టర్మ్‌ ప్లాన్లకు డిమాండ్‌ జోరు | Sakshi Interview with exide life insurance Chief Distribution Officer Rahul Agarwal | Sakshi
Sakshi News home page

టర్మ్‌ ప్లాన్లకు డిమాండ్‌ జోరు

Published Tue, Aug 11 2020 12:09 AM | Last Updated on Tue, Aug 11 2020 1:07 AM

Sakshi Interview with exide life insurance Chief Distribution Officer Rahul Agarwal

ఎక్సైడ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్ ‌ రాహుల్‌ అగర్వాల్

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కరోనా వైరస్‌ మహమ్మారి, లాక్‌డౌన్‌ అంశాలు జీవిత బీమా రంగంపైనా ప్రతికూల ప్రభావాలు చూపించాయి. అయితే, దీని వల్ల ఆర్ధిక భద్రతపై అవగాహన పెరిగిందని, టర్మ్‌ ప్లాన్లకు డిమాండ్‌ పెరుగుతోందని చెబుతున్నారు ఎక్సైడ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌ రాహుల్‌ అగర్వాల్‌. పాలసీదారులకు మరింత మెరుగైన సర్వీసులు అందించేందుకు డిజిటల్‌ మాధ్యమాన్ని మెరుగుపర్చుకుంటున్నామని సాక్షి బిజినెస్‌ బ్యూరోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ వివరాలు..

మీ వ్యాపారంపై కరోనా వైరస్‌ ప్రభావమేంటి?
కరోనా వైరస్‌ మహమ్మారి, దాని కట్టడికి విధించిన లాక్‌డౌన్‌లతో ఇతర రంగాల్లాగానే జీవిత బీమా రంగంపైనా ప్రతికూల ప్రభావం పడింది. మార్చి, ఏప్రిల్‌లో కస్టమర్లతో సంప్రదింపులు లేకపోవడం లేదా పాలసీలు తీసుకుందామనుకున్న వారు కూడా వాయిదా వేసుకోవడమో జరిగింది. మేం ప్రధానంగా కరోనా సమయంలో ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిచ్చాం. సరిగ్గా లాక్‌డౌన్‌కు ముందు ప్రవేశపెట్టిన వర్చువల్, యాప్‌ ఆధారిత శిక్షణా కార్యక్రమాలు మా సేల్స్‌ సిబ్బందికి ఉపయోగపడ్డాయి. దీనితో పరిస్థితులు కొంత మెరుగుపడ్డాక అత్యంత వేగంగా మా కార్యకలాపాలు సాధారణ స్థాయికి రాగలిగాయి. తొలి త్రైమాసికంలో మా ఏజెన్సీ శాఖల్లో 99 శాతం శాఖలు తెరిచే ఉన్నాయి. బ్రాంచీ ఉత్పాదకతలో కూడా మెరుగుదల కనిపించింది.  

మీ వృద్ధి ప్రణాళికలపై ఎలాంటి ప్రభావం పడింది?
పరిశ్రమకు రెట్టింపు స్థాయిలో వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కరోనా వైరస్, లాక్‌డౌన్‌ అంశాల కారణంగా మా అంచనాలు మార్చుకోవాల్సి వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎకాయెకిన భారీ వృద్ధిని ఆశించడం లేదు. అయితే, కరోనా నేపథ్యంలో ఆర్థిక భద్రతపై అవగాహన పెరిగింది. జీవిత బీమా ప్లాన్లకు.. ముఖ్యంగా టర్మ్‌ ప్లాన్లకు డిమాండ్‌ పెరిగింది. ఈ కష్టకాలంలో హామీతో కూడిన రాబడులను కస్టమర్లు కోరుకుంటున్నారు. కాబట్టి మా సాంప్రదాయ ప్లాన్లపై మరింతగా దృష్టి పెడుతున్నాం. డిజిటల్‌ సర్వీసులు మెరుగుపర్చుకునే ప్రక్రియ కొనసాగిస్తాం.   

కోవిడ్‌–19 సంబంధ క్లెయిమ్స్‌ ఏమైనా వచ్చాయా?
జూలై మధ్య నాటి దాకా రెండు క్లెయిమ్స్‌ వచ్చాయి. అవసరమైన పత్రాలన్నీ అందిన వెంటనే సెటిల్‌ కూడా చేశాం. పాలసీదారులకు తోడ్పాటుగా ఉండేందుకు మా వెబ్‌సైట్లో ప్రత్యేకంగా కోవిడ్‌–19 సెక్షన్‌ కూడా ఏర్పాటు చేశాం. ఆయా క్లెయిమ్స్‌కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇందులో పొందుపర్చాం.

కొత్త పాలసీలేవైనా ప్రవేశపెడుతున్నారా?
సవరించిన ప్రీమియంలకు అనుగుణంగా రెండు టర్మ్‌ ప్లాన్ల కోసం బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ)కి దరఖాస్తు చేసుకున్నాం. స్మార్ట్‌ టర్మ్‌ ప్లాన్, స్మార్ట్‌ టర్మ్‌ ప్లస్‌ ప్లాన్‌ వీటిలో ఉన్నాయి. ఐఆర్‌డీఏఐ తుది అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం.  

బీమా తీసుకునేవారి సంఖ్య తక్కువగానే ఉన్న తరుణంలో ప్రీమియంల పెంపు వల్ల ప్రతికూల పరిస్థితులు ఎదురైతే పరిశ్రమ ఎలా వ్యవహరించబోతోంది?
టర్మ్‌ ప్లాన్ల ప్రీమియంలలో పెంపు చాలా స్వల్పమే. ఆర్థిక ప్రణాళిలకలపై క్రమంగా అవగాహన పెరుగుతోంది. కరోనా  పరిణామాలతో ఇది వేగవంతమైంది. గతానికి భిన్నంగా జీవిత బీమాను తప్పనిసరైన సాధనంగా కస్టమర్లు పరిగణిస్తున్నారు. కనిపిస్తున్న ట్రెండ్స్‌ను బట్టి చూస్తే టర్మ్‌ పాలసీల విభాగం ఈ ఏడాది మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.  

మీ ప్రస్తుత వ్యాపార పరిమాణమెంత?
ప్రస్తుతం 15 లక్షల పైచిలుకు కస్టమర్లు, 44,000 పైచిలుకు అడ్వైజర్లు (మార్చి 31 నాటికి) ఉన్నారు. వీరితో పాటు బిజినెస్‌ పార్ట్‌నర్స్‌ మొదలైన వారు ఉన్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 98.15 శాతం క్లెయిమ్‌ సెటిల్మెంట్‌ నిష్పత్తి నమోదు చేశాం. గడిచిన ఎనిమిదేళ్లుగా లాభసాటిగానే ఉంటున్నాం. ప్రస్తుతం రూ. 15,795 కోట్ల ఆస్తులు నిర్వహణలో (ఏయూఎం) ఉన్నాయి. కస్టమర్ల పెట్టుబడులకు భద్రతనిచ్చేలా డెట్‌ పోర్ట్‌ఫోలియోలోని 99 శాతం సాధనాలకు సార్వభౌమ లేదా ట్రిపుల్‌ ఏ రేటింగ్‌ ఉన్నాయి. కొత్తగా నియామకాల విషయానికొస్తే.. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల కారణంగా కాస్త నెమ్మదిగానే అయినా దేశవ్యాప్తంగా అడ్వైజర్లను నియమించుకుంటున్నాం. కొత్త ప్రాంతాలకు విస్తరించే క్రమంలో రిలేషన్‌షిప్‌ మేనేజర్లు, సూపర్‌వైజర్‌ స్థాయి సిబ్బందిని రిక్రూట్‌ చేసుకుంటున్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement