
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ ముచ్చటగా మూడోసారి పంజాబ్ కింగ్స్‌తో జతకట్టాడు. ఐపీఎల్-2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు మాక్స్‌వెల్ ప్రాతినిథ్యం వహించనున్నాడు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన మెగా వేలంలో రూ. 4.2 కోట్లకు మాక్స్‌వెల్‌ను పంజాబ్ సొంతం చేసుకుంది.
ఇప్పటికే పంజాబ్ జట్టుతో చేరిన మాక్సీ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కాగా మాక్స్‌వెల్ తొలిసారిగా 2014 ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్య వహించాడు. 2014, 2015, 2016 సీజన్లలో మాక్సీ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో ఈ ఆసీస్ స్టార్ ఐపీఎల్-2017లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే ఆ సీజన్‌లో మాక్స్‌వెల్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ గ్రూపు స్టేజికే పరిమితమైంది.
అప్పటి జట్టు రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయిన పంజాబ్ టీమ్.. లీగ్ స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది. ఆ మ్యాచ్‌లో పంజాబ్ కేవలం 73 పరుగులకే ఆలౌటై ఘోర ఓటమిని మూట కట్టుకుంది.
అయితే ఆ మ్యాచ్ అనంతరం అప్పటి పంజాబ్ మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్‌తో గ్లెన్ మాక్స్‌వెల్‌కు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా తాజాగా మాక్స్‌వెల్.. సెహ్వాగ్‌తో జరిగిన గొడవ గురించి "గ్లెన్ మాక్స్‌వెల్: ది షోమ్యాన్" పుస్తకంలో రాసుకొచ్చాడు. సెహ్వాగ్ అందరూ ముందు తనను అవమానించాడని మాక్స్‌వెల్ చెప్పుకొచ్చాడు.
"మ్యాచ్ ముగిశాక జరిగిన విలేకరుల సమావేశానికి వీరేంద్ర సెహ్వాగ్ హాజరు కావాలని భావించాడు. కానీ ఓటమికి బాధ్యత వహిస్తూ స్వచ్ఛందంగా నేనే ప్రెస్‌కాన్ఫరెన్స్‌కు వెళ్లాను. ఆ తర్వాత హోటల్‌కు వెళ్లేందుకు అందరం కలిసి బస్‌లో కూర్చున్నాము. ఆ సమయంలో నన్ను మా టీమ్ ప్రధాన వాట్సాప్ గ్రూప్ నుండి తొలగించినట్లు గమనించాను.
వెంటనే ఆయనకు మీరు ఒక అభిమానిని కోల్పోయారు అని మెసేజ్ చేశాను. నీలాంటి అభిమాని అవసరం లేదని ఆయన బదులిచ్చాడు. మేము హోటల్‌కు చేరుకునే సమయానికి ఆయన మెసెజ్‌లతో నా ఫోన్ నిండిపోయింది. నిజంగా అతడి ప్రవర్తన నాకు తీవ్ర నిరాశపరిచింది. కెప్టెన్‌గా ఆ మ్యాచ్‌లో నేను విఫలమైనందుకు నిందించాడు.
అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా సెహ్వాగ్‌తో మాట్లాడలేదు" అని తన బుక్‌లో మాక్సీ పేర్కొన్నాడు. ఆ తర్వాత ఓ సారి ఐపీఎల్-2020లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. మళ్లీ ఇప్పుడు ఐదేళ్ల తర్వాత పంజాబ్ జట్టుతో మాక్స్‌వెల్ చేరాడు. ఐపీఎల్-18వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment