Dr Hari Kishan Gonuguntla Interview on Exact Status of Corona Cases in Telangana - Sakshi
Sakshi News home page

కరోనా డేంజర్‌ బెల్స్‌.. ముందుంది అసలు కథ!

Published Tue, Mar 30 2021 5:23 AM | Last Updated on Tue, Mar 30 2021 2:00 PM

Corona: Sakshi Interview With Pulmonologist Dr Harikishan Gonuguntla

సాక్షి,హైదరాబాద్‌: ప్రస్తుతం కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ దేశాన్ని వణికిస్తోంది. కరోనా కేసుల పెరుగుదలతో ‘డేంజర్‌ బెల్స్‌’మోగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ క్రమంగా పెరుగుతున్న కేసులతో మన రాష్ట్రంలో, హైదరాబాద్‌లో మరో రెండు వారాల్లో సెకండ్‌వేవ్‌ కేసులు ఉచ్ఛ స్థాయికి చేరుకోవచ్చని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంతో పోలిస్తే ఎక్కువ అనారోగ్యంతో కోవిడ్‌ రోగులు అధిక సంఖ్యలో హాస్పిటల్స్‌కు వస్తున్నారు.

గత కొంతకాలంగా అందరూ బయట స్వేచ్ఛగా తిరగడం.. ఇతర అంతర్రాష్ట్ర ప్రయాణాలు ఎక్కువగా జరగడంతో తెలంగాణలో, హైదరాబాద్‌లో ఏ రకం వైరస్‌ వ్యాప్తిలో ఉందనే విషయంలో స్పష్టత రావట్లేదు. మహారాష్ట్ర నుంచి ముఖ్యంగా నాందేడ్, ముంబై నుంచి హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రులకు పెద్దసంఖ్యలో రోగులు, వారి కుటుంబ సభ్యులు వస్తున్నారు. దీంతో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో మళ్లీ కేసుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యశోద ఆసుపత్రి పల్మనాలజిస్ట్‌ డా.హరికిషన్‌ గోనుగుంట్లతో ‘సాక్షి’ఇంటర్వ్యూ.. 

ప్రజల్లో భయం తగ్గింది... 
మాస్కులు, ఇతర జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పాటు కరోనా వస్తుందనే భయం ప్రజల్లో తగ్గింది. మనం ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ తీవ్రస్థాయికి చేరుకునే దశలో ఉన్నాం. గతంలో పాజిటివ్‌ వచ్చిన వారికి కాకుండా గతంలో ఇది సోకని వారు తీవ్ర ప్రభావానికి లోనవుతున్నారు. ప్రస్తుతం నైట్‌క్లబ్‌లు, పబ్బులు, ఇతర కార్యకలాపాలు బాగా పెరిగిపోయాయి. వ్యాక్సిన్‌ వచ్చేసింది.. కరోనా పోయినట్లే.. తమకేమీ కాదన్నట్లు తిరిగేస్తున్నారు. 

వ్యాధి తీవ్రత పెరిగింది.. 
ప్రస్తుతం కోవిడ్‌ వ్యాధి తీవ్రత బాగా పెరిగింది. గతంలో పాజిటివ్‌ వచ్చాక సీరియస్‌ కేసుగా మారేందుకు దాదాపు వారం రోజులు పట్టగా, ఇప్పుడు లక్షణాలు కనిపించిన రెండు రోజుల్లోనే ఇది తీవ్రరూపం దాలుస్తోంది. మూడు రోజులకే ఆక్సిజన్‌ పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి గణనీయంగా పెరిగింది. ఇవన్నీ కూడా మాస్కులు సరిగ్గా పెట్టుకోకపోవడం, ఇతర జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే. 60 ఏళ్లు పైబడిన వారు వెంటనే వ్యాక్సిన్లు తీసుకోవాలి. మహారాష్ట్ర నుంచి పెద్దసంఖ్యలో రోగులు మనదగ్గరి ఆసుపత్రులకు వస్తున్నారు. వారితో పాటు కుటుంబసభ్యులు వస్తున్నారు. వీరంతా ఆసుపత్రుల్లో, ఇతర ప్రదేశాల్లో ఇతరులతో కలసి పోవడంతో ఈ వైరస్‌ సులభంగా వ్యాపిస్తోంది.

అందుకే మరో 10, 15 రోజుల్లోనే ఇక్కడ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగి సెకండ్‌ వేవ్‌ పీక్‌ స్థాయికి వెళ్లే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో జ్వరం వచ్చినా అది వైరల్‌ లేదా టైఫాయిడ్‌ జ్వరంగా భావించి నాందేడ్‌తో పాటు మనరాష్ట్ర సరిహద్దుల్లో నిర్లక్ష్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి వైద్యులు కూడా ఐదారు రోజులు టైఫాయిడ్‌ కావొచ్చని ప్రాథమికంగా చికిత్స ఇచ్చి తగ్గకపోవడంతో హైదరాబాద్‌కు పంపుతున్నారు. కాగా, ఇతర దేశాల్లో మాదిరిగా ఇక్కడా సెకండ్‌ వేవ్‌ సందర్భంగా ఎక్కువ కేసుల నమోదుతో పాటు వ్యాధి తీవ్రత పెరిగితే పరిస్థితులు చేతులు దాటిపోయే ప్రమాదం ఉంది. భారత్‌లో సుదీర్ఘలాక్‌డౌన్‌ వల్ల తొలి దశలో మంచిç ఫలితాలు వచ్చాయి. సెకండ్‌వేవ్‌ కేసులు మాత్రం గణనీయంగా పెరుగుతున్నాయి. 

ఆ కేసులే ఎక్కువ.. 
ప్రస్తుతం వస్తున్న కరోనా కేసుల్లో ఊపిరితిత్తులకు సంబంధించిన కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. రక్త స్రావం, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలతో వస్తున్నారు. మహారాష్ట్ర నుంచి ముఖ్యంగా నాందేడ్‌ నుంచి అత్యధికంగా హైదరాబాద్‌కు కేసుల రాక ఎక్కువగా ఉంది. సీరియస్‌ కండిషన్‌తో, ‘ఎక్యూట్‌ స్ట్రెస్‌ సిండ్రోమ్‌’తో ఇక్కడకు వస్తున్నారు. కొత్తరకం వైరస్‌ సోకితే చికిత్సకు కూడా సులభంగా లొంగట్లేదు. 
(చదవండి: అనాథ శవాలతో దందా..ఇక్కడ శవాలు లభించును!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement