విద్యా రుణాలు...భవితకు వరాలు | Manage the future of education loans ... | Sakshi
Sakshi News home page

విద్యా రుణాలు...భవితకు వరాలు

Published Mon, Jun 30 2014 1:20 AM | Last Updated on Thu, Jul 11 2019 5:24 PM

Manage the future of education loans ...

ఓ వైపు బంగారు భవిష్యత్తును చూపించే కోర్సులు.. మరో వైపు కళ్లు చెదిరే ఫీజులు.. కోర్సులో చేరాలనే బలమైన ఆకాంక్ష.. అనుకూలించని ఆర్థిక పరిస్థితులు.. చివరకు రాజీ ధోరణితో ఏదో ఒక కోర్సులో చేరడం..ప్రతిభ, నైపుణ్యాలు మెండుగా ఉన్నప్పటికీ ప్రస్తుత విద్యా ప్రపంచంలో అధిక శాతం మందికి ఎదురవుతున్న అనుభవం. అయితే.. విద్యార్థులు ఈ పరిస్థితిని అధిగమించొచ్చు. ప్రతిభ ఉంటే రాజీ పడాల్సిన అవసరమే లేదు. కారణం.. బ్యాంకులు విద్యా రుణాల పేరుతో అందిస్తున్న భరోసానే. రాష్ట్రంలోనే కాకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లలో.. విదేశాల్లోనూ చదవాలనుకునే ప్రతిభ ఉన్న విద్యార్థులకు అన్ని జాతీయ బ్యాంకులు విద్యా రుణాలు అందిస్తున్నాయి. ఉన్నత విద్య దిశగా ప్రోత్సహిస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. విద్యా రుణాల విధివిధానాలపై విశ్లేషణ..
 
ఎన్నో కోర్సులు.. వాటిని పూర్తి చేస్తే మరెన్నో అవకాశాలు. ఒకేషనల్ నుంచి ఓవర్‌సీస్ ఎడ్యుకేషన్ వరకు ఔత్సాహిక విద్యార్థులకు ఉన్నత విద్య దిశగా ఎన్నెన్నో మార్గాలు. వాటికి సరిపడే అర్హతలూ, ప్రతిభాపాటవాలు విద్యార్థులకు ఉంటున్నాయి. కానీ ఈ అవకాశాలను అందుకుంటున్న విద్యార్థులు కొందరే. కారణం.. రూ. లక్షల్లో ఉంటున్న ఫీజులు. కేవలం రుసుముల కారణంగా.. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆశించిన కోర్సులో చేరలేక ఏదో ఒక కోర్సుకు పరిమితమవుతున్న వారి సంఖ్య లక్షల్లోనే. దీంతో దేశంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత ఏర్పడుతోంది. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ప్రతిభావంతులకు ‘విద్యా రుణాలు’ పేరుతో ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఎన్నో చర్యలు చేపడుతోంది. ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్‌తో సంప్రదింపులు సాగించి అన్ని జాతీయ బ్యాంకుల్లో విద్యా రుణ పథకాలను అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంది. దీంతో ఇప్పుడు ఇంటర్మీడియెట్ అర్హతగా ప్రవేశం లభించే సాధారణ బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు మొదలు మరెన్నో కోర్సులకు రుణ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
 
గుర్తింపు పొందిన కోర్సులకే

విద్యా రుణాలు మంజూరు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ సంయుక్తంగా.. ఈ రుణాలకు అర్హమైన కోర్సులను నిర్దేశించాయి. దీని ప్రకారం.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), కేంద్ర ప్రభుత్వం, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) తదితర నియంత్రణ సంస్థల పరిధిలోని యూనివర్సిటీల్లో లభించే బ్యాచిలర్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులన్నిటికీ రుణ సదుపాయం లభిస్తుంది. అంతేకాకుండా ప్రొఫెషనల్ కోర్సులుగా పేరొందిన చార్టర్డ్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ, ఐసీడబ్ల్యుఏ వంటి కోర్సుల ఔత్సాహికులు కూడా విద్యా రుణాల దరఖాస్తుకు అర్హులే. వీటితోపాటు ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్‌ఐటీల వంటి ఇన్‌స్టిట్యూట్‌లతోపాటు, ఇతర అన్ని జాతీయ ప్రాధాన్యమున్న ఇన్‌స్టిట్యూట్స్ (కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించే సంస్థలు)లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు కూడా విద్యా రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అన్నిటికంటే అత్యంత ఆకర్షణీయ అంశం రూ. లక్షల ఖర్చుతో కూడుకున్న పైలట్ శిక్షణ కోర్సులకు కూడా రుణ సదుపాయం అందుబాటులోకి తేవడం. అయితే దీనికి సంబంధించి సదరు శిక్షణనిచ్చే సంస్థకు డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గుర్తింపు తప్పనిసరి.
 
విదేశీ విద్యకు

ప్రతిభావంతులైన విద్యార్థుల విషయంలో విదేశీ విద్య ఔత్సాహికులకు కూడా ఈ విద్యా రుణాలు అందుబాటులోకి వచ్చాయి. స్టడీ అబ్రాడ్‌కు సంబంధించి ఆయా దేశాల నియంత్రణ సంస్థల గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో జాబ్ ఓరియెంటెడ్, ప్రొఫెషనల్, టెక్నికల్ కోర్సుల ఔత్సాహికులు, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్ వంటి కోర్సులు చదవాలనుకునేవారు విద్యా రుణాలకు అర్హులు.
 
దేశంలో ఒకేషనల్ కోర్సులకు కూడా

దీర్ఘకాలిక వ్యవధిలో ఉండే బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ కోర్సులే కాకుండా మూడు నెలలు మొదలు రెండు, మూడేళ్ల వ్యవధిలో ఉండే వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశించాలనుకునే విద్యార్థులకు కూడా రుణ సదుపాయం కల్పిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మోడల్ ఎడ్యుకేషన్ లోన్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ పేరుతో ఒక ప్రత్యేక పథకాన్ని రూపొందించారు. దీనికి ప్రధాన కారణం ఆయా వృత్తి నైపుణ్యాలను అందించే రంగాల్లో సుశిక్షితులైన మానవ వనరులను తీర్చిదిద్దడమే. ఈ క్రమంలో నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఇతర ప్రభుత్వ వృత్తి విద్యా సంస్థల గుర్తింపు పొందిన సంస్థలలో కోర్సులను ఈ విద్యా రుణాలకు అర్హమైన కోర్సులుగా పేర్కొన్నారు. దీంతో  ఆయా సంస్థలు అందించే స్వల్పకాలిక కోర్సుల నుంచి ఐటీఐలు, పాలిటెక్నిక్ కోర్సుల వరకు దాదాపు అన్ని ఒకేషనల్ కోర్సులకు విద్యా రుణాలు అందుబాటులోకి వస్తున్నాయి. రుణ మొత్తం కోర్సు కాల వ్యవధి ఆధారంగా ఉంటుంది. మూడు నెలల వ్యవధిలోని కోర్సులకు రూ. 10 వేలు; మూడు నెలల నుంచి ఆరు నెలల వ్యవధిలోని కోర్సులకు రూ. 25 వేలు; ఏడాది వ్యవధి గల కోర్సులకు రూ. 50 వేలు; ఏడాదికంటే ఎక్కువ వ్యవధి గల కోర్సులకు రూ. 1.5 లక్షలుగా నిర్ణయించారు.
 
