సాక్షి, హైదరాబాద్: కొన్నేళ్లుగా జీవన శైలిలో మార్పులు, ఇతర కారణాలతో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. అదే సమయంలో వైద్యచికిత్సలకు అయ్యే ఖర్చు భారీగా పెరిగింది. ఏదైనా అనుకోని ఆపదనో, జబ్బో వస్తే.. ఉన్న సంపాదన మొత్తం ఊడ్చుకుపోయే పరిస్థితి. దేశవ్యాప్తంగా చాలా మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఇదే. ప్రభుత్వాలు ఆరోగ్య బీమా పథకాలను అమలు చేస్తున్నా బీపీఎల్ (దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న) కుటుంబాలకే వర్తిస్తాయి. డబ్బున్నవాళ్లు ఎలాగోలా గట్టెక్కుతున్నా మధ్యతరగతి కుటుంబాలు మాత్రం వైద్యఖర్చులు తట్టుకోలేక విలవిల్లాడుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే నీతి ఆయోగ్ తాజాగా ‘హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ఇండియాస్ మిడిల్ మిస్సింగ్’పేరిట ఒక నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ప్రజలు ఆరోగ్య బీమాను వినియోగించుకుంటున్న తీరును విశదీకరించింది. దేశవ్యాప్తంగా తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల్లో మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్య బీమా అందడం లేదని పేర్కొంది. మన రాష్ట్రంలో 30శాతం కుటుంబాలు ఆరోగ్య బీమాకు దూరంగా ఉన్నాయని తెలిపింది.
పేదలకు ప్రభుత్వ పథకాలు:
రాష్ట్రంలో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తోంది. దీనితోపాటు కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని సైతం అమల్లోకి తెచ్చింది. ప్రధానంగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకే ఈ పథకాలను అమలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.5లక్షల వరకు ఉన్నవారు మాత్రమే అర్హులు. దీనికింద 949 రకాల చికిత్సలను నిర్దేశించిన ప్యాకేజీ ప్రకారం అందిస్తున్నారు.
ఇక స్వయం ఉపాధిపై ఆధారపడ్డ వారికి, అసంఘటితరంగంలో పనిచేస్తున్న వారికి, వలస కార్మికులు, ఓ మోస్తరు వేతనం అందుకునే ఉద్యోగులకు ఎలాంటి ప్రభుత్వ బీమా పథకాలు లేవు. ఆరోగ్యపరంగా ఏదైనా ఆపద తలెత్తితే ఆ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి.
నూరు శాతం బీమా ఉండాలి
జనాభాలో నూరుశాతం మందికి ఆరోగ్య బీమా అందే పరిస్థితి ఉండాలని నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొంది. ప్రతి పౌరుడికి ఆరోగ్యంగా జీవించడం ఒక హక్కు అని ప్రస్తావించింది. ఈ క్రమంలోనే ప్రీమియం చెల్లించేలా అయినా సరే.. మధ్యతరగతికి బీమా పథకాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. మధ్యతరగతి కుటుంబ ఆదాయానికి అనువుగా ప్రీమియం ఉండాలని.. కుటుంబ సభ్యుల సంఖ్య, ఆర్థిక స్థోమత తదితర అంశాలను పక్కాగా విశ్లేషించాకే తుది అంచనాకు రావాలని పేర్కొంది.
ఇక ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాల్లో అత్యవసర సేవలు కూడా కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని.. ఔట్‌పేషెంట్ సేవలు కూడా అందిస్తే మరింత ఎక్కువ ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు నీతి ఆయోగ్ ఇటీవలే ఈ నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది.
ఆ ఏడు రాష్ట్రాల్లో..
మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య బీమా పథకాలు అందడం లేదని నీతి ఆయోగ్ ప్రస్తావించిన రాష్ట్రాల జాబితాలో.. తెలంగాణతోపాటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లోనూ కొంతమేర ఆరోగ్య బీమా పథకాలు అందని పరిస్థితి ఉందని నీతి ఆయోగ్ పేర్కొంది. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఏదో రకంగా మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య బీమా పథకాలు అందుతున్నాయని వెల్లడించింది.
నాణ్యమైన వైద్యసేవలు మరింత చేరువ కావాలి
ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యసేవలు పక్కాగా అందాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాల ప్రకారం.. మనదేశంలో ఏటా 5శాతం మంది వైద్య సేవల ఖర్చు కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు. వైద్యం కోసం సంపాదనలో 40శాతం ఖర్చు చేస్తున్నారు. ఈ ఖర్చులో 90శాతం మందుల కోసమే వ్యయం అవుతోంది. ఈ నేపథ్యంలో మధ్య తరగతి వారికి కూడా వైద్యసేవలు మరింత దగ్గరగా అందేవిధంగా ప్రభుత్వాలు చొరవ చూపాలి. అందులోనూ అత్యవసర సేవలు, ఓపీ సేవలు ఉచితంగా అందాలి.
- డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ యూనిట్ హెచ్‌ఓడీ, నిజామాబాద్ మెడికల్ కాలేజీ
అవగాహన లేక.. ప్రీమియం ఎక్కువై..
ఆరోగ్య బీమాపై ఇంకా చాలామందికి సరైన అవగాహన లేదు. అంతేకాదు ఆరోగ్య బీమా పథకాల ప్రీమియం రేట్లు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ప్రైవేటు బీమా కంపెనీల ప్రీమియం ధరలు మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి దాదాపు నెల ఆదాయంతో సమానంగా ఉంటున్నాయి. దీనితో మెజార్టీ ప్రజలు బీమా పథకాలకు దూరమవుతున్నారు. ప్రభుత్వాలు మధ్యతరగతి కుటుంబాలకు కూడా అనువైన విధంగా బీమా పథకాలను రూపొందించి అమలు చేయాలి.
- డాక్టర్ కిశోర్ ఈగ, పీడియాట్రిక్స్ ప్రొఫెసర్
► ప్రస్తుతం కేంద్రం దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తోంది. దానితోపాటు చాలా రాష్ట్రాలు సొంత ఆరోగ్య బీమా పథకాలను నిర్వహిస్తున్నాయి. ఈ లెక్కన జనాభాలో సుమారు 50శాతం మందికి ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ వంటి ఆరోగ్య బీమా పథకాలు అందుతున్నాయి.
► మరో 20శాతం మంది.. ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ స్కీం, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీం, జర్నలిస్ట్ హెల్త్ స్కీం, ఈఎస్‌ఐ, ప్రైవేటు ఆరోగ్య బీమా పథకాల పరిధిలో ఉన్నారు.
► మిగతా 30 శాతం మంది ఆరోగ్య బీమా పథకాలకు దూరంగా ఉన్నారు. ప్రైవేటు ఆరోగ్య బీమా పథకాల ప్రీమియం రేట్లు ఎక్కువ. చాలావరకు మధ్యతరగతి కుటుంబాలు ఆ ఖర్చును భరించే పరిస్థితులు లేవు. దీనితోపాటు ఆరోగ్య బీమాపై సరైన అవగాహన లేకపోవడం కూడా కారణమేనని నీతి ఆయోగ్, వైద్య రంగ నిపుణులు చెప్తున్నారు.
► ప్రస్తుత పరిస్థితుల్లో కాస్త ప్రీమియం వసూలు చేసి అయినా సరే.. మధ్యతరగతి కుటుంబాలకు వర్తించేలా ఆరోగ్య బీమా పథకాలు తేవాలని రాష్ట్ర ప్రభుత్వాలను నీతి ఆయోగ్ కోరింది.
Comments
Please login to add a commentAdd a comment