సాక్షి, న్యూఢిల్లీ : ‘విద్యా ఓ ప్రాథమిక హక్కు, కాసులకు కల్పించే ప్రత్యేక సదుపాయం కాదు’. అందుకని ప్రతి పౌరుడికి అందుబాటులోకి విద్యను తీసుక రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ దిశగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించింది. పైగా ఢిల్లీలోని ప్రతిష్టాకరమైన జవహర్ లాల్ నెహ్రూ (జేఎన్‌యూ) విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థుల హాస్టల్ ఫీజులను అమాంతం 999 శాతం పెంచింది. దీంతో ఆగ్రహోదగ్రులైన యూనివర్శిటీ విద్యార్థులు సమర శంఖం పూరించడంతో దద్దరిల్లిన కేంద్ర మానవ వనరుల శాఖ కార్యాలయం దిగివచ్చింది. పెంపు ప్రతిపాదనలను భారీగా తగ్గించింది. అయినా అవి ఇప్పటికీ విద్యార్థులకు భారమే అవుతాయి.
తగ్గించిన ప్రతిపాదనల మేరకు హాస్టల్ గదులకు నెలకు రెండు కేటగిరీల (దారిద్య్ర రేఖకు దిగువ, ఎగువ) కింద 300, 150 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ఇతర సౌకర్యాలకు అదనంగా మరో 800 రూపాయలు చెల్లించాలి. ఇప్పటి వరకు హాస్టల్ గదుల అద్దె నెలకు 20, 10 రూపాయలు మాత్రమే ఉండింది. అదనపు చార్జీలు ఇంతకుముందు లేవు.
భారత ప్రథమ ప్రధాన మంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వసించే సామాజిక సమానత్వం, లౌకికవాదం, శాస్త్రీయ దక్పథం, అంతర్జాతీయ అవగాహన ఆశయాలకు అనుగుణంగా ఈ జెఎన్‌యూ యూనివర్శిటీని 1966లో ప్రారంభించారు. అందుకని అన్నింటిలో నామ మాత్రపు చార్జీలనే కొనసాగిస్తూ వచ్చారు. ఆశయాలకు అనుగుణంగానే కుల మతాలు, వర్గాలు, ప్రాంతీయ తత్వాలకు దూరంగా సామాజిక–ఆర్థిక సమానత్వమే ప్రాతిపదికగా యూనివర్శిటీ ఎదుగుతూ వచ్చింది. సమాజంలో ఎక్కడా ఏ అలజడి జరిగినా దాని ప్రతి ధ్వని జేఎన్‌యూలో వినిపిస్తుంది. పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు దీని ప్రతిష్ట మసక బారుతోంది.
పడిపోతున్న యూనివర్శిటీల గ్లోబల్ ర్యాంకులు
2014 సంవత్సరం నుంచి అంతర్జాతీయంగా దేశంలోని అన్ని ప్రతిష్టాత్మక జాతీయ యూనివర్శిటీల ర్యాంకులు పడిపోతున్నాయి. 2014లో భారత జాతీయ యూనివర్శిటీకి 328 గ్లోబల్ ర్యాంకు ఉండగా, అది 2015 నాటికి 341, 2016 నాటికి 354, 2017 నాటికి 397, 2018 నాటికి 420వ ర్యాంకుకు పడిపోయింది. దేశంలో ఏటేటా విద్యా రంగానికి ఆర్థిక కేటాయింపులు తగ్గిపోవడం, ఖాళీ అవుతున్న ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయక పోవడం ప్రధాన కారణాలు. విద్యారంగం పెట్టుబడులకు అధిక ప్రాధాన్యత ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం 2014–2015 సంవత్సరానికి జీడీపీలో 4.14 శాతం నిధులను కేటాయించగా, అవి 2019–2020 సంవత్సరానికి 3.4 శాతానికి పడిపోయాయి.
కేంద్ర విశ్వవిద్యాలయాల్లో 2018, జూలై నాటికి 5,606 ప్రొఫెసర్ల పోస్టులు, అంటే 33 శాతం, ఐఐటీల్లో 2,802 పోస్టులు, అంటే 34 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ 2018, జూలై 23వ తేదీన లోక్‌సభకు తెలియజేశారు. ఆ పోస్టుల భర్తీకి కేంద్రం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక విద్యా సంస్థలను ఆ రాముడే కాపాడాలి.
Comments
Please login to add a commentAdd a comment