పొట్ట కొట్టిన కరోనా | CoronaVirus And Lockdown Impact On Middle Class People | Sakshi
Sakshi News home page

రోడ్డున పడ్డ మధ్యతరగతి బతుకులు

Published Tue, Jul 7 2020 2:11 AM | Last Updated on Tue, Jul 7 2020 2:11 AM

CoronaVirus And Lockdown Impact On Middle Class People - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పీజీ, డిగ్రీలు చేసి చిన్నాచితకా ఉద్యో గాలతో నెట్టుకొస్తున్న లక్షలాది మంది మధ్య తరగతి కుటుంబాల యువతను కరోనా, లాక్‌డౌన్‌ కష్టాల్లోకి నెట్టేశాయి. వీరు పనిచేసే స్కూళ్లు, కళాశాలలు, బార్లు, సినిమా థియేటర్లు, జిమ్‌లు మూతపడడంతో జీవితాలు అగమ్య గోచరంగా మారాయి. ఇందులో 30 ఏళ్ల అనుభవం ఉన్న లెక్చరర్ల నుంచి సినిమా థియేటర్లు ఊడ్చి బతుకుబండిని లాగే స్వీపర్‌ వరకు ఉన్నారు. వీరంతా ఏం పాలుపోని స్థితిలో పడ్డారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి అవకాశం ఎక్కువనే కారణంతో దేశవ్యాప్తంగా వీటిని తెరిచేందుకు అనుమతి లేకపోవడంతో వీటిలో పనిచేస్తున్న వారంతా దినదినగం డంగా బతుకీడుస్తున్నారు. 

మూడు నెలలుగా జీతాల్లేక, చేతిలో ఉన్న కొద్ది సొమ్మూ ఖర్చయి పోవడంతో ప్రత్యామ్నాయ ఉపాధి కోసం వెతుకులాడుతున్నారు. కొందరు చేసేదేమీ లేక గ్రామాల్లో ఉపాధి పనులకు పోతుంటే మరికొందరు మళ్లీ తాము పనిచేసే కేంద్రాలు తెరుచుకోకపోతాయా అని ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇంకొందరు దొరికిన పనితోనే పొట్టపోసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా, మన రాష్ట్రంలోనూ రోజురోజుకూ కరోనా విజృంభిస్తుండటంతో ఇవెప్పటికి తెరుచుకుంటాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బతుకుదెరువు దెబ్బతిన్న వీరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన, ఆర్థిక చేయూతపై యోచించాలని నిపుణులు అంటున్నారు.

బతకలేక.. ప్రైవేట్‌ టీచర్‌
కరోనా, లాక్‌డౌన్‌తో బాగా దెబ్బతిన్నది ప్రైవేటు విద్యారంగం. రాష్ట్రంలో అన్ని రకాల ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలు కలిపి 50వేల వరకు ఉన్నాయి. వీటిలో టీచింగ్, నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ కనీసం 10లక్షల మంది వరకు ఉంటారని అంచనా. ఈ ఏడాది మార్చి 22 నుంచి పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. దీంతో వీటిలో పనిచేసే వారంతా ఉపాధి కోల్పోయారు. మార్చి నెల వేతనాలందుకున్న వీరికి ఏప్రిల్, మే, జూన్‌లో పైసా కూడా చేతిలో పడలేదు. మధ్యతరగతికి చెందిన ఉన్నత విద్యావంతులైన వీరంతా డిగ్రీ నుంచి పీజీలు, డబుల్‌ పీజీలు చేసినవారే. పాఠాలు చెప్పి పొట్టపోసుకునే వీరికిప్పుడు ఏంచేయాలో తోచట్లేదు. కొందరు ఇంటి వద్దే ట్యూషన్లు చెప్పుకునే ప్రయత్నం చేస్తుండగా, మరికొందరు పల్లెకు వెళ్లి ఉపాధి హామీ పనులు చేసుకుంటున్నారు. ఇక, భవనాల అద్దె కట్టలేక విద్యాసంస్థల యాజమాన్యాలు సతమంతం అవుతున్నాయి.

కూలబడిన ‘జిమ్‌’లు
కరోనా దెబ్బకు కూలబడిన ప్రధాన సెక్టార్లలో జిమ్‌లు కూడా ఉన్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే వేలాది జిమ్‌లు ఉండగా, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ ప్రాంతాల్లోనూ పదుల సంఖ్యలో ఉన్నాయి. ఒక్కో జిమ్‌లో కనీసం ఇద్దరు ట్రైనర్లు ఉంటారు. కనీసం రూ.20లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు పెట్టుబడి ఉంటే కానీ జిమ్‌లు ఏర్పాటు చేయలేరు. 3వేల చదరపు అడుగుల వైశాల్యం ఉన్న భవనాలు కావాలి. దీంతో రాష్ట్రంలోని దాదాపు అన్ని జిమ్‌లు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. అద్దె చెల్లింపు యాజమాన్యాలకు భారమైంది. ఇటీవలే హైదరాబాద్‌కు చెందిన ఓ జిమ్‌ ట్రైనర్‌ ఆత్మహత్య చేసుకున్నారు. జిమ్‌ ట్రైనర్లు పూర్తిగా ఉపాధి కోల్పోయారు. ఇప్పటికిప్పుడు జిమ్‌లు తెరిచేందుకు ప్రభుత్వాలు అనుమతిచ్చినా ప్రజలు రాలేని పరిస్థితి. దీంతో జిమ్‌లపై ఆధారపడ్డ కుటుంబాలు ల ఆర్థిక పరిస్థితి తలకిందులైంది.

బోరుమంటోన్న బార్లు
బార్లు దాదాపు దివాలా స్థితికి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి వరకు బార్లు ఉండగా, కనీసం బార్‌కు 20 మంది చొప్పున 20వేల కుటుంబాలు వీటిపై ఆధారపడి బతుకుతున్నాయి. కుక్‌లు, బార్‌టెండర్లు, బిల్లింగ్‌ సెక్షన్‌లో పనిచేసేవారు, సూపర్‌వైజర్లు, స్వీపర్లు.. ఇలా వేలాది మంది బార్లలో పనిచేస్తూ బతుకీడుస్తున్నారు. కరోనా కారణంగా బార్లు తెరిచేందుకు ప్రభుత్వాలు ససేమిరా అంటున్నాయి. దీంతో వేలాది మంది చిరుద్యోగుల భవిష్యత్తు అంధకారంలో పడింది. యాజమాన్యాలు ఇచ్చే అరకొర వేతనంతో పాటు టిప్‌ల కింద వచ్చే చిల్లరతో పొట్టపోసుకునే బార్‌ టెండర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. బార్ల యాజమానుల పరిస్థితి మరీ ఘోరంగా మారింది. బార్లు సవ్యంగా నడిచే సమయంలోనే లైసెన్సు ఫీజు కింద ప్రభుత్వానికి లక్షల రూపాయలు చెల్లించడం కష్టంగా ఉండేది. లాక్‌డౌన్‌ కాలానికి లైసెన్సుఫీజు రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా సానుకూల స్పందన రాలేదు.

చిరిగిన వెండి‘తెర’ బతుకులు
లాక్‌డౌన్‌కు ముందు రంగులీనిన వెండితెర.. ఇప్పుడు కరోనా పంజా దెబ్బకు చిరిగిపోయింది. ఇప్పుడిప్పుడే షూటింగ్‌లకు అనుమతిచ్చినా సినిమా థియేటర్లు తెరిచే పరిస్థితి లేకపోవడంతో వాటిపై ఆధారపడ్డ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి. థియేటర్లలో పనిచేసే గేట్‌మ్యాన్‌ల నుంచి వాచ్‌మెన్లు, టికెట్‌ కౌంటర్లు, క్యాంటీన్లలో పనిచేసే చిరుద్యోగులకు కుటుంబపోషణ కష్టంగా మారింది. మూడునెలలకు పైగా ఉపాధి లేకపోవడంతో పట్టణాల్లో కూలీ పనులకు వెళ్లి పొట్టపోసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,200 వరకు థియేటర్లుంటాయని అంచనా. వీటిలో కనీసం 50వేల మంది పనిచేస్తుండగా, వీరంతా కరోనా దెబ్బకు రోడ్డునపడ్డారు.

ఏం చేయాలి? ఎలా బతకాలి?
1994లో లక్ష రూపాయల పెట్టుబడితో హన్మకొండ రాగన్న దర్వాజ వద్ద జిమ్‌ సెంటర్‌ పెట్టా. నాతో పాటు ఇద్దరు ట్రైనర్లు పనిచేస్తారు. ఇప్పుడు మా పరిస్థితేమిటో?. గత పాతికేళ్లలో ఇలాంటి ఉత్పాతం చూడలేదు. అద్దె కట్టలేక సెంటర్‌ను ఖాళీ చేయాల్సిన పరిస్థితి.. జిమ్‌ పరికరాలు ఎక్కడ పెట్టాలి?, కుటుంబాలనెలా పోషించుకోవాలి?. నాలుగు నెలలుగా ఉపాధి లేక ట్రైనర్లు మానసికంగా కుంగిపోతున్నారు.
– పోతరాజు రవి, సూర్య జిమ్‌ సెంటర్, హన్మకొండ

వంద రోజులుగా ఇంట్లోనే..
బార్‌ వెయిటర్‌గా ఎనిమిది గంటలు పనిచేస్తే యజమాని ఇచ్చే వాటితో పాటు టిప్‌లు కలిపి రూ.10వేల వరకు వచ్చేవి. ఉన్నదాంట్లో కుటుంబాన్ని నడిపించా. లాక్‌డౌన్‌తో ఇప్పుడు వంద రోజులుగా ఇంట్లోనే ఉంటున్నా. పైసా ఆదాయం లేదు. రెండ్రోజుల క్రితం ఎలక్ట్రీషియన్‌ పని దొరికింది. రోజుకు రూ.300 ఇస్తున్నారు. నాతో పాటు బార్‌లో పనిచేసిన మరో 30 మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
– గర్దాస్‌ పరమేశ్వర్, వెయిటర్, అమృతా బార్, జనగామ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement