
నడక, యోగా రెండూ దేనికవే ప్రత్యేకం. ఆరోగ్యకరమైన వ్యాయామ మార్గాలు. ప్రస్తుతం ఈ రెంటినీ మిళితం చేసిన సరి కొత్త వ్యాయామంగా అందుబాటులోకి వచ్చింది వాకింగ్ యోగా. అటు నడక ద్వారా లభించే ప్రయోజనాలతో పాటు.. ఇటు యోగా ఫలితాలను ఒకే వ్యాయామం ద్వారా అందుకునేందుకు ఇది సహకరిస్తుంది. ఇటీవల తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో అనేక మందిని ఆకట్టుకుంటున్న ఈ వాకింగ్ యోగా విశేషాలివి..
నడక మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ నడక– యోగా ఆ ప్రయోజనాలను మరింత ముందడుగు వేయిస్తుంది. ఆధునిక సౌకర్యాలు, పని విధానాల వల్ల చలన రహితంగా మారుతున్న శరీరాన్ని చురుకుగా కదపడానికి విభిన్న రకాలుగా సాగదీయడానికి, సరైన రీతిలో శ్వాస పీల్చుకోడానికి వీలుగా ఈ వాకింగ్ యోగా రూపుదిద్దుకుంది.
ఇది నడిచేటప్పుడు మన శరీర భంగిమను మెరుగుపరచడానికి, నడకను మరింత ప్రయోజనకరంగా మార్చడానికి సహకరిస్తుంది. ఏదో నడిచాం అన్నట్టుగా కాకుండా అవగాహనతో నడవడం నేర్పిస్తుంది. ఇందులో ప్రతి అడుగు లోతైన శ్వాస, సున్నితమైన స్ట్రెచ్‌లతో కలిపి ఉంటుంది.
భంగిమకు మేలు..
మనలో చాలా మంది మన శరీర భంగిమ ఎలా ఉంటుందో పట్టించుకోకుండా నడుస్తూ ఉంటారు. తద్వారా నడవడం వల్ల కలిగే ప్రయోజనాలను కోల్పోతుంటారు. వాకింగ్ యోగా భంగిమను మెరుగుపరుస్తుంది. చేతులు, కాళ్లు, మెడ.. వీటిని సరైన రీతిలో ఉంచేలా సహాయపడుతుంది. నిటారుగా నిలిచేలా, నడుము భాగం, వీపుతో నడకను అనుసంధానిస్తుంది. కండరాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
కొందరికి అననుకూలం..
ఒక వ్యక్తి తమ నడకను మరింత విశ్రాంతిగా అదే సమయంలో మరింత ఉపయుక్తంగా మార్చే నడక యోగా టీనేజర్స్‌తో సహా అన్ని వయసుల వారికీ ఉపయుక్తమే. అయితే అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఇది అందరికీ అనుకూలం కాకపోవచ్చు. వేగవంతమైన నడక లేదా తీవ్రమైన వ్యాయామాలను ఇష్టపడే వ్యక్తులకు నప్పకపోవచ్చు.
అలాగే, దీనికి ఏకాగ్రత, ఎక్కువ సహనం అవసరం. అది లేనివారు దీన్ని సాధన చేయడం కష్టం. నప్పుతుందో లేదో తెలుసుకోడానికి ఒక వారం పాటు దీనిని ప్రయత్నించి పరిశీలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మానసికంగానూ ఎంతో మేలు..
నడక యోగా ఒత్తిడిని తగ్గించడానికి విశ్రాంతిని అందించడానికి ఒక గొప్ప మార్గం. ఇది నడుస్తున్నప్పుడు లోతుగా శ్వాస తీసుకోవడం అలవాటు చేస్తుంది. తద్వారా ఆందోళనను, ప్రతికూల ఆలోచనలను తగ్గించి మనసును ప్రశాంతపరుస్తుంది. ఇది చురుకుగా ఉంటూనే మెదడుకు రిఫ్రెష్ బటన్ ప్రెస్ చేయడం లాంటిదని చెప్పొచ్చు. మనసు శరీరానికి క్రమబద్ధమైన అభ్యాసం ఇది. ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్థితిని, ఏకాగ్రతను పెంచడానికి శరీరంపై అవగాహనను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
రోజుకు 5 నిమిషాలతో..
బాగా పరిచయం ఉన్న కాస్త ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో రోజుకు ఐదు నిమిషాలతో ఈ వాకింగ్ యోగాని ప్రారంభించాలి. రోజుకు క్రమంగా ఐదు నిమిషాల చప్పున పెంచుకోవచ్చు. తద్వారా రొటీన్ వ్యవహారాలకు, వ్యాయామాలతో సర్దుబాటు కావడానికి కండరాలకు సమయాన్ని ఇవ్వాలి.
‘రోజుకు 20 నిమిషాలు వచ్చే వరకూ ఈ విధంగా పెంచుతూపోవాలి. ప్రతిరోజూ 20 నిమిషాలు కేటాయించలేకపోతే.. కనీసం వారానికి మూడు రోజులు 30 నిమిషాలు చేస్తే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.
50 ఏళ్ల క్రితమే..
మైండ్‌ఫుల్ వాకింగ్ అనే ప్రక్రియను యోగా శిక్షకురాలు, యోగా ఫర్ పెయిన్ యాప్ సృష్టికర్త, లండన్‌కు చెందిన సోఫియా డ్రోజ్డ్ వ్యాప్తిలోకి తెచ్చారు. అయితే ఇదేమీ కొత్తది కాదని, దాదాపు 50 ఏళ్ల క్రితం.. అంటే 1970 ప్రాంతంలోనే రోజువారీ కార్యకలాపాలతో యోగా, బ్రీత్‌వర్క్‌లను కలిపే సాధనంగా ఇది ప్రప్రథమంగా వినియోగంలోకి వచ్చిందని డ్రోజ్డ్ అంటున్నారు.
ప్రకృతితో మమేకం.. మైండ్ ఫుల్ వాక్..
దృష్టిని పూర్తిగా శ్వాస మీదే కేంద్రీకరిస్తూ.. ఆలోచనలు మరే విషయం మీదకూ మళ్లించకుండా శరీరాన్ని కదిలించడమే మైండ్ ఫుల్ నెస్. నడిచే సమయంలో ఈ ప్రక్రియను సాధన చేస్తే.. అద్భుత ప్రయోజనాలు లభిస్తాయి. అది కూడా ప్రకృతిలో మమేకమవుతూ చేయడం మరింత ప్రయోజనకరం. నడకను, యోగాను మేళవించడమే వాకింగ్ యోగా. మైండ్ ఫుల్ బ్రీతింగ్, మైండ్ ఫుల్ నేచర్ వాక్, పచ్చని గడ్డి మీద నడిచే బేర్ ఫుట్ వాక్, క్లౌడ్ గేజింగ్.. వంటివన్నీ ఇందులో భాగంగానే చెప్పవచ్చు. నగరంలో పలువురు వాకింగ్ యోగాను సాధన చేస్తున్నారు.
– రీనా హిందోచా, యోగా శిక్షకురాలు
(చదవండి: క్షణాల్లో తయారయ్యే ఈ మ్యాగీ నూడుల్స్ రెసిపీని కనిపెట్టిందెవరంటే..)
Comments
Please login to add a commentAdd a comment