సోమవారం హైదరాబాద్ ఆసిఫ్‌నగర్ సమీపంలోని ఓ బ్యాంకు వద్ద భౌతికదూరం పాటించకుండా బారులు తీరిన జనం
సాక్షి, హైదరాబాద్: కరోనా కారణంగా గత నెల 24 నుంచి ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్‌డౌన్ కొనసాగనుంది. తెలంగాణలో మాత్రం మే 7 వరకు కొనసాగుతుంది. అయితే ఏప్రిల్ 20 నుంచి కొన్ని విషయాల్లో సడలింపులు ఇస్తామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎలాంటి సడలింపులు లేవని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయినా సోమవారం ప్రజలు రోడ్లెక్కేశారు. గత నెలరోజులుగా కొనసాగుతున్న లాక్‌డౌన్ పరిస్థితికి భిన్నంగా ఉదయం వేళ రోడ్లపై వందల సంఖ్యలో కార్లు, బైక్‌లు కనిపించాయి. సాయంత్రం వరకు కూడా ఈ పరిస్థితి కొనసాగింది. సడలింపులు ఏమీ ఉండవని స్వయంగా సీఎం ప్రకటించినా జనం ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదుల వచ్చాయి. అధికారులు వెంటనే కట్టడి చర్యలు చేపట్టాలని కింది స్థాయి అధికారులను ఆదేశించారు. దీంతో చాలా ప్రాంతాల్లో పోలీసులు చెక్‌పోస్టుల వద్దకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
మే 7 వరకూ లాక్‌డౌన్ అంటూ ప్రభుత్వం విస్పష్టంగా ప్రకటించినప్పటికీ.. కొందరికి అవేమీ పట్టడం లేదు.. ఆశీర్వాద్ ఆటా కోసం అంటూ ఒకరు.. పిల్లాడికి పాలకూర కట్ట కోసం అంటూ మరొకరు.. కారణం ఏదైతేనేం.. లాక్‌డౌన్ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు.. భౌతిక దూరం సంగతి సరేసరి.. స్వయంగా ముఖ్యమంత్రే కరోనా ఉధృతిపై హెచ్చరిస్తున్నా.. వీరు లైట్ తీసుకుంటున్నారు.. దానికి నిదర్శనమే సోమవారం హైదరాబాద్‌లో కనిపించిన ఈ దృశ్యాలు.. ఇక ఇంతేనా.. మనమింతేనా?
కిక్కిరిసిన మాల్స్..
డీమార్ట్ లాంటి షాపింగ్ కేంద్రాలు సోమవారం కిక్కిరిసిపోయాయి. వస్తువులు కొనేందుకు జనం ఎగబడ్డారు. సాధా రణ రోజుల్లోలాగే క్యూలు కనిపించాయి. ఎక్కడా భౌతిక దూరం నిబంధన అమలు ఆనవాళ్లే కనిపించలేదు. ఇలా ఒక్క చోట కాదు.. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న అలాంటి షాపింగ్ కేంద్రాలన్నీ కిటకిటలాడుతున్నా పోలీసులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించకపోవటం ఆశ్చర్యపరిచింది. మలక్‌పేటలోని అలాంటి ఓ కేంద్రంలో సాయంత్రం 4 దాటే వరకు జనం కిక్కిరిసి ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే పరిస్థితి ఉన్నా యంత్రాంగం ఎందుకు పట్టించుకోలేదో అంతు చిక్కలేదు. ఓవైపు కరోనా కేసుల సంఖ్య ప్రమాదకర రీతిలో పెరుగుతున్నాయి. దీంతో లాక్‌డౌన్‌ను పొడిగించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది.
అయినా ప్రభుత్వ హెచ్చరికలను ఖాతరు చేయని జనం, అదుపు తప్పిన జనాన్ని నియంత్రించలేని యంత్రాంగం.. వెరసి గందరగోళ వాతావరణం ఏర్పడింది. ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వానికి సహకరిస్తే కరోనాను కట్టడి చేయగలుగుతామని, పాలనకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడేలా ఆర్థిక పరిస్థితి దిగజారినా ప్రజల కోసం లాక్‌డౌన్ పొడిగిస్తున్నామని స్వయంగా సీఎం విన్నవించినా జనం పట్టించుకోలేదు. పోలీసులు కఠినంగా వ్యవహరించిన కొన్ని చోట్ల పరిస్థితి అదుపులోకి వచ్చింది. కానీ, చాలా ప్రాంతాల్లో పోలీసులు సాధారణ గస్తీకే పరిమితం కావటంతో పరిస్థితి అదుపులో లేదు. సాయంత్రం వరకు యథేచ్ఛగా సంచరిస్తూనే ఉన్నారు. చదవండి: రైలు ప్రయాణాలు ఇప్పట్లో వద్దు
సంతలకు అనుమతేల?
రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్నా.. నగరంలోని పలు చోట్ల కూరగాయల సంతలు నిర్వహిస్తున్నారు. పురాణాపూల్ సమీపంలోని జిన్సీ చౌరాహీ ప్రాంతంలో ఓ సంత ఏర్పాటైంది. ఒక్కసారిగా వందల మంది కొనుగోలుదారులతో ఆ ప్రాంతం రద్దీగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ తంతు కొనసాగింది. ఎక్కడా లాక్‌డౌన్ నిబంధనల అమలే లేదు. మాస్కులు కూడా కనిపించలేదు. సాధారణ రోజులమాదిరిగానే జనంతిరిగారు. అయినా పరిస్థితిని చక్కదిద్దే అధికారి ఒక్కరూ ఆ ప్రాంతంలో కనిపించలేదు. అన్ని ప్రాంతాల్లోనూ కూరగాయలు, పండ్లు బాగానే లభిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు ఇంతలా పెరుగుతున్న నేపథ్యంలోనూ సంతలకు అధికారులు ఎలా అనుమతిస్తున్నారో అర్థం కావట్లేదు.
పలుచోట్ల వాహనాలు సీజ్..
ఉదయం గాంధీభవన్ సమీపంలో పోలీసు అధికారులు పెద్ద సంఖ్యలో చేరుకుని వాహనాల తనిఖీ చేపట్టారు. అనవసరంగా వచ్చిన వాహనాలను సీజ్ చేశారు. ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి నిఘా వేయడంతో ఈ ప్రాంతంలో భారీ సంఖ్యలో వాహనాలను జప్తు చేశారు. దీంతో ఆ కూడలి వద్ద పరిస్థితి కొద్దిసేపటికే అదుపులోకి వచ్చింది. ఇలా కొన్ని ప్రాంతాల్లో పోలీసు భయంతో జనం ‘రూటు’మార్చారు. కానీ మిగతా చోట్ల అలాగే దూసుకుపోయారు. పోలీసులు అడిగితే రకరకాల అత్యవసరాలు చెప్పి, ఏవో కాగితాలు చూపి తప్పించుకున్నారు. పోలీసులు కఠినంగా లేని చోట ఈ నిర్లక్ష్యం యథేచ్ఛగా సాగింది.
స్విగ్గీ, జొమాటో కంటే మేలా..
ఆహారాన్ని సరఫరా చేసే స్విగ్గీ, జొమాటో లాంటి వాటికి లాక్‌డౌన్ సమయంలో అనుమతి రద్దు చేస్తున్నట్లు ఆదివారం సీఎం ప్రకటించారు. వాటి వల్ల కొన్ని ప్రాంతాల్లో కరోనా విస్తరించటమే దీనికి కారణంగా పేర్కొన్నారు. కానీ, నగరంలోని కొన్ని బడా వాణిజ్య సంస్థల్లోకి ఒకేసారి వందల మంది కొనుగోలుదారులు వస్తున్నా వాటిని అధికారులు కొనసాగిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని కాలనీలు, బస్తీల్లో కిరాణా దుకాణాలు అందుబాటులో ఉన్నా కూడా ఈ మాల్స్‌ను కొనసాగించటం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కిరాణా దుకాణాల్లో తక్కువ సంఖ్యలో కొనుగోలుదారులు ఉంటున్నారు. కానీ మాల్స్‌లోకి ఒకేసారి వందల మంది వస్తున్నారు. ఇందులో కరోనా పాజిటివ్ లక్షణాలున్న వ్యక్తి ఉంటే పరిస్థితి ఎంతగా అదుపు తప్పుతుందో అధికారులకు తెలియంది కాదు. అయినా నియంత్రించడం లేదు.
ఇప్పటికే మర్కజ్ వ్యవహారం ఎంత అదుపు తప్పేలా చేసిందో, కరోనాను దాదాపు అదుపులోకి తెచ్చామని అనుకుంటున్న తరుణంలో ఈ వ్యవహారం ఎంత నష్టానికి దారి తీసిందో చూస్తున్నదే. అయినా వందల మంది గుమికూడేందుకు దారి తీస్తున్న వాణిజ్య సంస్థలు, కాలనీల్లోని సంతలు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కరోనాను కట్టడి చేసే క్రమంలో దాదాపు 70 శాతం మంది ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. చాలా మంది స్వీయ నియంత్రణలో ఉంటూ లాక్‌డౌన్‌ను పాటిస్తున్నారు. కానీ మిగిలిన వారే యథేచ్ఛగా లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్నారు. లాక్‌డౌన్‌ను పొడిగించటం, సడలింపులు ఇవ్వకపోవటంలోని ఆంతర్యాన్ని అధికార యంత్రాంగం ఇప్పటికైనా అర్థం చేసుకుని ఉల్లంఘనలు లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాల్సి ఉంది. వచ్చే 17 రోజులు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తేనే కరోనా అదుపులోకి వస్తుంది.
చదవండి: కరోనా విజేత మానవుడే!
Comments
Please login to add a commentAdd a comment