ఫీజులుం | Exploitation of the private colleges in the name of the test fee | Sakshi
Sakshi News home page

ఫీజులుం

Published Thu, Oct 16 2014 1:53 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM

ఫీజులుం - Sakshi

ఫీజులుం

  • పరీక్ష ఫీజు పేరుతో ప్రయివేటు కళాశాలల దోపిడీ
  •  రూ.300 ఫీజుకు రూ.1,500 వసూలు        
  •  రెండేళ్లకూ ఒకేసారి చెల్లిస్తే రూ.2,500
  •  చెల్లించకపోతే పరీక్షల సమయంలో ఇబ్బందులని బెదిరింపులు
  •  అధికారులు పట్టించుకోవడం లేదంటున్న తల్లిదండ్రులు
  •  కఠిన చర్యలు తీసుకుంటామంటున్న ఆర్‌ఐవో
  • గుడివాడ : ఇంటర్మీడియెట్ పరీక్షల ఫీజు పేరుతో ప్రయివేటు కళాశాలల నిర్వాహకులు విద్యార్థులను దోచుకుంటున్నారు. ఏడాదికి పరీక్ష ఫీజు రూ.300 కాగా, ఇందుకు ఐదు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. ఇదేమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే... పరీక్షల సమయంలో ఖర్చులుంటాయని బదులిస్తున్నారు. ఒక్కో ప్రయివేటు కళాశాల నిబంధనలకు విరుద్ధంగా లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నప్పటికీ ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
     
    ఐదు రెట్లు అధికంగా వసూలు

    జిల్లాలో 23 ప్రభుత్వ, 227 ప్రయివేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో సుమారు ఐదు వేలమంది, ప్రయివేటు కళాశాలల్లో 95వేల మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 65వేల మంది ప్రథమ సంవత్సరం, 35వేల మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారని ఇంటర్మీడియెట్ బోర్డు జిల్లా అధికారి రాజారావు చెప్పారు. వీరందరూ పబ్లిక్ పరీక్షలకు ఈ నెల 17వ తేదీలోపు ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియెట్ బోర్డు నిర్ణయించింది.

    మొదటి ఏడాది విద్యార్థులు(అన్ని గ్రూపులు) కేవలం రూ.300 చొప్పున మాత్రమే చెల్లించాల్సి ఉంది. మొదటి ఏడాది సబ్జెక్టులు మిగిలి ఉండి వాటితోపాటు ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు గరిష్టంగా రూ.600 చెల్లించాలి. ద్వితీయ సంవత్సరం సైన్స్ గ్రూప్ విద్యార్థులు మాత్రం ప్రాక్టికల్స్ ఫీజు నిమిత్తం రూ.100 అదనంగా చెల్లించాలని బోర్డు ప్రకటించింది. అయితే, గుడివాడలోని కొన్ని కళాశాలలు ఇందుకు విరుద్ధంగా మొదటి సంవత్సరం విద్యార్థుల నుంచి రూ.1,500 వసూలు చేస్తున్నాయి.

    ప్రథమ సంవత్సరం విద్యార్థుల నుంచి రెండేళ్లకు ఒకేసారి రూ.2,500 చొప్పున వసూలు చేస్తున్నారు. మరికొన్ని కాలేజీల నిర్వాహకులు ప్రథమ సంవత్సరం విద్యార్థులు రూ.1,000 చొప్పున వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పుడు తాము చెప్పినట్లు ఫీజు చెల్లించకపోతే పరీక్షల సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, హాల్ టికెట్లు కూడా ఇవ్వబోమని బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

    జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ లెక్కన 95 వేల మంది నుంచి అదనంగా వసూలు చేసే మొత్తం రూ.9కోట్ల వరకు ఉంటుందని అంచనా. కళాశాలల నిర్వాహకులు వసూలు చేసే మొత్తంలో ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులకు కూడా వాటాలు ఉంటాయని పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అందువల్లే వారు కళాశాలలవైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అదనంగా వసూలు చేసిన ఫీజులను తిరిగి ఇప్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.  
     
    ఎక్కువ ఫీజు వసూలు చేస్తే చర్యలు : ఆర్‌ఐవో

    కళాశాలల యాజమాన్యాలు ఇంటర్మీడియెట్ బోర్డు నిర్ణయించిన ఫీజు కంటే అదనంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్మీడియెట్ బోర్డు జిల్లా అధికారి(ఆర్‌ఐవో) రాజారావు చెప్పారు. తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు అందాయని, ఆయా కళాశాలలపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎవరైనా అదనంగా ఫీజులు వసూలు చేస్తే తన సెల్ నంబర్ 9848308998కు ఫోన్ చేయాలని ఆర్‌ఐవో సూచించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement