
హైడ్రా తీరుపై హైకోర్టు మళ్లీ ఘాటు వ్యాఖ్యలు
సంస్థ టార్గెట్ పేద, మధ్యతరగతి మాత్రమేనా?
ప్రముఖులకు ఈ రాష్ట్రంలో ప్రత్యేక చట్టం ఉందా?
మియాపూర్, దుర్గం చెరువు ఆక్రమణల పరిస్థితి ఏంటి?
హైడ్రా పనితీరు ఆశాజనకంగా లేదన్న ఉన్నత న్యాయస్థానం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో నీటి వనరులు, సర్కార్ భూముల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా.. పేద, మధ్యతరగతి ప్రజలను మాత్రమే టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సంపన్నులు, రాజకీయ నేతలు, ఇతర ప్రముఖుల జోలికెళ్లడం లేదని, ఒకసారి వారి నిర్మాణాల్లో నిబంధనలు పాటించారో, లేదో పరిశీలించాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది. సంపన్నులకు హైడ్రా ప్రత్యేక చట్టాన్ని అమలు చేస్తోందా అని నిలదీసింది.
పేద, మధ్యతరగతికి చెందిన ఇళ్లను కూల్చి మీడియాలో ఫొటోలు వేయించుకోవడం కాదని.. మియాపూర్, దుర్గం చెరువు సహా పలుచోట్ల సర్కార్ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన ప్రముఖుల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. అందరికీ ఒకేలా న్యాయం దక్కినప్పుడే హైడ్రా ప్రజాప్రయోజనాలను పరిరక్షించినట్లు అవుతుందని తేల్చిచెప్పింది. ‘ఒకప్పుడు హైదరాబాద్ అంటే చెరువులు, సరస్సుల నగరంగా పేరు ఉండేది. 2000కుపైగా చెరువులు ఉండగా, ఇప్పుడు 200 కూడా లేవు.
చెరువుల రక్షణకు నాడు ప్రత్యేక చట్టాలు అమల్లో ఉండేవి. హైడ్రా ఏర్పాటు బాగానే ఉన్నా.. పనితీరు మాత్రం ఆశాజనకంగా లేదు. పేదలతోపాటు పెద్దలకు చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసినప్పుడే నిజమైన సార్థకత చేకూరుతుంది. ఇప్పటి ప్రభుత్వాల కంటే నాడు నిజాం చేపట్టిన చెరువుల పరిరక్షణ చర్యలే పకడ్బందీగా ఉన్నాయి. మీరాలం చెరువు పరిధిలో నిర్మాణాలపై ఉమ్మడి సర్వే చేపట్టి.. ఆక్రమణలు ఉంటే తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి’అని స్పష్టం చేసింది.
ప్రభుత్వానిదా? వక్ఫ్‌దా?
రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్ సర్వే నంబర్ 329/1, 329/2, 329/3లోని ఆరు ఎకరాల భూమిపై తహసీల్దార్ జారీచేసిన నోటీసులను సవాల్ చేస్తూ ఫాతిమా, మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశా రు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాద నలు వినిపిస్తూ.. ‘సదరు భూమికి సంబంధించి వక్ఫ్ బోర్డు సీఈవో లేఖ మేరకు తహసీల్దార్ చర్యలు చేపట్టడం చెల్లదు.
ఒకవేళ వక్ఫ్‌భూమి అయినా సీఈవో చర్యలు తీసుకోవచ్చు గానీ, నోటీసులు జారీ చేసే అధికారం తహసీల్దార్‌కు లేదు. ఆ నోటీసులను రద్దు చేయాలి’అని కోరారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘ఇదే హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్య ం మేరకు మీరాలం చెరువు పరిధిలోని ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టాం. అన్ని చర్యలు తీసుకుంటున్నాం’అన్నారు.
వాదనలు విన్న న్యాయమూర్తి.. మీరా లం చెరువుకు సంబంధించి పిటిషనర్ అభ్యంతరాలపై ఉమ్మ డి సర్వే నిర్వహించాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. ప్రభుత్వానిదే అని తేలితే చర్యలు చేపట్టాలని, వక్ఫ్ బోర్డుదని తేలితే చర్యలు తీసుకునే బాధ్యతను బోర్డుకు అప్పగించాలని చెప్పారు. నీటి వనరుల ఆక్రమణపై వాల్టా చట్టం కింద చర్యలు తీసుకోవచ్చంటూ విచారణ ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment