సాక్షి, సిటీబ్యూరో : విధి నిర్వహణలో వారికి వారే సాటి. ఒకవైపు శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం పాటుపడుతూనే.. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ పోరులో వారు పోషిస్తున్న పాత్ర అపురూపం. రాత్రింబవళ్లూ ప్రజాసేవలో తరిస్తున్నారు ఇద్దరు పోలీస్ బాస్‌లు. ఒకరు రాచకొండ సీపీ మహేశ్ భగవత్, మరొకరు సైబరాబాద్ సీపీ సజ్జనార్. ఇటు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే అటు విధి నిర్వహణలోనూ తమదైన విభిన్నత చాటుతున్నారు. సమాజం నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. తమ భర్తల సేవాభావాన్ని చూసి వీరి సతీమణులు సైతం వేనోళ్ల కొనియాడుతున్నారు. వీరి పనితీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పిల్లలకు, కుటుంబానికి సమయం కేటాయించడంలేదనే భావన ఉన్నా.. ప్రజల కోసం పని చేస్తుండడం గర్వంగా ఉందని చెబుతున్నారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ సతీమణి అనూప, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సునీతా భగవత్ తమ మనోగతాన్ని ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు.
మహేశ్ ది గ్రేట్
ఓ ఐపీఎస్‌గా ఆయన సేవలకు సెల్యూట్ చేస్తున్నా. ప్రస్తుతం రంగారెడ్డి ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్‌గా పనిచేస్తున్నాను. విధి నిర్వహణలో సామాన్యులకు అండగా ఉండటం నచ్చింది. లాక్‌డౌన్ సమయంలో సొంతూళ్లకు వెళ్లలేని వలస కార్మికులను గుర్తించి వారికి సహయం అందించడంలో మహేష్ భగవత్ నేతృత్వంలోని బృందం ముందుండడం అభినందనీయం. లాక్‌డౌనే కాదు పండగలు, నూతన సంవత్సర వేడుకలు.. ఇలా ఏదైనా ఫ్యామిలీతో అందరూ చేసుకుంటుంటే పోలీసులు మాత్రం ఆ రోజుల్లో విధుల్లో బిజీగా ఉంటారు. ఇలా ఏ ఆపద వచ్చినా ముందుండే పోలీసులకు కృతజ్ఞతలు.
(కరోనా ఆగట్లేదు.. జర జాగ్రత్త)
ఇక మా ఫ్యామిలీ విషయానికొస్తే చిన్న పాప ‘అతవరి’కి డాడీ ఎంతో ఇష్టం. సాయంత్రం సమయంలో ఎప్పుడూ వస్తున్నారని అడుగుతూటూంది. అయితే నాన్నను చూపి ప్రేరణ పొందిన అతవరి ఇండస్ అక్షన్ అనే ఎన్జీఓకు వలంటీర్‌గా సేవలు అందిస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ప్రజలకు ప్రభుత్వం నుంచి సహయం అందిందా? లేదా? అని ఫోన్‌కాల్స్ చేసి అడుగుతుంది. అవసరమైతే వాళ్లకు మార్గదర్శనం చేస్తుండడంతో మావారు ఎంతో సంతోషపడుతున్నారు. ఇక పెద్దపాప మైత్రేయి అమెరికాలోని న్యూజెర్సీలోనే ఉండడంతో ప్రతిరోజూ ఇంటికి వచ్చాక ఓ గంటపాటు వాట్సాప్ వీడియో కాల్ చేసి కరోనా వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. ఓవైపు పోలీసింగ్, మరోవైపు ఫ్యామిలీని సమన్వయం చేస్తుండడం చూస్తే నాకెంతో సంతోషంగా ఉంటుంది. ఇక సమయం దొరికినప్పుడల్లా ముఖ్యంగా ఆదివారం రోజున తనకు నచ్చిన ఆమ్లెట్, ఉప్మా చేస్తుంటారు. ఒత్తిడి నుంచి బయట పొందేందుకు మ్యూజిక్ వింటారు. ముఖ్యంగా దుర్గా జస్‌రాజ్ ఫేస్‌బుక్ లైవ్ షో మ్యూజిక్ వారంలో రెండుసార్లైనా వింటారు.
(పరమౌషధం కానున్న ప్లాస్మా !)
అన్నీ ఫోన్‌లోనే..
కరోనాపై పోరుకు ప్రజలు సహకరించాలి. స్వచ్ఛందంగా ఇంట్లోనే ఉండాలి. అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రాకూడదు. లాక్‌డౌన్ ముందు బిజీ షెడ్యూల్ ఉన్న ఫ్యామిలీకి బాగానే సమయం కేటాయించేవాణ్ణి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమయంతో సంబంధం లేకుండా విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. రాత్రి ఇంటికి చేరుకున్నాక అమెరికాలో ఉంటున్న మా పెద్ద కుమార్తెకు వీడియో కాల్ చేస్తున్నా. మహారాష్ట్రలో ఉంటున్న మా నాన్నతో కూడా మాట్లాడుతున్నా. ఇటు విధులు నిర్వహిస్తూనే ఫ్యామిలీని చూసుకుంటున్నా.– మహేష్ భగవత్, రాచకొండ సీపీ
సజ్జనార్ ది లీడర్
కరోనా వైరస్ నియంత్రణలో పోలీసు సిబ్బంది సేవలకు సలామ్ చేస్తున్నాం. సిబ్బందికి మావారు నాయకత్వం వహించడం చాలా గర్వంగా ఉంది. ఐపీఎస్‌గా విధుల్లో చేరినప్పటి నుంచి ఎక్కడ ఉన్నా విధులను అకుంఠిత దీక్షతో చేస్తున్నారు. ఇప్పుడూ కరోనా నియంత్రణలోనూ కష్టపడుతున్నారు. మిగతా పోలీసు సిబ్బంది కూడా చాలా కష్టపడుతున్నారు. ప్రజలు కూడా సహకరించాలి. బయట తిరగవద్దు. అప్పుడూ వీళ్లకు కూడా బాగుంటుంది. కుటుంబపరంగా చూసుకుంటే మిగతా వాళ్లతో పోలిస్తే కాస్త సమయం తక్కువగానే ఉంటారు. ముఖ్యంగా మా అమ్మాయిలు అదితి, నియతి.. డాడీ.. డాడీ అంటూ కలవరించేవారు. అయితే డాడీ విధులు తెలిశాక గ్రేట్ అంటున్నారు.
వర్క్‌హాలిక్ మైండ్ సెట్ ఉన్న మావారు.. ప్రజలకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఇందుకు ఎంతో గర్వంగా ఉంది. ఎప్పుడూ విధులతో బిజీగా ఉండే మావారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కువగా ఉడికించిన కోడిగుడ్లు, కూరగాయలు ఇష్టంగా తింటారు. ఉదయం వ్యాయామంతో పాటు యోగా కూడా చేస్తుంటారు. ఆమ్లా జ్యూస్, ఇమ్యూనిట్ బూస్ట్ తీసుకుంటారు. సినిమాలంటే పెద్దగా ఇష్టం ఉండదు. వీలైతే వార్తలు చూస్తుంటారు. విధులకు వెళ్లి లేట్‌గా వచ్చినా పిల్లలతో కొంతసేపు క్యారమ్ ఆడాక నిద్రకు ఉపక్రమిస్తారు.
లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి తెల్లవారుజామున మానిటరింగ్ మొదలై అర్ధరాత్రి వరకు టెలీ కాన్ఫరెన్స్‌లతో బిజీగా ఉంటున్నారు. అందుకే మా అమ్మాయిలు డాడీతో కొంతసేపైనా ఉండాలన్న ఉద్దేశంతో ఉదయం లేవగానే డాడీ వాహనంలో ఒక రౌండ్ వేసుకొని ఇంటికి వచ్చేస్తారు. బయటకు వెళ్లి ఇంట్లోకి వచ్చే కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కూడా కచ్చితంగా హ్యాండ్ శానిటైజింగ్ చేయాల్సిందే. కాళ్లు, చేతులు కడుక్కొవాల్సిందే. ఇక మావారు బయటి నుంచి ఇంటికి రాగానే యూనిఫాం శానిటైజ్ చేసి సపరేట్‌గా పెట్టేస్తారు. స్నానం చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే క్వారంటైన్ అవుతారు. చివరగా ఒక మాట ఇంట్లోనే ప్రజలు ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. కరోనాను జయించాలి.
ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాం. గతంలో కుటుంబ సభ్యులతో గడిపిన విధంగా పరిస్థితులు ఇప్పుడు లేవు. ఏ సమయంలోనైనా విధి నిర్వహణకు వెళ్లాల్సిందే. గతంలో ప్రతిరోజూ అరగంట పాటు ఆడుకోనేదే ఊరుకునేవారు కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి కాస్త దూరంగా ఉండాల్సి వస్తోంది. సమయంతో సంబంధం లేకుండా సిబ్బందికి మార్గదర్శకాలిస్తున్నాం.
– వీసీ సజ్జనార్, సైబరాబాద్ సీపీ
Comments
Please login to add a commentAdd a comment