
డైట్ నుంచి మెడిసిన్ వరకూ అన్నీ మొబైల్‌లోనే
వైద్యుల సంప్రదింపులు, పరీక్షలు సైతం
జెనెటిక్ వెల్‌నెస్, ఫేస్‌స్కాన్‌లూ వస్తున్నాయ్
నగరవాసుల ఆరోగ్యానికి అనుసంధానంగా స్మార్ట్ ఫోన్
అరచేతిలో ఆరోగ్యం.. సర్వ స్మార్ట్ మయం
పంజాగుట్టలోని ఆఫీస్‌లో కంప్యూటర్ సిస్టమ్ ముందు దీక్షగా పనిచేస్తున్న రవిరాజ్‌కి ఒక్కసారిగా కళ్లు బైర్లు కమ్మాయి.. నిలుచుంటే తూలి పడిపోతానేమో అని ఫీలింగ్, వెంటనే మొబైల్ చేతిలోకి తీసుకుని వేళ్లు కదిపాడు. అంతే.. నిమిషాల వ్యవధిలోనే అతని శారీరక, మానసిక పరిస్థితుల స్టేటస్ చార్ట్ సిద్ధమవడం, వ్యక్తిగత వైద్యునికి చేరడం, జాగ్రత్తలు, మందుల జాబితా రవిరాజ్‌కి చేతికి రావడం జరిగిపోయింది. నగరానికి చెందిన ఐటీ ఉద్యోగి నవీన్‌కి మూడేళ్ల బాబు.. ఉన్నట్లుండి అర్ధరాత్రి రెండు గంటలకు తీవ్ర జ్వరం, ఇతర ఆరోగ్య సమస్య తలెత్తింది.. అదే సమయంలో నవీన్ ఇంట్లో లేకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి.. ఆయన భార్య మొబైల్ యాప్ సహాయంతో ఆన్‌లైన్‌లో డాక్టర్‌ని సంప్రదించారు. డాక్టర్ సలహా మేరకు వెంటనే మందులను ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టడంతో సమస్య నుంచి పరిష్కారం లభించింది. ఇలా ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌లో డాక్టర్ కన్సల్టేషన్ తీసుకునేవారు అనేకం.. ఈ నేపథ్యంలో దీని గురించిన మరిన్ని విషయాలు.. – సాక్షి, సిటీబ్యూరో
రవిరాజ్ మాత్రమే కాదు పలువురు నగరవాసులు ఆరోగ్య సమస్యల పరిష్కారంలో స్మార్ట్ ఫోన్‌పైనే ఆధారపడుతున్నారు. కోవిడ్ సమయంలో ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో పలువురు టెక్నాలజీని బాగానే ఔపోసన పట్టారు. అనంతర పరిణామాల క్రమంలో ఆరోగ్యంపై పెరిగిన అవగాహన మొబైల్స్‌ని పలువురికి మెడికల్ అసిస్టెంట్లుగా మార్చేశాయి. తొలుత సకాలంలో వైద్యసేవలను మాత్రమే అందించిన మొబైల్ ఫోన్ యాప్స్ ద్వారా ఇప్పుడు విభిన్న రకాలుగా ఆరోగ్యరక్షణలోనూ కీలకపాత్ర పోషిస్తోంది.
ప్రివెంటివ్..కేర్
అనారోగ్యాలకు చికిత్సతో పాటు కొన్ని యాప్‌లు ప్రధానంగా ప్రివెంటివ్ హెల్త్ కేర్‌పై దృష్టి పెడుతున్నాయి. వైద్యులు, శిక్షకులను అందుబాటులోకి తెస్తున్నాయి. వ్యక్తి రోజువారీ ఫిట్‌నెస్ స్థాయిలు, రక్తపోటు హెచ్చుతగ్గులు, రక్తంలో చక్కెర స్థాయిలు వగైరాలన్నీ పర్యవేక్షిస్తూ మార్పుచేర్పులపై హెచ్చరిస్తున్నాయి. వినియోగదారులతో వైద్యులకు రిమోట్ యాక్సెస్ అందించే యాప్స్ ద్వారా వ్యక్తులు తమ పరిస్థితిని డాక్టర్‌కు వివరించడానికి చాట్ చేసే సౌకర్యం, వీడియో కాల్స్ వంటివెన్నో అందుబాటులోకి తెచ్చాయి.
యాప్స్ ద్వారా జెనెటిక్ వెల్‌నెస్..
డాక్టర్ దగ్గరకు వెళితే ప్రిస్కిప్షన్ రాస్తాడు. రోగం తగ్గిపోగానే ఆ ప్రిస్కిప్షన్ విసిరేస్తాం. కానీ వాటిని జాగ్రత్త చేయం. కానీ ఆ ప్రిస్కిప్షన్ చాలా అవసరం అనే విషయం గ్రహించం. భవిష్యత్తులో ఆరోగ్య చికిత్సలకు ఇది చాలా కీలకం. అందుకే డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అందుబాటులోకి తెచ్చాం’ అంటూ చెప్పారు నగరానికి చెందిన హెల్త్‌కేర్ సంస్థ ఆసియానా నిర్వాహకులు సత్యనారాయణ. ఆరోగ్య పరిరక్షణ, వ్యాధుల విషయంలో జీన్స్ ప్రాధాన్యతను గుర్తిస్తూ సరికొత్త ఆన్‌లైన్ ఆరోగ్య వేదికను రూపకల్పన చేశారాయన. ప్రతి డయాబెటిక్ రోగికి తక్షణ చికిత్సగా వెట్ మార్పిన్ ఇస్తారని, కానీ వంశపారంపర్యంగా వచ్చిందా, జీవనశైలి ద్వారా వచ్చిందా? అని గుర్తించాకే ట్రీట్‌మెంట్ ఇవ్వాలనీ అంటున్నారాయన. దీనికి వ్యక్తి ఆరోగ్య చరిత్ర, ఫ్యామిలీ హిస్టరీ వంటివన్నీ డిజిటల్ రికార్డ్స్‌గా భద్రపరచి యాప్స్‌తో అనుసంధానిస్తే ఆరోగ్య సమస్యలకు మరింత మెరుగైన పరిష్కారం లభిస్తుంది అంటున్నారాయన.
వంశ ఆరోగ్య చరిత్ర తెలిస్తే..
జెనెటిక్ వెల్‌నెస్ కోసం జెనెటిక్ టెస్టులు సైతం అందుబాటులోకి తెచ్చారు. భవిష్యత్తులో ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి? వంటివి సైతం గుర్తించవచ్చు. తద్వారా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే ఒక డాక్టర్ దగ్గరకి వెళ్లినప్పుడు అతని జీన్స్ ప్రకారం ఏ మెడిసిన్ ఇవ్వొచ్చు? ఇవ్వకూడదు? వంటివి కూడా సూచించగలుగుతున్నారు. అలాగే న్యూట్రిషనిస్ట్ దగ్గరకు వెళ్లినప్పుడు కూడా నప్పే, నప్పని ఆహారంపైనా ముందస్తు సూచనలు అందించేలా ఈ యాప్స్ వెల్‌నెస్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నాయి.
సరికొత్త సేవ ఫేస్‌స్కాన్..
ఎవరైనా తమ హెల్త్ ఎలా ఉంది? అని తెలుసుకోవాలి అనుకుంటే ఫేస్‌స్కాన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. కేవలం 30 సెకన్లలోనే 25 రకాల పరిశీలనలను ఇది అందిస్తుంది. ఇది కూడా యాప్ ద్వారానే సాధ్యమవుతోంది. అలాగే ఒక వెల్‌నెస్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయ్యాక ఇంప్రూవ్‌మెంట్ ఎలా ఉంది? అనేది సమీక్షించుకునేందుకు కూడా ఈ ఫేస్ స్కాన్ ఉపకరిస్తోంది. హార్ట్ రేట్, థైరాయిడ్, కొలె్రస్టాల్ శాతం, వాసు్క్యలార్ రిస్క్, షుగర్ కంటెంట్, హైపర్ గ్లైసీమియా.. వంటివాటికి సంబంధించిన విశేషాలన్నీ స్కాన్ చేసి చెబుతుంది. ఈ ఫలితాలను బట్టి అవసరమైతే మరిన్ని వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు.
హెల్త్‌కేర్ వర్చువల్ కేర్‌పై అవగాహన..
కోవిడ్ తర్వాత వర్చువల్ కేర్‌పై అందరికీ ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలోనే రోగులకు వైద్యసేవలకు మధ్య ఉన్న ఖాళీని పూరించేందుకు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ ఏర్పాటు చేశాం. డిజిటల్ కన్సల్టేషన్, ఫార్మసీ కన్సల్టేషన్స్, ల్యాబ్ కన్సల్టేషన్స్ అన్నీ అందిస్తున్నాం. ఫేస్ స్కాన్, జెనెటిక్ వెల్‌నెస్ వంటి అత్యాధునిక సేవలను అందుబాటులోకి తెచ్చాం. – సత్యనారాయణ వంటిపల్లి, ఛీప్ టెక్నాలజీ ఆఫీసర్, ఆసియానా
Comments
Please login to add a commentAdd a comment