మీకెందుకులెండి కారు !
నెలకు 50 వేల రూపాయల జీతం లేకుంటే కారు కొనటం ఇక కలే. ఎందుకంటే కనీసం 50వేల జీతం లేకుంటే తాము కారు కొనటానికి రుణం ఇవ్వలేమని ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ తెగేసి చెప్పేసింది. సాధారణంగా అయితే రుణం లేకుండా కారు కొనే మధ్యతరగతి వారు ఉండనే ఉండరు. మరి జీతం తక్కువైతే రుణం ఇవ్వలేమని బ్యాంకులు చెప్పేస్తుంటే ఇక మధ్య తరగతి కుటుంబాలు కారు కొనేదెలా? ఎస్‌బీఐ దారినే ఇతర బ్యాంకులూ అనుసరిస్తున్న ఈ సమయంలో మధ్య తరగతికి దారేది? ఇదే ఈ వారం ప్రాఫిట్ ప్రత్యేక కథనం...
డాలరు దెబ్బకు కార్ల ధరలు రయ్యిమంటూ దూసుకెళుతున్నాయి. మరోపక్క ఇంధన ధరలూ అదే రీతిలో ఎగిసిపోతున్నాయి. వీటికి తోడు రుణాలపై వడ్డీ రేట్లు... కార్లకు బీమా ప్రీమియం... మెయింటెనెన్స్ చార్జీలు... ఇలా అన్నీ కొత్తగా కారు కొనే వాళ్లని భయపెడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రుణం మీద కారు కొనుగోలు చేస్తే నెలకు కనీసం రూ.20,000 కేటాయించక తప్పటం లేదు. అందుకనే బ్యాంకులు కారు రుణం నిబంధనలు కఠినతరం చేస్తున్నాయి. ఎస్‌బీఐ అయితే వార్షిక వేతనం రూ.6 లక్షలు ఉండాల్సిందేనని స్పష్టం చేస్తోంది. చిత్రమేంటంటే ఎస్‌బీ ఐలో పనిచేస్తున్న క్లరికల్ స్థాయి ఉద్యోగి జీతం కూడా దీనికన్నా తక్కువే. అంటే బ్యాంకు ఉద్యోగికి కూడా కారు లోన్ దొరికే అవకాశం లేదన్న మాట. ‘‘ఈ నిబంధన వల్ల ఆఫీసర్ స్థాయి అధికారి మాత్రమే కారు కొనుక్కోగలరు’’ అని ఎస్‌బీఐ అధికారే అంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఇప్పటివరకూ వార్షిక వేతనం రూ.2.5 లక్షలుంటే చాలు ఎస్‌బీఐ రుణం మంజూరు చేసేది. మొండిబకాయిలు పెరగటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకు చెబుతోంది. ఎస్‌బీఐ నిర్ణయం నేపథ్యంలో మరికొన్ని బ్యాంకులు కూడా రుణ వాయిదాలు పోగా... జీతంలో 50-40% మొత్తం చేతికి వచ్చేట్లుంటేనే లోన్ ఇస్తామని స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఉద్యోగికి గృహరుణం లేదా ఏ ఇతర రుణాలైనా ఉంటే...కార్ లోన్ లభించే అవకాశాలు సన్నగిల్లాయి.
ఎస్‌బీఐ నిర్ణయం వెనక...
వడ్డీరేట్లు, ఇంధన, ఇతర నిర్వహణా వ్యయాలు పెరిగిన నేపథ్యంలో రుణంపై కారు కొన్నవారికి నెలకు రూ.20 వేలు ఖర్చవుతోందని, దీన్ని భరించాలంటే కనీసం రూ.50 వేలు జీతం ఉండాలని ఎస్‌బీఐ చెబుతోంది. లేనిపక్షంలో కారు మోజుతో రుణం తీసుకున్నా చెల్లింపులు చేయలేని పరిస్థితి ఎదురవుతుందని, అందుకే నిబంధనలు కఠినం చేశామని అధికారులు చెబుతున్నారు. రూ.5 లక్షల లోన్ తీసుకుంటే ఐదేళ్ళకు 11 శాతం వడ్డీ చొప్పున ప్రతి నెలా రూ.11,000 వరకు ఈఎంఐ చెల్లించాల్సి వస్తోంది. హైదరాబాద్ వంటి నగరంలో ఒక ఐటీ ఉద్యోగి సగటున రోజుకు 30 కి.మీ, వారాంతంలో 50 కి.మీ చొప్పున తిరుగుతారు అనుకుంటే... పెట్రోల్ ఖర్చు నెలకు రూ.6,800 అదే డీజిల్ అయితే రూ.3,500 వరకు అవుతోంది. కారు సర్వీసింగ్, బీమా, ఇతర నిర్వహణ చార్జీలను కలుపుకుంటే నెలకు మరో రెండు వేల వరకు అవుతోంది. ఇలా చూసుకుంటే ఒక మధ్య స్థాయి కారును నిర్వహణ చేయడానికి కనీ సం నెలకు రూ.20,000 అవుతోందనేది. అందుకని కొత్తగా కారు కొనేవారు కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోవాలని బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి.
అందుబాటులో కారు ధర
కొత్త కారు ఎంపిక చేసుకునేటపుడు అన్నిటికన్నా ముఖ్యమైనది కారు ధర. మీరు ఎంచుకున్న కారు మోడల్ ధర ఎంతన్నది ముందుగా పరిశీలించాలి. ఎందుకంటే బ్యాంకులు ఇప్పుడు కారు ధరలో గరిష్టంగా 80 నుంచి 90 శాతం వరకు రుణాన్ని అందిస్తున్నాయి. అంటే డౌన్ పేమెంట్ కింద కారు ధరలో 10 నుంచి 20 శాతం తప్పనిసరిగా పెట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు ఎంచుకున్న కారు ధర రూ.5 లక్షలు అనుకుంటే అందులో బ్యాంకు కేవలం రూ.4 లక్షలు మాత్రమే రుణమిస్తుంది. మిగిలిన రూ.లక్షను డౌన్ పేమెంట్ కింద మీరు చెల్లించాల్సిందే. అలాగే పెట్రోల్ వెర్షన్ కంటే డీజిల్ వెర్షన్ ధర లక్ష నుంచి లక్షన్నర వరకు అధికంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. డీజిల్ వెర్షన్ ఎంచుకుంటే ఆ మేరకు చెల్లించే ఈఎంఐ భారం పెరుగుతుంది కూడా. పెట్రోల్ కంటే డీజిల్ ధర తక్కువగా ఉన్నా ఆ మేరకు ఈఎంఐ భారం పెరగడం, నిర్వహణా వ్యయం డీజిల్ కార్లలో ఎక్కువగా ఉండటం వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటే పెద్దగా తేడా ఏమీ కనిపించదు.
చెల్లింపు సామర్థ్యం
కారు మోడల్‌ను ఎంచుకున్నాక దాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా లేదా అన్నది పరిశీలించుకోవాలి. సాధారణంగా లక్ష రూపాయల రుణానికి ఐదేళ్ళ కాలపరిమితి గనక ఉంటే... నెలకు దాదాపు రూ.2,000 ఈఎంఐగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఐదు లక్షలకు తీసుకుంటే దాదాపు రూ.10,000 నెలకు కట్టాల్సి ఉంటుంది. ప్రతినెలా ఇంత మొత్తం కేటాయించగలమా లేదా అన్నది ఆలోచించుకోవాలి.
కాలపరిమితి
సాధారణంగా కార్‌లోన్స్ మూడేళ్ళ నుంచి గరిష్టంగా ఏడేళ్ల కాలపరిమితిలో ఇస్తున్నాయి. కాలపరిమితి పెంచుకునే కొద్దీ... చెల్లించే వడ్డీ అధికం అవుతుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. నెలవారీ చెల్లించే ఈఎంఐ కొద్దిగా అధికమైనా సాధ్యమైనంత వరకు తక్కువ కాలపరిమితిని ఎంచుకోవడం ద్వారా వడ్డీ భారం తగ్గుతుంది. దాని ప్రకారం కాలపరిమితిని ఎంచుకోవాల్సి ఉంటుంది.
- సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం
వడ్డీరేట్లు...
ప్రైవేటు బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వడ్డీరేట్లు తక్కువ. అన్నిటికన్నా ఎస్‌బీఐ అతి తక్కువ రేటులో 10.45 శాతానికే రుణం మంజూరు చేస్తోంది. కానీ ఇపుడు వార్షికాదాయం కనీసం రూ.6 లక్షలుండాలనే పరిమితి పెట్టింది. ఇంతకంటే తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు మిగిలిన బ్యాంకుల్లో రుణాలను తీసుకోవచ్చు. కానీ ఇలా ఇతర బ్యాంకులను పరిశీలించేటప్పుడు వడ్డీరేటును గమనంలోకి తీసుకోవడం మర్చిపోవద్దు. సాధ్యమైనంత వరకు తక్కువ వడ్డీరేటు ఉన్న బ్యాంకుల్ని సంప్రదించండి.
అర్హతలు..
ఇవి బ్యాంకును బట్టి మారుతుంటాయి. సాధారణ నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటే 18 సంవత్సరాలు నిండిన ఉద్యోగస్తులు, అదే స్వయం ఉపాధి పొందే వారైతే 21 ఏళ్లు నిండితే కార్ లోన్‌కు అర్హులు. ఉద్యోగస్తుడైతే చేరిన సంస్థలో కనీసం ఒక సంవత్సరం నుంచి ఉద్యోగం చేస్తుండాలి. రెండేళ్ళు ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేయాలి. అదే వ్యాపారస్తులు, వృత్తినిపుణులు అయితే కనీసం రెండేళ్ళ రిటర్నులు సమర్పించాల్సి ఉంటుంది. గరిష్ట రుణ మొత్తంపై ఎంటువంటి ఆంక్షలు లేవు కానీ... కనీస రుణ మొత్తం లక్ష రూపాయలు. ఇవి కాకుండా పాన్‌కార్డు, వ్యక్తిగత, నివాస ధృవపత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది.