నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: వచ్చే ఏడాది ఇంటర్మీడియెట్‌లో సీట్లు భర్తీ చేసుకునేందుకు పలు కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలు ఇప్పటి నుంచి కసరత్తు ప్రారంభించాయి. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల నుంచి పదో తరగతి విద్యార్థుల జాబితా సేకరించే పనిలో ఉన్నాయి. ఇందు కోసం కొంతమందిని ప్రత్యేకంగా నియమించుకున్నాయి. ముఖ్యంగా అధిక ఫీజులు వసూలు చేసే పాఠశాలలపైనే కార్పొరేట్ కళాశాలలు దృష్టిసారించాయి.
పాఠశాల స్థాయిలోనే అధికఫీజులు చెల్లించే తల్లిదండ్రులు భవిష్యత్‌లో తాము అడిగినంత ఫీజు చెల్లించగలరనే ధీమాతో నగరంలో ఖ్యాతిగాంచిన పాఠశాలల విద్యార్థులకు ఎరవేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. తమకు అనుకూలంగా ఉండే కరస్పాండెంట్ నుంచి అధికారికంగా జాబితా సేకరిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో జాబితా ఇచ్చేందుకు యాజమాన్యం నిరాకరిస్తోంది. దీంతో పాఠశాలలో పనిచేసే కీలకమైన వ్యక్తి, లేదా కంప్యూటర్ ఆపరేటర్లను ప్రలోభ పెట్టి విద్యార్థుల జాబితాను చేజిక్కించుకుంటున్నారు. ఈ విషయమై ఇటీవల పలు వివాదాలు చోటు చేసుకున్నట్టు తెలిసింది. తప్పు ఒకరు చేస్తే మరొకరిని అనుమానించి ఉద్యోగం నుంచి తొలగించిన సందర్భాలున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో ఇటీవలే పదో తరగతి విద్యార్థులకు త్రైమాసిక పరీక్షలు పూర్తయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు త్రైమాసిక పరీక్షలు ఇంకా ప్రారంభం కాలేదు. అయితే కార్పొరేట్ కళాశాలల అత్యాశ, తొందరపాటు ప్రైవేటు పాఠశాలల సిబ్బంది, యాజమాన్యానికి ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. గతంలో వేసవి సెలవుల్లో విద్యార్థులను గుర్తించి తమ కళాశాలల్లో చేర్చాల్సిందిగా తల్లిదండ్రులను ప్రాథేయపడేవారు.
కాలక్రమంలో సెల్‌ఫోన్ల ద్వారా విన్నవించుకునేవారు. పలువురు ఏజెంట్లను నియమించి వారికి ఒక రశీదు పుస్తకం అప్పగించి, ఒక్కో విద్యార్థిని తమ కళాశాలలో చేర్పించి వారి నుంచి కనీసం రూ.వెయ్యి అయినా అడ్వాన్స్‌గా వసూలు చేస్తే చాలని దళారులను పోషించేవారు. ఒక్కో విద్యార్థి తల్లిదండ్రులను ఒప్పించి వారి నుంచి కనీసం రూ.వెయ్యి వసూలు చేసిన ఏజెంట్‌కు కళాశాల యాజమాన్యం రూ.2వేల నుంచి రూ.5వేల వరకు ముట్టచెప్పేవాళ్లు. ప్రస్తుతం దళారీ వ్యవస్థకు స్వస్తి చెప్పి అడ్మిషన్ల కోసం ప్రత్యేకంగా కొందరు సిబ్బందిని కళాశాలల యాజమాన్యాలు నియమించుకోవడం వెనక జిల్లాలో విద్యాసంస్థల మధ్య నెలకొన్న పోటీతత్వమే ప్రధాన కారణంగా కన్పిస్తోంది.
పాఠశాలల్లోనూ అదే తీరు...
జిల్లావ్యాప్తంగా విద్యావ్యవస్థ లాభసాటి వ్యాపారరంగంగా మారిపోయింది. ధనార్జనే ధ్యేయంగా పలు విద్యాసంస్థలు ఎంతటి చర్యలకైనా దిగజారేందుకు సిద్ధంగా ఉన్నాయి. తమ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకునేందుకు అన్ని రకాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా డిగ్రీ, పీజీలు పూర్తిచేసిన ఉపాధ్యాయుల చేతికి కరపత్రాలు అందజేసి ప్రతివీధి తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేయాల్సిందిగా ఆదేశిస్తున్నాయి. ఇంటిలో ఎంత మంది చిన్నపిల్లలున్నారు, వారు ఏ పాఠశాలలో చదువుతున్నారు, ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి విరమించుకుని తమ పాఠశాలలో ప్రవేశం పొందే అవకాశం ఉందా? ఏ పాఠశాలలో ఇంకా ప్రవేశం పొందని చిన్నపిల్లల తల్లిదండ్రుల అడ్రస్, ఫోన్ నంబర్లు సేకరించి పాఠశాలలోని కార్యాలయంలో అప్పగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఉపాధ్యాయులు సేకరించిన సమాచారం, ఫోన్ నంబర్ల ఆధారంగా విద్యాసంస్థలోని రిసెప్షనిస్ట్ తరచూ సంప్రదింపులు జరిపి ఎట్టకేలకు ఆ పిల్లలను తమ పాఠశాలలో చేర్పిస్తుంది. ఈ వ్యవహారమంతా తాము తయారు చేసిన వస్తువులను విక్రయించేందుకు బహుళజాతి సంస్థలు అనుసరిస్తున్న పద్ధతిని పోలి ఉంటుంది.
టెన్త్ విద్యార్థులకు కార్పొరేట్ ఎర
Published Thu, Nov 7 2013 4:03 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement