మనుషులన్నాక పొరపాట్లు చేయడం సహజం అని అంటారు. దీనికి వైద్యులేమీ మినహాయింపు కాదనిపించే పలు ఘటనలను మనం చూసే ఉంటాం. తాజాగా అటువంటి ఉదాహరణ మన ముందు నిలిచింది. ఒక వైద్యుడు తాను 14 ఏళ్లుగా వైద్యం అందించిన బాధితునికి రూ. 10 లక్షలు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ బాధితునికి 14 ఏళ్లుగా వైద్యం అందించడం ఆ వైద్యునికి తలకుమించిన భారంలా మారింది. సదరు వైద్యుడు అందించిన ఔషధాలు ఆ బాధితునికి వికటించాయి. ఫలితంగా అతను ఇకముందు తండ్రి కాలేని పరిస్థితికి చేరుకున్నాడు. ఈ ఉదంతం కోర్టు వరకూ చేరింది. వాదనల అనంతరం కోర్టు ఆ వైద్యునికి రూ. 10 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని బాధితునికి 30 రోజుల్లోగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
యూపీ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ప్రిసైడింగ్ అధికారి తన తీర్పులో డాక్టర్ అరవింద్ గుప్తాకు ఈ జరిమానాను విధించారు. జరిమానా మొత్తంతో పాటు కేసు ఖర్చుల నిమిత్తం బాధితునికి రూ.25 వేలు చెల్లించాలని కూడా ఆదేశించారు. 30 రోజుల్లోగా బాధితునికి తొమ్మిది శాతం వడ్డీతో సహా మొత్తం సొమ్ము చెల్లించాలని ఆదేశించారు. జౌన్‌పూర్‌కు చెందిన ఓ బాధితుడు వినియోగదారుల కమిషన్‌లో ఈ ఉదంతంపై పిటిషన్ దాఖలు చేశాడు. తనకు పెళ్లి అయ్యిందని, పిల్లలను కనేందుకు 14 ఏళ్లుగా ప్రముఖ వైద్యుని దగ్గర చికిత్స చేయించుకున్నట్లు యువకుడు తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.
ఆయనకు ఫీనిక్స్ హాస్పిటల్‌లో ప్రయాగ్‌రాజ్‌కు చెందిన డాక్టర్ అరవింద్ గుప్తా చికిత్స అందించారు. డాక్టర్ అరవింద్ గుప్తా ప్రయాగ్‌రాజ్‌లోని మోతీలాల్ నెహ్రూ మెడికల్ కాలేజీలో నెఫ్రాలజీ ప్రొఫెసర్‌గా కూడా పనిచేస్తున్నారు. ఆయన చికిత్స సమయంలో, బాధితుడికి పలుమార్లు హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చారు. అయినా బాధితునికి ఉపశమనం లభించకపోవడంతో ఆయన మరో వైద్యుడిని సంప్రదించారు ఆ రెండో వైద్యుడు నిర్వహించిన పరీక్షలో డాక్టర్ అరవింద్ గుప్తా చికిత్స కారణంగా బాధితునికి మరో అనారోగ్యం వాటిల్లిందని తేలింది. డాక్టర్ అరవింద్ గుప్తా చికిత్సలో దుష్ప్రభావాల కారణంగా బాధితునికి ఇక తండ్రి అయ్యే అవకాశాలు లేకుండా పోయాయని వైద్య పరీక్షల్లో తేలింది.
ఇది కూడా చదవండి: నాలుగు రాష్ట్రాల్లో ‘మహిళా పథకాలు’.. ప్రయోజనాల్లో తేడాలివే
Comments
Please login to add a commentAdd a comment