health insurance scheme
-
ఉచితంగా రూ.5 లక్షల బీమా.. 70 ఏళ్లు దాటినవారికి వరం!
కేంద్ర ప్రభుత్వం 70 ఏళ్లు పైబడిన వారికి పేద, ధనిక అనే తేడాలేకుండా వైద్యం కోసం ప్రత్యేక బీమా కల్పిస్తోంది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ–పీఎంజెఎవై) కింద అక్టోబర్ 30 నుంచి ఆరోగ్య బీమా అవకాశం కల్పిస్తోంది.అర్హులైన సీనియర్ సిటిజన్లకు ఈ పథకం కింద కొత్త, విభిన్నమైన కార్డ్ జారీచేస్తారు. ఆధార్ కార్డు ప్రకారం 70 ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా... ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని కేంద్రం తెలిపింది.దరఖాస్తు చేసే విధానం...ఏబీపీఎంజేఏవై పథకంలో లబ్ధి పొందేందుకు పీఎంజేఏవై పోర్టల్ లేదా ఆయుష్మాన్ యాప్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎంజేఏవై పోర్టల్ పీఎంజేఏవైజీవోవీ.ఇన్ లాగిన్ అయి 70 ప్లస్ ట్యాబ్ఫై క్లిక్ చేయాలి. దాంతో www.beneficiary.nha.gov.in అనే వెబ్ సైట్‌కి రీడైరెక్ట్ అవుతారు. అక్కడ క్యాప్చా, మొబైల్ నెంబర్, ఓటీపీ ఎంటర్ చేయాలి. తర్వాత కేవైసీ కోసం వివరాలు నమోదు చేసి ఆమోదం కోసం చూడాలి. ఆయుష్మాన్ కార్డు సిద్ధమైన తర్వాత ఆధికారిక ఆమోదం లభించిన వెంటనే బీమా కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఇవీ ఉపయోగాలు..● అర్హులైన సీనియర్ సిటిజన్లందరికీ ఈ పథకం కింద ఏబీ–పీఎంజేఎవై రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ఎంపానెల్ అయిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో 1,835 రకాల వ్యాధులకు ఉచితంగా చికిత్సలు పొందవచ్చు.● లబ్ధిదారులు నమోదు చేసుకున్న మొదటి రోజు నుంచి చికిత్సను యాక్సెస్ చేయడం ప్రారంభించవచ్చు. ఏదైనా వ్యాధి లేదా చికిత్స కోసం వేచి ఉండే కాలం ఉండదు, కాబట్టి కవరేజ్ వెంటనే ప్రారంభమవుతుంది. -
రోగాలకు ‘గూగుల్ చికిత్స’ వద్దు
మాదాపూర్: కిడ్నీ సమస్యలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మాదాపూర్‌లోని యశోద హాస్పిటల్లో అత్యాధునిక క్రిటికల్ కేర్ నెఫ్రాలజీపై శనివారం అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సును ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, రోజురోజుకీ జీవన విధానంలో మార్పులు రావడం వల్లనే అనారోగ్య సమస్యలు ఎక్కువగా పెరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ మెరుగైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని కోరారు. గ్రామాలలో చాలా మందికి కిడ్నీ సమస్యలపై అవగాహన లేకపోవడంతో, సంబంధంలేని డాక్టర్ల వద్దకు వెళ్లి మోతాదుకు మించిన మందులను వాడుతుండటంతో కిడ్నీ సమస్యలు తీవ్రమవుతున్నాయని తెలిపారు. చాలా మంది గూగుల్ సెర్చ్ చేసి స్వయంగా మందులు వాడటంతో అవి పెద్ద సమస్యలుగా మారుతున్నాయన్నారు. డాక్టర్ల సలహా మేరకు మాత్రమే మందులను వాడాలని, సంబంధించిన డాక్టర్ వద్ద మాత్రమే చికిత్స పొందాలని గవర్నర్ కోరారు. కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షల రూపాయల ఆరోగ్య బీమాను అందిస్తోందని, ప్రతి ఒక్కరూ దానిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. కిడ్నీలను పరీక్షించేందుకు గతంలో సరైన పరికరాలు ఉండేవి కాదని, ప్రస్తుతం అత్యాధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇలాంటి సదస్సులను నిర్వహించడం వల్ల రోగులకు వ్యాధులపై అవగాహనతో పాటు మెరుగైన చికిత్సను అందించవచ్చని చెప్పారు. యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ, ఏకేఐ నిర్ధారణ సీరం క్రియాటిన్ పెరుగుదలపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రపంచంలో దాదాపు 850 మిలియన్ ప్రజలు ఏదో ఒక మూత్రపిండాల వ్యాధితో సతమతమవుతున్నారని తెలిపారు. కిడ్నీ వ్యాధులు, ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి, క్రిటికల్ కేర్ నెఫ్రాలజీ వ్యాధులపై చర్చించడానికి సదస్సులో అంతర్జాతీయ వైద్య నిపుణులు పాల్గొననున్నట్టు తెలిపారు. ఈ సదస్సులో వేయి మందికిపైగా వైద్య నిపుణులు పాల్గొన్నారు. -
మధ్య తరగతికి వైద్య బీమా ఏదీ?
సాక్షి, హైదరాబాద్: కొన్నేళ్లుగా జీవన శైలిలో మార్పులు, ఇతర కారణాలతో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. అదే సమయంలో వైద్యచికిత్సలకు అయ్యే ఖర్చు భారీగా పెరిగింది. ఏదైనా అనుకోని ఆపదనో, జబ్బో వస్తే.. ఉన్న సంపాదన మొత్తం ఊడ్చుకుపోయే పరిస్థితి. దేశవ్యాప్తంగా చాలా మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఇదే. ప్రభుత్వాలు ఆరోగ్య బీమా పథకాలను అమలు చేస్తున్నా బీపీఎల్ (దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న) కుటుంబాలకే వర్తిస్తాయి. డబ్బున్నవాళ్లు ఎలాగోలా గట్టెక్కుతున్నా మధ్యతరగతి కుటుంబాలు మాత్రం వైద్యఖర్చులు తట్టుకోలేక విలవిల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నీతి ఆయోగ్ తాజాగా ‘హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ఇండియాస్ మిడిల్ మిస్సింగ్’పేరిట ఒక నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ప్రజలు ఆరోగ్య బీమాను వినియోగించుకుంటున్న తీరును విశదీకరించింది. దేశవ్యాప్తంగా తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల్లో మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్య బీమా అందడం లేదని పేర్కొంది. మన రాష్ట్రంలో 30శాతం కుటుంబాలు ఆరోగ్య బీమాకు దూరంగా ఉన్నాయని తెలిపింది. పేదలకు ప్రభుత్వ పథకాలు: రాష్ట్రంలో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తోంది. దీనితోపాటు కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని సైతం అమల్లోకి తెచ్చింది. ప్రధానంగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకే ఈ పథకాలను అమలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.5లక్షల వరకు ఉన్నవారు మాత్రమే అర్హులు. దీనికింద 949 రకాల చికిత్సలను నిర్దేశించిన ప్యాకేజీ ప్రకారం అందిస్తున్నారు. ఇక స్వయం ఉపాధిపై ఆధారపడ్డ వారికి, అసంఘటితరంగంలో పనిచేస్తున్న వారికి, వలస కార్మికులు, ఓ మోస్తరు వేతనం అందుకునే ఉద్యోగులకు ఎలాంటి ప్రభుత్వ బీమా పథకాలు లేవు. ఆరోగ్యపరంగా ఏదైనా ఆపద తలెత్తితే ఆ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి. నూరు శాతం బీమా ఉండాలి జనాభాలో నూరుశాతం మందికి ఆరోగ్య బీమా అందే పరిస్థితి ఉండాలని నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొంది. ప్రతి పౌరుడికి ఆరోగ్యంగా జీవించడం ఒక హక్కు అని ప్రస్తావించింది. ఈ క్రమంలోనే ప్రీమియం చెల్లించేలా అయినా సరే.. మధ్యతరగతికి బీమా పథకాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. మధ్యతరగతి కుటుంబ ఆదాయానికి అనువుగా ప్రీమియం ఉండాలని.. కుటుంబ సభ్యుల సంఖ్య, ఆర్థిక స్థోమత తదితర అంశాలను పక్కాగా విశ్లేషించాకే తుది అంచనాకు రావాలని పేర్కొంది. ఇక ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాల్లో అత్యవసర సేవలు కూడా కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని.. ఔట్‌పేషెంట్ సేవలు కూడా అందిస్తే మరింత ఎక్కువ ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు నీతి ఆయోగ్ ఇటీవలే ఈ నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. ఆ ఏడు రాష్ట్రాల్లో.. మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య బీమా పథకాలు అందడం లేదని నీతి ఆయోగ్ ప్రస్తావించిన రాష్ట్రాల జాబితాలో.. తెలంగాణతోపాటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లోనూ కొంతమేర ఆరోగ్య బీమా పథకాలు అందని పరిస్థితి ఉందని నీతి ఆయోగ్ పేర్కొంది. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఏదో రకంగా మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య బీమా పథకాలు అందుతున్నాయని వెల్లడించింది. నాణ్యమైన వైద్యసేవలు మరింత చేరువ కావాలి ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యసేవలు పక్కాగా అందాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాల ప్రకారం.. మనదేశంలో ఏటా 5శాతం మంది వైద్య సేవల ఖర్చు కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు. వైద్యం కోసం సంపాదనలో 40శాతం ఖర్చు చేస్తున్నారు. ఈ ఖర్చులో 90శాతం మందుల కోసమే వ్యయం అవుతోంది. ఈ నేపథ్యంలో మధ్య తరగతి వారికి కూడా వైద్యసేవలు మరింత దగ్గరగా అందేవిధంగా ప్రభుత్వాలు చొరవ చూపాలి. అందులోనూ అత్యవసర సేవలు, ఓపీ సేవలు ఉచితంగా అందాలి. - డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ యూనిట్ హెచ్ఓడీ, నిజామాబాద్ మెడికల్ కాలేజీ అవగాహన లేక.. ప్రీమియం ఎక్కువై.. ఆరోగ్య బీమాపై ఇంకా చాలామందికి సరైన అవగాహన లేదు. అంతేకాదు ఆరోగ్య బీమా పథకాల ప్రీమియం రేట్లు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ప్రైవేటు బీమా కంపెనీల ప్రీమియం ధరలు మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి దాదాపు నెల ఆదాయంతో సమానంగా ఉంటున్నాయి. దీనితో మెజార్టీ ప్రజలు బీమా పథకాలకు దూరమవుతున్నారు. ప్రభుత్వాలు మధ్యతరగతి కుటుంబాలకు కూడా అనువైన విధంగా బీమా పథకాలను రూపొందించి అమలు చేయాలి. - డాక్టర్ కిశోర్ ఈగ, పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ ► ప్రస్తుతం కేంద్రం దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తోంది. దానితోపాటు చాలా రాష్ట్రాలు సొంత ఆరోగ్య బీమా పథకాలను నిర్వహిస్తున్నాయి. ఈ లెక్కన జనాభాలో సుమారు 50శాతం మందికి ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ వంటి ఆరోగ్య బీమా పథకాలు అందుతున్నాయి. ► మరో 20శాతం మంది.. ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ స్కీం, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీం, జర్నలిస్ట్ హెల్త్ స్కీం, ఈఎస్ఐ, ప్రైవేటు ఆరోగ్య బీమా పథకాల పరిధిలో ఉన్నారు. ► మిగతా 30 శాతం మంది ఆరోగ్య బీమా పథకాలకు దూరంగా ఉన్నారు. ప్రైవేటు ఆరోగ్య బీమా పథకాల ప్రీమియం రేట్లు ఎక్కువ. చాలావరకు మధ్యతరగతి కుటుంబాలు ఆ ఖర్చును భరించే పరిస్థితులు లేవు. దీనితోపాటు ఆరోగ్య బీమాపై సరైన అవగాహన లేకపోవడం కూడా కారణమేనని నీతి ఆయోగ్, వైద్య రంగ నిపుణులు చెప్తున్నారు. ► ప్రస్తుత పరిస్థితుల్లో కాస్త ప్రీమియం వసూలు చేసి అయినా సరే.. మధ్యతరగతి కుటుంబాలకు వర్తించేలా ఆరోగ్య బీమా పథకాలు తేవాలని రాష్ట్ర ప్రభుత్వాలను నీతి ఆయోగ్ కోరింది. -
ఆ స్కీమ్‌తో లక్ష ఉద్యోగాలు..
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పేరిట ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్య బీమా పథకంతో రానున్న నాలుగేళ్లలో లక్షకు పైగా ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల విస్తరణ ద్వారా మరిన్ని ఉద్యోగాలు యువతకు అందివస్తాయని ఆయుష్మాన్ భారత్ సీఈఓ ఇందు భూషణ్ చెప్పారు. ఈ కార్యక్రమం కింద దేశంలోని 10 కోట్ల నిరుపేద కుటుంబాలకు రూ 5 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ఈ కార్యక్రమం అమలు ద్వారా రానున్న నాలుగేళ్లలో లక్షకు పైగా నైపుణ్యాలు, తక్కువ నైపుణ్యాలతో కూడిన ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నామని భూషణ్ తెలిపారు. కేంద్ర స్థాయిలో అమలు పర్యవేక్షక సిబ్బంది, రాష్ట్ర స్ధాయిలో క్లెయిమ్ నిర్వహణ వ్యవస్థ, ట్రస్ట్, క్షేత్రస్థాయిలో బీమా ఏజెన్సీల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సమకూరుతాయని చెప్పారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ సేవల కోసం దాదాపు 25,000 ఆస్పత్రులను ఈ స్కీమ్‌లో చేరుస్తామని తెలిపారు. ఆ యుష్మాన్ భారత్‌తో నెలకొనే డిమాండ్‌ను అధిగమించేందుకు కొత్తగా 300 ప్రైవేట్ ఆస్పత్రులు ప్రారంభమైనా ఒక్కో ఆస్పత్రిలో 200 మంది ఉద్యోగులకు చోటు దక్కినా ప్రత్యక్షంగా 60,000 ఉద్యోగాలు ఆస్పత్రుల్లో అందుబాటులోకి వస్తాయని ఆయన అంచనా వేశారు.పరోక్షంగా లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పుకొచ్చారు. -
‘ఆయుష్మాన్ భారత్’కు ఓకే
-
‘ఆయుష్మాన్ భారత్’కు ఓకే
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకంగా భావిస్తున్న ‘ఆయుష్మాన్ భారత్’ను ప్రారంభించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇటీవల బడ్జెట్లో ప్రతిపాదించిన ఈ పథకం ద్వారా ఏటా 10 కోట్ల పేద కుటుంబాలకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలని సంకల్పించిన సంగతి తెలిసిందే. అలాగే, పట్టు పరిశ్రమ అభివృద్ధికి రూ.2,161 కోట్లు కేటాయించడానికి సమ్మతించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం కేంద్ర నిధులతో అమలవుతున్న రాష్ట్రీయ స్వస్థ్య బీమా యోజన(ఆర్ఎస్బీవై), సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీం(ఎస్‌సీహెచ్‌ఐఎస్) పథకాలను ఆయుష్మాన్ భారత్‌లో విలీనం చేయనున్నారు. ఇతర నిర్ణయాలు.. దేశంలో సెరీకల్చర్‌ను ప్రోత్సహించడానికి పట్టు పరిశ్రమ అభివృద్ధికి వచ్చే రెండేళ్లలో రూ.2,161.68 కోట్లు వెచ్చించాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే ఈ రంగంలో ఉత్పాదక ఉద్యోగుల సంఖ్య 85 లక్షల నుంచి కోటికి పెరిగే అవకాశాలున్నాయి. ► ఓబీసీల ఉపవర్గీకరణపై ఏర్పాటైన జస్టిస్ జి.రోహిణి కమిటీ పదవీ కాలం జూన్ 20 వరకు పొడిగింపు. ► వాణిజ్య సరోగసీని నిషేధించి, షరతులకు లోబడి పిల్లలు లేని దంపతులకు నైతిక సరోగసీకి వీలుకల్పించేలా చట్టంలో సవరణ చేయడానికి ఆమోదం. -
ఆరోగ్యబీమా.. దేశానికే ఆదర్శం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఆరోగ్య బీమా పథకంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ వైపు దేశమంతా చూసేలా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పని చేస్తోందని కితాబిచ్చారు. సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి ప్రాంగణంలో గురువారం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు సంబంధించిన ‘వెల్నెస్ సెంటర్’ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. కాంట్రిబ్యూషన్ లేకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్న ‘ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు’కార్యక్రమం ద్వారా.. అందరి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు నమోదు చేస్తామన్నారు. రోగి పూర్వ స్థితి తెలుసుకుని మెరుగైన చికిత్స అందించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందన్నారు. ప్రజారోగ్యాన్ని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని మంత్రి ఆరోపించారు. రూ.3,324 కోట్ల అంచనా వ్యయంతో సంగారెడ్డి– నాందేడ్– అకోలా 161 జాతీయ రహదారి నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయినట్లు వెల్లడించారు. మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. గాంధీ ఆస్పత్రిలో సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంతాన సాఫల్యత కోసం పేద, మధ్య తరగతి వర్గాలు ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీలు పాతూరు సుధాకర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, రాములు నాయక్, ఎమ్మెల్యేలు వి.శ్రీనివాస్‌గౌడ్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, బ్రీవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సఖి కేంద్రం ప్రారంభం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ‘సఖి’కేంద్రాన్ని మంత్రి హరీశ్ ప్రారంభించారు. అనంతరం కందుల కొనుగోలు తీరుపై సంగారెడ్డి కలెక్టరేట్ నుంచి మార్కెటింగ్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
నేతన్నకు ఆరోగ్య బీమా!
న్యూఢిల్లీ: కార్మిక రాజ్య బీమా కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) పథకం కింద నేత కార్మికులకు(హ్యాండ్లూమ్, పవర్లూమ్) ఆరోగ్య బీమా పథకంపై ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీని ద్వారా 8 కోట్ల మంది చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు ఈఎస్ఐసీ కింద మేలు జరగనుందని మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. నేత కార్మికులకు ఈఎస్ఐ పథకం కిందకు చేర్చాలన్న కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ రాసిన లేఖపై మంత్రి స్పందించారు. -
జనవరి 1 నుంచి ఆరోగ్య బీమా: సీఎం
డిసెంబర్ 24న స్వస్త విద్యావాహిని ప్రారంభం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకాన్ని వచ్చే జనవరి 1 వ తేదీన ప్రారంభించాలని నిర్ణరుుంచినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. దీనికి ముందే స్వస్త విద్యావాహిని పేరుతో మరో కార్యక్రమాన్ని డిసెంబర్ 24 వ తేదీన రాష్ట్రంలోని 222 ప్రదేశాల నుంచి ప్రారంభించనున్నట్టు చెప్పారు. మంగళవారం రాత్రి సీఎం క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ సమీక్షా సమావేశం జరిగింది. ఈ రెండు పథకాలను కొత్త సంవత్సరం కానుకగా ప్రజలకు అందించాలని నిర్ణరుుంచినట్లు చంద్రబాబు చెప్పారు. ఆరోగ్య బీమా కార్యక్రమంలో భాగంగా కుటుంబంలోని ఒక్కో వ్యక్తి నెలకు రూ.100 ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. స్వస్త విద్యావాహిని పథకం విద్యార్థులకు ఉద్దేశించినది. బాలబాలికలకు సరైన పోషకాహారం అందించడం, ఆరోగ్య సంరక్షణపై అవగాహన కలిగించడం, వారిలో రోగనిరోధక శక్తి పెంచడం ఈ పథకం లక్ష్యాలు. క్లినికల్ స్పెషలిస్టుల కోసం ఉద్దేశించిన ఇన్సోర్సింగ్ పోర్టల్‌ను ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ఆవిష్కరించారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన 25 హెల్త్ ఏటీఎంలను రిమోట్ ద్వారా ప్రారంభించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. -
ఈఎస్ఐసీకి బదులు ఇతర బీమాల ఎంపిక!
న్యూఢిల్లీ: సంఘటిత రంగంలోని రెండు కోట్ల మందికిపైగా కార్మికులకు శుభవార్త. బహిరంగ మార్కెట్లో లభించే ఆరోగ్య బీమా ప్లాన్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు వారికి త్వరలో లభించనుంది. ప్రస్తుతం నెలకు రూ.21 వేల వరకు వేతనం పొందే కార్మికులు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) ఆధ్వర్యంలోని ఆరోగ్య బీమా పథకంలో చేరడం తప్పనిసరి. అయితే ఇకమీదట ఈఎస్ఐసీ ఆరోగ్య బీమా పథకానికి బదులుగా మార్కెట్లో లభించే ఆరోగ్య బీమా ఉత్పత్తులను ఎంచుకునే ప్రత్యామ్నాయం వారికి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ చట్టం, 1948కి సవరణలు చేస్తూ ఒక బిల్లును కార్మిక మంత్రిత్వశాఖ త్వరలో కేంద్ర మంత్రివర్గం ఆమోదానికి పంపనుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లు ఆమోదానికి మంత్రిత్వశాఖ ప్రయత్నిస్తుం దని ఆ శాఖకు చెందిన వర్గాలు తెలిపాయి. -
ఫ్యూచర్ జెనరాలి.. ‘టోటల్ హెల్త్’ వైద్య బీమా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేటురంగ సాధారణ బీమా కంపెనీ... ఫ్యూచర్ జెనరాలి ‘టోటల్ హెల్త్’ పేరుతో సమగ్ర ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. వైటల్, సుప్రీం, ప్రీమియం పేర్లతో మూడు లక్షల నుంచి గరిష్టంగా కోటి రూపాయల వరకు వైద్య బీమాను ఈ సంస్థ అందిస్తోంది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఫ్యూచర్ జెనరాలి సౌత్ జోన్ హెడ్ మాధవ ఎండ్లూర్ టోటల్ హెల్త్ పాలసీని మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేశారు. ఒక సంవత్సరం కాలపరిమితి నుంచి మూడేళ్ళ కాలపరిమితికి ఈ పాలసీని తీసుకోవచ్చని, అప్పుడే పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి బీమా రక్షణ ఉండే విధంగా దీన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఒకసారి ‘టోటల్ హెల్త్’ పాలసీ తీసుకుంటే మధ్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా జీవిత కాలం రెన్యువల్ చేయించుకోవచ్చు. క్లెయిమ్‌లు లేకపోతే మరుసటి ఏడాది నో-క్లెయిమ్ బోనస్ కింద 50 శాతం బీమా రక్షణ మొత్తాన్ని ఇలా గరిష్టంగా 100 శాతం పెంచుతామన్నారు. ప్రస్తుతం ఫ్యూచర్ జెనరాలి ప్రీమియం ఆదాయంలో 14 శాతం వైద్య బీమా రంగం నుంచి వస్తోందని, వచ్చే మూడేళ్లలో దీన్ని 20 శాతానికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గతేడాది ఫ్యూచర్ జెనరాలి మొత్తం ప్రీమియం ఆదాయం రూ. 1,450 కోట్లుగా ఉంది. ప్రస్తుతం కంపెనీ అయిదు రకాల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను కలిగి ఉంది. -
కావూరి హామీలు
కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం రూ.37,500తో ఆరోగ్యబీమా పథకం. అందరికీ ఉచితం. మొత్తం డబ్బులు ప్రభుత్వమే భరిస్తుంది. కార్మికుల వివరాలు వెంటనే పంపించాలని సెంట్రల్ టెక్స్టైల్ కమిషనర్ జోషీకి ఆదేశం. ఇంతకుముందు బీమా పథకం రూ.7,500 ఉండేది. పనిలో నేర్పరితనం పెంపొందించేందుకు సిరిసిల్లలో రూ.8 కోట్లతో శిక్షణ కేంద్రం ఏర్పాటు. వీవింగ్, వార్పింగ్, సైజింగ్, డైయింగ్, ప్రాసెసింగ్ తదితర అంశాల్లో కార్మికులకు తర్ఫీదు. సిరిసిల్లలో మెగా పవర్‌లూం క్లస్టర్ ఏర్పాటు కోసం రానున్న బడ్జెట్లో నిధులు కేటాయింపునకు ఆర్థిక మంత్రికి సిఫారసు. ఒక్కొక్కరికి అధునాతన మగ్గాల కోసం రూ.50 లక్షల వరకు రుణం అందించేందుకు సంసిద్ధత. వ్యక్తిగత షెడ్లకు, సామూహిక(గ్రూప్) షెడ్లకు రుణాలు. వీటి మూలధనం రెట్టింపు. పత్తి నుంచి గార్మెంట్స్ తయారై మార్కెట్ చేసుకునే దాకా సిరిసిల్ల పరిశ్రమను ఆదుకుంటామని హామీ. పవర్‌లూం సర్వీస్ సెంటర్ సిరిసిల్లలో ఏర్పాటుకు కృషి. చేనేత కార్మికుల వ్యక్తిగత రుణాలు ఈ నెల 31 లోపు మాఫీ చేస్తున్నట్లు ప్రకటన.సిరిసిల్లలో యారన్ బ్యాంకు(నూలు డిపో) నెలరోజులలోపు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం.నిరాశ సిరిస్లిలను స్పెషల్ టెక్స్టైల్ జోన్‌గా ప్రకటించకపోవడం... అపెరల్ పార్క్ ఏర్పాటుపై ప్రకటన చేయకపోవడం కార్మికవర్గాలను నిరాశకు గురిచేసింది.