ప్రభుత్వ నిర్దేశిత ఫీజు మొత్తాలకు మాత్రమే

విద్యా రుణాలను అందించే విషయంలో ప్రభుత్వం, బ్యాంకర్స్ అసోసియేషన్‌లు కలిసి కొన్ని నిబంధనలను నిర్దిష్టంగా పేర్కొన్నాయి. ముఖ్యంగా రుణ మొత్తం మంజూరుకు సంబంధించి స్పష్టమైన విధివిధానాలను పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయా కోర్సులకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన ట్యూషన్ ఫీజులకు సమానమైన మొత్తానికి మాత్రమే రుణాలను అందిస్తారు. మేనేజ్‌మెంట్ కోటాలో చేరినా ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు మేరకే రుణం మంజూరు చేస్తారు.

రుణ మొత్తాలు ఇలా

దేశంలో, విదేశాల్లో విద్యాభ్యాసానికి సంబంధించి రుణ సదుపాయంపై బ్యాంకులు గరిష్ట పరిమితులు విధించాయి. దీని ప్రకారం దేశంలోని విద్యా సంస్థల్లో కోర్సులకు గరిష్టంగా రూ. పది లక్షలు, విదేశీ విద్యకు గరిష్టంగా రూ. 20 లక్షలు మంజూరు చేస్తారు. అంతేకాకుండా మొత్తం రుణాలకు సంబంధించి మార్జిన్ మనీ (విద్యార్థులు సొంతంగా భరించాల్సిన మొత్తం)ని కూడా నిర్దేశించాయి. రూ. నాలుగు లక్షల వరకు ఎలాంటి మార్జిన్ మనీ ఉండదు. రుణ మొత్తం రూ.నాలుగు లక్షలు దాటితే స్వదేశంలో విద్యకు 5 శాతం, విదేశీ విద్యకు 15 శాతం మార్జిన్ మనీ నిబంధన అమలులో ఉంది.
 
హామీల నిబంధనలివే

రుణ మంజూరుకు సంబంధించి విద్యార్థులు కొన్ని హామీలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ విషయంలోనూ రూ. నాలుగు లక్షల వరకు ఎలాంటి హామీ అవసరం లేదు. కేవలం తల్లిదండ్రులను సహ దరఖాస్తుదారులుగా పేర్కొంటే సరిపోతుంది.
     
రూ. నాలుగు లక్షల నుంచి రూ. 7.5 లక్షల వరకు తల్లిదండ్రుల హామీతో పాటు థర్డ్‌పార్టీ గ్యారెంటీ సమర్పించాలి.
     
రూ.7.5 లక్షల కంటే ఎక్కువ రుణాలకు తల్లిదండ్రుల హామీతోపాటు స్థిరాస్థులను కొల్లేటర్ సెక్యూరిటీగా చూపించాలి.
 
వడ్డీ రేట్లలోనూ చేయూత

ఆయా రుణ మొత్తాలపై వసూలు చేసే వడ్డీ రేట్ల విషయంలోనూ బ్యాంకులు  సరళీకృత విధానాలను అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం 10.5 శాతం నుంచి 13.00 శాతం వరకు వార్షిక వడ్డీరేటును వసూలు చేస్తున్నాయి. ఈ వడ్డీ రేట్లు ఆయా బ్యాంకుల అంతర్గత నిబంధనల మేరకు నిర్ణయమవుతున్నాయి. అంతేకాకుండా మహిళా విద్యార్థులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించే క్రమంలో అన్ని బ్యాంకులు దాదాపు ఒక శాతం వడ్డీని తక్కువగా వసూలు చేస్తున్నాయి.
 
సీఎస్‌ఐఎస్ స్కీం.. ప్రత్యేక సదుపాయం

వడ్డీ గణన విషయంలో విద్యార్థులకు వెసులుబాటు కల్పించే క్రమంలో 2009లో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ సెక్టార్ ఇంట్రెస్ట్ సబ్సిడీ (సీఎస్‌ఐఎస్) స్కీంను ప్రవేశపెట్టింది. ఈ స్కీం 2009-10 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం కోర్సు వ్యవధిలో వడ్డీ రేటును లెక్కించరు. దీని ఫలితంగా అంతకు ముందు మాదిరిగా రుణం మంజూరు చేసిన రోజు నుంచి వడ్డీ చెల్లించాల్సిన అవసరం విద్యార్థులకు తప్పింది.
 
తిరిగి చెల్లింపు ఇలా

విద్యా రుణాలు పొందిన విద్యార్థులు ఆ మొత్తాలను కోర్సు పూర్తి చేసుకున్న ఒక ఏడాది తర్వాత నుంచి లేదా ఉద్యోగం పొందిన ఆరు నెలల తర్వాత నుంచి (రెండిట్లో ముందుగా ఏది సాధ్యమైతే దానినే పరిగణనలోకి తీసుకుంటారు) నెల వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అప్పటి వరకు రీపేమెంట్ హాలిడే లేదా మారటోరియం పేరుతో తిరిగి చెల్లింపు విషయంలో బ్యాంకులు వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఒకవేళ విద్యార్థులు అనివార్య కారణాల వల్ల కోర్సును నిర్దిష్ట గడువు లోపు పూర్తి చేయలేక పోయినా.. మరో రెండేళ్లు రీపేమెంట్ హాలిడే సదుపాయాన్ని అందిస్తు న్నాయి.

అకడెమిక్ ట్రాక్ రికార్డ్‌పైనా దృష్టి

విద్యా రుణాలు మంజూరు చేసే క్రమంలో బ్యాంకులు విద్యార్థుల అకడెమిక్ రికార్డ్‌పైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు నిర్దిష్ట పర్సంటేజ్‌తో ఉత్తీర్ణత సాధించాలనే నిబంధనను విధిస్తున్నాయి. సాధారణంగా కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రాధాన్యమిస్తున్నాయి. అంతేకాకుండా నిరంతరం ఆయా కళాశాలల యాజమాన్యాల సహకారంతో విద్యార్థుల ట్రాక్ రికార్డ్‌ను తెలుసుకుంటున్నాయి. కాబట్టి రుణం మంజూరు చేయించుకోవడంతో పాటు.. ఆ తర్వాత అకడెమిక్‌గానూ మంచి ప్రదర్శన కనబర్చాల్సిన అవసరం విద్యార్థులపై ఉంటోంది.
 
రుణ మొత్తాలు.. వీటికే
బ్యాంకులు మంజూరు చేసే విద్యా రుణాల్లో ట్యూషన్ ఫీజుతోపాటు మరికొన్ని వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. అవి..
ట్యూషన్ ఫీజు
లైబ్రరీ/లేబొరేటరీ/ఎగ్జామినేషన్ ఫీజు
     
పుస్తకాలు, యూనిఫామ్స్, కోర్సు అభ్యసనానికి అవసరమయ్యే ఇతర పరికరాలు (కంప్యూటర్లు తదితర) కొనుగోలు వ్యయం.
     
స్టడీ టూర్స్, ప్రాజెక్ట్ వర్క్స్‌కు వెచ్చించే మొత్తం.
     
విదేశీ విద్య ఔత్సాహికులకు సంబంధించి ప్రయాణ ఖర్చులు
 
అన్ని బ్యాంకులు ప్రధానంగా వీటి ఆధారంగానే రుణ మొత్తాలను ఖరారు చేస్తాయి. వాటిని నేరుగా కళాశాలలకు అందిస్తాయి. ఒకవేళ అప్పటికే విద్యార్థులు ఆయా ఫీజులను చెల్లించి ఉంటే తగిన ఆధారాలను పరిశీలించి సదరు మొత్తాన్ని విద్యార్థి చేతికి అందిస్తాయి. కోర్సు మిగతా సమయాల్లో చెల్లించాల్సిన మొత్తాలను కళాశాలలకు చెల్లిస్తాయి.
 
రుణ దరఖాస్తుకు సమర్పించాల్సిన పత్రాలు
ప్రవేశం లభించిన ఇన్‌స్టిట్యూట్ నుంచి ఫీజు, ఇతర అకడెమిక్ సంబంధిత ఖర్చులతో కూడిన అడ్మిషన్ లెటర్
     
వయసు నిర్ధారణకు సంబంధించి వయో ధ్రువీకరణ పత్రం
     
అప్పటి వరకు పొందిన అకడెమిక్ అర్హతలకు సంబంధించి సర్టిఫికెట్ల నకలు ప్రతులు
     
తల్లిదండ్రులు/కో-అప్లికెంట్స్/హామీదారుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు.
     
కొల్లేటర్ సెక్యూరిటీకి సంబంధించి వాల్యుయేషన్ సర్టిఫికెట్
     
విదేశీ విద్య ఔత్సాహికులు పాస్‌పోర్ట్, వీసా, అడ్మిషన్ లెటర్, ప్రయాణ ఖర్చులకు సంబంధించిన నకలు ప్రతులు.
     
విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్యారంటార్ల పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్స్
 
ఇటీవల కాలంలో బ్యాంకులు దరఖాస్తు చేసుకునే బ్రాంచ్ విషయంలోనూ కొన్ని నిబంధనలు పాటిస్తున్నాయి. దీని ప్రకారం విద్యార్థులు తమ నివాస పరిధిలోని లేదా తాము చేరిన కళాశాల/ఇన్‌స్టిట్యూట్ సమీపంలోని బ్యాంకుల బ్రాంచ్‌లలోనే దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉంది.
 
బ్యాంకుల నుంచి ఎంతో చేయూత
విద్యా రుణాల విషయంలో బ్యాంకులు ఎంతో చేయూతనిస్తున్నాయి. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత విద్య కలలను నిజం చేసేందుకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో రీపేమెంట్ హాలిడే, మహిళలకు వడ్డీ రాయితీ వంటి సదుపాయాలను అందిస్తున్నాయి. నెలవారీ వాయిదాల చెల్లింపు విషయంలోనూ విద్యార్థుల కోణంలో ఆలోచిస్తున్నాయి. నిర్దిష్ట రీపేమెంట్ గడువు కంటే ముందే రుణ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తే మొత్తం వడ్డీ నుంచి ఒక శాతం గుడ్‌విల్ అందిస్తున్నాయి. విద్యార్థులు ఈ సౌకర్యాలను అందిపుచ్చుకుని ఉన్నత విద్యలో రాణించాలని అభిలషిస్తున్నాను.
     - ఆర్.సి. రాజన్, జీఎం, కెనరా బ్యాంక్

ముందస్తు కసరత్తుతో సులువుగా
విద్యా రుణాలకు దరఖాస్తు చేసుకునేవారు ఆ ప్రక్రియను ముందుగానే ప్రారంభించాలి. అన్ని బ్యాంకుల్లో లోన్ ప్రాసెసింగ్‌కు 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. కాబట్టి తమ కోర్సు ప్రారంభానికి ముందే అడ్మిషన్ లెటర్‌తో దరఖాస్తు చేసుకోవాలి. అంతేకాకుండా దరఖాస్తు పూర్తి చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలి. దరఖాస్తులో చిన్న చిన్న లోపాలతో చాలా మంది విద్యార్థులు చివరి నిమిషంలో ఒత్తిడికి గురవుతున్నారు. అందుకే దరఖాస్తును, అందులోని నియమ నిబంధనలను ఒకటికి రెండుసార్లు పరిశీలించి దరఖాస్తు చేయడం మంచిది. దరఖాస్తుతోపాటు అవసరమైన ఇతర పత్రాలన్నిటినీ పకడ్బందీగా సమర్పిస్తే 15 రోజుల్లో రుణం మంజూరవుతోంది.
- వి.కె. గోపాలన్, చీఫ్ మేనేజర్, ఎస్‌బీహెచ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement