ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తుతో ‘ప్రయోగం’ | Inter student prospects 'experiment' | Sakshi
Sakshi News home page

ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తుతో ‘ప్రయోగం’

Published Mon, Jan 13 2014 4:07 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

Inter student prospects 'experiment'

నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్ : జిల్లాలో కొన్ని ప్రైవేట్ కళాశాలలు ప్రయోగశాలలు లేకుండా ఇంటర్ సైన్స్ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నాయి. జిల్లాలో సైన్స్ గ్రూప్‌నకు చెందిన 22 వేల మంది ఇంటర్ విద్యార్థులు ఈ ఏడాది ఫిబ్రవరి 12 నుంచి ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కానున్నారు. జిల్లాలో 142 ప్రైవేట్, కార్పొరేట్, జూనియర్ కళాశాలలు, 26 ప్రభుత్వ, 7 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో రెండుమూడు కళాశాలల్లో మినహాయించి మిగిలిన అన్ని కళాశాలల్లో ప్రయోగశాలలు, పరికరాలు, విశాలమైన గదులు, టేబుళ్లు, బల్లలు పుష్కలంగా ఉన్నాయి. పాత ఎయిడెడ్ కళాశాలల్లో కూడా వసతులకు కొదవలేదు. అయితే జిల్లా వ్యాప్తంగా ఇబ్బడిముబ్బడిగా వెలసిన ప్రైవేట్, కార్పొరేట్ జూని యర్ కళాశాలల్లో చాలా వరకు ప్రయోగశాలలు లేకపోవడం గమనార్హం.
 
 ప్రయోగశాలలున్న కళాశాలల్లో సైతం పూర్తి స్థాయిలో  వస్తు సామగ్రి, ప్రయోగశాలకు అవసరమైన  పరికరా లు లేవు. దీంతో సైన్స్ విద్యార్థులకు అవసరమైన  ప్రయోగ పరిజ్ఞానం  మిథ్యగానే మిగిలి పోయింది. అందువల్ల తమ విద్యార్థులను ఎలాగైనా ఉత్తీర్ణులు చేసుకోవాలనే తలంపుతో ప్రైవేట్ యాజమాన్యాలు అక్రమ మార్గంలో పయనిస్తున్నాయి. తమ కళాశాలలకు ఇన్విజిలేటర్, డిపార్ట్‌మెంటల్ అఫీసర్‌గా వచ్చిన అధ్యాపకులను సామ, ధాన,భేద దండోపాయాలతో పాటు అంగ, అర్థబలాన్ని ఉపయోగించి తమ దారికి తెచ్చుకుంటున్నారు. ప్రయోగ పరీక్షలకు ఇన్విజిలేటర్‌గా వచ్చి న అధికారులు సైతం  తమకెందుకని  ప్రైవేటు యాజమాన్యాలతో రాజీపడి పని చేస్తున్నారనే విమర్శలున్నాయి.
 
 ఈ ఏడాది జంబ్లింగ్ లేనట్టే
 ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్నే అనుసరిస్తారని  మూడేళ్లుగా అందరూ భావిస్తున్నారు. అయితే ప్రతి ఏడాది  ప్రాక్టికల్ పరీక్ష సమీపించే సమయానికి ఈ ఏడాది వరకు జంబ్లింగ్ లేకుండా పాత పద్ధతిలోనే ప్రయోగ పరీక్షలు  నిర్వహిస్తామని  ప్రభుత్వం  ప్రకటిస్తుంది. దీంతో అటు అధ్యాపకులు, ఇటు విద్యార్థులలో తీవ్ర అయోమయం నెలకొంటోంది. ఈ ఏడాది పాత విధానంలో ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడిస్తున్నారు.
 
 అర్హులకు అన్యాయం
 జంబ్లింగ్ విధానం లేకుండా సెల్ఫ్ సెంటర్ల వల్ల  అర్హులకు అన్యాయం జరుగుతుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. పలు కళాశాలల యాజమాన్యాలు తమ పలుకుబడి ఉపయోగించి విద్యార్థులను పాస్ చేయించుకుంటున్నారు. అంతగా పేరు ప్రఖ్యాతలు లేని కళాశాలల విద్యార్థుల ఉత్తీర్ణత  కష్టమవుతోంది. ఇటీవల కార్పొరేట్ స్థాయిలో  నిర్మించిన కళాశాలల్లో అన్ని హంగులతో  ప్రయోగశాలలు నిర్మించాయి. కొన్ని కళాశాలలు మాత్రం నేటికీ అరకొర  వసతులతో విద్యార్థులకు అసంపూర్తి పరిజ్ఞానాన్ని అందిస్తున్నాయి. దీంతో పలువురు విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలంటేనే భయపడుతున్నారు.  
 
 ప్రయోగశాలలు లేని 60 కళాశాలలను గుర్తించాం:  వై.పరంధామయ్య, ఆర్‌ఐఓ, ఇంటర్ బోర్డు
  జిల్లాలో పూర్తి స్థాయిలో  ప్రయోగశాలలు లేని 60 కళాశాలలను గుర్తించాం. ఈ కళాశాలలకు స్పష్టమైన ఆదేశాలి స్తాం. ఇక్కడి విద్యార్థులు సమీపంలోని  అన్ని వసతులున్న కళాశాలలతో ప్రాక్టికల్ జ్ఞానాన్ని పొందుతున్నారు. ఈ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు సైతం  అన్ని వసతులు ఉన్న కళాశాలలలోనే ని ర్వహిస్తాం. వసతులు లేని  కళాశాలలను గుర్తించడంలో ప్రభుత్వ కళాశాలలకు  కూడా మినహాయింపు ఇవ్వలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement