Life insurance sector
-
దేశ ప్రగతిలో తనదైన ముద్రవేస్తూ...
‘బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్– 2024’ వారి తాజా నివేదిక ప్రకారం భారత జీవిత బీమా (ఎల్ఐసీ) సంస్థ, బలమైన బ్రాండ్‌గా ప్రపంచంలో మొదటి స్థానం కైవసం చేసుకుంది. ఫార్చ్యూన్ ప్రపంచ సూచీ– 2023లో 107వ ర్యాంక్ పొంద డమే గాక, మొత్తం ప్రీమియం ఆదాయంలో ప్రపంచంలో 10వ అతిపెద్ద సంస్థగా నిలిచింది. ఇప్పటికే క్లెయిమ్‌ల చెల్లింపు తదితర విషయాలలో ప్రపంచ నంబర్ 1గా ఇది ఉండటం గమనార్హం. 2024 సెప్టెంబర్ 1 నాటికి భారతీయ జీవిత బీమా సంస్థ 68 ఏళ్ళు పూర్తిచేసుకుని, 69వ ఏట అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఇటువంటి ఫలితాలు ప్రభుత్వ బీమా రంగానికి మరింత ఊతం ఇస్తాయి.జీవిత బీమా రంగంలో పట్టాదారుల సొమ్ము, భద్రత ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో సురక్షితం కాదని, వారి సొమ్ముకు పూర్తి రక్షణ కావాలంటే జాతీయం చేయడం ఒక్కటే పరిష్కారమని అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 1951 నుంచి 1956 వరకు ఉద్య మాలు నడిచాయి. ఫలితంగా జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం 1956 జనవరి 19న జీవిత బీమా రంగాన్ని జాతీయీకరణ చేస్తూ ఆర్డినెన్సు తీసుకువచ్చింది.అయిదు కోట్ల రూపాయల ప్రభుత్వ మూలధనంతో 1956 సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఎల్ఐసీ నేడు రూ. 53 లక్షల కోట్ల మేర ఆస్తులు సమకూర్చుకున్నది. ఇప్పుడు ఏడాదికి 3.5 లక్షల కోట్ల నుండి 4 లక్షల కోట్ల వరకు దేశా భివృద్ధికి పెట్టుబడులు ఇచ్చే పరిస్థితి ఈ సంస్థ పని తీరుకు అద్దం పడుతోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వనరుల సేకరణ పేరుతో ఎల్ఐసీలో 25 శాతం వాటాలు అమ్మి, రెవెన్యూ లోటును పూడ్చుకునే ఉద్దేశంతో ఉన్నది. దేశ అంతర్గత వనరుల సమీకరణలో ఎల్ఐసీ వాటా 25 శాతం పైమాటే! ఏదైనా బీమా కంపెనీ పనితీరుకు దాని క్లెయిమ్‌ల పరిష్కార శాతమే కొలబద్ద. ఆ విషయంలో 99 శాతంతో ఎల్ఐసీ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రెండు కోట్ల క్లెయిమ్స్ చెల్లించి ప్రపంచంలోనే అత్యుత్తమ బీమా సంస్థగా ఘనత సాధించింది. ఎల్ఐసీ చట్టం, 1956లోని సెక్షన్ 37 ప్రకారం ఎల్ఐసీ పాలసీలకు ప్రభుత్వ గ్యారంటీ లభిస్తుంది. ఎల్ఐసీ జాతీయీకరణ ముందు ప్రైవేట్ బీమా కంపెనీల అక్రమాలను చూసి ప్రభుత్వం ఎల్ఐసీ పాలసీలకు ప్రభుత్వ గ్యారెంటీ మంజూరు చేసింది. దీని ప్రకారం ఎల్ఐసీలో పాలసీదారులు దాచుకున్న మొత్తాలకు, బోన స్‌లకు కేంద్ర ప్రభుత్వం అదనంగా గ్యారంటీ ఇస్తుంది. కానీ ఇంతవరకూ ఎల్ఐసీ ఈ గ్యారెంటీని ఉపయోగించుకో లేదు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం ధాటికి ఏఐజీ వంటి బీమా కంపెనీలను అమెరికా ప్రభుత్వం ఆదుకోక తప్ప లేదంటే మన ఎల్ఐసీ ఎంత పటిష్ఠమైనదో తెలుస్తోంది. గత 24 ఏళ్ళుగా 23 ప్రైవేటు బీమా కంపెనీల పోటీని ఎదుర్కొంటూ నేటికీ దాదాపు 70 శాతానికి పైగా మార్కెట్ షేర్‌తో మార్కెట్ లీడర్‌గా కొనసాగుతున్నది. ఎల్ఐసీ సంస్థలో పనిచేసే 14 లక్షల ఏజెంట్లలో 48 శాతం పైబడి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పొందు తున్నారు. 2024 మార్చి నాటికి మహిళా ఏజెంట్ల సంఖ్య మూడు లక్షల పైమాటే. ఈ విధంగా మహిళా ఉపాధికి సంస్థ వెన్నుదన్నుగా నిలుస్తోంది. 1960లలో పేద భారత దేశంలో తాను అందించే పాలసీలలో కేవలం బీమాపై మాత్రమే కాకుండా, సేవింగ్స్ అంశంపై కూడా ఎల్ఐసీ దృష్టి పెట్టింది. పిల్లల చదువులకూ, యువతుల పెళ్లిళ్లకూ అందివచ్చేలా మధ్యంతర, తుది చెల్లింపులు, బీమా రక్షణ ఉండే పాలసీలను రూపొందించింది. గత బడ్జెట్ సెషన్లో అనేకమంది పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో బీమాపై జీఎస్టీ భారాన్ని తగ్గించమని అభ్యర్థించినా, జయంత్ సిన్హా నేతృత్వంలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ బీమా ప్రీమియంపై జీఎస్టీ భారం తగ్గించమని సిఫార్సు చేసినా, ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. అయితే, దేశవ్యాప్తంగా ఈ విషయంపై వస్తున్న విశేష స్పందన నేపథ్యంలో వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆర్థికమంత్రి ప్రకటించారు. బీమా ప్రీమియ మ్‌లపై జీఎస్టీ భారాన్ని తగ్గిస్తే సంస్థ పాలసీదారులకు ఇంకా మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు అందించగలదు. ఎల్ఐసీని ఆర్థికంగా బలోపేతం చేస్తే, అది దేశ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చి, అంతిమంగా దేశానికీ, పాలసీ దారులకూ ఎంతో ప్రయోజనకరం అవుతుంది. పి. సతీష్ వ్యాసకర్త ఎల్ఐసీ ఉద్యోగుల సంఘ నాయకులుమొబైల్: 94417 97900 (నేడు ఎల్ఐసీ ఆవిర్భావ దినోత్సవం) -
ఆక్సా వాటా భారతీ గ్రూప్ చేతికి
న్యూఢిల్లీ: జీవిత బీమా రంగ భాగస్వామ్య సంస్థలో ఏఎక్స్ఏ(ఆక్సా) వాటాను కొనుగోలు చేయనున్నట్లు భారతీ గ్రూప్ తాజాగా పేర్కొంది. వెరసి భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఆక్సాకుగల 49 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఈ లావాదేవీ తదుపరి జీవిత బీమా జేవీకి హోల్డింగ్ కంపెనీగా భారతీ లైఫ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్(బీఎల్వీపీఎల్) నిలవనున్నట్లు తెలియజేసింది. 100 శాతం వాటాను పొందడం ద్వారా భారతీ గ్రూప్ ఈ ఫీట్‌ను సాధించనుంది. ప్రస్తుతం జేవీలో ఆక్సాకు 49 శాతం వాటా ఉంది. తగిన అనుమతులు పొందాక లావాదేవీ డిసెంబర్‌కల్లా పూర్తికానున్నట్లు భారతీ అంచనా వేసింది. 2006లో ఆక్సా, భారతీ గ్రూప్ సంయుక్తంగా భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్, భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్‌లను ఏర్పాటు చేశాయి. తదుపరి 2020లో ఐసీఐసీఐ లాంబార్డ్‌కు జనరల్ ఇన్సూరెన్స్‌ను విక్రయించాయి. -
జీవిత బీమా రంగంలో తొలి స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్ ఇదే..
ముంబై: మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తాజాగా యులిప్స్ విభాగంలో నిఫ్టీ స్మాల్‌క్యాప్ క్వాలిటీ ఇండెక్స్ ఫండ్‌ను ఆవిష్కరించింది. జీవిత బీమా రంగంలో ఇదే తొలి స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్ అని సంస్థ సీనియర్ డైరెక్టర్ మిహిర్ వోరా తెలిపారు. పదేళ్ల వ్యవధిలో 22 శాతం రాబడి అందించిన నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 క్వాలిటీ 50 సూచీ దీనికి ప్రామాణికంగా ఉంటుందని వివరించారు. యూనిట్‌కు రూ. 10 చొప్పున ఈ న్యూ ఫండ్ ఆఫర్ ఆగస్టు 25 వరకు అందుబాటులో ఉంటుంది. అధిక రిస్కు సామరŠాధ్యలు కలిగి ఉండి, దీర్ఘకాలికంగా మెరుగైన రాబడులు కోరుకునే ఇన్వెస్టర్లకు ఇది అనువైనదిగా ఉంటుందని వోరా వివరించారు. -
బీమా రంగం పెట్టుబడులకు అనుకూలమేనా?
డిజిటల్‌గా పంపిణీ పద్దతులు, బలమైన రిస్క్ నిర్వహణ విధానాలతో జీవిత బీమా పరిశ్రమ క్లిష్ట సమయాల్లోనూ వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం కష్టించి పనిచేస్తోంది. గడిచిన ఏడాది కాలంలో పరిశ్రమలో సర్దుబాటు చోటుచేసుకుంది. డిజిటల్, ఈ కామర్స్ నమూనాలు ఇటీవలి కాలంలో బీమా పరిశ్రమకు ఫలితాలనిస్తున్నాయి. జీవితంలోని కీలక దశల్లో ప్రజలకు విశ్వసనీయమైన భాగస్వామిగా లైఫ్ ఇన్సూరెన్స్ కొనసాగుతోంది. డిజిటల్ వైపు కరోనా సంక్షోభం ఎన్నో మార్పులకు బీజం వేసింది. భౌతికపరమైన సంప్రదింపులకు బ్రేక్ పడడంతో కస్టమర్లు పెద్ద ఎత్తున డిజిటల్ వేదికలకు మళ్లారు. దీంతో బీమా సంస్థలు డిజిటల్ విధానాలను అందిపుచ్చుకోవడం తప్పనిసరి అయింది. టెక్నాలజీ సదుపాయాల బలోపేతానికి బీమా పరిశ్రమ గడిచిన ఏడాది కాలంలో పెట్టుబడులు కూడా పెట్టింది. దీంతో ముఖ్యమైన వ్యాపార కార్యకలాపాలను నిర్వహించే వెసులుబాటు లభించింది. కస్టమర్లు బీమా పాలసీల కొనుగోలుకు సంబంధించి వారికి మెరుగైన సేవలు అందించడం సాధ్యపడింది. మారకపోయి ఉంటే 2020–21 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో నూతన పాలసీల ప్రీమియం (న్యూ బిజినెస్ ప్రీమియం) గణనీయంగా పడిపోయింది. ఎందుకంటే జీవిత బీమా సంస్థలు, పంపిణీదారులు ఈ తరహా పరిస్థితులకు సన్నద్ధంగా లేరు. దీంతో పంపిణీదారులు డిజిటల్‌గా మారిపోయేందుకు అవసరమైన సాయాన్ని బీమా సంస్థలు అందించాయి. కస్టమర్లతో సంప్రదింపులు మెరుగ్గా ఉండేందుకు డేటా అనలైటిక్స్‌ను వినియోగించడం ద్వారా.. ఈ సవాళ్లను బీమా కంపెనీలు, పంపిణీదారులు సమర్థవంతంగా అధిగమించాయి. డిజిటల్‌కు మారకపోతే పరిశ్రమ 2020–21 తొలినాళ్లలో మాదిరే స్తంభించిపోయే పరిస్థితి అనడంలో సందేహం లేదు. సమస్యలు కూడా డిజిటల్‌గా మారిపోవడం వల్ల ప్రయోజనాలున్నా కానీ, సమస్యలు కూడా ఉన్నాయి. టెక్నాలజీ పరంగా మోసాల రిస్క్ కూడా పెరిగింది. చెల్లింపుల నెట్‌వర్క్‌ల దుర్వినియోగానికి అవకాశం ఉండడం, ఇప్పటికే సమాచార తస్కరణ ఘటనలు నమోదవుతుండడం వంటి వాటి రూపంలో పరిశ్రమకు నూతన సవాళ్లు ఏర్పడ్డాయి. అనుమానాస్పద వ్యక్తుల నుంచి అసలైన వినియోగదారులను వేరు చేయాల్సిన అవసరం ఏర్పడింది. వ్యక్తిగత సంప్రదింపులకు అవకాశం లేకపోవడంతో కస్టమర్లకు సంబంధించి రిస్క్‌ను పూర్తిస్థాయిలో అంచనా వేయడం పరిశ్రమకు కఠినమైన సవాలే. డేటా అనలటిక్స్ రిస్క్‌ను ఎదుర్కొనేలా, మోసాలకు చెక్ పెట్టేలా బలమైన సదుపాయాల ఏర్పాటు పరిశ్రమకు కీలకంగా మారింది. మోసాలను గుర్తించడంలో డేటా అనలైటిక్స్ ఎంతో సాయపడుతోంది. విశ్వసనీయమైన సమాచారం లోపించిన నేపథ్యంలో బీమా పరిశ్రమ క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రజలకు టీకాలు ఇస్తుండడంతో భవిష్యత్తు ఆరోగ్యం గురించి మెరుగ్గా అర్థం చేసుకునేందుకు పరిశ్రమ ప్రయత్నిస్తోంది. ప్రజలకు బీమాను మరింత చేరువ చేయడం పరిశ్రమ ముందున్న ప్రాధాన్య అంశం. విస్తరణకు అవకాశం మొత్తంగా రిస్క్‌లను ఎదుర్కొనేందుకు వీలుగా ఆర్థిక రక్షణ అవసరాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో జీవిత బీమా (లైఫ్ ఇన్సూరెన్స్) ప్రాధాన్యాన్ని అర్థం చేసుకుంటున్నారు. పెరిగిన డిమాండ్‌ను తీర్చే విధంగా పరిశ్రమ సైతం సన్నద్ధమవుతోంది. జీడీపీలో 3.76 శాతం వాటాను కలిగిన బీమా పరిశ్రమ విస్తరణ పరంగా చూస్తే ఎంతో వెనుకనే ఉంది. కనుక విస్తరించేందుకు భారీ అవకాశాలున్నాయి. ఎడెల్వీజ్ టోకియో లైఫ్ ఎండీ, సీఈవో -
Policybazaar: నిబంధనల ఉల్లంఘన.. 25 లక్షలు ఫైన్
న్యూఢిల్లీ: ఆన్లైన్లో బీమా పాలసీ సేవలను అందించే (పాలసీ అగ్రిగేటర్) పాలసీ జజార్‌కు బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) రూ.24 లక్షల జరిమానా విధించింది. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం పెరుగుతుందంటూ కస్టమర్లకు గతేడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 7 మధ్య ఎస్ఎంఎస్లు పంపడం ద్వారా ప్రకటనల నిబంధనలను పాలసీబజార్ ఉల్లంఘించినట్టు ఐఆర్డీఏఐ గుర్తించింది. 2020 ఏప్రిల్ 1 నుంచి టర్మ్ పాలసీల ప్రీమియం పెరుగుతోందని, ఆ లోపే పాలసీ తీసుకోవడం ద్వారా ప్రీమియంను ఆదా చేసుకోవచ్చంటూ సుమారు 10 లక్షల మంది కస్టమర్లకు పాలసీబజార్ నుంచి సందేశాలు వెళ్లినట్టు ఐఆర్డీఏఐ తెలిపింది. ప్రీమియం ధరలు పెరుగుతున్నాయంటూ తప్పుదోవ పట్టించడంతోపాటు, నిబం ధన 11, 9లను ఉల్లంఘించినందుకు జరిమానా విధిస్తున్నట్టు పేర్కొంది. అయితే, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా ఏఐఏ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల నుంచి ప్రీమియం పెరుగుదలపై తమకు సమాచారం అందిందని ఐఆర్డీఏఐ ఇచ్చిన నోటీసులకు స్పందనగా పాలసీ బజార్ తెలియజేయడం గమనార్హం. కస్టమర్లకు తాజా సమాచారం తెలియజేయడమే కానీ, తప్పుదోవ పట్టించడం తమ ఉద్దేశ్యం కాదని వివరణ ఇచ్చింది. చదవండి: వ్యక్తిగత హామీదార్లూ బాధ్యులే..! -
టర్మ్ ప్లాన్లకు డిమాండ్ జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా వైరస్ మహమ్మారి, లాక్డౌన్ అంశాలు జీవిత బీమా రంగంపైనా ప్రతికూల ప్రభావాలు చూపించాయి. అయితే, దీని వల్ల ఆర్ధిక భద్రతపై అవగాహన పెరిగిందని, టర్మ్ ప్లాన్లకు డిమాండ్ పెరుగుతోందని చెబుతున్నారు ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ రాహుల్ అగర్వాల్. పాలసీదారులకు మరింత మెరుగైన సర్వీసులు అందించేందుకు డిజిటల్ మాధ్యమాన్ని మెరుగుపర్చుకుంటున్నామని సాక్షి బిజినెస్ బ్యూరోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ వివరాలు.. మీ వ్యాపారంపై కరోనా వైరస్ ప్రభావమేంటి? కరోనా వైరస్ మహమ్మారి, దాని కట్టడికి విధించిన లాక్డౌన్లతో ఇతర రంగాల్లాగానే జీవిత బీమా రంగంపైనా ప్రతికూల ప్రభావం పడింది. మార్చి, ఏప్రిల్‌లో కస్టమర్లతో సంప్రదింపులు లేకపోవడం లేదా పాలసీలు తీసుకుందామనుకున్న వారు కూడా వాయిదా వేసుకోవడమో జరిగింది. మేం ప్రధానంగా కరోనా సమయంలో ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిచ్చాం. సరిగ్గా లాక్‌డౌన్‌కు ముందు ప్రవేశపెట్టిన వర్చువల్, యాప్ ఆధారిత శిక్షణా కార్యక్రమాలు మా సేల్స్ సిబ్బందికి ఉపయోగపడ్డాయి. దీనితో పరిస్థితులు కొంత మెరుగుపడ్డాక అత్యంత వేగంగా మా కార్యకలాపాలు సాధారణ స్థాయికి రాగలిగాయి. తొలి త్రైమాసికంలో మా ఏజెన్సీ శాఖల్లో 99 శాతం శాఖలు తెరిచే ఉన్నాయి. బ్రాంచీ ఉత్పాదకతలో కూడా మెరుగుదల కనిపించింది. మీ వృద్ధి ప్రణాళికలపై ఎలాంటి ప్రభావం పడింది? పరిశ్రమకు రెట్టింపు స్థాయిలో వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కరోనా వైరస్, లాక్డౌన్ అంశాల కారణంగా మా అంచనాలు మార్చుకోవాల్సి వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎకాయెకిన భారీ వృద్ధిని ఆశించడం లేదు. అయితే, కరోనా నేపథ్యంలో ఆర్థిక భద్రతపై అవగాహన పెరిగింది. జీవిత బీమా ప్లాన్లకు.. ముఖ్యంగా టర్మ్ ప్లాన్లకు డిమాండ్ పెరిగింది. ఈ కష్టకాలంలో హామీతో కూడిన రాబడులను కస్టమర్లు కోరుకుంటున్నారు. కాబట్టి మా సాంప్రదాయ ప్లాన్లపై మరింతగా దృష్టి పెడుతున్నాం. డిజిటల్ సర్వీసులు మెరుగుపర్చుకునే ప్రక్రియ కొనసాగిస్తాం. కోవిడ్–19 సంబంధ క్లెయిమ్స్ ఏమైనా వచ్చాయా? జూలై మధ్య నాటి దాకా రెండు క్లెయిమ్స్ వచ్చాయి. అవసరమైన పత్రాలన్నీ అందిన వెంటనే సెటిల్ కూడా చేశాం. పాలసీదారులకు తోడ్పాటుగా ఉండేందుకు మా వెబ్సైట్లో ప్రత్యేకంగా కోవిడ్–19 సెక్షన్ కూడా ఏర్పాటు చేశాం. ఆయా క్లెయిమ్స్‌కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇందులో పొందుపర్చాం. కొత్త పాలసీలేవైనా ప్రవేశపెడుతున్నారా? సవరించిన ప్రీమియంలకు అనుగుణంగా రెండు టర్మ్ ప్లాన్ల కోసం బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ)కి దరఖాస్తు చేసుకున్నాం. స్మార్ట్ టర్మ్ ప్లాన్, స్మార్ట్ టర్మ్ ప్లస్ ప్లాన్ వీటిలో ఉన్నాయి. ఐఆర్డీఏఐ తుది అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం. బీమా తీసుకునేవారి సంఖ్య తక్కువగానే ఉన్న తరుణంలో ప్రీమియంల పెంపు వల్ల ప్రతికూల పరిస్థితులు ఎదురైతే పరిశ్రమ ఎలా వ్యవహరించబోతోంది? టర్మ్ ప్లాన్ల ప్రీమియంలలో పెంపు చాలా స్వల్పమే. ఆర్థిక ప్రణాళిలకలపై క్రమంగా అవగాహన పెరుగుతోంది. కరోనా పరిణామాలతో ఇది వేగవంతమైంది. గతానికి భిన్నంగా జీవిత బీమాను తప్పనిసరైన సాధనంగా కస్టమర్లు పరిగణిస్తున్నారు. కనిపిస్తున్న ట్రెండ్స్‌ను బట్టి చూస్తే టర్మ్ పాలసీల విభాగం ఈ ఏడాది మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రస్తుత వ్యాపార పరిమాణమెంత? ప్రస్తుతం 15 లక్షల పైచిలుకు కస్టమర్లు, 44,000 పైచిలుకు అడ్వైజర్లు (మార్చి 31 నాటికి) ఉన్నారు. వీరితో పాటు బిజినెస్ పార్ట్నర్స్ మొదలైన వారు ఉన్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 98.15 శాతం క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి నమోదు చేశాం. గడిచిన ఎనిమిదేళ్లుగా లాభసాటిగానే ఉంటున్నాం. ప్రస్తుతం రూ. 15,795 కోట్ల ఆస్తులు నిర్వహణలో (ఏయూఎం) ఉన్నాయి. కస్టమర్ల పెట్టుబడులకు భద్రతనిచ్చేలా డెట్ పోర్ట్‌ఫోలియోలోని 99 శాతం సాధనాలకు సార్వభౌమ లేదా ట్రిపుల్ ఏ రేటింగ్ ఉన్నాయి. కొత్తగా నియామకాల విషయానికొస్తే.. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల కారణంగా కాస్త నెమ్మదిగానే అయినా దేశవ్యాప్తంగా అడ్వైజర్లను నియమించుకుంటున్నాం. కొత్త ప్రాంతాలకు విస్తరించే క్రమంలో రిలేషన్షిప్ మేనేజర్లు, సూపర్వైజర్ స్థాయి సిబ్బందిని రిక్రూట్ చేసుకుంటున్నాం. -
యులిప్ అమ్మకాలు పెరుగుతున్నాయ్
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఎండీ, సీఈవో అమితాబ్ చౌదరి - నాలుగు వారాల్లో స్టాండర్డ్ లైఫ్ వాటా 49%కి - వచ్చే ఏడాది మార్కెట్లో లిస్టయ్యే అవకాశం - పరిశ్రమ సగటు కంటే అధిక వృద్ధిరేటు నమోదు - ఈ ఏడాది 17వేల ఏజెంట్ల నియామకాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : గత కొంత కాలంగా సంస్కరణలు, ఆర్థిక వృద్ధిరేటు నెమ్మదించడంతో కష్టాలను ఎదుర్కొన్న జీవిత బీమా రంగం క్రమేపీ గాడిలో పడుతోందని ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ హెచ్డీఎఫ్సీ లైఫ్ పేర్కొంది. ఈ ఏడాది పరిశ్రమ రెండంకెల వృద్ధిరేటు నమోదు చేయడంతో పాటు, మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి యులిప్ అమ్మకాలు పెరిగాయంటున్న హెచ్డీఎఫ్సీ లైఫ్ మేనేజింగ్ డెరైక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ చౌదరితో ఇంటర్వ్యూ... ఈ ఏడాది జీవిత బీమా పరిశ్రమ వృద్ధి ఏవిధంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు? హెచ్డీఎఫ్సీ లైఫ్ వృద్ధిరేటు ఏ విధంగా ఉండొచ్చు? ఈ ఏడాది జీవిత బీమా వ్యాపారంలో ఆశావాహకమైన పరిస్థితులు కనపడుతున్నాయి. పాలసీ నిబంధనలు, అమ్మకాల్లో జరిగిన మార్పుల్లో ఒక స్పష్టత వచ్చింది. ఈ ఏడాది ఇప్పటి వరకు జీవిత బీమా వ్యాపారంలో 8-10 శాతం వృద్ధి నమోదయ్యింది. ఏడాది మొత్తం మీద ఇంతకంటే ఎక్కువ వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నాం. ఇక మా విషయానికి వస్తే గత ఐదేళ్లు మాదిరిగానే ఈ సారి కూడా పరిశ్రమ సగటు కంటే ఎక్కువ వృద్ధిరేటును నమోదు చేస్తాం. స్టాక్ సూచీలు రికార్డు స్థాయికి చేరిన తర్వాత యులిప్ అమ్మకాలు ఏమైనా పెరిగాయా? మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యులిప్ (యూనిట్ లింక్డ్ పాలసీలు) అమ్మకాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం మా అమ్మకాల్లో యులిప్స్ వాటా 60 శాతం దాటింది. మొత్తం పాలసీ అమ్మకాల్లో యులిప్ వాటా 50 నుంచి 60 శాతం లోపు ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం. కేంద్రం ప్రవేశపెట్టిన బీమా పథకాల వల్ల టర్మ్ ఇన్సూరెన్స్ వ్యాపారంపై ఏమైనా ప్రతికూల ప్రభావం కనిపించే అవకాశం ఉందా? కేంద్రం ప్రవేశపెట్టిన బీమా పథకాలు అద్భుతమైన విజయం సాధించాయి. వీటి వల్ల బీమా కంపెనీల వ్యాపారం దెబ్బతింటోందన్న వాదనతో నేను ఏకీభవించటం లేదు. వీటి వల్ల ప్రజల్లో బీమాపై మరింత అవగాహన పెరిగింది. మారిన కాలపరిస్థితుల్లో ప్రభుత్వం కల్పిస్తున్న రెండు లక్షల బీమా సరిపోదు. అందుకోసం ప్రజలు అదనపు బీమా రక్షణ కోసం బీమా కంపెనీలను ఆశ్రయిస్తారు. ఈ విధంగా బీమా వ్యాపారం మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాం. వ్యాపార విస్తరణకు సంబంధించి ఏమైనా మూలధనం సేకరించే అవకాశం ఉందా? హెచ్డీఎఫ్సీ లైఫ్ స్టాక్ మార్కెట్లో ఎప్పుడు లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది? మా వాటాదారుల నుంచి వ్యాపార విస్తరణ కోసం గత నాలుగేళ్లుగా ఎటువంటి మూలధనాన్ని తీసుకోలేదు. ఇప్పుడు కూడా ఎటువంటి మూలధనం అవసరం లేదు. ఇక ఐపీవో విషయానికి వస్తే ప్రమోటర్ల మాటను బట్టి ఈ ఏడాది స్టాక్ మార్కెట్లో నమోదయ్యే అవకాశాలు కనిపించడం లేదు. నాలుగు వారాల్లో స్టాండర్డ్ లైఫ్ తన వాటాను 26 శాతం నుంచి 49 శాతానికి పెంచుకోనుంది. ఈ వాటా పెంచుకోవడం తర్వాతనే ఐపీవో ఉండొచ్చు. వచ్చే ఏడాది స్టాక్ మార్కెట్లో నమోదైనా కొత్తగా మూలధనం సేకరించాలని లేదు. వాటాదారులు తమ వాటాలను విక్రయించుకోవచ్చు. వ్యాపార విస్తరణ, ఏజెంట్ల నియామకాల గురించి వివరిస్తారా? ఆర్థిక పథకాల విషయంలో ఆన్లైన్లో పాలసీలు అందుబాటులో ఉన్నా చాలా మంది పాలసీలను తీసుకోవడానికి ఏజెంట్లనే ఆశ్రయిస్తున్నారు. అందుకే ఏజెంట్ల నియామకంపై దృష్టిసారిస్తున్నాం. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీలో 70,000 ఏజెంట్లు ఉంటే ఈ ఏడాది అదనంగా 15 నుంచి 17 వేల మంది ఏజెంట్లను నియమించుకోవాలని నిర్ణయించుకున్నాం. కొత్తగా ప్రవేశపెట్టిన సీఎస్సీ బీమా పథకం ప్రయోజనం ఏమిటి? మరిన్ని పథకాలు ప్రవేశపెట్టే ఆలోచన ఉందా? అల్పాదాయ వర్గాలను దృష్టిలో పెట్టుకొని తక్కువ ప్రీమియంతో కూడిన టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ‘సీఎస్సీ సురక్ష’ను ప్రారంభించాం. ఈ-సేవ కేంద్రాల ద్వారా కేవలం రెండు నిమిషాల్లో జారీ చేసే విధంగా దీన్ని రూపొందించాం. ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకం విజయవంతమయితే మరిన్ని పథకాలను ప్రవేశపెడతాం. -
వచ్చే ఏడాది కొత్త కార్పొరేట్ ఏజెంట్ నిబంధనలు
సహారా లైఫ్ పటిష్టంగానే ఉంది - ఈ ఏడాది జీవిత బీమా వ్యాపారంలో వృద్ధి - ఐఆర్డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్ - హెచ్డీఎఫ్సీ లైఫ్ సీఎస్సీ సురక్షా పథకం షురూ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవిత బీమా రంగంలో కార్పొరేట్ ఏజెంట్ల కొత్త నిబంధనలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నట్లు బీమా అభివృద్ధి నియంత్రణ మండలి (ఐఆర్డీఏ) ప్రకటించింది. దీనికి సంబంధించి వచ్చే మూడు వారాల్లోగా గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నట్లు ఐఆర్డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్ తెలిపారు. ఒక కార్పొరేట్ ఏజెంట్ గరిష్టంగా మూడు కంపెనీల పాలసీలను విక్రయించే విధంగా ఈ నిబంధనలను రూపొందించామని, దీనికి అనుగుణంగా కంపెనీలు ఏజెంట్లను మార్చుకోవడానికి తగినంత సమయం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఒక కార్పొరేట్ ఏజెంట్ ఒక కంపెనీ పాలసీ మాత్రమే విక్రయించాల్సి ఉంది. గురువారం హైదరాబాద్‌లో హెచ్డీఎఫ్సీ లైఫ్ కామన్ సర్వీస్ సెంటర్స్ ( మీ సేవా కేంద్రాలు) ద్వారా విక్రయించే పాలసీ ‘సీఎస్సీ సురక్ష’ను విజయన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది జీవిత బీమా వ్యాపారంలో 15 శాతం వృద్ధి నమోదవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బీమా కంపెనీలు ఐపీవోల ద్వారా నిధులు సమీకరించడానికి నిబంధనలు జారీ చేసినా ఇప్పటి వరకు ఒక కంపెనీ కూడా ఇందుకోసం దాఖలు చేసుకోలేదని చెప్పారు. సహారా లైఫ్ ఆర్థికంగా పటిష్టంగానే ఉందని, దీనిపై ఎటువంటి ఫిర్యాదులు రాలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ మధ్యనే సహారా మ్యూచువల్ ఫండ్‌ను సెబీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. డిమ్యాట్ రూపంలో బీమా పాలసీలను అందించే రిపాజిటరీ సేవలకు స్పందన అంతంత మాత్రంగానే ఉందని, ఇప్పటి వరకు కేవలం 3 లక్షలు పాలసీలు మాత్రమే రిపాజిటరీ రూపంలో ఉన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీమా పథకాలకు మంచి స్పందన వచ్చిందని, ఇప్పటి వరకు 11 కోట్లకు పైగా మంది ఈ పథకాల్లో సభ్యులుగా చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆంధ్ర, తెలంగాణ హెడ్ రామకృష్ణ హెగ్డే, తెలంగాణ రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.