
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన కేసులో మాజీ మంత్రి హరీష్‌రావుకు ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌పై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావు, రాధాకిషన్ రావుకు హైకోర్టులో ఊరట దక్కింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కాగా, రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో హరీష్‌రావు, రాధాకిషన్ రావుపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో, వీరద్దర్నీ పోలీసులు నిందితులుగా చేర్చారు. అయితే, ఈ కేసులో ఇప్పటికే ఇరువైపుల వాదనలు ముగిశాయి. ఇక, తాజాగా హైకోర్టు తీర్పును వెల్లడించింది. ఫోన్ టాపింగ్ కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలా ఉండగా.. సిద్దిపేట జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్.. తన ఫోన్‌ను ట్యాపింగ్ చేశారని.. మాజీ మంత్రి హరీష్ రావు, రాధాకిషన్ రావులపై గతేడాది ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పంజాగుట్ట పోలీసులు.. హరీష్ రావు పీఏ వంశీకృష్ణ సహా ముగ్గురి అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించారు. తన ఫోన్‌ను ట్యాపింగ్ చేసి బెదిరింపులు, వేధింపులకు గురిచేశారని పిటిషనర్ చక్రధర్ గౌడ్ తెలిపారు. ఒక రైతుకు తెలియకుండా అతని పత్రాలతో హరీష్ రావు పీఏ వంశీకృష్ణ సిమ్‌కార్డు కొనుగోలు చేశారని.. ఆ సిమ్‌ను ఉపయోగించి తనకు బెదిరింపు కాల్స్ చేసి వసూళ్లకు పాల్పడ్డారని చక్రధర్ గౌడ్ ఆరోపించారు. ఇక ఈ కేసులో ఏ-1గా హరీష్ రావు, ఏ-2గా రాధాకిషన్ రావులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment