మాదాపూర్‌లోని యశోద ఆస్పత్రిలో అంతర్జాతీయ క్రిటికల్ కేర్ నెఫ్రాలజీ సదస్సును ప్రారంభించిన గవర్నర్ తమిళిసై తదితరులు
మాదాపూర్: కిడ్నీ సమస్యలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మాదాపూర్‌లోని యశోద హాస్పిటల్‌లో అత్యాధునిక క్రిటికల్ కేర్ నెఫ్రాలజీపై శనివారం అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సును ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, రోజురోజుకీ జీవన విధానంలో మార్పులు రావడం వల్లనే అనారోగ్య సమస్యలు ఎక్కువగా పెరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ మెరుగైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని కోరారు. గ్రామాలలో చాలా మందికి కిడ్నీ సమస్యలపై అవగాహన లేకపోవడంతో, సంబంధంలేని డాక్టర్ల వద్దకు వెళ్లి మోతాదుకు మించిన మందులను వాడుతుండటంతో కిడ్నీ సమస్యలు తీవ్రమవుతున్నాయని తెలిపారు.
చాలా మంది గూగుల్ సెర్చ్ చేసి స్వయంగా మందులు వాడటంతో అవి పెద్ద సమస్యలుగా మారుతున్నాయన్నారు. డాక్టర్ల సలహా మేరకు మాత్రమే మందులను వాడాలని, సంబంధించిన డాక్టర్ వద్ద మాత్రమే చికిత్స పొందాలని గవర్నర్ కోరారు. కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షల రూపాయల ఆరోగ్య బీమాను అందిస్తోందని, ప్రతి ఒక్కరూ దానిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. కిడ్నీలను పరీక్షించేందుకు గతంలో సరైన పరికరాలు ఉండేవి కాదని, ప్రస్తుతం అత్యాధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇలాంటి సదస్సులను నిర్వహించడం వల్ల రోగులకు వ్యాధులపై అవగాహనతో పాటు మెరుగైన చికిత్సను అందించవచ్చని చెప్పారు.
యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ, ఏకేఐ నిర్ధారణ సీరం క్రియాటిన్ పెరుగుదలపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రపంచంలో దాదాపు 850 మిలియన్ ప్రజలు ఏదో ఒక మూత్రపిండాల వ్యాధితో సతమతమవుతున్నారని తెలిపారు. కిడ్నీ వ్యాధులు, ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి, క్రిటికల్ కేర్ నెఫ్రాలజీ వ్యాధులపై చర్చించడానికి సదస్సులో అంతర్జాతీయ వైద్య నిపుణులు పాల్గొననున్నట్టు తెలిపారు. ఈ సదస్సులో వేయి మందికిపైగా వైద్య నిపుణులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment