సందర్భం
‘బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్– 2024’ వారి తాజా నివేదిక ప్రకారం భారత జీవిత బీమా (ఎల్‌ఐసీ) సంస్థ, బలమైన బ్రాండ్‌గా ప్రపంచంలో మొదటి స్థానం కైవసం చేసుకుంది. ఫార్చ్యూన్ ప్రపంచ సూచీ– 2023లో 107వ ర్యాంక్ పొంద డమే గాక, మొత్తం ప్రీమియం ఆదాయంలో ప్రపంచంలో 10వ అతిపెద్ద సంస్థగా నిలిచింది.
ఇప్పటికే క్లెయిమ్‌ల చెల్లింపు తదితర విషయాలలో ప్రపంచ నంబర్ 1గా ఇది ఉండటం గమనార్హం. 2024 సెప్టెంబర్ 1 నాటికి భారతీయ జీవిత బీమా సంస్థ 68 ఏళ్ళు పూర్తిచేసుకుని, 69వ ఏట అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఇటువంటి ఫలితాలు ప్రభుత్వ బీమా రంగానికి మరింత ఊతం ఇస్తాయి.
జీవిత బీమా రంగంలో పట్టాదారుల సొమ్ము, భద్రత ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో సురక్షితం కాదని, వారి సొమ్ముకు పూర్తి రక్షణ కావాలంటే జాతీయం చేయడం ఒక్కటే పరిష్కారమని అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 1951 నుంచి 1956 వరకు ఉద్య మాలు నడిచాయి. ఫలితంగా జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం 1956 జనవరి 19న జీవిత బీమా రంగాన్ని జాతీయీకరణ చేస్తూ ఆర్డినెన్సు తీసుకువచ్చింది.
అయిదు కోట్ల రూపాయల ప్రభుత్వ మూలధనంతో 1956 సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఎల్‌ఐసీ నేడు రూ. 53 లక్షల కోట్ల మేర ఆస్తులు సమకూర్చుకున్నది. ఇప్పుడు ఏడాదికి 3.5 లక్షల కోట్ల నుండి 4 లక్షల కోట్ల వరకు దేశా భివృద్ధికి పెట్టుబడులు ఇచ్చే పరిస్థితి ఈ సంస్థ పని తీరుకు అద్దం పడుతోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వనరుల సేకరణ పేరుతో ఎల్‌ఐసీలో 25 శాతం వాటాలు అమ్మి, రెవెన్యూ లోటును పూడ్చుకునే ఉద్దేశంతో ఉన్నది. దేశ అంతర్గత వనరుల సమీకరణలో ఎల్‌ఐసీ వాటా 25 శాతం పైమాటే!
ఏదైనా బీమా కంపెనీ పనితీరుకు దాని క్లెయిమ్‌ల పరిష్కార శాతమే కొలబద్ద. ఆ విషయంలో 99 శాతంతో ఎల్‌ఐసీ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రెండు కోట్ల క్లెయిమ్స్ చెల్లించి ప్రపంచంలోనే అత్యుత్తమ బీమా సంస్థగా ఘనత సాధించింది. ఎల్‌ఐసీ చట్టం, 1956లోని సెక్షన్ 37 ప్రకారం ఎల్‌ఐసీ పాలసీలకు ప్రభుత్వ గ్యారంటీ లభిస్తుంది. ఎల్‌ఐసీ జాతీయీకరణ ముందు ప్రైవేట్ బీమా కంపెనీల అక్రమాలను చూసి ప్రభుత్వం ఎల్‌ఐసీ పాలసీలకు ప్రభుత్వ గ్యారెంటీ మంజూరు చేసింది.
దీని ప్రకారం ఎల్‌ఐసీలో పాలసీదారులు దాచుకున్న మొత్తాలకు, బోన స్‌లకు కేంద్ర ప్రభుత్వం అదనంగా గ్యారంటీ ఇస్తుంది. కానీ ఇంతవరకూ ఎల్‌ఐసీ ఈ గ్యారెంటీని ఉపయోగించుకో లేదు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం ధాటికి ఏఐజీ వంటి బీమా కంపెనీలను అమెరికా ప్రభుత్వం ఆదుకోక తప్ప లేదంటే మన ఎల్‌ఐసీ ఎంత పటిష్ఠమైనదో తెలుస్తోంది.
గత 24 ఏళ్ళుగా 23 ప్రైవేటు బీమా కంపెనీల పోటీని ఎదుర్కొంటూ నేటికీ దాదాపు 70 శాతానికి పైగా మార్కెట్ షేర్‌తో మార్కెట్ లీడర్‌గా కొనసాగుతున్నది. ఎల్‌ఐసీ సంస్థలో పనిచేసే 14 లక్షల ఏజెంట్‌లలో 48 శాతం పైబడి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పొందు తున్నారు. 2024 మార్చి నాటికి మహిళా ఏజెంట్ల సంఖ్య మూడు లక్షల పైమాటే. ఈ విధంగా మహిళా ఉపాధికి సంస్థ వెన్నుదన్నుగా నిలుస్తోంది.
1960లలో పేద భారత దేశంలో తాను అందించే పాలసీలలో కేవలం బీమాపై మాత్రమే కాకుండా, సేవింగ్స్ అంశంపై కూడా ఎల్‌ఐసీ దృష్టి పెట్టింది. పిల్లల చదువులకూ, యువతుల పెళ్లిళ్లకూ అందివచ్చేలా మధ్యంతర, తుది చెల్లింపులు, బీమా రక్షణ ఉండే పాలసీలను రూపొందించింది.
గత బడ్జెట్ సెషన్‌లో అనేకమంది పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్‌లో బీమాపై జీఎస్టీ భారాన్ని తగ్గించమని అభ్యర్థించినా, జయంత్ సిన్హా నేతృత్వంలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ బీమా ప్రీమియంపై జీఎస్టీ భారం తగ్గించమని సిఫార్సు చేసినా, ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. అయితే, దేశవ్యాప్తంగా ఈ విషయంపై వస్తున్న విశేష స్పందన నేపథ్యంలో వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆర్థికమంత్రి ప్రకటించారు.
బీమా ప్రీమియ మ్‌లపై జీఎస్టీ భారాన్ని తగ్గిస్తే సంస్థ పాలసీదారులకు ఇంకా మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు అందించగలదు. ఎల్‌ఐసీని ఆర్థికంగా బలోపేతం చేస్తే, అది దేశ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చి, అంతిమంగా దేశానికీ, పాలసీ దారులకూ ఎంతో ప్రయోజనకరం అవుతుంది.
పి. సతీష్
వ్యాసకర్త ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘ నాయకులు
మొబైల్: 94417 97900
(నేడు ఎల్‌ఐసీ ఆవిర్భావ దినోత్సవం)
Comments
Please login to add a commentAdd a comment