అంతా టెన్షనే! | inter student confused in private colleges | Sakshi
Sakshi News home page

అంతా టెన్షనే!

Published Sat, Feb 25 2017 11:01 PM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM

అంతా టెన్షనే! - Sakshi

అంతా టెన్షనే!

- ఫీజు చెల్లించలేదని హాల్‌టికెట్లు ఇవ్వని ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు
- పరీక్షల సమయంలో దగ్గరపడుతుండడంతో విద్యార్థుల్లో టెన్షన్‌
- పట్టించుకోని విద్యాధికారులు
- అధికారుల ఉదాసీనతతో రెచ్చిపోతున్న కళాశాలల యాజమాన్యం


అనంతపురం ఎడ్యుకేషన్‌ : ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని కళాశాల ఫీజు మొత్తం చెల్లించింది. అయితే సదరు విద్యార్థిని రెండు రోజుల క్రితం హాల్‌ టికెట్‌ కోసం కళాశాలకు వెళ్లగా రూ.250 బకాయి ఉంది.. ఆమొత్తం చెల్లిస్తేనే హాల్‌ టికెట్‌ ఇస్తామని తేల్చి చెప్పింది. విషయాన్ని ఆ విద్యార్థిని తన తండ్రికి ఫోన్‌లో సమాచారం ఇచ్చింది. చివరకు ఆమె తండ్రి వచ్చి రూ.250 చెల్లించిన తర్వాత హాల్‌ టికెట్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఇలా ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలు ఫీజు బకాయి పేరుతో హాల్‌టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.   ఈ  ఒక్క విద్యార్థిని సమస్యే కాదు.. జిల్లా వ్యాప్తంగా చాలా ప్రైవేట్‌ కళాశాలల్లోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్య ఇది.

    మార్చి 1 నుంచి 18 వరకు ఇంటర్‌ థియరీ పరీక్షలు జరుగనున్నాయి. జిల్లాలో మొత్తం 70,726 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 35,981 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 34,745 మంది ఉన్నారు. పరీక్షల కోసం మొత్తం 96 కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు :
    పరీక్షల సమయం దగ్గర పడుతోంది..ఫీజు చెల్లించని వారికి హాల్‌ టికెట్లు ఇచ్చేదిలేదని ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు తేల్చి చెప్తుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చాలామంది పేద, మధ్య తరగతి కుటుంబాలు కూడా తమ పిల్లలను ప్రైవేట్‌ కళాశాలల్లో చదివిస్తున్నారు. కళాశాలలో పిల్లలను చేర్పించే‡ సమయంలోనే ఫీజు చెల్లించేందుకు అంగీకారం పొంది ఉంటారు. అందులో 70–80 శాతం మొత్తం చెల్లించి ఉంటారు. బకాయి మొత్తం చెల్లిస్తేనే హాల్‌టికెట్లు ఇస్తామంటూ చాలా కళాశాలల యాజమాన్యాలు తెగేసి చెప్తున్నాయి. తమ పిల్లలు పరీక్షలు రాసినంత మాత్రాన కళాశాలకు రాకుండా పోరని, తర్వాత సర్టిఫికెట్లు కోసమైనా కళాశాలకు వెళ్లాల్సి ఉంటుంది.. ఆలోపు చెల్లిస్తామని తల్లిదండ్రులు ప్రాథేయ పడుతున్నా  యాజమాన్యాలు ససేమిరా అంటున్నాయి. ఇదిలా ఉండగా హాల్‌ టికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇస్తారో ఇవ్వరోనన్న బెంగ పెట్టుకుని చాలామంది పిల్లలు చదువుపై ఏకాగ్రత పెట్టలేకపోతున్నారు. తీరా పరీక్షల సమయంలో ఇది కొత్త సమస్య తెచ్చే ప్రమాదముందని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు.

చేతులెత్తేస్తున్న అధికారులు :
చాలా కళాశాలల్లో ఫీజు చెల్లిస్తేనే హాల్‌టికెట్లు ఇస్తామని యాజమాన్యాలు చెబుతున్న విషయం ఇంటర్మీడియట్‌ అధికారులకూ తెలుసు. ఏకారణం చేతనూ హాల్‌టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను అవస్థలకు గురి చేయరాదని నిబంధనలు ఉన్నాయి.   అయినా యాజమాన్యాలు బరి తెగించి విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఫీజు బకాయి పేరుతో హాల్‌టికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్న కళాశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఆర్‌ఐఓ వెంకటేశులు ఏమంటున్నారంటే...
హాల్‌టికెట్లు విద్యార్థులకు కచ్చితంగా ఇవ్వాల్సిందే. ఫీజు బకాయిల వ్యవహారం తర్వాత చూసుకోవాలి తప్పా.. విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయరాదు. ఫీజు పెండింగ్‌ పేరుతో విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఎక్కడైనా ఇబ్బందులకు గురి చేస్తుంటే నేరుగా మమ్మల్ని సంప్రదించాలి. అలాంటి కళాశాలలపై చర్యలు తీసుకుంటాం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement