సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నిరుద్యోగులు.. మధ్యతరగతి వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఏజెంట్ల ముసుగులో మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి వేలరూపాయలు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేస్తున్న ఏజెంట్లు అనేకమంది ఉన్నారు. ఏజెంట్లను నమ్మి ఆస్తులు అమ్ముకుని విమానం ఎక్కిన ఎందరో అమాయకులు గల్ఫ్ దేశాల్లో మగ్గుతున్నారు. ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోయి నరకం అనుభవిస్తున్న 54 మంది జిల్లావాసులు అబుదాబి, మలేషియా, బహ్రెన్ ప్రాంతంలో నరకం అనుభవిస్తున్నట్లు సమాచారం.
బుధవారం సాక్షిలో వచ్చిన కథనంతో స్పందించిన బాధితులు ఒక్కొక్కరుగా మీడియాకు ఫోన్లుచేసి సమాచారమిస్తున్నారు. ‘ఏజెంటు చేతిలో మోసపోయాం.. ఇక్కడ నరకం చూస్తున్నాం. మమ్మల్ని ఈ నరక కూపం నుంచి తీసుకెళ్లండి’ అంటూ ఫోన్లు చేసి కన్నీరుపెడుతున్నారు. మూడు రోజుల క్రితం సాక్షిలో ‘విదేశాల్లో ఉపాధి పేరుతో పేదలకు టోకరా’ శీర్షికన కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనంతో ఏజెంట్ల చేతిలో మోసపోయిన బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. నాయుడుపేటకు చెందిన టోపీభాయ్ చేతిలో 25 మంది మోసపోయినట్లు తెలిసింది. వారంతా లక్షలు పోగొట్టుకున్నట్లు బోరుమంటున్నారు. అదేవిధంగా పొదలకూరుకు చెందిన రాణెమ్మ, ఆమె భర్తను బాధితుల ఫిర్యాదు మేరకు బుధవారం కోవూరు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
గల్ఫ్ మోజులో నగలు.. స్థలాలు అమ్మేసుకుంటున్నారు
నాయుడుపేటకు చెందిన ఓమహిళ తన ఒంటిపై ఉన్న రెండుసవర్ల బంగారాన్ని, ఇంటిస్థలాన్ని రూ.90 వేలకు అమ్మి కుమార్తెను దుబాయ్‌కి పంపేందుకు ఏజెంట్ కు ఇచ్చారు. అయితే డబ్బు తీసుకున్న ఏజెంటు కనిపించకుండా పోవటంతో లబోదిబోమంటోంది. ఇలా జిల్లాలో అనేకమంది గల్ఫ్ మోజులోపడి ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు. ఓజిలి మండలానికి చెందిన మేకల రమేష్, బల్లి దినకర్, పద్మ, సురేష్, నరేష్, నారాయణమ్మ మరికొందరు టోపీభాయ్‌కి లక్షల్లో ముట్టజెప్పారు.
వారందరికీ అబుదాబి, మలేషియాలో ఉద్యోగం ఇప్పిస్తామని వసూలు చేసుకుని పత్తాలేకుండా పోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మరో 15 మంది నుంచి డబ్బు వసూలు చేసి కేరళలోని తిరుచ్చికి తీసుకెళ్లి వదిలిపెట్టినట్లు బాధితులు వాపోతున్నారు. మరి కొందరు మలేషియా వెళ్లి ఎక్కడికి పోవాలో దిక్కుతోచక తిరుగుతుంటే విజిలెన్స్ అధికారులు పసిగట్టి వారిని తిరిగి నాయుడుపేటకు చేర్చినట్లు బాధితులు వెల్లడించారు. ఇలా ఎంతోమంది ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారి గురించి పత్రికలు, టీవీల్లో కథనాలు వస్తుండటంతో గల్ఫ్‌లో నరకం అనుభవిస్తున్న అనేక మంది బాధితులు బంధువులకు ఫోన్లు చేసి కాపాడమని వేడుకుంటున్నారు. గల్ఫ్‌లో ఇబ్బందులుపడుతున్న వారిని తిరిగి నివాసాలకు చేర్చాలని వారి బంధువులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
గల్ఫ్ మోసం
Published Thu, Mar 5 2015 3:11 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement