middle class family
-
Devananda: ఇలాంటి కూతురు ఉండాలి!
‘ఈ అమ్మాయిని చూస్తే చాలా సంతోషంగా ఉంది. ప్రతి తల్లిదండ్రులకు ఇలాంటి కూతురు ఉండాలి’ అని సాక్షాత్తు కేరళ హైకోర్టు 17 ఏళ్ల దేవనంద గురించి అంది. ఎందుకో చదవండి! కేరళలోని త్రిసూర్‌లో కాఫీ హోటల్ నడుపుకునే 48 ఏళ్ల ప్రతీష్‌కు నిన్న మొన్నటి దాకా జీవితం సాఫీగానే సాగింది. భార్య ధన్య, కూతురు దేవనంద, కొడుకు ఆదినాథ్... అందరిలాంటి ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం. అయితే ఈ మధ్య కాలు వాపు తరచూ కనిపిస్తుండేసరికి డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. పరీక్షలు చేశాక డాక్టర్లు పిడుగులాంటి వార్త చెప్పారు– లివర్ కేన్సర్. వైద్యం అంటూ లేదు... లివర్ ట్రాన్స్‌ప్లాంటేషనే శరణ్యం అని తేల్చి చెప్పారు. అది కూడా వెంటనే జరగాలని చెప్పారు. ఆ మధ్యతరగతి కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. కొచ్చిలోని రాజగిరి హాస్పిటల్ వారు మీరు డోనర్ని తెస్తే మేము ట్రాన్స్‌ప్లాంట్ చేస్తాం అని భరోసా ఇచ్చారు. కాని లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు డోనర్ దొరకడం అంత సులభం కాదు. దొరికినా సూట్ కావాలి. సమయం లేదు... మరి ఏం చెయ్యాలి? నేనే ఎందుకు ఇవ్వకూడదు అనుకుంది కూతురు. ఇంటర్ సెకండియర్ చదువుతున్న దేవనంద తండ్రిని కోల్పోవడానికి సిద్ధంగా లేదు. మరో ఆలోచన చేయకుండా ఆస్పత్రి వర్గాల దగ్గరకు పోయి తనే లివర్‌లోని కొంత భాగం డొనేట్ చేయవచ్చా అని అడిగింది. చేయచ్చు గాని ‘ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్ యాక్ట్ 1994’ ప్రకారం మైనర్లకు అనుమతి లేదని చెప్పారు. దేవనంద ఇంటర్నెట్ జల్లెడ పట్టింది. గతంలో ఇలాంటి కేసులో ఒక మైనర్‌కు ఆర్గాన్ డొనేట్ చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చినట్టుగా చదివింది. అయితే ఆ మైనర్ నుంచి ఆర్గాన్ డొనేషన్ జరగలేదు. ఆ తీర్పు ఆధారంగా తాను హైకోర్టుకు వెళ్లాలని నిశ్చయించుకుంది. జడ్జి పూనుకొని హైకోర్టులో జస్టిస్ వి.జి.ఆరుణ్ సమక్షానికి ఈ కేసు వచ్చింది. ప్రత్యేకమైన కమిటీని వేసి ఆర్గాన్ యాక్ట్‌లో ఏదైనా మినహాయింపుతో దేవనంద తన తండ్రికి లివర్ ఇవ్వొచ్చోకూడదో సూచించమని ఆదేశించాడాయన. కమిటీ అధ్యయనం చేసి చిన్న వయసులో ఇవ్వడానికి ఏ మాత్రం వీలు లేదని, దేవనందను ఇందుకు అనుమతించ వద్దని తేల్చి చెప్పింది. కాని దేవనంద కమిటీ రిపోర్టును మళ్లీ సవాలు చేసి తండ్రిని కాపాడుకునే హక్కు తనకు ఉందని కోర్టుకు చెప్పింది. ‘నాన్నను కోల్పోతే మేము దిక్కులేని వాళ్లం అవుతాం’ అని చెప్పింది. జస్టిస్ వి.జి.అరుణ్ దేవనంద పట్టుదలను, తండ్రి కోసం ఆమె పడుతున్న ఆరాటాన్ని ఎంతో ప్రశంసించారు. ‘ఇలాంటి కూతురు అందరికీ ఉండాలి’ అన్నారు. ఈసారి మరో కమిటీని వేశారు. ఆ కమిటీ దేవనందకు అనుకూలంగా రిపోర్టు ఇవ్వడంతో డిసెంబర్ 2022లో అనుమతి ఇస్తూ తీర్పు చెప్పారు. అన్ని విధాలా సిద్ధమయ్యి ఈ విషయం తెలిసి బంధువులు వారించినా దేవనంద వెనక్కు తగ్గలేదు. తండ్రికి ఆరోగ్యకరమైన లివర్ ఇవ్వడానికి జిమ్‌లో చేరింది. మంచి పోషకాహారం తీసుకుంది. తండ్రి కోసం ఫిబ్రవరి 9న ఆపరేషన్ బల్ల ఎక్కింది. పెద్ద వైద్యుల బృందం ఆధ్వర్యంలో తండ్రీకూతుళ్లకు సర్జరీ చేసి లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌ను విజయవంతం చేశారు. ఆపరేషన్ జరిగిన రాజగిరి హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్ల బృందం దేవనందకు ఫ్యాన్స్ అయ్యా రు. తండ్రీ కూతుళ్లు డిశ్చార్జ్ అవుతుంటే అందరూ వచ్చి జ్ఞాపికతో వారిని సాగనంపారు. అంతేనా? దేవనంద పట్టుదల, ప్రేమను చూసి తండ్రి ఆపరేషన్ ఖర్చులను మాఫీ చేశారు. కూతురు ప్రేమ సాధించిన ఘన విజయంగా దీనిని అభివర్ణించవచ్చు. -
విశాఖ అమ్మాయి.. భారీ ప్యాకేజ్‌తో కొలువు
మనం అనుకున్నవి నెరవేరకున్నా.. ఆ లక్ష్యం మరో రూపంలో నెరవేరే అవకాశాలు అరుదుగా జరుగుతుంటాయి. అలాంటి తండ్రీకూతుళ్ల కథే ఇది. తన తల్లి ప్రోత్సహంతో ఉన్నత స్థానానికి ఎదగాలనుకున్న వ్యక్తి.. కన్నకూతురి రూపంలో ఆ ఆశయాన్ని నెరవేర్చుకున్నాడు. భారీ ప్యాకేజీ కొలువుతో తండ్రి కలను తీర్చి.. ఆయన పేరును నలుదిశలా చాటిన ఆ మధ్యతరగతి బిడ్డ పేరు రేపాక ఈశ్వరి ప్రియ. పైగా ఏయూ చరిత్రలోనే పెద్ద ప్యాకేజీ అందుకున్న అమ్మాయి కూడా ఈమెనే కావడం గమనార్హం!. రేపాక శ్రీనివాసరావుది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆయన ఎలక్ట్రానిక్ స్పేర్‌పార్ట్‌లు అమ్ముకునే చిరు వ్యాపారి. ఆయన భార్య రాధ.. గృహిణి. కొడుకు సందీప్ సాఫ్ట్వేర్ డెవలపర్. ఇక కూతురు ఈశ్వరి ప్రియ గురించి చెప్పుకోవాల్సింది చాలానే ఉంది. కానీ, అంతకంటే ముందు శ్రీనివాసరావు గురించి చెప్పాలి. చిన్నతనంలో ఆయనకు బాగా చదువుకోవాలని కోరిక. అదే ఆయన తల్లి కూడా కోరుకుంది. కానీ, ఆమె శ్రీనివాసరావు చిన్నతనంలోనే చనిపోయారు. అదే సమయంలో ఆర్థిక పరిస్థితులు సహకరించక.. చదువు ముందుకు సాగలేదు. ఏళ్లు గడిచాయి.. ఆయన పెద్దయ్యాడు.. ఆయనకు ఓ కుటుంబం వచ్చింది. తాను చదువుకోలేకపోయానన్న బాధను.. తరచూ పిల్లల ముందు వ్యక్తపరిచేవారాయన. ఆ మాటలు కూతురు ఈశ్వరి ప్రియను బాగా ప్రభావితం చేశాయి. ‘నేనెలాగూ చదువుకోలేకపోయా. మీరైనా బాగా చదువుకోవా’లనే మాటలను ఆమె బాగా ఎక్కించుకుంది. ఇంటర్, ఆపై ఎంసెట్‌లో మంచి ర్యాంక్ సాధించింది. కానీ, తండ్రి కళ్లలో ఇంకా పూర్తి స్థాయిలో ఆనందం చూడలేదామె. మంచి ఉద్యోగంలో స్థిరపడినప్పుడే తన తండ్రి సంతోషంగా ఉంటాడని భావించిందామె. మంచి ర్యాంక్ రావడంతో ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్‌లో చేరింది. ఈ క్రమంలో సందీప్ సైతం సోదరికి ఎంతో ప్రోత్సాహం అందించాడు. వెనువెంటనే.. థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు.. మోర్గాన్ స్టాన్లీ సంస్థలో ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసింది. రెండు నెలల ఇంటర్న్‌షిప్‌లో.. ఆమెకు రూ.87 వేలు స్టైపెండ్ వచ్చింది. అప్పుడే.. ఆ కంపెనీ రూ.28.7 లక్షల ప్యాకేజీతో(ఇయర్ శాలరీ) ఆఫర్ చేసింది. ఆపై అమెజాన్ సంస్థ కోడింగ్ పరీక్షలోనూ ఎంపికై.. నెలకు రూ.1.4 లక్షల అందించడం మొదలుపెట్టింది. నెల పూర్తయ్యే లోపే.. అట్లాషియన్‌లో భారీ ప్యాకేజీతో కొలువు దక్కించుకుంది. ఏకంగా ఏడాదికి.. రూ.84.5 లక్షల ప్యాకేజీని ఆఫర్ చేసింది అట్లాషియన్ కంపెనీ. ఇది తాను అసలు ఊహించలేదని ఈశ్వరి చెబుతోంది. అంతేకాదు వర్క్‌ఫ్రమ్ హోం కావడంతో.. తమ బిడ్డ కళ్లెదురుగానే ఉంటూ పని చేసుకుంటుందంటూ ఆ కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. పెద్ద ప్యాకేజీ ఇంటర్వ్యూ అంటే.. ఆమె ఆందోళనకు గురైందట. అది తెలిసిన శ్రీనివాసరావు.. మరేం ఫర్వాలేదు.. ఇదొక్కటే జీవితం కాదు. అంతా మన మంచికే. నీ వంతు ప్రయత్నించు అని కూతురికి ప్రొత్సహం ఇచ్చి పంపించారు. ఆ మాటలే ఆమెలో ధైర్యాన్ని నింపాయి. ఇంటర్వ్యూ అయిన రోజే అపాయింట్మెంట్ లెటర్ మెయిల్ చేశారు. కిందటి ఏడాది అక్టోబర్‌లో అట్లాషియన్ కంపెనీ కోడింగ్ కోసం పోటీ పెడితే.. దేశవ్యాప్తంగా 30 వేల మంది విద్యార్థులు పోటీ పడ్డారు. 300 మందిని ఫైనల్ పోటీలకు ఎంపిక చేసి వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. టెక్నికల్ సిస్టమ్ డిజైన్, హెచ్ఆర్ దశల్లో పరీక్షించి పది మందిని ఉద్యోగాలకు, చదువుతున్న మరో పది మందిని ఇంటర్న్‌షిప్‌లోకి తీసుకున్నారు. విశేషం ఏంటంటే.. ఈ ఉద్యోగానికి ఏపీ నుంచి ఎంపికైన ఏకైక వ్యక్తి ఈశ్వరినే. ఉపాధి అవకాశాల కోసం సోషల్ మీడియాలో అనేక ఫ్లాట్‌ఫామ్‌లు ఉంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజినీరింగ్ ఉద్యోగావకాశాలు చాలానే ఉంటున్నాయి. కాకపోతే.. క్యాంపస్‌లో కాకుండా బయట రిక్రూట్‌మెంట్స్‌పై దృష్టిసారించాలి అని సలహా ఇస్తోంది ఈ విజేత. -
బడ్జెట్లో మధ్యతరగతి కుటుంబానికి ఒరిగిందిదే..!
కేంద్ర బడ్జెట్ మీద గంపెడాశలు పెట్టుకున్న ఓ సగటు మధ్య తరగతి కుటుంబానికి దక్కింది చాలా తక్కువే. ఒకట్రెండు హామీలు తప్పితే మిగతావన్నీ చేదుగుళికలే. ‘‘నేనూ మధ్యతరగతి వ్యక్తినే. ఈ వర్గం ప్రజలపై ఉండే ఒత్తిళ్లు నాకూ తెలుసు. వాటిని అర్థం చేసుకోగలను’’ అని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలతో బడ్జెట్లో మిడిల్ క్లాస్ మెలోడీస్ విని పిస్తాయని అందరూ అనుకున్నారు. తీరా చూస్తే ఆదాయ పన్ను మినహాయింపు, కాసింత సేవింగ్స్, కూసింత ఎంటర్టైన్మెంట్ తప్ప మిగిలిన వాటిల్లో నిరాశే మిగిలింది. – సాక్షి, నేషనల్ డెస్క్ ఉద్యోగి కరోనా తర్వాత బతుకు భారమైపోయింది. ఆదాయాన్ని మించిపోయేలా ఖర్చులు తడిసిమోపెడయ్యాయి. సగటు వేతన జీవి ఆదాయ పన్ను పరిమితివైపే ఆశగా చూశాడు. ఈ విషయంలో కాస్తో కూస్తో ఊరట కలిగింది. ఏడాదికి రూ.7 లక్షలు అంటే నెలకి రూ.60 వేల సంపాదన ఉన్నవారు ఆదాయ పన్ను కట్టాల్సిన పని లేదు. ఈ కొత్త బడ్జెట్ ద్వారా వారికి నెలకి రూ.2800 వరకు మిగులుతుంది. పెరిగిపోతున్న ధరాభారానికి అదేమంత పెద్ద మొత్తం కాదని అందరూ పెదవి విరుస్తున్నారు. ఒక కుటుంబం కొనుగోలు శక్తిని మరింత పెంచకుండా దేశ ఆర్థిక వృద్ధి రేటుపై మోయలేని లక్ష్యాలు పెట్టుకొని ఏం ప్రయోజనమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సీనియర్ సిటిజన్ సీనియర్ సిటిజన్లకి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. సీనియర్ సిటిజన్ల సేవింగ్స్ స్కీమ్ పరిమితిని ఒకేసారి రెట్టింపు చేస్తూ నిర్ణయం ప్రకటించారు. సీనియర్ సిటిజన్లు తమ పేరు మీద ఇన్నాళ్లూ రూ.15 లక్షల డిపాజిట్లు చేసుకోవచ్చు. ఇప్పుడు దానిని రూ.30 లక్షలకు పెంచారు. కరోనా సమయంలో రైలు ప్రయాణంలో సీనియర్ సిటిజన్లకి 50శాతం కన్సెషన్ ఉండేది. దానిని ఎత్తేస్తారని ఆశగా ఎదురు చూసిన వారికి నిరాశే ఎదురైంది. నిర్మలక్క ఆ ఊసు కూడా ఎత్తలేదు. సొంతిల్లు సొంతిల్లు అనేది మధ్య తరగతికి కల. ఏదున్నా లేకున్నా తలదాచుకోవడానికి ఒక గూడు ఉండాలని అనుకుంటారు. ఈ మధ్య కాలంలో ఆర్బీఐ రెపో రేట్లు సవరించిన ప్రతీసారి గృహ రుణాల వడ్డీ రేటు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ సారి బడ్జెట్లో వడ్డీ రేట్లు తగ్గింపు వంటి వాటిపై ఏమైనా ప్రకటనలుంటాయేమోనని, ఆదాయ పన్ను మినహాయింపులో గృహ రుణాలు తీసుకున్న వారి పరిమితిని పెంచుతారని ఆశపడ్డారు. కానీ ఆర్థిక మంత్రి ఆ ఊసే ఎత్తలేదు. అయితే నిరుపేదల కోసం నిర్మించే ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకానికి 66% నిధుల్ని పెంచుతూ మొత్తంగా 79 వేల కోట్లు కేటాయించారు. మహిళ ఆదాయాన్ని పొదుపుగా వాడుకుంటూ ఇల్లు నడిపే మహిళల కోసం ప్రకటించిన మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఒక వరం. బ్యాంకుల్లో వడ్డీ రేట్లు నానాటికీ తీసికట్టుగా మారిపోతున్న నేపథ్యంలో మహిళలకి 7.5% స్థిర వడ్డీరేటుని కల్పిస్తారు. ఈ సర్టిఫికెట్ కింద రెండు లక్షల వరకు డిపాజిట్ చేసే అవకాశం ఉంది. ఆర్థిక కష్టాలు వస్తే బంగారం ఆదుకుంటుందన్న నమ్మకం బడ్జెట్లో గల్లంతైంది. గోల్డ్ బార్స్ దిగుమతి సుంకాన్ని 12.5 శాతానికి పెంచడంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. బడ్జెట్ ప్రసంగం పూర్తయిన వెంటనే 10 గ్రాముల బంగారం రూ. 58 వేలకి చేరుకోవడం మహిళలకి షాక్ తగిలినట్టైంది. విద్యార్థి కోవిడ్–19 చదువుల్ని చావు దెబ్బ తీసింది. బడిముఖం చూడకుండా ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లలో పాఠాలు విన్న పిల్లలు చదువుల్లో కొన్నేళ్లు వెనకబడిపోయారు. 2012 నాటి స్థాయికి చదువులు పడిపోయాయని సర్వేలు ఘోషిస్తున్నాయి. ఈ సారి బడ్జెట్లో ఎన్నడూ లేని విధంగా రూ.1.12 లక్షల కోట్లు కేటాయించారు. పాఠశాల విద్యకి 8 శాతం నిధులు పెరిగినా పిల్లల్ని బడి బాట పట్టించే చర్యలు శూన్యం. నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తాననడం కంటితుడుపు చర్యగా మారింది. నిరుద్యోగి ఇది లే ఆఫ్‌ల కాలం. పని సగంలో ఉండగా మీ సేవలు ఇంక చాలు అంటూ పింక్ స్లిప్ చేతికిచ్చి ఇంటికి పంపేస్తున్నారు. దీంతో నిరుద్యోగ యువతకి ఉద్యోగాల కల్పనకి అవసరమైన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సారి బడ్జెట్ సప్తరుషుల్లో ఒకటిగా యువశక్తికి పెద్ద పీట వేసింది. యువతలో నైపుణ్యం పెంచడానికి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) 4.0 ప్రారంభించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, 3డీ ప్రింటింగ్, డ్రోన్లు వంటి వాటిలో శిక్షణ ఇస్తుంది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 38,800 ఉపాధ్యాయులను నియమించనుంది. టూరిజం రంగంలో ఉద్యోగాల కోసం యుద్ధ ప్రాతిపదిక చర్యలు చేపడతామని చెప్పినా ఎన్ని కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న దానిపై స్పష్టత లేదు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇవాళ రేపు ఎవరింట్లో చూసినా ఎవరి తీరాన వారు మొబైల్ ఫోన్లలో తలదూర్చేస్తున్నారు. వాట్సాప్‌లోనే పలకరింపు, ముచ్చట్లు కలబోసుకుంటున్నారు. వినోదమైనా, విజ్ఞానమైనా అంతా మన అరచేతిలోనే. ఇప్పుడు ఆ మొబైల్ ధరలైతే తగ్గనున్నాయి. టీవీలు, మొబైల్ ఫోన్లలో వాడే విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించడంతో టీవీ, మొబైల్ రేట్లు తగ్గుతాయి. ఇవి తగ్గుతాయి బానే ఉంది కానీ, వినోదం కోసం బయట సినిమాకి వెళ్లారంటే ఇక్కడ మిగిలింది కాస్త అక్కడ ఖర్చైపోతుంది. మొత్తంగా లెవలైపోతుంది. హళ్లికీ హళ్లి సున్నాకి సున్నా. ఫ్యామిలీ పార్టీల్లో బ్రాడెండ్ దుస్తులు వేసుకోవాలన్నా మధ్యతరగతికి ఇప్పుడు అది భారమైపోయింది. -
మిడిల్ క్లాస్ ఫ్యామిలీల్లో తండ్రి-కొడుకులంతా ఇంతేనా..!
మధ్య తరగతి కుటుంబం అంటేనే ప్రేమ, అప్యాయత, అనురాగాలు అంటారు. కానీ అవేవి బయటివారికి పెద్దగా కనిపించవు. ఎందుకంటే అక్కడ ప్రేమ కంటే ఎక్కువ ఆర్థిక ఇబ్బందులే ఉంటాయి. దాంతో మనసులో ఎంత ప్రేమ ఉన్న వాటిని బయటికి కనబడనివ్వవు ఆర్థిక ఇబ్బందులు. అందుకే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీల్లో తరచూ అరుపులు, గొడవలే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తండ్రి-కొడుకులకు అసలు పడదు. కానీ తండ్రికి కొడుకుపై ఎనలేని ప్రేమ, కొడుకుకు తండ్రి అంటే అంతులేని గౌరవం ఉంటాయి. అయితే కొడుకు భవిష్యత్తుపై దిగులుతో నాన్న కొడుకుపై చిరాకు పడతాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా తాను కన్న కలలను సాకారం చేసుకోని స్థితిలో తండ్రిపై అసహనంతో ఉంటాడు కొడుకు. మరి అలాంటి వారు ఎప్పుడు ఎదురుపడినా ఏం జరుగుతుంది. గొడవలే కదా. అది సాధారణంగా అన్ని మధ్య తరగతి కుటుంబాల్లో కనిపించేదే. అలాంటి పాత్రలు వెండితెరపై కనిపిస్తే ఎలా ఉంటుంది. మరి మధ్యతరగతి తండ్రి-కొడుకుల బాండింగ్‌ను తెరపై ఆవిష్కరించిన చిత్రాలేవో ఓసారి చూద్దాం! తండ్రి, కొడుకుల సంఘర్షణే ‘నీది నాది ఒకటే కథ’: తండ్రి, కొడుకల మధ్య ఉండే సంఘర్షణ అందరి ఇళ్లలోనూ కామన్‌గా కనిపిస్తుంది. అలాంటిదే చాలా సినిమాల్లోనూ చూశాం. కానీ…తండ్రి, కొడుకుల మధ్య సంఘర్షణే కథాంశంగా వచ్చిన చిత్రం ‘నీది నాది ఒకటే కథ’. కొడుకు బాగా బతకాలి అని తపించే తండ్రి…మనకొచ్చిన పని చేసుకుంటూ జీవితంలో సాగిపోవాలి అని నమ్మే కొడుకు. ఈ లైన్‌ని అద్భుతంగా వెండితెరపై పండించారు దేవిప్రసాద్, శ్రీవిష్ణు. మధ్య తరగతి తండ్రి పాత్రలో దర్శకుడు దేవిప్రసాద్ పరకాయ ప్రవేశం చేశారని చెప్పాలి. విద్యలేని వాడు వింత పశువు అన్న నానుడి ఎప్పటి నుంచో సమాజంలో పాతుకుపోయింది. చదువుకోని వాడు వింత పశువేనా ? చదువురాని వాళ్లంతా పనిరాని వాళ్లేనా ? అని ప్రశ్నలు వేస్తే దర్శకుడు వేణు ఊడుగల తీసిన సినిమా…ప్రేక్షకులను థియేటర్ బయటకు వచ్చిన తర్వాత కూడా వెంటాడుతుంది. ప్రతి మధ్య తరగతి తండ్రి…ఆ మాటకొస్తే ప్రతి తండ్రి తన పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకుంటారు. చదువులో వెనుక బడితే జీవితంలో వెనుక బడినట్టే అని ఆందోళన చెందుతారు. ఈ సంఘర్షణని బలంగా చూపించి, చర్చించారు ‘నీది నాది ఒకే కథ’లో. తండ్రిని అసలు లెక్కచేయని ‘మహర్షి’ చాలా బాగా చదవాలి, గొప్పవాడు కావాలని తపనపడే మధ్య తరగతి కొడుకులకు.. ధనవంతుల తనయులు అడ్డుపడుతుంటారు. డబ్బు, పలుకుబడితో ప్రతి విషయంలో వారిని తొక్కాలని చూస్తుంటారు. అలాంటి సంఘటన ఎదురైనప్పుడల్లా తండ్రిని తలచుకుని అసహనం వ్యక్తం చేస్తుంటాడు కొడుకు. ఓడిపోయిన తండ్రిగా చూస్తూ నాన్నను అసలు లెక్కచేయడు ఆ కొడుకు. ఆ తండ్రి కూడా కొడుకు కలలకు వారధి కాలేకపోతున్నానని మదనపడుతూ తననిన తాను ఓడిపోయిన తండ్రిగా చూసుకుంటాడు. అలా ఆ తండ్రి కొడుకుల మధ్య చూపులు తప్పా మాటలే ఉండవు. ఒకే ఇంట్లో ఉన్న ఆ తండ్రి-కొడుకుల మధ్య ఏడు సముద్రాలంత దూరం ఉంటుంది. అలాంటి పాత్రలను మహర్షిలో చాలా చక్కగా చూపించాడు ‘వంశీపైడిపల్లి’. ఆకలి రాజ్యం: దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు…ఆ పరిస్థితులను ఎత్తి చూపిన చిత్రం ఆకలి రాజ్యం. అదే సినిమాలో తండ్రి, కొడుకుల మధ్య సంఘర్షణని దర్శకుడు కె.బాలచందర్ అద్భుతంగా చూపించారు. తాను చెప్పినట్టుగా తనయుడు నడుచుకోవడం లేదని తండ్రి. తన దారిలో తనను వెళ్లనివ్వడం లేదని కొడుకు. ఆత్మాభిమానం విషయంలో ఇద్దరూ ఏమాత్రం తగ్గేది లేదంటారు. సుతిమెత్తగా తిట్టిపోసే తండ్రి ‘రఘువరన్ బీటెక్’: మిడిల్ క్లాస్ తండ్రులను ప్రేక్షకులకు బాగా చూపించిన చిత్రాల్లో రఘువరన్ బీటెక్ ఒకటి. ధనుష్ తండ్రిగా సముద్రఖని నటించారు. కొడుకేమో సివిల్ ఇంజినీర్ జాబ్ వస్తే మాత్రమే చేస్తానంటాడు. ఎన్నాళ్లు ఖాళీగా కూర్చుంటావని సుతిమెత్తగా తిట్టి పోస్తూ ఉంటా డు తండ్రి. ఇలాంటి నాన్నలు మనకి ప్రతి చోట కనిపిస్తూనే ఉంటారు. అందుకే ఈ క్యారెక్టర్ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ‘చిత్రలహరి’.. కొడుకు కోసం సైకాలజిస్ట్‌గా మారిన తండ్రి: మిడిల్ క్లాస్ అన్న మాటలోనే అసలు విషయం అంతా ఉంది. ఇటు పూర్ ఫ్యామిలీ కోటాలోకి వెళ్లలేరు. అటు రిచ్ ఫ్యామిలీస్ సరసన నిలబడలేరు. కుటుంబ పెద్ద ఏమాత్రం బ్యాలెన్స్ తప్పి ఆ ఫ్యామిలీ రోడ్డున పడుతుంది. అందుకే…మిడిల్ క్లాస్ ఫాదర్స్‌లో పిల్లల కెరీర్ గురించి అంత ఎక్కువ తపన కనిపిస్తూ ఉంటుంది. ఆ క్రమంలోనే అరుపులు. తిట్లు. అవసరం అయితే నాలుగు దెబ్బలు కూడా ఉంటాయి. కానీ…ఎదిగిన కొడుకు ప్రేమ దెబ్బకి దిగాలు పడిపోతే అరుపులు, తిట్లు పని చేయవు. అప్పుడే నాన్న తనకు తాను సైకాలజిస్ట్ అయిపోతాడు. ఇలాంటి పాత్రని ‘చిత్రలహరి’ సినిమాలో అద్భుతంగా చూపించాడు దర్శకుడు కిషోర్ తిరుమల. సాయి ధరమ్ తేజ తండ్రిగా పోసాని కృష్ణ మురళి నటన అందరినీ ఆకట్టుకుంది. ఇడియట్: నాన్న తిడతాడు. నాన్న కోప్పడతాడు. ఓకే.. బాగానే ఉంది. మరి కొడుకేం చేస్తాడు? ఏమన్నా చేస్తే నాన్న ఎందుకు తిడతాడు చెప్పండి ? చాలా ఇళ్లలో జరిగేది ఇదే. కొడుకులు చాలా సందర్భాల్లో నాన్నలను లైట్ తీసుకుంటారు. ఆ తండ్రి అసహనం…ఈ తనయుడి టేక్ ఇట్ ఈజీ పాలసీ. ఇడియట్ సినిమాలో ఇలాంటి నాన్నకి యాక్షన్ చెప్పేశాడు పూరి జగన్నాథ్. ‘కొత్త బంగారు లోకం’.. కొడుకుని కొప్పడని తండ్రి: నాన్నలకు కోపం ఉంటుంది నిజమే. కానీ…కొందరు నాన్నలకు తమ పెంపకం మీద ఎనలేని నమ్మకం ఉంటుంది. తమ కోపాన్ని, అసహనాన్ని, పిల్లల ముందు చూపించడానికి కూడా ఇష్టపడరు. ఈ టైప్ ఆఫ్ నాన్నలు మిడిల్ క్లాస్‌లో కనిపించడం తక్కువే. ఆ మాటకొస్తే తెలుగు సినిమాల్లోనూ తక్కువే. ‘కొత్త బంగారు లోకం’లో అలాంటి తండ్రి పాత్రకు ప్రకాశ్ రాజ్ ప్రాణం పోశారు. ‘అమ్మో ఒకటో తారీఖు’: ఇప్పటి దాకా పిల్లల మీద అరిచే తండ్రులను చూశాం. అవసరమైతే రెండు దెబ్బలు వేసే తండ్రులను చూశాం. మధ్య తరగతి కుటుంబం అంటేనే… ఒంటెద్దు బండి అనే అర్థం. అలాంటి ఒంటెద్దు లాంటి తండ్రిని కళ్ల ముందుంచిన చిత్రం ‘అమ్మో ఒకటో తారీఖు’. గోవింద రావు పాత్రలో ఎల్.బి.శ్రీరాం చెలరేగిపోయారు. చాలా మధ్య తరగతి కుటుంబాల్లో తాము పేద వాళ్లం కాదన్న భావన ఉంటుంది. కానీ అక్కడ ఉండేదల్లా పేదరికమే. ఆ పరిస్థితిని, మధ్య తరగతి కుటుంబాల్లోని వ్యక్తుల ఆలోచనని, ఇంటి పెద్ద పడే ఆవేదనని వెండితెరకెక్కించడంలో దర్శకులు ఇ.వి.వి.సత్యనారాయణ సక్సెస్ అయ్యారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో రేలంగి మామయ్య: మిడిల్ క్లాస్ డాడీస్ అనగానే…బీపీ కామన్ అన్నట్టుగా వాతావరణం ఉంటుంది. కానీ, కొందరు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటారు. ఆల్ ఈజ్ వెల్ పాలసీని బలంగా నమ్ముతారు. ఈ తరహా నాన్నలు నిజ జీవితంలో అరుదుగానే కనిపిస్తూంటారు. ఆమాట కొస్తే వెండితెర మీద కూడా అరుదే. అలాంటి తండ్రిని రేలంగి మామయ్య క్యారెక్టర్లో మనకు చూపించాడు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ దర్శకుడు. ఆ పాత్రకి తనదైన శైలిలో ప్రాణం పోశారు ప్రకాశ్ రాజ్. ‘పెళ్లి చూపులు’లో తండ్రికి చుక్కలు చూపించి విజయ్: హీరో కొంచెం అల్లరి చిల్లరిగా ఉంటేనే సినిమాకి అందం. అలాంటి హీరోని తండ్రి చివాట్లు పెడితేనే అసలు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ ఫార్ములాకి దర్శకులు పదును పెడుతూ ఉండటం వల్ల…మిడిల్ క్లాస్ తండ్రి పాత్రలు సిల్వర్ స్క్రీన్‌పై బాగా పండుతున్నాయి. ‘పెళ్లి చూపులు’ చిత్రంలో అలాంటి డాడీ క్యారెక్టర్లో నవ్వులు పూయించాడు నటుడు కేదార్ శంకర్. ఇక హీరో విజయ్ దేవరకొండ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్దగా చదువు ఎక్కని బద్దకపు కొడుకుగా తండ్రికి చుక్కలు చూపించే పాత్రలో విజయ్ రెచ్చిపోయాడు. -
వామ్మో ‘జూన్’.. తలుచుకుంటే వణుకు పుడుతోంది!
‘జూన్ అంటేనే మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ నెలలోనే విద్యాసంస్థలు, వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల్లో ఫీజులు చుక్కలనంటుతున్నాయి. బుక్స్, యూనిఫాం, పెన్నులు, పెన్సిల్ ఇతరాత్ర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు వానాకాలం సీజన్ మొదలవ్వడంతో రైతులు పెట్టుబడుల కోసం తిప్పలు పడుతున్నారు. విత్తనాలు, ఇతర ఖర్చులకు డబ్బుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూనే బ్యాంకర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దీంతో ఈనెల ఎలా గట్టేక్కుతుందా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.’ సాక్షి,కరీంనగర్: పేద, మధ్య తరగతి కుటంబీకుల జేబులకు చిల్లుపడే మాసం వచ్చేసింది. ఈ నెల 12 నుంచి కొత్తవిద్యాసంవత్సరం ప్రారంభంకానున్న నేపథ్యంలో పిల్లల చదువుకు పెట్టే ఖర్చులపై తల్లిదండ్రులు బేరీజు వేసుకుంటున్నారు. కొత్తగా అడ్మిషన్ తీసుకునేవారు ప్రైవేటు విద్యాసంస్థలు వసూలు చేస్తున్న అడ్మిషన్, డొనేషన్ ఫీజులు చూసి జంకుతున్నారు. ఇదివరకే చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం తదితర వస్తువుల కొనుగోలుతో తల్లిదండ్రులకు జేబులకు చిల్లుపడనుంది. దీంతో ‘వామ్మో జూన్’ అంటూ తలపట్టుకుంటున్నారు. ఒక వైపు తమ పిల్లలను ఏ పాఠశాలలో చేర్పించాలి, ఏయే స్కూల్లో ఏ స్థాయి ఫలితాలు వచ్చాయి, తదితర అంశాలపై తల్లిదండ్రులు విశ్లేషించుకుంటున్నారు. అప్పు చేసైనా పైసలున్న బడికి.. జిల్లావ్యాప్తంగా సుమారు 600 పైగా ప్రైవేట్ పాఠశాలల్లో వాటి విద్యాప్రమాణాలు, ఇతర అంశాలతో కూడిన స్థాయిని బట్టి ఏడాదికి రూ.10 వేల నుంచి మొదలుకొని రూ.లక్షకు పైగా ఫీజులున్నాయి. అందులోనూ ఐఐటీ, ట్యూషన్, సాంస్కృతిక, కరాటే తదితర అంశాలు నేర్పించేందుకు అదనంగా రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు ప్రైవేట్ స్కూళ్లు వసూలు చేస్తున్నాయి. వీటిలో కొన్ని తోకల పేరుతో 1వ తరగతికే రూ.లక్షల్లో వసూలు చేయడం విశేషం. కొన్ని పాఠశాలలైతే నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అప్పు చేసైనా ప్రైవేట్ స్కూల్ అనేది వేళ్లూనుకోవడంతో దిగువ, మధ్య తరగతి జనం కూడబెట్టుకున్న దానికి మరికొంత అప్పు చేసి పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. రైతులకు ఖరీఫ్ భారం ఏటా రైతులకు వానాకాలం సీజన్ భారంగా మారుతోంది. ఈ యాసంగి పంటలు పండినా ధా న్యం డబ్బు చేతికి రాని దైన్య స్థితిలో రైతులు ఉ న్నారు. వ్యవసాయ పనులూ అంతంతే. ఇతరత్రా కూలీ పనులు దొరక్క గ్రామీణులుæ ఉపాధి పనుల కు వెళ్లినా కొద్ది రోజులుగా డబ్బులు అందక వారి పరిస్థితి గందరగోళంగా ఉంది. మండుతున్న ఎండల్లో ఉపాధి పనులకు వెళ్తే రూ.200 నుంచి రూ. 250 వరకు దక్కడం లేదు. ఈ పరిస్థితుల్లో ఖరీ ఫ్‌నకు సంబంధించి ఎరువులు, విత్తనాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల్లో సరిపడా రుణాలు లభించక అప్పు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. పిల్లల చదువు, వ్యవసాయ ఖర్చులు అంచనా వేయలేని స్థితి ఏర్పడడంతో పేద, మధ్య తరగతి ప్రజల్లో ఆందోళన నెలకొంది. చదవండి: కుక్క కరిచిందా.. అయితే రూ.10వేలు తీసుకోవడం మరచిపోకండి! -
ఇడ్లీ, దోశ పిండితో మొదలెట్టి.. వేల కోట్ల కంపెనీకి సీఈఓ
ముంబై: వ్యాపారాల్లో విజయాలు అంత సులువుగా రావు. ఎన్నో కష్టాలు, అడ్డంకులు.. ఇలా ఎదురయ్యే ప్రతి వాటిని దాటుకుంటూ వెనకడుగు వేయక ముందుక సాగాల్సి ఉంటుంది. అలా ప్రయాణించిన ఓ పేద కుటుంబంలోని యువకుడు నేడు వేల కోట్ల కంపెనీకి సీఈవో అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన ముస్తఫా పేద కుటుంబం నుంచి వచ్చాడు. తన తండ్రి.. రోజూ కూలీ పని చేస్తే గానీ మూడు పూటల తిండి దొరకని స్థితి. తను 6వ తరగతిలో ఫెయిల్ కావడంతో చదువు మానేసి కూలి పనులకు వెళ్లాలనుకుంటున్న తరుణంలో అతని స్కూల్ టీచర్ చొరవతో మళ్లీ స్కూల్‌కి వెళ్లే అవకాశం దక్కించుకోవడంతో పాటు స్కూల్లో టాపర్‌గా నిలిచాడు. చివరికి ఉద్యోగం సంపాదించి తన తండ్రి చేసిన అప్పులన్నింటినీ తీర్చేశాడు. అనంతరం విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం రావడంతో వెళ్లాడు. జీవితం సాఫీగా సాగుతున్నా ఏదో తెలియని వెలితే ఉన్నట్లు అనిపించింది. ఉద్యోగం కన్నా బిజినెస్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఓ రోజు అతని బంధువులలో ఒకరు నాణ్యమైన ఇడ్లీ-దోశ పిండి కంపెనీని ప్రారంభించాలనే ఆలోచనను ఇచ్చారు. అది నచ్చడంతో ముస్తఫా ₹ 50,000 పెట్టుబడితో వ్యాపారం మొదలుపెట్టి తెలిసినవారికే వ్యాపార బాధ్యతలు అప్పగించి వెళ్లిపోయాడు. అయితే, మూడు సంవత్సరాల తర్వాత అతను తన పూర్తి సమయాన్ని కంపెనీపై దృష్టి పెడితేనే లాభాల్లోకి వెళ్తుందని గ్రహించి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అలా పూర్తి సమయాన్ని కంపెనీ కోసం కేటాయించినప్పటికీ ఒకానొక దశలో తన ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేక కంపెనీలో షేర్లు ఇస్తానని మాటిచ్చాడు. అలా 8 ఏళ్ల పాటు అతని ప్రయాణం ఎన్నో కష్టాలను చవి చూశాక.. చివరకు తన కంపెనీకి ఓ పెద్ద ఇన్వెస్టర్ దొరికారు. 2000 కోట్ల రూపాయలను ఐడీ ఫ్రెష్ ఫుడ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడంతో కంపెనీ రూపురేఖలే మారిపోయాయి. కంపెనీ విస్తరించడంతో పాటు సేల్స్ కూడా పెరిగాయి. తాను చెప్పినట్లుగా అందులో ఉన్న ఉద్యోగులను లక్షాధికారులను చేశాడు. ప్రస్తుతం తన కంపెనీలో వందల మంది పనిచేస్తున్నారు. చదవండి: వినూత్న ఉద్యోగ ప్రయత్నం.. ఉద్యోగం కావాలంటూ హోర్డింగ్ ఏర్పాటు, అయినా..? -
మిడిల్ క్లాస్.. ఐపీఎస్
‘కానిస్టేబుల్ కొడుకు ఐపీఎస్ అవుతాడా..! అంటూ ఎగతాళి’ ‘ఆటో డ్రైవర్ కొడుకుకు సివిల్స్ కోచింగ్ అవసరమా? అంటూ గేలి’ ‘వ్యవసాయదారుడి కుమారుడు పోలీసా?’ అంటూ ఆశ్చర్యం..’ ..వారి లక్ష్యం కోసం శ్రమిస్తున్న సమయంలో సమాజంలో చాలా మంది ఇలా వెనుక నుంచి వెక్కిరించినవారున్నారు. అలాంటి వారి అంచనాలు తప్పు అంటూ.. లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ మిడిల్ క్లాస్ అబ్బాయిలంతా నేడు ఐపీఎస్ అధికారులయ్యారు. కల సాకారం చేసుకున్నారు. సంకల్పం, పట్టుదల ఉంటే ఎంతటి సుదూర లక్ష్యమైనా చిన్నబోతుంది అనడానికి ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారులే మంచి ఉదాహరణ. సివిల్స్ ఛేదించడానికి మునుపటి స్థాయిలో కష్టపడక్కర్లేదని, ఇంటర్నెట్ ఉండటంతో పట్టుదల ఉన్న వారు ఎవరైనా సివిల్స్ లక్ష్యాన్ని చేరుకోవచ్చని భరోసా కల్పిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కేంద్రం 11 మంది ఐపీఎస్‌లను కేటాయించింది. వారిలో నలుగురు ‘సాక్షి’తో మాట్లాడారు. అఖిల్ మహాజన్,బాలస్వామి, రోహిత్‌రాజు, రూపేశ్ చెన్నూరి.. అంతా లోకల్ బ్యాచ్. వీరిలో అఖిల్ కూకట్‌పల్లిలో సాధారణ బ్యాచిలర్. బాలస్వామి ఓయూలో పాఠాలు చెప్పిన అసిస్టెంట్ ప్రొఫెసర్. రోహిత్‌రాజు, బాలస్వామి కిట్స్ కాలేజీలో అల్లరి చేసిన కుర్రాళ్లే. అందరిదీ మిడిల్‌క్లాస్ నేపథ్యమే. వారి స్వప్నం వారిని వీఐపీలుగా మార్చింది. లా అండ్ ఆర్డర్‌ను కాపాడే ఐపీఎస్‌లను చేసింది. నాన్నే నాకు స్ఫూర్తి... నేను పుట్టి పెరిగింది వరంగల్‌లోనే. నాన్న అప్పట్లో సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్. కిట్స్‌లో ఇంజనీరింగ్ చేశా. నాన్నను చూసి చాలా స్ఫూర్తి పొందాను. అందుకే ఐపీఎస్ ఎంచుకున్నా. 2013లో డిగ్రీ అయ్యాక ఐపీఎస్ సాధించాలన్న కసి పెరిగింది. ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నా. ఎట్టకేలకు సాధించా. చాలా మంది కానిస్టేబుల్ కొడుకు ఐపీఎస్ అవ్వడమేంటి? అనుకున్నారు. కానీ నా కలముందు ఆ మాటలు చిన్నవైపోయాయి. లక్ష్యానికి పేదరికం అడ్డుకాదు. కల నెరవేరే దాకా వెనకడుగు వేయకండి. – రోహిత్‌రాజు దూరవిద్యతో నెరవేరిన కల.. చిన్నప్పటి నుంచి ఐపీఎస్ నా కల. మాది మహబూబ్‌నగర్‌లో చిన్న వ్యవసాయ కుటుంబం. ఇంటర్‌లోనే జాబ్ రావడంతో చేరాను. అయినా కల మీద మమ కారంతో దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేశా. తరువాత ఓయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరాను. నిజాం కాలేజీలోనూ పాఠాలు బోధించా. ఏడోసారి సివిల్స్ రాసి ఎట్టకేలకు ఎంపికయ్యా. – బాలస్వామి లక్ష్యాన్ని ఎన్నడూ మర్చిపోలేదు.. మాది వరంగల్ జిల్లా హసన్‌పర్తి. నాన్న ఆటోడ్రైవర్, హసన్‌పర్తి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదివాను. 2013లో వరంగల్ కిట్స్‌లో ఇంజనీరింగ్ చేశా. తరువాత ఒక సంస్థలో ఉద్యోగం చేశాను. కానీ, ఏనాడూ నా లక్ష్యాన్ని మర్చి పోలేదు. ఆటోడ్రైవర్ కొడుకు ఐపీఎస్ చదవడమేంటని ఎంత మంది అనుకున్నా.. నేను ఎక్కడా వెనక్కి తగ్గలేదు. – రూపేశ్ చెన్నూరి ఎన్నడూ రాజీపడవద్దు... మాది జమ్మూ. కుటుంబ నేపథ్యం వ్యాపారం. 2011లో హైదరాబాద్ జేఎన్టీయూలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశా. తరువాత మైక్రోసాఫ్ట్‌లో చేరాను. చిన్నప్పటి నుంచి ఐపీఎస్ నా కల. అందుకే ఉద్యోగం వదిలేశా. 2013లో సివిల్స్ కోసం ప్రిపరేషన్ ప్రారంభించా. 2017లో సివిల్స్‌కు సెలక్టయ్యా. సివిల్స్ లక్ష్యంగా పెట్టుకున్నవాళ్లు ఏనాడూ రాజీపడవద్దు. – అఖిల్ మహాజన్ -
పొట్ట కొట్టిన కరోనా
సాక్షి, హైదరాబాద్: పీజీ, డిగ్రీలు చేసి చిన్నాచితకా ఉద్యో గాలతో నెట్టుకొస్తున్న లక్షలాది మంది మధ్య తరగతి కుటుంబాల యువతను కరోనా, లాక్డౌన్ కష్టాల్లోకి నెట్టేశాయి. వీరు పనిచేసే స్కూళ్లు, కళాశాలలు, బార్లు, సినిమా థియేటర్లు, జిమ్‌లు మూతపడడంతో జీవితాలు అగమ్య గోచరంగా మారాయి. ఇందులో 30 ఏళ్ల అనుభవం ఉన్న లెక్చరర్ల నుంచి సినిమా థియేటర్లు ఊడ్చి బతుకుబండిని లాగే స్వీపర్ వరకు ఉన్నారు. వీరంతా ఏం పాలుపోని స్థితిలో పడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తికి అవకాశం ఎక్కువనే కారణంతో దేశవ్యాప్తంగా వీటిని తెరిచేందుకు అనుమతి లేకపోవడంతో వీటిలో పనిచేస్తున్న వారంతా దినదినగం డంగా బతుకీడుస్తున్నారు. మూడు నెలలుగా జీతాల్లేక, చేతిలో ఉన్న కొద్ది సొమ్మూ ఖర్చయి పోవడంతో ప్రత్యామ్నాయ ఉపాధి కోసం వెతుకులాడుతున్నారు. కొందరు చేసేదేమీ లేక గ్రామాల్లో ఉపాధి పనులకు పోతుంటే మరికొందరు మళ్లీ తాము పనిచేసే కేంద్రాలు తెరుచుకోకపోతాయా అని ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇంకొందరు దొరికిన పనితోనే పొట్టపోసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా, మన రాష్ట్రంలోనూ రోజురోజుకూ కరోనా విజృంభిస్తుండటంతో ఇవెప్పటికి తెరుచుకుంటాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బతుకుదెరువు దెబ్బతిన్న వీరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన, ఆర్థిక చేయూతపై యోచించాలని నిపుణులు అంటున్నారు. బతకలేక.. ప్రైవేట్ టీచర్ కరోనా, లాక్‌డౌన్‌తో బాగా దెబ్బతిన్నది ప్రైవేటు విద్యారంగం. రాష్ట్రంలో అన్ని రకాల ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలు కలిపి 50వేల వరకు ఉన్నాయి. వీటిలో టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్ కనీసం 10లక్షల మంది వరకు ఉంటారని అంచనా. ఈ ఏడాది మార్చి 22 నుంచి పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. దీంతో వీటిలో పనిచేసే వారంతా ఉపాధి కోల్పోయారు. మార్చి నెల వేతనాలందుకున్న వీరికి ఏప్రిల్, మే, జూన్‌లో పైసా కూడా చేతిలో పడలేదు. మధ్యతరగతికి చెందిన ఉన్నత విద్యావంతులైన వీరంతా డిగ్రీ నుంచి పీజీలు, డబుల్ పీజీలు చేసినవారే. పాఠాలు చెప్పి పొట్టపోసుకునే వీరికిప్పుడు ఏంచేయాలో తోచట్లేదు. కొందరు ఇంటి వద్దే ట్యూషన్లు చెప్పుకునే ప్రయత్నం చేస్తుండగా, మరికొందరు పల్లెకు వెళ్లి ఉపాధి హామీ పనులు చేసుకుంటున్నారు. ఇక, భవనాల అద్దె కట్టలేక విద్యాసంస్థల యాజమాన్యాలు సతమంతం అవుతున్నాయి. కూలబడిన ‘జిమ్’లు కరోనా దెబ్బకు కూలబడిన ప్రధాన సెక్టార్లలో జిమ్‌లు కూడా ఉన్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే వేలాది జిమ్‌లు ఉండగా, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ ప్రాంతాల్లోనూ పదుల సంఖ్యలో ఉన్నాయి. ఒక్కో జిమ్‌లో కనీసం ఇద్దరు ట్రైనర్లు ఉంటారు. కనీసం రూ.20లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు పెట్టుబడి ఉంటే కానీ జిమ్‌లు ఏర్పాటు చేయలేరు. 3వేల చదరపు అడుగుల వైశాల్యం ఉన్న భవనాలు కావాలి. దీంతో రాష్ట్రంలోని దాదాపు అన్ని జిమ్‌లు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. అద్దె చెల్లింపు యాజమాన్యాలకు భారమైంది. ఇటీవలే హైదరాబాద్‌కు చెందిన ఓ జిమ్ ట్రైనర్ ఆత్మహత్య చేసుకున్నారు. జిమ్ ట్రైనర్లు పూర్తిగా ఉపాధి కోల్పోయారు. ఇప్పటికిప్పుడు జిమ్‌లు తెరిచేందుకు ప్రభుత్వాలు అనుమతిచ్చినా ప్రజలు రాలేని పరిస్థితి. దీంతో జిమ్‌లపై ఆధారపడ్డ కుటుంబాలు ల ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. బోరుమంటోన్న బార్లు బార్లు దాదాపు దివాలా స్థితికి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి వరకు బార్లు ఉండగా, కనీసం బార్‌కు 20 మంది చొప్పున 20వేల కుటుంబాలు వీటిపై ఆధారపడి బతుకుతున్నాయి. కుక్‌లు, బార్టెండర్లు, బిల్లింగ్ సెక్షన్లో పనిచేసేవారు, సూపర్వైజర్లు, స్వీపర్లు.. ఇలా వేలాది మంది బార్లలో పనిచేస్తూ బతుకీడుస్తున్నారు. కరోనా కారణంగా బార్లు తెరిచేందుకు ప్రభుత్వాలు ససేమిరా అంటున్నాయి. దీంతో వేలాది మంది చిరుద్యోగుల భవిష్యత్తు అంధకారంలో పడింది. యాజమాన్యాలు ఇచ్చే అరకొర వేతనంతో పాటు టిప్‌ల కింద వచ్చే చిల్లరతో పొట్టపోసుకునే బార్ టెండర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. బార్ల యాజమానుల పరిస్థితి మరీ ఘోరంగా మారింది. బార్లు సవ్యంగా నడిచే సమయంలోనే లైసెన్సు ఫీజు కింద ప్రభుత్వానికి లక్షల రూపాయలు చెల్లించడం కష్టంగా ఉండేది. లాక్డౌన్ కాలానికి లైసెన్సుఫీజు రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా సానుకూల స్పందన రాలేదు. చిరిగిన వెండి‘తెర’ బతుకులు లాక్‌డౌన్‌కు ముందు రంగులీనిన వెండితెర.. ఇప్పుడు కరోనా పంజా దెబ్బకు చిరిగిపోయింది. ఇప్పుడిప్పుడే షూటింగ్‌లకు అనుమతిచ్చినా సినిమా థియేటర్లు తెరిచే పరిస్థితి లేకపోవడంతో వాటిపై ఆధారపడ్డ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి. థియేటర్లలో పనిచేసే గేట్మ్యాన్ల నుంచి వాచ్మెన్లు, టికెట్ కౌంటర్లు, క్యాంటీన్లలో పనిచేసే చిరుద్యోగులకు కుటుంబపోషణ కష్టంగా మారింది. మూడునెలలకు పైగా ఉపాధి లేకపోవడంతో పట్టణాల్లో కూలీ పనులకు వెళ్లి పొట్టపోసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,200 వరకు థియేటర్లుంటాయని అంచనా. వీటిలో కనీసం 50వేల మంది పనిచేస్తుండగా, వీరంతా కరోనా దెబ్బకు రోడ్డునపడ్డారు. ఏం చేయాలి? ఎలా బతకాలి? 1994లో లక్ష రూపాయల పెట్టుబడితో హన్మకొండ రాగన్న దర్వాజ వద్ద జిమ్ సెంటర్ పెట్టా. నాతో పాటు ఇద్దరు ట్రైనర్లు పనిచేస్తారు. ఇప్పుడు మా పరిస్థితేమిటో?. గత పాతికేళ్లలో ఇలాంటి ఉత్పాతం చూడలేదు. అద్దె కట్టలేక సెంటర్‌ను ఖాళీ చేయాల్సిన పరిస్థితి.. జిమ్ పరికరాలు ఎక్కడ పెట్టాలి?, కుటుంబాలనెలా పోషించుకోవాలి?. నాలుగు నెలలుగా ఉపాధి లేక ట్రైనర్లు మానసికంగా కుంగిపోతున్నారు. – పోతరాజు రవి, సూర్య జిమ్ సెంటర్, హన్మకొండ వంద రోజులుగా ఇంట్లోనే.. బార్ వెయిటర్‌గా ఎనిమిది గంటలు పనిచేస్తే యజమాని ఇచ్చే వాటితో పాటు టిప్‌లు కలిపి రూ.10వేల వరకు వచ్చేవి. ఉన్నదాంట్లో కుటుంబాన్ని నడిపించా. లాక్‌డౌన్‌తో ఇప్పుడు వంద రోజులుగా ఇంట్లోనే ఉంటున్నా. పైసా ఆదాయం లేదు. రెండ్రోజుల క్రితం ఎలక్ట్రీషియన్ పని దొరికింది. రోజుకు రూ.300 ఇస్తున్నారు. నాతో పాటు బార్లో పనిచేసిన మరో 30 మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. – గర్దాస్ పరమేశ్వర్, వెయిటర్, అమృతా బార్, జనగామ -
కరోనా జీవన చిత్రం.. పొదుపు మంత్రం..
శరత్, సంతోషి భార్యాభర్తలు. సికింద్రాబాద్‌లోని ఓ పేరున్న హోటల్లో ఒకరు మేనేజర్, మరొకరు రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా రెండు నెలలుగా విధులకు హాజరు కావడం లేదు. హోటల్ మూతబడటంతో వీరికి ఏప్రిల్ నెల వేతనం అందలేదు. మరోవైపు లాక్డౌన్ ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఫలితంగా ఇప్పటికిప్పుడు మరో ఉద్యోగం వెతుక్కోవడం కష్టమే. దీంతో అందుబాటులో ఉన్న నగదు నిల్వలను, పీఎఫ్ విత్‌డ్రా చేస్తే వచ్చిన మొత్తాన్ని జాగ్రత్త చేసుకున్నారు. మరో నాలుగు నెలల వరకు ఈ నగదుతో జీవనం సాగించేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటూనే ప్రత్యామ్నాయ ఆదాయం కోసం ప్రయత్నిస్తున్నారు. రాజేశ్ దిల్సుఖ్నగర్ సమీపంలోని ఓ మల్టీప్లెక్స్‌లో సూపర్వైజర్. వచ్చే ఆదాయంతో ఇద్దరు పిల్లలు, భార్యతో ఆనందంగా గడుపుతున్నాడు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో థియేటర్ కాంప్లెక్స్ మూతపడింది. ఉద్యోగానికి లాక్‌పడి సరిగ్గా రెండు నెలలైంది. అప్పట్నుంచి వేతనం లేదు. దీంతో ఇద్దరు పిల్లల్ని పోషించడం ఎలా అనే ప్రశ్నతో ఉన్నపళంగా ఇల్లు ఖాళీ చేసి సొంతూరు నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లికి వెళ్లిపోయాడు. పరిస్థితులు చక్కబడే వరకు అక్కడే ఉండాలని నిర్ణయించుకుని, చేతిలో ఉన్న సొమ్మును జాగ్రత్త చేసుకుని కుటుంబ పోషణ చూసుకుంటున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ లక్షలాది కుటుంబాల జీవన చిత్రాన్ని మార్చేసింది. ఇప్పటికిప్పుడు పరిస్థితులు చక్కబడేటట్లు లేకపోవడంతో పలు రంగాల్లో పనిచేస్తున్న వారిని ప్రత్యామ్నాయ బాట చూపిస్తూనే పొదుపు మంత్రానికి అలవాటు చేసింది. లాక్డౌన్ కారణంగా చాలా సంస్థలు మూతపడ్డాయి. హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, లాడ్జీలు, సినిమా థియేటర్లు, ఫంక్షన్ హాళ్లు తదితర సంస్థలు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. అలాగే విద్యా సంస్థలు, వాటికి అనుబంధంగా ఉన్న హాస్టళ్లు సైతం మూత పడ్డాయి. లాక్డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ ఇలాంటి సంస్థలు తెరుచుకునే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో వీటిల్లో పనిచేస్తున్న లక్షలాది ఉద్యోగులు సొంతూళ్ల బాట పట్టారు. ఇక్కడే స్థిరపడ్డ వారు మాత్రం రోజు వారీ ఖర్చులు భారీగా తగ్గించుకుంటూ పొదుపు జీవితానికి అలవాటు పడుతున్నారు. దాచిన సొమ్ముతో ధైర్యంగా.. లాక్డౌన్ కారణంగా చాలామంది ఉద్యోగాలకు దూరమయ్యారు. సడలింపులతో కొందరు తిరిగి విధులకు హాజరవుతున్నారు. అయితే పూర్తిస్థాయిలో కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు మాత్రం తెరుచుకోలేదు. మరోవైపు ఆర్థిక సర్దుబాటులో భాగంగా కొన్ని కంపెనీలు ఉద్యోగాల తొలగింపు చేస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి కారణాలతో ఉద్యోగాలు పోతాయనే భయం వారిలో సరికొత్త ఆలోచనలకు ప్రాణం పోస్తోంది. ఇప్పటికిప్పుడు ఉద్యోగం కోల్పోతే ఎలా? అనే కోణంలో దాదాపు ప్రతి ప్రైవేటు ఉద్యోగి ఆలోచిస్తూ భవిష్యత్ కార్యాచరణ తయారు చేసుకుంటున్నాడు. చేతిలో ఉన్న నగదు, దాచిన సొమ్మును జాగ్రత్తగా ఖర్చు చేసేలా ప్రణాళిక తయారు చేసుకుంటూనే, కొత్తగా అప్పులు చేయకుండా గట్టెక్కే మార్గాలను అన్వేషిస్తున్నాడు. ఈక్రమంలో దుబారా ఖర్చులకు మంగళం పాడుతూ పొదుపు బాటన పరుగులు పెడుతున్నాడు. ఇక ఇప్పటికిప్పుడు ఉద్యోగం కోల్పోయినా, కొత్త ఉద్యోగం వెతికిపట్టుకుని అందులో ఇమిడే వరకు పట్టే ఆర్నెల్ల కాలం తన కుటుంబంతో తాపీగా బతికేలా ఆర్థిక ప్రణాళిక రూపొందించుకుంటున్నాడు. ఎందుకీ వృథా ఖర్చు మార్చి 22 నుంచి రాష్ట్రంలో లాక్డౌన్ అమలవుతోంది. అయితే హోటళ్లు, థియేటర్లు, రెస్టారెంట్లు, విద్యా సంస్థలు, హాస్టళ్లు మాత్రం మార్చి 16 నుంచే మూతబడ్డాయి. సరిగ్గా 2 నెలలు పూర్తి కాగా, ఈ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు అప్పట్నుంచి జీతభత్యాలు లేవు. ఫలితంగా కుటుంబ పోషణ గందరగోళంగా మారింది. ఈ క్రమంలో ఆయా కుటుంబాలు పొదుపుబాట పట్టాయి. అందుబాటులో ఉన్న నగదును పక్కా ప్రణాళికతో ఖర్చు పెడుతున్నాయి. కొందరికి అధికంగా టీ తాగడం అలవాటు. కానీ ప్రస్తుతం చాలా ఇళ్లలో టీ, టిఫిన్లను భారీగా తగ్గిస్తున్నారు. వీటికి బదులుగా చిరుధాన్యాలైన పెసర్లు, శనగలు, బొబ్బర్లను ఉడికించి తినడం అలవాటు చేసుకుంటున్నారు. టిఫిన్లతో పోలిస్తే వీటి ఖర్చు తక్కువే. అదేవిధంగా నూనె వేపుళ్లు, ఇతర చిరుతిళ్లకు పూర్తిగా చెక్‌పెడుతూ.. అన్నం, కూరగాయలతో కానిచ్చేస్తున్నారు. తీసుకునే ఆహారం ఒక క్రమపద్ధ తిలో భుజిస్తే ఎన్నోరకాలుగా కలిసొస్తుందనే పాఠాన్ని వంటబట్టించుకుంటున్నారు. కుటుంబ పోషణలో కీలకమైన కిరాణా సరుకులను కూడా పద్ధతిగా కొనుగోలు చేస్తూ అనవసరమైన వాటికి దాదాపు దూరమవుతున్నారు. ఇలా కొత్త తరహా జీవనానికి అలవాటు పడుతూ పొదుపే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నారు. -
ఇంటి పద్దు.. అతిగా వద్దు
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడుతోంది. ముఖ్యంగా కుటుంబ ఆర్థిక విధానంలో భారీ కష్టాలు మొదలవుతున్నాయి. సగటు వేతన జీవికి ఆర్థిక సమస్యలు ప్రారంభమయ్యాయి. మార్చి 22 నుంచి ఏప్రిల్ 14 వరకు తొలివిడత లాక్డౌన్ పూర్తయింది. అనంతరం రెండో విడత లాక్డౌన్ ఈ నెల 14 నుంచి మే 7 వరకు పెరిగింది. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టేంత వరకు లాక్డౌన్ ఒక్కటే సరైన మార్గమని ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వైరస్ వ్యాప్తి తీవ్రత తగ్గకుంటే లాక్డౌన్ మరింత పెరిగే అవకాశం లేకపోలేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో మధ్యతరగతి కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. లాక్డౌన్ పొడిగిస్తే తలెత్తే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేందుకు వేతన జీవి కుటుంబం సన్నద్ధమవుతోంది. మరింత పక్కాగా ఖర్చులు.. పేద, మధ్యతరగతి వర్గాల్లో భవిష్యత్ అవసరాల కోసం చేసే పొదుపు అంతా నెలవారీ ఖర్చులపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం వేతన జీవికి నెలకొచ్చే జీతంపై సందిగ్ధం నెలకొంది. లాక్డౌన్ కారణంగా చాలా రంగాలు మూతబడ్డాయి. రోజువారీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. మరోవైపు చిన్నపాటి వ్యాపారం చేసుకునే వారిపై కూడా లాక్డౌన్ ప్రభావం పడింది. ఈ క్రమంలో ఖర్చులు భారీగా తగ్గించుకుంటే మేలని భావిస్తున్నారు. ముఖ్యంగా అదనపు ఖర్చులను పూర్తిగా రద్దు చేయడంతో పాటు ఆహార పద్ధతుల్లో కూడా అనవసర ఖర్చును తగ్గించుకుంటున్నారు. చిరుతిళ్లకు చెక్ పెట్టి సాదాసీదా తిండికి అలవాటు పడుతున్నారు. కొందరిలో లాక్డౌన్ కారణంగా కిరాణా సరుకులు సైతం దొరకవనే భావన కనిపిస్తోంది. దీంతో అవసరానికి మించి ఎక్కువ కొనుగోళ్లు చేస్తున్నారు. తొలిదశ లాక్డౌన్లో ఎక్కువ శాతం కుటుంబాలు ఇలాగే కొనుగోళ్లు చేయడంతో చాలా దుకాణాలు సరుకులు లేక వెలవెలబోగా... ధరలు సైతం అమాంతం పెరుగుతున్నాయి. ప్రస్తుతం కిరాణా సరుకులకు కొరత లేదు. దీంతో అవనసర ఖర్చును పూర్తిగా తగ్గించి పరిమితంగా కొనుగోళ్లు చేస్తే మంచిదని భావిస్తున్నారు. చెల్లింపుల భారం ఎలా.. లాక్డౌన్ కారణంగా బ్యాంకుల వద్ద తీసుకున్న రుణ చెల్లింపులపై ప్రభుత్వం మారటోరియం విధించింది. దీంతో మూడు మాసాల వరకు రుణ వాయిదాల చెల్లింపులు చేయాల్సిన పనిలేదు. అయితే ఈ మొత్తాన్ని లాక్డౌన్ తర్వాత చెల్లించాల్సిందే. అయితే అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇంతకు ముందున్న పరిస్థితే ఉంటుందా? అనే సందిగ్ధం సర్వత్రా నెలకొంది. దీంతో వాయిదాల చెల్లింపులను కట్టేద్దామనే ఆలోచనలో పడ్డారు. బ్యాంకింగ్ రంగంలో రుణాల మారటోరియం ఉండగా.. ప్రైవేటు అప్పులు, నెలవారీ చీటీలు, ఇతర సేవింగ్స్ పథకాలు, రుణ వాయిదాలపై ఎలాంటి మారటోరియం లేదు. దీంతో ప్రస్తుతం ఖర్చులు తగ్గించుకుని ఆ మొత్తాన్ని అప్పులు చెల్లిస్తే ఇబ్బంది ఉండదనే అభిప్రాయం మధ్యతరగతి వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రెండు నెలల వరకు పాఠశాలలు తెరిచే అవకాశం లేకపోవడంతో స్కూల్ ఫీజులకు వెచ్చించే మొత్తాన్ని ఇతర రుణ చెల్లింపులపై ఖర్చు చేస్తున్నారు. నిత్యావసర సరుకుల కొనుగోళ్లు మొదలు.. రుణ వాయిదాల చెల్లింపులు.. నిర్వహణ ఖర్చుల్లో భారీ మార్పులు చోటుచేసుకోవడంతో కుటుంబ ఆర్థిక వ్యవస్థ కొత్త బాట పడుతోంది. లాక్డౌన్ కాలంతో పాటు అనంతర పరిస్థితుల ఆధారంగా బతుకు బండి ప్రయాణం సాగుతుంది. -
గల్ఫ్ మోసం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నిరుద్యోగులు.. మధ్యతరగతి వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఏజెంట్ల ముసుగులో మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి వేలరూపాయలు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేస్తున్న ఏజెంట్లు అనేకమంది ఉన్నారు. ఏజెంట్లను నమ్మి ఆస్తులు అమ్ముకుని విమానం ఎక్కిన ఎందరో అమాయకులు గల్ఫ్ దేశాల్లో మగ్గుతున్నారు. ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోయి నరకం అనుభవిస్తున్న 54 మంది జిల్లావాసులు అబుదాబి, మలేషియా, బహ్రెన్ ప్రాంతంలో నరకం అనుభవిస్తున్నట్లు సమాచారం. బుధవారం సాక్షిలో వచ్చిన కథనంతో స్పందించిన బాధితులు ఒక్కొక్కరుగా మీడియాకు ఫోన్లుచేసి సమాచారమిస్తున్నారు. ‘ఏజెంటు చేతిలో మోసపోయాం.. ఇక్కడ నరకం చూస్తున్నాం. మమ్మల్ని ఈ నరక కూపం నుంచి తీసుకెళ్లండి’ అంటూ ఫోన్లు చేసి కన్నీరుపెడుతున్నారు. మూడు రోజుల క్రితం సాక్షిలో ‘విదేశాల్లో ఉపాధి పేరుతో పేదలకు టోకరా’ శీర్షికన కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనంతో ఏజెంట్ల చేతిలో మోసపోయిన బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. నాయుడుపేటకు చెందిన టోపీభాయ్ చేతిలో 25 మంది మోసపోయినట్లు తెలిసింది. వారంతా లక్షలు పోగొట్టుకున్నట్లు బోరుమంటున్నారు. అదేవిధంగా పొదలకూరుకు చెందిన రాణెమ్మ, ఆమె భర్తను బాధితుల ఫిర్యాదు మేరకు బుధవారం కోవూరు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గల్ఫ్ మోజులో నగలు.. స్థలాలు అమ్మేసుకుంటున్నారు నాయుడుపేటకు చెందిన ఓమహిళ తన ఒంటిపై ఉన్న రెండుసవర్ల బంగారాన్ని, ఇంటిస్థలాన్ని రూ.90 వేలకు అమ్మి కుమార్తెను దుబాయ్‌కి పంపేందుకు ఏజెంట్ కు ఇచ్చారు. అయితే డబ్బు తీసుకున్న ఏజెంటు కనిపించకుండా పోవటంతో లబోదిబోమంటోంది. ఇలా జిల్లాలో అనేకమంది గల్ఫ్ మోజులోపడి ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు. ఓజిలి మండలానికి చెందిన మేకల రమేష్, బల్లి దినకర్, పద్మ, సురేష్, నరేష్, నారాయణమ్మ మరికొందరు టోపీభాయ్కి లక్షల్లో ముట్టజెప్పారు. వారందరికీ అబుదాబి, మలేషియాలో ఉద్యోగం ఇప్పిస్తామని వసూలు చేసుకుని పత్తాలేకుండా పోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మరో 15 మంది నుంచి డబ్బు వసూలు చేసి కేరళలోని తిరుచ్చికి తీసుకెళ్లి వదిలిపెట్టినట్లు బాధితులు వాపోతున్నారు. మరి కొందరు మలేషియా వెళ్లి ఎక్కడికి పోవాలో దిక్కుతోచక తిరుగుతుంటే విజిలెన్స్ అధికారులు పసిగట్టి వారిని తిరిగి నాయుడుపేటకు చేర్చినట్లు బాధితులు వెల్లడించారు. ఇలా ఎంతోమంది ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారి గురించి పత్రికలు, టీవీల్లో కథనాలు వస్తుండటంతో గల్ఫ్‌లో నరకం అనుభవిస్తున్న అనేక మంది బాధితులు బంధువులకు ఫోన్లు చేసి కాపాడమని వేడుకుంటున్నారు. గల్ఫ్‌లో ఇబ్బందులుపడుతున్న వారిని తిరిగి నివాసాలకు చేర్చాలని వారి బంధువులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. -
ఆధార్‌తో అవస్థ గడువు పెంపు లేనట్టే ?
ఏలూరు, న్యూస్‌లై న్ : ప్రభుత్వం వంటగ్యాస్ ధరను అమాంతం పెంచేసి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం వేసింది. మరోవైపు ఆధార్ అనుసంధానం చేరుుం చుకోని వారికి గ్యాస్‌పై సబ్సిడీ మొత్తాన్ని ఇచ్చేది లేదని అధికారులు చావుకబురు చల్లగా చెబుతున్నారు. ఎలాంటి సాంకేతిక కారణాలున్నా తమకు సంబంధం లేదని, గడచిన డిసెంబర్ 31లోగా ఆధార్ అనుసంధానం చేరుుంచుకోని వినియోగదారులు సిలిండర్‌కు రూ.1,326 చొప్పున చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల జిల్లాలో అనుసంధాన ప్రక్రియ పూర్తి చేరుుంచుకోని సుమారు 2లక్షలకు పైగా వినియోగదారులకు గ్యాస్ గుదిబండగా మారనుంది. నెలాఖరు వరకూ గడువు కోరినా... ఆధార్ అనుసంధానం గడువును ఈ నెలాఖరు వరకు పెంచాలన్న డిమాండ్ ప్రజల నుంచి వచ్చింది. అధికారులతోపాటు ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా స్పందించింది. అరుుతే, గడువు పొడిగించేందుకు అంగీకరిం చేది లేదని గ్యాస్ కంపెనీలు మొండికేస్తున్నారుు. ఈ విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసేందుకు సిద్ధమైందని అధికార వర్గాల భోగట్టా. దీంతో డిసెంబర్ 31లోగా ఆధార్ అనుసంధానం చేరుుంచుకోని వారందరి నుంచి సిలిం డర్‌కు రూ.1,326 చొప్పున వసూలు చేసి తీరుతామని గ్యాస్ కంపెనీలు పేర్కొంటున్నారుు. సుప్రీం కోర్టు వద్దన్నా... గ్యాస్ సిలిండర్లకు ఆధార్ అనుసంధానం చేయూలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్పందించిన సుప్రీం కోర్టు సబ్సిడీ వర్తింపునకు ఆధార్ కార్డు అర్హత కాదని వ్యాఖ్యానించింది. దీనికి తోడు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి సైతం గ్యాస్ పంపిణీకి ఆధార్ అవసరం లేదంటూ ప్రకటనలు గుప్పించారు. ఇది నిజమని నమ్మిని వినియోగదారులు ఆధార్ అనుసంధానం చేయించుకోలేదు. జిల్లాలో మొత్తంగా 8.50 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నారుు. ఇందులో కేవలం 5.86 లక్షల మంది ఆధార్ అనుసంధానం చేరుుంచుకున్నారు. ఇంకా 2.64 లక్షల కనెక్షన్లకు అనుసంధానం కాలే దు. ఇందులో డబుల్ కనెక్షన్లు ఉన్నవారు, బినామీలు లక్షపైనే ఉన్నట్లు అంచనా. ఆరుుల్ కంపెనీల తాజా నిర్ణయంతో మిగతా వారంతా సబ్సిడీకి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ‘మా చేతుల్లో లేదు’ : ఆధార్ అనుసంధాన ప్రక్రియ గడువు పెంపు విషయమై డీఎస్వో డి.శివశంకరరెడ్డిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా... ఆ నిర్ణయం తమ చేతుల్లో లేదన్నారు. గడువు పెంపు విషయమై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ తమకెలాంటి ఉత్తర్వులు అందలేదని తెలిపారు. అనుసంధానం చేరుుంచుకోని వారికి సబ్సిడీపై గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే అవకాశం లేదని చెప్పారు. తక్షణమే ఆధార్ అనుసంధానం చేరుుంచుకుంటే సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. -
భయం నీడన జనం
జిల్లా ప్రజల్లో 2013 భయాన్ని నింపింది. భవిష్యత్తును బంగారు మయం చేసుకోవాలని పైసాపైసా పోగు చేసిన అనేక మంది మధ్య తరగతి కుటుంబీకులు నిలువునా మోసపోయారు. ఆర్థిక నేరాలు, చోరీలు పెరిగిపోయాయి. హత్యలు, ప్రతీకార దాడులు పోలీసులకు సవాళ్లు విసిరాయి. అభద్రత నడుమ మహిళలు జీవించాల్సి వచ్చింది. - న్యూస్‌లైన్, అనంతపురం క్రైం అనంతపురంలో రౌడీషీటర్లు, కిరాయి హంతక ముఠా సభ్యులు పెట్రేగిపోయారు. కమ్యూనిస్టు నేత హత్యతో ప్రారంభమైన ఏడాది... ప్రతి నెలా ఒకటి, రెండు హత్యలతో కొనసాగింది. జనవరి 1న అనంతపురంలో జాతీయ రహదారిపై తెల్లవారుజామున కమ్యూనిస్టు నేత, మాజీ కార్పొరేటర్ రామకృష్ణారెడ్డిని ప్రత్యర్థులు హతమార్చారు. మార్చి 4న ఇందిరానగర్‌లోని రైలు పట్టాలపై పెయింటర్ ప్రసాద్‌ను స్నేహితులే దారుణంగా హతమార్చారు. ఏప్రిల్ 2న సాక్షి ఉద్యోగి నరసింహులును పథకం ప్రకారం కిరాయి హంతక ముఠా నరికి చంపింది. ఏప్రిల్ 7న ఎమ్మార్పీస్ నేత సిద్ధును బంధువులే హతమార్చారు. అక్టోబర్ 23న కేబుల్ ఆపరేటర్ అయూబ్‌ను ప్రత్యర్థులు హత్యచేశారు. అభద్రత నడుమ అనంత మహిళా లోకం.. నిర్భయ చట్టాన్ని ప్రవేశపెట్టిన ఏడాదిలోపే జిల్లాలో పది కేసులు నమోదయ్యాయి. తల్లిదండ్రులకు కాఫీ తెచ్చేందుకు హోటల్‌కు వెళ్లి న తొమ్మిదేళ్ల చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడు, ఓ యువకుడు సామూహిక అత్యాచారానికి తెగబడిన ఘటన ‘అనంత’ మహిళా లోకాన్ని ఆందోళనకు గురి చేస్తే... మైనర్ బాలికను తల్లిని చేసి అసహజమైన పద్ధతిలో పిండాన్ని తొలగించి పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు పెంచి తప్పించుకోవాలని చూసిన ఓ మానవ మృగాన్ని మహిళా సంఘాల ఒత్తిడితో ఉన్నతాధికారులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. పెచ్చరిల్లిన ఆర్థిక నేరాలు నవంబరు 19న ‘ది అనంతపురం టౌన్ కోఆపరేటివ్ బ్యాంకు’లో క్యాషియర్‌గా పనిచేసే రమేశ్‌రెడ్డి రాబరీకి తెగబడ్డాడు. రూ.13 లక్షల నగదును అపహరించి పట్టుబడ్డాడు. నవంబరు 30న మణప్పుఱం గోల్డ్‌లోన్ బ్యాంకులో అసిస్టెంట్ క్యాషియర్‌గా పనిచేసే విక్రమ్‌రావు తాకట్టు నగలను అపహరించినట్లు వెలుగు చూసింది. పోలీసుల దర్యాప్తులో రూ. 1.50 కోట్ల విలువైన బంగారు నగలు మాయమైనట్లు స్పష్టమైంది. జిల్లాలో నకిలీ నోట్లు చలామణి కూడా విచ్చలవిడిగా కొనసాగింది. నేరాల చిట్టా ఇదిగో... జిల్లా వ్యాప్తంగా చోరీల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకొని స్నాచింగ్ ముఠాలు హల్చల్ చేశాయి. ఏడాది మొత్తం (డిసెంబర్ 27 వరకు) 6555 కేసులు నమోదు కాగా వీటిలో కిరాయి హత్యలు తొమ్మిది, దోపిడీలు 5, రాబరీలు 23, పగటి దొంగతనాలు 47, రాత్రి చోరీలు 210, సాధారణ, పశువుల దొంగతనాలు 572 జరిగాయి. ఈ ఏడాది రూ.5,40,25,222 విలువజేసే బంగారం, నగదును చోరులు తస్కరించారు. ఇందులో పోలీసులు రూ.3,31,06,830 విలువజేసే సొత్తును రికవరీ చేశారు. కాగా, 140 దాడులు, 53 కిడ్నాపులు, 105 లైంగికదాడులు, 25 తీవ్ర ఘాతుకాలు, 45 సాధారణ ఘాతుకాలు, 1321 మోసాలు, 147 నమ్మించి ద్రోహం చేసిన ఘటనలు, 6 నకిలీ కరెన్సీ కేసులు, 4 హత్యాయత్నాలు పోలీసు రికార్డుల్లో నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగులపై నిఘా సారించలేకపోయారు. అవినీతి చేపలకు వల విసిరిన ఏసీబీ.. ఈ ఏడాదిలో రెండు సార్లు పెనుకొండ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నవంబరు 5న నంబులపూలకుంట మండల కేంద్రానికి చెందిన పంచాయతీరాజ్ శాఖ జూనియర్ ఇంజినీర్ తులసీప్రసాద్, అక్టోబరు 26న హిందూపురం సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల విద్యాలయంలో ప్రిన్సిపాల్ అరుణకుమారి ఏసీబీ అధికారుల ఉచ్చులో చిక్కుకున్నారు. మార్చి 2న వరంగల్జిల్లా హన్మకొండ నుంచి కర్ణాటకలోని కోలార్‌కు ఏపీ36టీఏ 3362 వాహనంలో జిలెటిన్‌స్టిక్స్ తీసుకెళ్తుండగా ఆ వాహనం మిడుతూరు వద్ద ఆపిన డీసీటీఓ రమేశ్‌కుమార్‌రెడ్డి రూ.1.50 లక్షలు లంచం డిమాండ్ చేసి పట్టుబడ్డాడు. -
అధికారుల నిర్లక్ష్యం లబ్ధిదారులకు శాపం
జిల్లాలో రాజీవ్ స్వగృహ ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. జీవితంలో సొంతింటి కలను సాకారం చేసుకోవాలనే సామాన్య, మధ్య తరగతి ప్రజల ఆశలు అడియాశలు అవుతున్నాయి. లబ్ధిదారులు మాత్రం అటు బ్యాంకులకు వడ్డీలు చెల్లించలేక.. ఇటు వారు నివాసముంటున్న ఇళ్లకు అద్దెలు చెల్లించుకోలేక నలిగిపోతున్నారు. ఇళ్లు ఎప్పుడు పూర్తి చేస్తారనే విషయంలో అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు. -న్యూస్‌లైన్, రాయచోటి రాయచోటి,న్యూస్‌లైన్: సామాన్య, మధ్య తరగతి ప్రజలకు తక్కువ మొత్తానికే సొంతింటి కల సాకారం చేయాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో రాజీవ్ స్వగృహ పథకాన్ని ప్రారంభించారు. పథకం కింద జిల్లాలోని రాయచోటిలో 550, రాజంపేటలో 220 ఇళ్లతో రాజీవ్ స్వగృహ కాలనీల నిర్మాణం గత నాలుగేళ్లుగా సాగుతోంది. ఈ పథకం కింద రాయచోటిలో మొత్తం 550 ఇళ్లకు గాను 120 ఇళ్ల నిర్మాణం పనులు మాత్రమే ప్రారంభించారు. ఈ పనులను ఏఎంఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకుంది. అవి కూడా నత్తనడకన సాగుతున్నాయి. రాయచోటి వెంచర్‌లోని 120 గృహాల నిర్మాణానికి కేవలం 20 మంది కూలీలను వినియోగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదే సంస్థ రాజంపేట పట్టణంలో గృహ నిర్మాణ పనులను సైతం సంవత్సరాల తరబడి సాగిస్త్తుండటం గమనార్హం. ఇక్కడి లబ్ధిదారుల వద్ద వ సూలు చేసిన మొత్తంతో రాజీవ్ స్వగృహ ఎండీ శాలినీమిశ్రా హైదరాబాద్ శివార్లలో కోట్లు విలువచేసే బహుళ అంతస్తులను నిర్మించారు. వాటిని విక్రయించి వచ్చిన మొత్తంతో జిల్లాలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని భావించారు. కానీ వాటిని కొనుగోలు చేసే నాధుడే లేకపోవడంతో సంస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం స్వగృహకు ’.105కోట్ల వడ్డీతో కూడిన రుణాన్ని మంజూరు చేసి సగానికిపైగా పనులు జరిగిన ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆదేశించింది. ఇలా ప్రభుత్వ నిధులతో తిరిగి రాయచోటి, రాజంపేట వెంచర్ల పనులను ఏఎంఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకుని మొదలు పెట్టింది. సకాలంలో బిల్లులు రాకపోవడం, నిధుల కొరత తదితర కారణాలతో నిర్మాణం పనులు నత్తనడకన సాతున్నాయి. స్వగృహ కాలనీ పనులు నత్తనడకన సాగుతుండటంపై లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమ గృహాల నిర్మాణం జరిగినంతవరకు అయిన డబ్బులను పట్టుకుని మిగిలిన ఖర్చును తమకు యిచ్చేయండంటూ గత నెలలో స్వగృహ ఎండీ దేవానందంను నిలదీశారు. ఇందుకు ఆయన స్పందిస్తూ డిసెంబరు లోపు నిర్మాణం పూర్తిచేసి ఇళ్లను అప్ప చెబుతామన్నారు. లేనిపక్షంలో మీకు కేటాయించిన గృహాల నిర్మాణానికి ఖర్చుచేసిన మొత్తాన్ని పట్టుకుని మిగిలినది వెనక్కు యిచ్చేస్తాం మీరే ఇళ్లను నిర్మించుకోండని చెప్పారని లబ్ధిదారులు చెబుతున్నారు. 10 రోజుల్లో ఖర్చును లెక్కగట్టి ఇళ్లను అప్పగిస్తామని లబ్ధిదారుల నుంచి సమ్మతి పత్రాలను తీసుకెళ్లిన అధికారులు ఇంతవరకు వారి ఇళ్లకు అయిన ఖర్చును లెక్కగట్టడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఇళ్లనిర్మాణం కోసం బ్యాంకుల నుంచి లక్షల్లో తీసుకున్న రుణానికి కంతులు చెల్లించలేకపోగా ఈ రుణానికి తిరిగి ఒకటిన్నర నుంచి రెండు లక్షల వరకు వడ్డీలు చెల్లిస్తున్నారు. ఇప్పటికైనా స్వగృహ అధికారులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి తమ కేటాయించిన గృహాలను సమంజసమైన రేట్లకే తమకు అప్పజెప్పాలని లబ్ధిదారులు కోరుతున్నారు. రూ.1.60 లక్షలు వడ్డీచెల్లించా స్వగృహలో క్లాసిక్ మోడల్ ఇంటి నిర్మాణం కోసం బ్యాంకు నుంచి రూ.15లక్షలు అప్పు తీసుకున్నాం. ఈ అప్పుకు ఇప్పటివరకు రూ.1.60లక్షల వడ్డీ చెల్లించాను. ఒకవైపు వడ్డీ, మరోవైపు బాడుగ ఇంటికి అద్దె చెల్లించలేక అల్లాడుతున్నాం. వెంటనే మాకు కేటాయించిన గృహాన్ని పూర్తిచేసి అప్పజెప్పాలి. -రామానుజం, లబ్ధిదారు మీచేత కాకపోతే మేమే నిర్మించుకుంటాం మాకు కేటాయించిన ఇళ్లను పూర్తిచేయడం రాజీవ్ స్వగృహ అధికారులకు చేతకాకపోతే వెంటనే మాకు అప్పజెప్పాలి. నిర్మించినంతవరకు ఇంటి విలువను లెక్కగట్టి మేము చెల్లించిన మొత్తంలో పట్టుకుని మిగిలిన సొమ్మును, గృహాన్ని మాకు అప్పజెపితే మేమే నిర్మించుకుంటాం. రవీంద్రనాథబాబు, లబ్ధిదారు ఆర్థికంగా చితికిపోయాం స్వగృహలో ఇంటినిర్మాణం కోసం అవసరమైన డిపాజిట్టు చెల్లింపునకు అవసరమైన డబ్బుకోసం అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోయాం. ఇదే సమయంలో గృహనిర్మాణాల కోసం బ్యాంకు మంజూరు చేసిన రుణాలకు వడ్డీలు, ఇళ్ల అద్దెలు కట్టలేక సతమతమవుతున్నాం. మృత్యుంజయరాజు, లబ్ధిదారు . -
తగ్గని కూర‘గాయాలు’
జోగిపేట, న్యూస్‌లైన్: కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఈ ధరలు ఇప్పుడప్పుడే దిగివచ్చే పరిస్థితులు కన్పించడం లేదు. పెరిగిన ధరలతో గత రెండు నెలలుగా సామాన్య, మధ్యతరగతి జీవులు అవస్థలు పడుతున్నారు. ఇదివరకు నెల బడ్జెట్లో కూరగాయలకు రూ.450 కేటాయిస్తే సరిపోయేది ఇప్పుడు వెయ్యి రూపాయలు కేటాయించినా సరిపోయే పరిస్థితి లేదు. ధరలు రెట్టింపు కావడంతో కిలో కొనేవారు అరకిలో, అరకిలో కొనేవారు పావు కిలో మేరకు కొనుగోలు చేస్తున్నారు. ఇదివరకు మూడు పూటలు కూరగాయలతో తినేవారు ఇప్పుడు ఒకేపూటతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఏ కూరగాయ కొనుగోలు చేయాలన్నా కిలోకు రూ.30 నుంచి రూ.40 వరకు వెచ్చించాల్సి వస్తుంది. ఆలుగడ్డ, బెండకాయ కిలో ధర రూ.35 చొప్పున, పెద్ద చిక్కుడు, బీర్నిస్, దొండకాయ, మిర్చి రూ.40 చొప్పున విక్రయిస్తున్నారు. ఒక్క టమాటా ధర మాత్రం కాస్త దిగివచ్చింది. కిలో రూ.20 పలుకుతుంది. పాలకూర కట్ట ఒకటి రూ.5, కోతిమీర, కరివేపాకు ఒక కట్ట రూ.5 చొప్పున అమ్ము తున్నారు. ఆదివారం జోగిపేటలో జరిగిన అంగడిలో ఈ ధరలను చూసి సామాన్యులు బిక్కమోహం వేశారు. కూరగాయల ధరలన్నీ ఒకేసారి పెరిగిపోవడంతో ఏ కూరగాయలు కొనుగోలు చేయాలో అర్థం కాని జనం సతమతమవుతున్నారు. ధరలు తగ్గలేదు టమాటా మినహా ఇతర కూరగాయల ధరలు తగ్గలేదు. ఒక్కో కూరగాయ ధర కిలో రూ.40 వరకు ఉంది. ధరలు పెరగడంతో అమ్మకాలు తగ్గాయి. ధరలు తక్కువగా ఉంటేనే అన్ని వర్గాల వారు కొనుగోలు చేస్తారు. - రమేశ్, కూరగాయల వ్యాపారి, జోగిపేట -
మీకెందుకులెండి కారు !
నెలకు 50 వేల రూపాయల జీతం లేకుంటే కారు కొనటం ఇక కలే. ఎందుకంటే కనీసం 50వేల జీతం లేకుంటే తాము కారు కొనటానికి రుణం ఇవ్వలేమని ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ తెగేసి చెప్పేసింది. సాధారణంగా అయితే రుణం లేకుండా కారు కొనే మధ్యతరగతి వారు ఉండనే ఉండరు. మరి జీతం తక్కువైతే రుణం ఇవ్వలేమని బ్యాంకులు చెప్పేస్తుంటే ఇక మధ్య తరగతి కుటుంబాలు కారు కొనేదెలా? ఎస్బీఐ దారినే ఇతర బ్యాంకులూ అనుసరిస్తున్న ఈ సమయంలో మధ్య తరగతికి దారేది? ఇదే ఈ వారం ప్రాఫిట్ ప్రత్యేక కథనం... డాలరు దెబ్బకు కార్ల ధరలు రయ్యిమంటూ దూసుకెళుతున్నాయి. మరోపక్క ఇంధన ధరలూ అదే రీతిలో ఎగిసిపోతున్నాయి. వీటికి తోడు రుణాలపై వడ్డీ రేట్లు... కార్లకు బీమా ప్రీమియం... మెయింటెనెన్స్ చార్జీలు... ఇలా అన్నీ కొత్తగా కారు కొనే వాళ్లని భయపెడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రుణం మీద కారు కొనుగోలు చేస్తే నెలకు కనీసం రూ.20,000 కేటాయించక తప్పటం లేదు. అందుకనే బ్యాంకులు కారు రుణం నిబంధనలు కఠినతరం చేస్తున్నాయి. ఎస్బీఐ అయితే వార్షిక వేతనం రూ.6 లక్షలు ఉండాల్సిందేనని స్పష్టం చేస్తోంది. చిత్రమేంటంటే ఎస్బీ ఐలో పనిచేస్తున్న క్లరికల్ స్థాయి ఉద్యోగి జీతం కూడా దీనికన్నా తక్కువే. అంటే బ్యాంకు ఉద్యోగికి కూడా కారు లోన్ దొరికే అవకాశం లేదన్న మాట. ‘‘ఈ నిబంధన వల్ల ఆఫీసర్ స్థాయి అధికారి మాత్రమే కారు కొనుక్కోగలరు’’ అని ఎస్బీఐ అధికారే అంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఇప్పటివరకూ వార్షిక వేతనం రూ.2.5 లక్షలుంటే చాలు ఎస్బీఐ రుణం మంజూరు చేసేది. మొండిబకాయిలు పెరగటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకు చెబుతోంది. ఎస్బీఐ నిర్ణయం నేపథ్యంలో మరికొన్ని బ్యాంకులు కూడా రుణ వాయిదాలు పోగా... జీతంలో 50-40% మొత్తం చేతికి వచ్చేట్లుంటేనే లోన్ ఇస్తామని స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఉద్యోగికి గృహరుణం లేదా ఏ ఇతర రుణాలైనా ఉంటే...కార్ లోన్ లభించే అవకాశాలు సన్నగిల్లాయి. ఎస్బీఐ నిర్ణయం వెనక... వడ్డీరేట్లు, ఇంధన, ఇతర నిర్వహణా వ్యయాలు పెరిగిన నేపథ్యంలో రుణంపై కారు కొన్నవారికి నెలకు రూ.20 వేలు ఖర్చవుతోందని, దీన్ని భరించాలంటే కనీసం రూ.50 వేలు జీతం ఉండాలని ఎస్బీఐ చెబుతోంది. లేనిపక్షంలో కారు మోజుతో రుణం తీసుకున్నా చెల్లింపులు చేయలేని పరిస్థితి ఎదురవుతుందని, అందుకే నిబంధనలు కఠినం చేశామని అధికారులు చెబుతున్నారు. రూ.5 లక్షల లోన్ తీసుకుంటే ఐదేళ్ళకు 11 శాతం వడ్డీ చొప్పున ప్రతి నెలా రూ.11,000 వరకు ఈఎంఐ చెల్లించాల్సి వస్తోంది. హైదరాబాద్ వంటి నగరంలో ఒక ఐటీ ఉద్యోగి సగటున రోజుకు 30 కి.మీ, వారాంతంలో 50 కి.మీ చొప్పున తిరుగుతారు అనుకుంటే... పెట్రోల్ ఖర్చు నెలకు రూ.6,800 అదే డీజిల్ అయితే రూ.3,500 వరకు అవుతోంది. కారు సర్వీసింగ్, బీమా, ఇతర నిర్వహణ చార్జీలను కలుపుకుంటే నెలకు మరో రెండు వేల వరకు అవుతోంది. ఇలా చూసుకుంటే ఒక మధ్య స్థాయి కారును నిర్వహణ చేయడానికి కనీ సం నెలకు రూ.20,000 అవుతోందనేది. అందుకని కొత్తగా కారు కొనేవారు కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోవాలని బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి. అందుబాటులో కారు ధర కొత్త కారు ఎంపిక చేసుకునేటపుడు అన్నిటికన్నా ముఖ్యమైనది కారు ధర. మీరు ఎంచుకున్న కారు మోడల్ ధర ఎంతన్నది ముందుగా పరిశీలించాలి. ఎందుకంటే బ్యాంకులు ఇప్పుడు కారు ధరలో గరిష్టంగా 80 నుంచి 90 శాతం వరకు రుణాన్ని అందిస్తున్నాయి. అంటే డౌన్ పేమెంట్ కింద కారు ధరలో 10 నుంచి 20 శాతం తప్పనిసరిగా పెట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు ఎంచుకున్న కారు ధర రూ.5 లక్షలు అనుకుంటే అందులో బ్యాంకు కేవలం రూ.4 లక్షలు మాత్రమే రుణమిస్తుంది. మిగిలిన రూ.లక్షను డౌన్ పేమెంట్ కింద మీరు చెల్లించాల్సిందే. అలాగే పెట్రోల్ వెర్షన్ కంటే డీజిల్ వెర్షన్ ధర లక్ష నుంచి లక్షన్నర వరకు అధికంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. డీజిల్ వెర్షన్ ఎంచుకుంటే ఆ మేరకు చెల్లించే ఈఎంఐ భారం పెరుగుతుంది కూడా. పెట్రోల్ కంటే డీజిల్ ధర తక్కువగా ఉన్నా ఆ మేరకు ఈఎంఐ భారం పెరగడం, నిర్వహణా వ్యయం డీజిల్ కార్లలో ఎక్కువగా ఉండటం వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటే పెద్దగా తేడా ఏమీ కనిపించదు. చెల్లింపు సామర్థ్యం కారు మోడల్‌ను ఎంచుకున్నాక దాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా లేదా అన్నది పరిశీలించుకోవాలి. సాధారణంగా లక్ష రూపాయల రుణానికి ఐదేళ్ళ కాలపరిమితి గనక ఉంటే... నెలకు దాదాపు రూ.2,000 ఈఎంఐగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఐదు లక్షలకు తీసుకుంటే దాదాపు రూ.10,000 నెలకు కట్టాల్సి ఉంటుంది. ప్రతినెలా ఇంత మొత్తం కేటాయించగలమా లేదా అన్నది ఆలోచించుకోవాలి. కాలపరిమితి సాధారణంగా కార్‌లోన్స్ మూడేళ్ళ నుంచి గరిష్టంగా ఏడేళ్ల కాలపరిమితిలో ఇస్తున్నాయి. కాలపరిమితి పెంచుకునే కొద్దీ... చెల్లించే వడ్డీ అధికం అవుతుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. నెలవారీ చెల్లించే ఈఎంఐ కొద్దిగా అధికమైనా సాధ్యమైనంత వరకు తక్కువ కాలపరిమితిని ఎంచుకోవడం ద్వారా వడ్డీ భారం తగ్గుతుంది. దాని ప్రకారం కాలపరిమితిని ఎంచుకోవాల్సి ఉంటుంది. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం వడ్డీరేట్లు... ప్రైవేటు బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వడ్డీరేట్లు తక్కువ. అన్నిటికన్నా ఎస్బీఐ అతి తక్కువ రేటులో 10.45 శాతానికే రుణం మంజూరు చేస్తోంది. కానీ ఇపుడు వార్షికాదాయం కనీసం రూ.6 లక్షలుండాలనే పరిమితి పెట్టింది. ఇంతకంటే తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు మిగిలిన బ్యాంకుల్లో రుణాలను తీసుకోవచ్చు. కానీ ఇలా ఇతర బ్యాంకులను పరిశీలించేటప్పుడు వడ్డీరేటును గమనంలోకి తీసుకోవడం మర్చిపోవద్దు. సాధ్యమైనంత వరకు తక్కువ వడ్డీరేటు ఉన్న బ్యాంకుల్ని సంప్రదించండి. అర్హతలు.. ఇవి బ్యాంకును బట్టి మారుతుంటాయి. సాధారణ నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటే 18 సంవత్సరాలు నిండిన ఉద్యోగస్తులు, అదే స్వయం ఉపాధి పొందే వారైతే 21 ఏళ్లు నిండితే కార్ లోన్‌కు అర్హులు. ఉద్యోగస్తుడైతే చేరిన సంస్థలో కనీసం ఒక సంవత్సరం నుంచి ఉద్యోగం చేస్తుండాలి. రెండేళ్ళు ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేయాలి. అదే వ్యాపారస్తులు, వృత్తినిపుణులు అయితే కనీసం రెండేళ్ళ రిటర్నులు సమర్పించాల్సి ఉంటుంది. గరిష్ట రుణ మొత్తంపై ఎంటువంటి ఆంక్షలు లేవు కానీ... కనీస రుణ మొత్తం లక్ష రూపాయలు. ఇవి కాకుండా పాన్‌కార్డు, వ్యక్తిగత, నివాస ధృవపత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది.