ఫ్యూచర్ జెనరాలి.. ‘టోటల్ హెల్త్’ వైద్య బీమా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేటురంగ సాధారణ బీమా కంపెనీ... ఫ్యూచర్ జెనరాలి ‘టోటల్ హెల్త్’ పేరుతో సమగ్ర ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. వైటల్, సుప్రీం, ప్రీమియం పేర్లతో మూడు లక్షల నుంచి గరిష్టంగా కోటి రూపాయల వరకు వైద్య బీమాను ఈ సంస్థ అందిస్తోంది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఫ్యూచర్ జెనరాలి సౌత్ జోన్ హెడ్ మాధవ ఎండ్లూర్ టోటల్ హెల్త్ పాలసీని మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేశారు.
ఒక సంవత్సరం కాలపరిమితి నుంచి మూడేళ్ళ కాలపరిమితికి ఈ పాలసీని తీసుకోవచ్చని, అప్పుడే పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి బీమా రక్షణ ఉండే విధంగా దీన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు.
ఒకసారి ‘టోటల్ హెల్త్’ పాలసీ తీసుకుంటే మధ్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా జీవిత కాలం రెన్యువల్ చేయించుకోవచ్చు. క్లెయిమ్‌లు లేకపోతే మరుసటి ఏడాది నో-క్లెయిమ్ బోనస్ కింద 50 శాతం బీమా రక్షణ మొత్తాన్ని ఇలా గరిష్టంగా 100 శాతం పెంచుతామన్నారు. ప్రస్తుతం ఫ్యూచర్ జెనరాలి ప్రీమియం ఆదాయంలో 14 శాతం వైద్య బీమా రంగం నుంచి వస్తోందని, వచ్చే మూడేళ్లలో దీన్ని 20 శాతానికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గతేడాది ఫ్యూచర్ జెనరాలి మొత్తం ప్రీమియం ఆదాయం రూ. 1,450 కోట్లుగా ఉంది. ప్రస్తుతం కంపెనీ అయిదు రకాల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను కలిగి ఉంది.