కల్పిత కొలువులు!  | Engineering Colleges Cheating Students By Placements | Sakshi
Sakshi News home page

కల్పిత కొలువులు! 

Published Thu, Apr 19 2018 11:03 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

Engineering Colleges Cheating Students By Placements - Sakshi

నెల్లూరు నగరానికి చెందిన ఒక విద్యార్థి (పేరు వెల్లడించడానికి ఇష్టపడని) ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ప్రాంగణ ఎంపికల ద్వారా ఉద్యోగం పొందేందుకు ఆ కళాశాల యాజమాన్యానికి రూ. లక్ష చెల్లించాడు. ఉద్యోగం వస్తుందని బంధు, మిత్రులకు చెప్పి సంబరపడిపోయాడు. అయితే కొద్ది రోజులకే ఇంటికి చేరడంతో అదేమని అడిగితే నష్టపోయానని, నాలాగా ఎందరో ఉన్నారని వాపోయాడు. ప్రాంగణ ఎంపికల సమయంలో ఉపాధి ఏ విధంగా ఉంటుందో, విధులు ఏమిటో సంబంధిత కంపెనీ ప్రతినిధులు వివరించారు. తీరా చేరిన తర్వాత ముందు చెప్పిన దానికి, ఇచ్చే వేతనానికి, పనికి పొంతన లేకపోవడంతో వెనక్కి వచ్చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రీతిలో మోసపోయిన అనేక మంది విద్యార్థులు ఇప్పటికి ఆయా కళాశాలల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 

నెల్లూరు (టౌన్‌) : ఒకప్పుడు ఇంజినీరింగ్‌ విద్య అంటే క్రేజీగా ఉండేది. ప్రస్తుతం కొంత మేర ప్రాధాన్యత తగ్గినా మెజార్టీ విద్యార్థులు ఇంజినీరింగ్‌ వైపే చూస్తున్నారు. నాలుగేళ్లు చదువు పూర్తయిందంటే యువ ఇంజినీర్‌ చూపులన్నీ ఉపాధి వైపే ఉంటాయి. ఈ డిమాండ్‌ను మెజార్టీ ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు క్యాష్‌ చేసుకుంటున్నాయి. క్యాంపస్‌ సెలెక్షన్స్‌ పేరుతో ఉద్యోగాలు కల్పిస్తామని, ఇందులో పాల్గొనేందుకు ఒక్కో విద్యార్ధి నుంచి రూ.15 వేల నుంచి రూ.35 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆయా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీట్లు భర్తీ కోసం విస్తృత ప్రచారానికి కొన్ని ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు ఛీప్‌ ట్రిక్స్‌ ప్లే చేస్తున్నాయనే ఆరోపణలు లేకపోలేదు.

బోగస్‌ కంపెనీలు, డబ్బా కంపెనీలతో గొప్ప కంపెనీలుగా భ్రమింప చేసి క్యాంపస్‌ సెలెక్షన్స్‌ నిర్వహించి (అంతా పకడ్బందీగా) ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నారు. తీరా ఉద్యోగ ఒప్పంద పత్రాలు తీసుకుని ఉద్యోగాలకు వెళ్లితే కానీ.. ఆయా కంపెనీల డొల్లతనం బయటపడుతుంది. చదివిన చదువుకు, అక్కడి ఉద్యోగ బాధ్యతలకు పొంతన లేకపోవడంతో కొద్ది నెలల్లోనే ఉద్యోగాలకు గుడ్‌బై చెబుతున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వచ్చిందని గొప్పగా చెప్పుకుని.. తిరిగి ఇంటికి రాలేక ఇంకొందరు అరకొర జీతాలకు సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగాలకు వేట సాగిస్తున్నారు. 

సాధారణంగా చివరి సంవత్సరం పూర్తయ్యే నాటికి ఉద్యోగం కల్పించే దిశగా కళాశాలల యాజమాన్యాలు దృష్టి సారిస్తాయి. అందుకు దేశ, విదేశీ బహుళజాతి కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటాయి. ఆయా కంపెనీలకు అవసరమైన ఇంజినీర్లను ఎంపిక చేసుకునేందుకు ఆయా కళాశాలలకు వచ్చి ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తుంటాయి. నిజమైన, గుర్తింపు ఉన్న కంపెనీలు విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసుకుని ఉద్యోగాన్ని కల్పిస్తున్నాయి. ఇలాంటి కొన్ని కంపెనీల పేర్లు చెప్పి యాజమాన్యాలు విద్యార్థుల భవిష్యత్‌ను డొల్ల కంపెనీలకు తాకట్టుపెడుతున్నాయి. ఇటీవల కాలంలో కళాశాలలకు వచ్చే కంపెనీలను పరిశీలిస్తే ఏఏ ప్రాంతాల్లో బ్రాంచ్‌లు ఉన్నాయో, కంపెనీ వివరాలు తెలియకుండా గోప్యంగా ఉంచుతుండటం చర్చనీయింశంగా మారింది. 

కొందరికే అవకాశం   
జిల్లాలో ప్రతి ఏటా వేలాది మంది ఇంజినీరింగ్‌ పూర్తి చేస్తున్నారు. కానీ వారిలో చాలా మంది ఉత్తీర్ణత కావడం లేదు. ప్రతిభ ఉన్న విద్యార్థులను మాత్రమే కొన్ని కంపెనీలు ఎంపిక చేసుకుంటున్నాయి. జిల్లాలో కొన్ని కళాశాలల వైపు కార్పొరేట్, బహుళజాతి కంపెనీలు కన్నెత్తి చూడకపోయినా, మా కళాశాలలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పుకుని వచ్చే ఏడాదికి అడ్మిషన్లుకు సిద్ధమవుతున్నాయి. ప్రాంగణ ఎంపికలంటే మౌఖిక పరీక్ష, వ్యక్తిత్వ వికాసం వంటివి కొలమానం కాదని, నేరుగా డబ్బులు చెల్లిస్తే సరిపోతాయంటూ మోసం చేస్తున్నాయి. 

రూ.15 వేలకు పైగానే .. 
ప్రాంగణ ఎంపికలు అనగానే ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో నూతనోత్సవం వస్తుంది. దీన్ని పెట్టుబడిగా మలుచుకునేందుకు కొన్ని కళాశాలలు ప్రయత్నిస్తున్నాయి. ప్రాంగణ ఎంపికలకు అడ్మిషన్‌ చార్జీల కింద ఒక్కో విద్యార్థి నుంచి రూ.15 వేల నుంచి రూ.35 వేల వరకు వసూలు చేస్తున్నాయి. మరికొన్ని కళాశాలలు రూ. 50 వేలు వసూలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయిని విద్యార్థులే చెబుతున్నారు. అంత ఎందుకుని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తుంటే ఉద్యోగం ఇచ్చే కంపెనీకి ముందుగా కొంత మొత్తంను చెల్లించితే వెంటనే ఉద్యోగంలో చేరే అవకాశం ఉంటుందని, లేకంటే కళాశాల నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఉపాధి పొందడం కష్టమని చెబుతున్నారు.

ముందే అంగీకార పత్రాలతో ముప్పతిప్పలు   
ప్రాంగణ ఎంపికలు నిర్వహించే కొన్ని కంపెనీలు ముందే కొన్ని షరతులు విధిస్తున్నాయి. రెండేళ్ల పాటు వారి కంపెనీలోనే పనిచేయాలని, ఎక్కడికి పంపితే అక్కడే ఉండి ఉద్యోగం చేయాలని అంగీకార పత్రాలను విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులతో కూడా రాయించుకుంటున్నారు. కంపెనీలో చేరిన తర్వాత తొలి నెల జీతం తమ అకౌంట్‌ల్లో వేయాలని విద్యార్థితో రాయించుకుంటున్నారు. ఇది పలువురు విద్యార్థులకు శాపంగా మారుతుంది. ఒక వేళ ఆ కంపెనీలో ఉద్యోగం నచ్చకుంటే బయటకు వచ్చే వీలుండదు. గట్టిగా కాదంటే ఒప్పందం ప్రకారం విద్యార్హత పత్రాలను వెనక్కి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.   

అన్ని విషయాలు తెలుసుకుంటే మంచిది   
ఉద్యోగం పేరు చెప్పి కళాశాలలకు ప్రాంగణ ఎంపికల కోసం వస్తున్న కంపెనీ వివరాలు, ఎంత వరకు వేతనం ఇవ్వగలదు, ఏ ప్రాంతంలో విధులు నిర్వర్తించాలో తదితర విషయాలను ముందుగానే విద్యార్థులు తెలుసుకోవాలని విద్యా నిపుణులు చెబుతున్నారు. కొన్ని కళాశాలల్లో తాము ప్రాంగణ ఎంపికలు నిర్వహించి ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించామంటూ హడావుడి చేస్తున్నాయి. అలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. శిక్షణకు కొద్ది మొత్తాన్ని చెల్లించినా పెద్దగా నష్టం ఉండబోదంటున్నారు. రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు, నిబంధలు పాటించడం తదితర విషయాలు తెలసుకోవచ్చు. ఉద్యోగం పేరు చెప్పి రూ.లక్షలు చెల్లించమని అడిగారంటే అది గ్యారంటీగా నకిలీ కంపెనీగా తెలుసుకోవాలని విద్యా వేత్తలు పేర్కొంటున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement