట్‌ పార్ట్స్‌ దగ్గర ఎప్పుడూ పొడిగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలతో ఈ సమస్యను నివారించవచ్చు. 

యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌: కొందరు మహిళల్లో మూత్రంపై నియంత్రణ అంతగా ఉండదు. ఈ సమస్య ఉన్నవారు దగ్గినా, తుమ్మినా, ఏదైనా వస్తువును అకస్మాత్తుగా ఎత్తినా, కొందరిలో నవ్వినా వారి పొట్టపై కండరాలు మూత్రాశయంపై ఒత్తిడి కలిగించి... మూత్రం చుక్కలు, చుక్కలుగా పడేలా చేస్తాయి. సాధారణంగా ప్రసవం తర్వాత ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ప్రసవమైన తర్వాత మహిళల పొట్ట కండరాలు బలహీనం కావడంతో మూత్ర విసర్జన స్ఫింక్టర్‌పై వారు నియంత్రణ కోల్పోయేందుకు అవకాశమెక్కువ. దాంతో ఈ సమస్య కనిపిస్తుంది. 

పరిష్కారాలు: డాక్టర్‌ను సంప్రదించి, వారు సూచించిన విధంగా కొన్ని ప్రసవానంతర వ్యాయామాలూ, కెగెల్స్‌ ఎక్సర్‌సైజ్‌ల ద్వారా మూత్రవిసర్జనపై నియంత్రణ సాధించవచ్చు లేదా వారు సూచించిన విధంగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది కొందరిలో శస్త్రచికిత్స కూడా అవసరమవుతుంది. 

మహిళల్లో కనిపించే కొన్ని సాధారణ గైనిక్‌ సమస్యలు..
పీసీఓఎస్‌ / పీసీఓడీ : అండాశయంలో అనేక నీటితిత్తులు పెరిగే ఈ సమస్యను వైద్యపరిభాషలో పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌ లేదా డిజార్డర్‌ అంటారు. చాలావరకు అవి హానికరం కాకపోవచ్చు. అలాగే గర్భధారణకూ పెద్దగా అంతరాయం కలిగించకపోవచ్చు. 

పీసీఓఎస్‌ / పీసీఓడీకి కారణాలు : మహిళల అండాశయం నుంచి ప్రతి నెలా ఒక ఫాలికిల్‌ (అండం పెరిగే నీటి తిత్తి) కనిపిస్తుంది. దీని పరిమాణం 18 నుంచి 20 మిల్లీమీటర్లకు చేరాక ఇది పగిలి దాని నుంచి అండం విడుదల అవుతుంది. అయితే కొంతమందిలో ఫాలికిల్స్‌ 5–10 మిల్లీమీటర్లకు చేరగానే అంతకు మించి అది పెరగకుండా చిన్న చిన్న నీటి బుడగలాగా పెరుగుతాయి. 

అవి పది, పన్నెండు కంటే ఎక్కువగా ఉన్న కండిషన్‌ను పాలిసిస్టిక్‌ ఓవరీస్‌ అంటారు. ఇవి ఏర్పడానికి స్పష్టమైన కారణం తెలియదుగానీ... మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు, కొన్ని మానసిక, శారీరక సమస్యలతో పాటు హార్లోన్లలో అసమతౌల్యత, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ వంటి సమస్యలు ఉన్నప్పుడు ఇవి వస్తుండటం పరిశోధకులు గమనించారు. ఈ సమస్య ఉన్న మహిళల్లో బరువు పెరగడం, అవాంఛిత రోమాలు, పీరియడ్స్‌ సక్రమంగా లేకపోవడంతో పాటు కొంతమందిలో సంతానలేమి, గర్భధారణ సమస్యలు  కనిపించవచ్చు. 

పరీక్షలు/పరిష్కారాలు : కొన్ని రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ పరీక్షలతో  సమస్యను నిర్ధారణ చేస్తారు. ఈ సమస్య ఉన్న మహిళలందరికీ ఒకేలాంటి చికిత్స ఉండదు. వారిలో కనిపించే లక్షణాలు, రక్తపరీక్షలు తేలిన అంశాలను బట్టి చికిత్స మారుతుంది. బరువు తగ్గించుకోవడం, అవసరాన్ని బట్టి మెట్‌ఫార్మిన్‌ వంటి మందులు, హార్మోన్లు వాడాల్సి ఉంటుంది. సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే అవసరాన్ని బట్టి ల్యాపరోస్కోపిక్‌ శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. 

ఎండోమెట్రియాసిస్‌ : గర్భాశయం లోపలి పొరను ఎండోమెట్రియమ్‌ అంటారు. రుతుస్రావం తర్వాత ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ గర్భాశయం లోపలి గోడలపై ప్రభావం చూపడంతో అక్కడ ఎండోమెట్రియమ్‌ అనే పొర మొదటి 14 రోజులపాటు వృద్ధి చెంది, 15వ రోజున విడుదల అయ్యే ప్రోజెస్టెరాన్‌ అనే హార్మోన్‌ వల్ల ఆ పొర మరింత మందమవుతుంది. 

అక్కడ సన్నటి రక్తనాళాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అప్పుడు ఓవరీస్‌లో విడుదలైన అండం శుక్రకణంతో కలవకపోతే 14 రోజుల తర్వాత ప్రొజెస్టెరాన్‌ ఉత్పత్తి ఆగిపోతుంది. దాంతో ఎండోమెట్రియమ్‌లో అభివృద్ధి చెందిన రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఫలితంగా ఎండోమెట్రియమ్‌ పొర... గర్భాశయం గోడ నుంచి ఊడిపోయి సన్నటి ముక్కలుగా రక్తంలో కలిసి బ్లీడింగ్‌ రూపంలో బయటకు వచ్చేస్తుంది. మహిళల్లో ప్రతినెలా అయ్యే రుతుస్రావం ఇదే. 

అయితే కొందరిలో ఎండోమెట్రియమ్‌ కణాలు గర్భాశయంలోపలి వైపునకు కాకుండా, కొన్ని కారణాల వల్ల కడుపులోకి వివిధ అవయవాలపైన అంటే... అండాశయాలపైనా, ట్యూబ్స్‌పై, గర్భాశయం పై పొరపై, కత్తికడుపులోని గోడలపై, పేగులపై, మూత్రాశయంపై, ఇంకా చాలా అరుదుగా ఊపిరితిత్తుల్లో, మెదడులోకి పెరుగుతాయి.   

హార్మోన్ల ప్రభావం వల్ల అవి రుతుచక్రంలో ఎలాంటి మార్పులు చెందుతాయో... బయట పెరిగిన ఆ కణాల్లోనూ అలాంటి మార్పులే జరుగుతూ అవి పెరిగిన చోట కూడా వృద్ధి చెందుతుంటాయి. వాటినే ఎండోమెట్రియల్‌ ఇంప్లాంట్స్‌ అంటారు. రుతుస్రావం సమయంలో ఆ అవయవాల్లో కూడా కొద్దిగా బ్లీడింగ్‌ అవుతుంటుంది. ఈ సమస్యనే ఎండోమెట్రియాసిస్‌ అంటారు. 

వివిధ అవయవాలపై ఉన్న ఎండోమెట్రియమ్‌ ఇంప్లాంట్స్‌లో రక్తస్రావం జరిగాక... అది బయటకు వెళ్లడానికి దారి లేక రక్తం అక్కడిక్కడే ఇంకిపోతుంది. అయితే కొందరిలో రక్తం ఇంకకుండా అది  గూడు కట్టడం జరగవచ్చు. కొందరిలో ఒక అవయవానికి, మరో అవయవానికి మధ్య ఈ రక్తపు కణాలు గూడుకట్టడం వల్ల కండ పెరగడమూ జరగవచ్చు. 

ఇలా జరగడం వల్ల పెరిగిన కండను అడ్‌హెషన్స్‌ లేదా ఫైబ్రోసిస్‌ బ్యాండ్స్‌ అంటారు. అలా పెరిగిన కణజాలం నుంచి విడుదల అయ్యే ప్రోస్టాగ్లాండిన్స్‌ హార్మోన్స్‌తోపాటు ఇతర రసాయన పదార్థాల వల్ల ఒక్కొక్కరిలో ఒక్కోలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో నడుం, పొత్తికడుపులో నొప్పి, సంతానం కలగకపోవడం, పేగులు అతుక్కు΄ోవడం, మూత్రనాళాలు, పేగుల్లో అడ్డంకులు ఏర్పడటం వంటి సమస్యలు రావచ్చు. 

పరిష్కారం : ఈ సమస్యకు ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్‌ వంటి హార్మోన్‌ మాత్రలతో చికిత్స అందిస్తారు. కొందరిలో శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం రావచ్చు.

చర్మ సమస్యలు..
మహిళల్లో బిగుతైన వస్త్రధారణ కారణంగా వారిలో చర్మానికి సంబంధించిన కొన్ని సమస్యలు కనిపించేందుకు అవకాశాలెక్కువ. అందులో ముఖ్యమైనవి... 

క్యాండిడియాసిస్‌ / ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌: ఇది మహిళల్లో కనిపించే చాలా సాధారణ సమస్య. వాళ్లకు చెమట విపరీతంగా పట్టే ప్రదేశాల్లోనూ, అలాగే చర్మంలోని ముడతలుండే ప్రాంతాల్లో తగినంత గాలి, వెలుతురు సోకే అవకాశాలు తక్కువ. దాంతో అక్కడ ఉక్క΄ోతలతో చెమట తాలూకు చెమ్మ పెరగడంతో క్యాండిడియాసిస్‌ వంటి ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌ రావడానికి అవకాశమెక్కువ. 

ఇక కొందరిలో వాళ్లు గర్భం దాల్చినప్పుడూ ఈ సమస్యలు కనిపించడం మామూలే. అలాగే డయాబెటిస్‌ ఉన్నవారిలోనూ, రోగనిరోధక శక్తి తగ్గిన వారిలో, యాంటీబయాటిక్స్‌ ఎక్కువగా వాడే వారిలో ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌ తరచూ కనిపిస్తుంటాయి.  

పరీక్షలు / పరిష్కారాలు: సాధారణ ఫిజికల్‌ ఎగ్జామినేషన్‌తోనే ఈ సమస్యను   తెలుసుకోవచ్చు. చర్మంపై వచ్చిన ఫంగస్‌ తాలూకు రకాన్ని బట్టి కొన్ని చర్మంపై పూసేందుకు కొన్ని పూతమందులూ (టాపికల్‌ మెడిసిన్స్‌), నోటి ద్వారా తీసుకోవాల్సిన యాంటీఫంగల్‌ మందులు వాడాల్సి ఉంటుంది. 

ఎండోక్రైన్‌ సమస్యలు : ఇది హార్మోన్ల స్రావాల్లో వచ్చే తేడాల వల్ల వచ్చే సమస్యలు. ఇందులో ప్రధానంగా రెండు రకాలు కనిపించేందుకు అవకాశాలెక్కువ.  మొదటిది థైరాయిడ్‌ గ్రంథి చాలా తక్కువగా లేదా అస్సలు పనిచేయకపోవడం వల్ల వచ్చే సమస్య అయిన హైపోథైరాయిడిజమ్‌.

ఈ సమస్య స్త్రీ, పురుషులిద్దరిలోనూ కనిపించినా సాధారణంగా మహిళల్లోనే కాస్త ఎక్కువ. రోగనిరోధక వ్యవస్థలో వచ్చే లోపాల వల్ల హై΄ోథైరాయిడిజమ్‌ రావచ్చు.  తీవ్రమైన అలసట / మందకొడిగా ఉండటం, డిప్రెషన్, బరువు పెరగడం, చర్మం పొడిగా మారడం, మలబద్దకం, రుతుక్రమం సక్రమంగా రాకపోవడం వంటి లక్షణాలతో ఇది కనిపిస్తుంది. 

కొందరిలో ఈ కండిషన్‌ వల్ల రక్తంలో కొలెస్ట్రాల్‌ మోతాదులు పెరిగి అవి హృద్రోగాలకు దారితీయవచ్చు. ఒక్కోసారి మైక్సిడిమా కోమా అన్న కండిషన్‌కు దారితీసి ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉంది. గర్భిణుల విషయంలో థైరాక్సిన్‌ మోతాదులు తగ్గుతున్నాయేమో జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. 

ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ పరీక్షలు చాలా అవసరం. గర్భిణుల్లో హై΄ోథైరాయిడిజం అన్నది బిడ్డ మానసిక వికాసానికి కొద్దిగా అంతరాయం కలిగించవచ్చు. అందుకే గర్భిణుల విషయంలో హైపోథైరాయిడిజమ్‌ లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. లెవో థైరాక్సిన్‌ సోడియమ్‌ వంటి మందుల ద్వారా దీనికి చికిత్స చేస్తారు. 

హైపర్‌ థైరాయిడిజమ్‌ : రక్తంలో థైరాయిడ్‌ హార్మోన్‌లు (టీ3, టీ4) పెరగడం వల్ల వచ్చే సమస్యను హైపర్‌ థైరాయిడిజమ్‌ లేదా థైరోటాక్సికోసిస్‌ అంటారు. దీని లక్షణాలన్నీ హైపోథైరాయిడిజమ్‌ లక్షణాలకు పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి. 

  • గుండెదడ 

  • చేతులు వణకడం 

  • బరువు తగ్గిపోవడం ∙నీరసం ∙విరేచనాలు ∙ రుతుక్రమానికి సంబంధించిన సమస్యలు 

  • థైరాయిడ్‌ గ్రంథి వాపు (గాయిటర్‌) వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

  • హైపర్‌థైరాయిడిజమ్‌ను రక్త పరీక్ష ద్వారా గుర్తిస్తారు. ఈ పరీక్షలో రక్తంలో టీ3, టీ4 మోతాదు ఎక్కు కావడం, టీఎస్‌హెచ్‌ మోతాదు బాగా తగ్గి΄ోవడం కనిపిస్తుంది.  దీనికి చికిత్సగా యాంటీ థైరాయిడ్‌ మందులు ఉపయోగిస్తారు. ఈ మందులను డాక్టర్‌ సలహా మేరకు తీసుకోవాలి. కొన్ని నెలల వ్యవధిలోనే ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. చాలామందిలో ఈ యాంటీథైరాయిడ్‌ మందులు ఆపిన తర్వాత మళ్లీ థైరాయిడ్‌ హార్మోన్‌ మోతాదులు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా యాంటీ థైరాయిడ్‌ మందుల ద్వారా హార్మోన్‌ని తగ్గించి, ఆ తర్వాత ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం రెండు పద్థతులు అనుసరిస్తారు. మొదటి దానిలో రేడియో ఆక్టివ్‌ అయోడిన్‌ మందును ఎక్కువ మోతాదులో ఇవ్వడం ద్వారా థైరాయిడ్‌ గ్రంథిలో హార్మోన్‌ తయారు చేసే కణాలను నాశనం చేయడం ద్వారా హార్మోన్‌ స్రావాన్ని తగ్గిస్తారు. ఇక రెండో పద్ధతిలో ఆపరేషన్‌ ద్వారా థైరాయిడ్‌ గ్రంథిని తొలగించడం ద్వారా హార్మోన్‌ స్రావాన్ని తగ్గిస్తారు. ఈ రెండు పద్ధతుల్లోనూ హార్మోన్‌ స్రావం బాగా తగ్గిపోయి, చివరకు హార్మోన్‌ లోపానికి దారితీస్తుంది. అప్పుడుహైపోథైరాయిడిజమ్‌లో మాదిరిగానే జీవితాంతం థైరాక్సిన్‌ మాత్రలు వాడాల్సి ఉంటుంది. 

మధ్య వయసులో వచ్చేవి..
మధ్యవయసు నాటికి మహిళల్లో కనిపించే సమస్యల్లో ముఖ్యమైనవి ఇవి... 

మెనోపాజ్‌ సమస్యలు : రుతుక్రమం రావడంతో సమస్యలు మొదలవుతాయంటే... తమకు 45 ఏళ్లు వచ్చాక అదే రుతుక్రమం ఆగి΄ోవడం కూడా మహిళల్లో ఒక సమస్యాత్మక అంశంగానే ఉంటుంది. రుతుక్రమం ఆగే సమయంలో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ తగ్గినందున వారికి ఒంట్లోంచి వెచ్చటి ఆవిర్లు రావడం, భావోద్వేగాల్లో వేగంగా మార్పులు (మూడ్స్‌ స్వింగ్స్‌), ఆస్టియో΄ోరోసిస్‌తో ఎముకలు బలహీనం కావడం, ఈస్ట్రోజెన్‌ వల్ల గుండెకు కలిగే సహజ రక్షణ తొలగిపోవడం వల్ల  గుండెజబ్బులకు తేలిగ్గా గురికావడం, యోని పొడిగా మారడం, గర్భసంచి కిందికి జారడం  వంటి అనేక సమస్యలు కనిపిస్తాయి. 

పరిష్కారం : రుతుక్రమం ఆగిన (మెనోపాజ్‌) మహిళల్లో సంబంధిత లక్షణాలేవైనా  కనిపిస్తే తక్షణం డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. లక్షణాలను బట్టి డాక్టర్లు హెచ్‌ఆర్‌టీ వంటి చికిత్సలను సూచిస్తారు. క్యాల్షియమ్, విటమిన్‌ ’డి’ ఇవ్వడం వల్ల మెనోపాజ్‌ వచ్చిన మహిళల్లో ఎముకల ఆరోగ్యం పటిష్టంగా ఉండటమే కాకుండా ఆస్టియోపోరోసిస్‌ వంటి సమస్యలను నివారించవచ్చు. అలాగే ఆహారంలో క్యాల్షియమ్‌ ఎక్కువగా ఉండే పాల వంటివి తీసుకోవడంతోపాటు దేహానికి తగినంత వ్యాయామం కూడా అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 

ఆస్టియోపోరోసిస్‌... మహిళల్లో ఈ ఎముకలకు గుల్లబారి΄ోయే ఈ వ్యాధి చాలా ఎక్కువ. పైగా మన దేశ మహిళలు (ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి యువతుల వరకు) క్యాల్షియమ్‌ ఎక్కువగా ఉండే పాలు క్రమం తప్పకుండా తాగడం చాలా తక్కువ. ఇటీవల చాలామంది సూర్యకాంతికి ఎక్స్‌పోజ్‌ కాకపోవడంతో ఎముకలకు బలం చేకూర్చే విటమిన్‌ డీ3 పాళ్లూ తగ్గుతాయి. 

పైగా మహిళలకు వ్యాయామ అలవాట్లూ తక్కువే. వీటిన్నింటి ఫలితంగా మహిళల్లో ఎముక సాంద్రతా, బలం క్రమంగా తగ్గుతూ పోతుంది. ఇక తమ వ్యాధినిరోధక శక్తి తమపైనే ప్రతికూల ప్రభావం చూపే ఎముక సంబంధితమైన రుమటాయిడ్‌ ఆర్థరైటిస్, ఎస్‌ఎల్‌ఈ వంటి వ్యాధులు మహిళ్లోనే ఎక్కువ. 

అందుకే మహిళల్లో ఎముకల బలాన్ని పెంచడానికి పొట్టుతో ఉంటే కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్స్‌ ఇచ్చే ధాన్యాలైన (గోధువు, జొన్న, మెుక్కజొన్న, రాగులు, ఓట్స్‌)తో చేసిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పొట్టుతీసిన కార్బోహైడ్రేట్స్‌ నివారించాలి. తాజా పండ్లు, క్యాల్షియమ్‌ ఎక్కువగా ఉండే రాగులు, తాజా ఆకుపచ్చ కూరలు (గ్రీన్‌ లీఫీ వెజిటబుల్స్‌) తీసుకోవడం చాలా మంచిది. 

ఇటీవలి ఆధునిక మహిళలు ఇంటిపనులతోపాటు బయట ఉద్యోగాలూ చేస్తున్నారు. అందుకే వారిపై పనిఒత్తిడి తోపాటు మానసిక ఒత్తిడీ ఎక్కువే. ఫలితంగా ఆరోగ్య సమస్యలూ ఎక్కువే. అందుకే ఆమెకు కుటుంబం నుంచీ, అందునా మరీ ముఖ్యంగా  భర్త నుంచి తగిన సహాయ సహకారాలు అవసరమని అందరూ తెలుసుకోవాలి.
డాక్టర్‌ చల్మేడ నివేదిత, సీనియర్‌ ఫిజీషియన్‌, డయాబెటాలజిస్ట్‌ 

(చదవండి: అరుదైన శసస్త్ర చికిత్స: దంతంతో కంటి చూపు..!)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement