ఫీజు చెల్లిస్తేనే సీటు.!
- ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉన్నా అదనంగా వసూలు
- ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ కళాశాలలు
- పట్టించుకోని యూనివర్సిటీ సిబ్బంది
నిజామాబాద్‌అర్బన్ : ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ఫీజుల మోత మోగుతోంది. విద్యార్థులకు ప్రభుత్వం రీరుంబర్స్‌మెంట్ సౌకర్యం కల్పించినా అదనపు ఫీజులు చెల్లించక తప్పడం లేదు. ఫీజు చెల్లిస్తేనే అడ్మిషన్ చేయించుకుంటూ విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నారుు. అంతేకాకుండా అదనపు ఫీజు ను విడతల వారీగా కాకుండా మొత్తం ఒకేసారి చెల్లించాలని కొన్ని కళాశాలలు ముందుగానే షరతులు విధిస్తున్నట్టు సమాచారం. ఇంత జరుగుతున్నా యూనివర్సిటీ అధికారులు స్పందించకపోవడం గమనార్హం.
ఇదీ పరిస్థితి....
జిల్లాలో 56 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో అడ్మిషన్లు ఒక్కో కళాశాలల ఒక్కో విధంగా సాగుతున్నాయి. ఇప్పటికే అడ్మిషన్లు పూర్తి చేసుకున్న ఓ కళాశాల 25 వేలు, మిగిలిన కళాశాలలు 15 వేల చొప్పున ఒక్కో విద్యార్థి నుంచి ఫీజు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కల్పించినా వీరు మాత్రం అదనపు ఫీజు వసూలు చేస్తున్నారు. వీటికి తోడు ఒక్కో విద్యార్థి నుంచి అడ్మిషన్ ఫీజు పేరుతో రూ.2 వేలు వసూలు చేస్తున్నారు. సీట్లు ఖాళీలేవని సాకు చూపుతూ యూనివర్సిటీ నుంచి అనుమతి తీసుకోవాలని అందుకోసం రూ. 3,500 వసూలు చేస్తున్నారు. కానీ, వాస్తవానికి యూనివర్సిటీకి రూ.2 వేల మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. రీయింబర్స్‌మెంట్ వస్తుంది కదా..? అని విద్యార్థులు ప్రశ్నిస్తే మాత్రం అది వచ్చినప్పుడు మీది మీకు తిరిగి ఇస్తామని క ళాశాల సిబ్బంది సమాధానం చెబుతున్నట్టు సమాచారం.
సీట్ల బదలాయింపు......
కొన్ని కళాశాలలు సీట్ల బదలాయింపు కొనసాగిస్తున్నాయి. తమ కళాశాలల్లోని అడ్మిషన్లను ఇతర కళాశాలలకు బదలారుుస్తున్నారు. వాస్తవానికి ఇది నిబంధనలకు విరుద్ధం. నాలుగు కళాశాలలు సీట్ల బదలాయింపు చర్యకు పాల్పడుతున్నట్టు తెలిసింది. పట్టణంలోని ప్రధాన రోడ్డుపై ఉన్న ఓ కళాశాల ఖలీల్‌వాడిలోని మరో కళాశాలకు సీట్లు బదలాయిస్తున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంపై యూనివర్శిటీ అధికారులు మేల్కొని తనిఖీలు చేస్తే కళాశాలల ఆగడాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇకనైనా అధికారులు స్పందించి ‘ప్రైవేట్’ ఆగడాలకు ముకుతాడు వేయాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.