Skill Development Center
-
నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ.. మీ ప్రతిభకు తోడుగా జగనన్న ప్రభుత్వం
-
‘కాగ్’ నివేదికలోనూ.. ‘చంద్రబాబు ప్రభుత్వ దోపిడీ ‘స్కిల్’ సిత్రాలు
సాక్షి, అమరావతి : టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ) ముసుగులో సాగిన కుంభకోణాన్ని రాజ్యాంగ ప్రతిపత్తిగల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు చెందిన ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కూడా నిగ్గుతేల్చింది. యువతకు నైపుణ్యాభివృద్ధి ముసుగులో సీమెన్స్ కంపెనీ పేరిట చంద్రబాబు ప్రభుత్వం నడిపించిన ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలను కడిగిపారేసింది. 2015 నుంచి 2018 వరకు సాగిన ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టు రికార్డులను కాగ్ 2018 మే 29 నుంచి జూన్ 22 వరకు పరిశీలించింది. అందులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండిపడిందని తేల్చింది. కాగ్ ప్రధానంగా లేవనెత్తిన అభ్యంతరాలివే.. రూ.370 కోట్ల ప్రాజెక్టును రూ.3,300 కోట్లుగా.. సీమెన్స్ కంపెనీ పేరిట ప్రాజెక్టు నివేదిక రూపకల్పనలోనే చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. ఆ ప్రాజెక్టులో పేర్కొన్న వివరాల ప్రకారం ఆ ఒప్పందం విలువ రూ.370కోట్లు మాత్రమే. ప్రైవేటు కంపెనీ సరఫరా చేస్తామని చెప్పిన సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, ఇతర అంశాలకు సంబంధించిన ఇన్వాయిస్లను పరిశీలిస్తే ఆ ప్రాజెక్టు విలువ రూ.370 కోట్లుగానే లెక్కతేలిందని పేర్కొంది. కానీ, అది రూ.3,300 కోట్ల ప్రాజెక్టుగా భ్రమింపజేసేలా అంచనాలను అమాంతంగా పెంచేసి నివేదికను రూపొందించారు. దాంతోనే ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి ఆస్కారం ఏర్పడింది. ఇంతవరకూ లెక్కాపత్రం లేదు ఇక ప్రాజెక్టు ఒప్పందంలో భాగంగా సరఫరా చేసిన హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ విలువ ఎంత అన్నది కనీసం నిర్థారించలేదు. నిపుణులైన ఏజెన్సీలతో నిర్థారించాలని 2017, నవంబరు 25న నిర్వహించిన ఏపీఎస్ఎస్డీసీ బోర్డు సమావేశంలో నిర్ణయించారు. కానీ, ఆ మేరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. డిజైన్‌టెక్ కంపెనీ సరఫరా చేసిన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన కొనుగోలు ఆర్డర్ కాపీని ఆడిట్ కోసం అందుబాటులో ఉంచకపోవడం గమనార్హం. ఖజానాకు రూ.355 కోట్ల గండి నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టు రూపకల్పన, నిధుల విడుదలతో మొత్తం రూ.355 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. ప్రాజెక్టులో పేర్కొన్న వివరాల ప్రకారం ప్రాజెక్టు విలువలో ప్రభుత్వం 10శాతం నిధులు కేటాయించాలి. అంటే, ప్రాజెక్టు వాస్తవ విలువ రూ.370 కోట్లుగా చూపించి ఉంటే.. ప్రభుత్వం రూ.37 కోట్లు మాత్రమే విడుదల చేయాలి. కానీ.. అంచనాలను అమాంతం పెంచేసి రూ.3,300 కోట్లుగా చూపించి.. ప్రభుత్వ వాటా 10 శాతంతో పాటు జీఎస్టీ, ఇతర అంశాలను కలుపుతూ ఏకంగా రూ.370 కోట్లు విడుదల చేశారు. అలా రూ.333 కోట్లు కొల్లగొట్టారు. అంతేకాదు, ఒక ఏడాది ముందే.. అది కూడా ప్రాజెక్టు మొదలుకాకుండానే ప్రభుత్వం నిధులు విడుదల చేయడం గమనార్హం. దాంతో రూ.22 కోట్ల వడ్డీ రూపంలో రావల్సిన ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. వెరసి ప్రభుత్వ ఖజానాకు రూ.355 కోట్ల నష్టం వాటిల్లింది. నకిలీ ఇన్వాయిస్లతో రూ.241కోట్లు కొల్లగొట్టారు ఇక షెల్ కంపెనీలు సరఫరా చేసినట్లుగా నకిలీ ఇన్వాయిస్లు చూí³ంచి కనికట్టు చేశారు. ఆ విధంగా రూ.241 కోట్లను షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు తరలించారు. అక్కడ నుంచి హవాలా మార్గంలో టీడీపీ పెద్దలకు ఆ నిధులు చేరాయని సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. ఒప్పందంలో కాలేజీలకు భాగస్వామ్యం లేదు అలాగే, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం చేసుకున్నామని చెబుతున్న ఈ ఒప్పందంలో సంబంధిత కాలేజీలను భాగస్వాములను చేయనేలేదు. దాంతో ఆ కాలేజీలకు ఎలాంటి పాత్రా లేకుండాపోయింది. వాటిల్లో నెలకొల్పిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో ఏర్పాటుచేసిన హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ విలువ ఎంతన్నది మదింపు చేయనేలేదు. ఆ కాలేజీల యాజమాన్యాలకు కూడా ఆ విషయంపై ఎలాంటి అవగాహనలేదు. -
స్కిల్ మస్తు.. జాబ్ పక్కా.. యువతకు ఉద్యోగాల వెల్లువ
మార్కాపురం(ప్రకాశం జిల్లా): డిగ్రీ పట్టా ఉంటే చాలదు.. ఉద్యోగం సాధించాలంటే టెక్నాలజీకి అవసరమైన నైపుణ్యం అవసరం.. ఆ దిశగా రాష్ట్ర పభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. నియోజకవర్గానికో స్కిల్ హబ్, జిల్లాకో స్కిల్ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. వాటి ద్వారా స్థానికంగా డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తోంది. నిరంతరం జాబ్‌మేళాలు నిర్వహిస్తూ ఉపాధి కల్పిస్తోంది. ఇప్పటి వరకూ జిల్లాలో 7,147 మంది వివిధ రంగాల్లో ఉద్యోగాలు సాధించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో గత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఐదేళ్లపాటు ఆర్భాటపు ప్రకటనలకే పరిమితమై నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఫలితంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలకు దూరమయ్యారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పలు చర్యలు తీసుకున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థను పటిష్టపరచడం, సంస్థ సేవలను విస్తృతం చేయడం ద్వారా పెద్ద పెద్ద నగరాల్లోని ప్రముఖ కంపెనీల్లో మంచి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా అధికారులు జిల్లాలో 10 స్కిల్ హబ్‌లు, ఒంగోలు నగరంలో 2 శిక్షణ కేంద్రాలతో పాటు స్కిల్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఎటువంటి అదనపు అర్హత లేకపోయినా డిగ్రీ పాసై ఉంటే నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాల కల్పన చేస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా జిల్లాలో మొత్తం 23,853 మందికి శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన వారిలో 7,147 మంది నెల్లూరు, చిత్తూరు. తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు, చెన్నై తదితర పట్టణాల్లోని ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. ప్రతి నెలా మొదటి శుక్రవారం ఒక నియోజకవర్గంలో మెగా జాబ్‌మేళా, మూడో మంగళవారం మినీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు. స్థానికంగా డిమాండ్ ఉన్న కోర్సులను గుర్తించి శిక్షణ ఇచ్చి ఉపాధి చూపుతున్నారు. ఒంగోలు నగరంలో బాలురు, బాలికల ఐటీఐల్లో రెండు శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. బాలికల ఐటీఐలో ప్రత్యేకంగా మహిళల కోసం హౌసింగ్, ఎల్రక్టీషియన్ కోర్సులు నిర్వహిస్తున్నారు. మరో కేంద్రంలో ఇండ్రస్టియల్, పిట్టర్ ఎరోకేషన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. గిద్దలూరులో సెక్యూరిటీ గార్డు, టెలీకాలర్స్, కొండపిలో రిటైల్ అసిస్టెంట్, అసిస్టెంట్ బ్యూటీషియన్, దర్శి, మార్కాపురంలో ఇండ్రస్టియల్ విభాగంలో శిక్షణ ఇస్తున్నారు. సంతనూతలపాడులో సీయింగ్ వెకేషన్, బ్యూటీథెరపిస్టులో శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఒంగోలులో 90 మందితో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మెండుగా ఉపాధి అవకాశాలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు స్థానికంగా డిమాండ్ ఉన్న కోర్సులను గుర్తించి యువతకు శిక్షణ ఇస్తున్నాం. స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలన్న సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాలను అమలు చేస్తున్నాం. ప్రతి నెలా 15 నుంచి 25 కంపెనీలతో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నాం. 8 నియోజకవర్గాల్లో 10 స్కిల్ హబ్ సెంటర్లు ఏర్పాటు చేశాం. ఇండ్రస్టియల్ ఎల్రక్టీ షియన్, ఫిట్టర్, ఫ్యాబ్రికేషన్ తదితర అంశాల్లో శిక్షణ ఉంటుంది. త్వరలో ఒంగోలులో నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. – లోకనాథం, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి చెన్నైలో ఉద్యోగం చేస్తున్నా నా పేరు శేషుకుమారి. మాది రామసముద్రం. పీజీ చదివాను, జాబ్‌మేళాలో పాల్గొని ఉద్యోగానికి ఎంపికయ్యాను. ప్రస్తుతం చెన్నైలో ఒక ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నా. నెలకు రూ.14 వేల జీతం. హ్యాపీగా ఉన్నాను. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నిర్వహించిన జాబ్‌మేళాలో ఈ అవకాశం దక్కింది. – జే శేషుకుమారి ఏడాదికి రూ.7.5 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేస్తున్నా నా పేరు జీ రమేష్. మాది పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామం. గుంటూరులో బీటెక్ చేశా. ఇటీవల స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌మేళాకు హాజరై బైజూస్ సంస్థలో ఎడ్యుకేషన్ కౌన్సిలర్‌గా ఎంపికయ్యా. ఏడాదికి రూ.7.5 లక్షల ప్యాకేజీ. – జీ రమేష్ -
తెలంగాణలో అతిపెద్ద స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్.. ఎక్కడో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ యువతకు ఉపాధి లక్ష్యంగా నగరానికి ఆనుకుని యాదాద్రి జిల్లా పరిధిలోని దండుమల్కాపురం (ఎన్‌హెచ్– 65) వద్ద టీఎస్ఐఐసీ, తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ నిర్మిస్తోన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ (ఎస్డీసీ) డిసెంబరులో అందుబాటులోకి రానుంది. ఈ ప్రాంతంలో సుమారు 547 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నెలకొల్పిన ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పరిశ్రమల పార్క్‌కు ఎస్డీసీ తలమాణికం కానుంది. ఈపార్క్‌లో దశలవారీగా ప్రత్యక్ష, పరోక్షంగా సుమారు 20–30 వేల మందికి ఉపాధి కల్పించనున్నట్లు టీఎస్ఐఐసీ వర్గాలు తెలిపాయి. ఎస్‌డీసీపై కేటీఆర్ ట్వీట్.. ఇటీవల మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి కేటీఆర్ సైతం ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుపై సామాజిక మాధ్యమం ట్విటర్లో ట్వీట్ చేశారు. టీఎస్ఐఐసీ, తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన.. రాష్ట్రంలోనే అతిపెద్ద స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్, ఇండస్ట్రియల్ పార్క్ ఇదేనని పేర్కొన్నారు. దండుమల్కాపురం పార్క్‌లో సుమారు 589 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కొలువుదీరనున్నాయన్నారు. సుమారు 20–30 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ పార్క్‌ను ఏర్పాటు చేశామన్నారు. స్థానిక పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా నైపుణ్యం కలిగిన కార్మికులు, టెక్నీషియన్లు, ఉద్యోగులను తీర్చిదిద్దేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అవసరమైన శిక్షణనిస్తుందన్నారు. ఇటీవల హర్యానా స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు సైతం తమ స్టడీటూర్‌లో భాగంగా ఈ కేంద్రాన్ని, పార్క్‌ను సందర్శించి స్ఫూర్తి పొందినట్లు తెలిపారు. కాగా ఈపార్క్‌లో సుమారు 60 శాతం స్థలాన్ని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించారు. ఈ పార్క్‌లో టౌన్షిప్ ఏర్పాటు ద్వారా వాక్‌టు వర్క్ కాన్సెప్ట్‌ను అమలు చేయనున్నారు. ఇప్పటికే ఈ పార్క్‌లో సుమారు 200 పరిశ్రమలు తమ కంపెనీలు నెలకొల్పే పనులు చేపట్టడం విశేషం. వచ్చే ఏడాది జూన్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆయాసంస్థలు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే 30 పరిశ్రమలు ఈ పార్క్‌లో ఉత్పత్తులకు శ్రీకారం చుట్టాయి. మిగతా పరిశ్రమలు కూడా తమ కంపెనీల స్థాపనకు చర్యలు తీసుకుంటున్నాయి. పలు పారిశ్రామిక పార్క్‌ల పరిశీలన తర్వాతే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం దేశవ్యాప్తంగా పలు పారిశ్రామిక వాడలను పరిశీలించిన అనంతరమే టీఎస్ఐఐసీ, టీఐఎఫ్ సంస్థలు ఈ పార్క్‌ను అభివృద్ధి చేశాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అతిపెద్ద ఎంఎస్ఎంఈ పార్క్ ఇదేనని తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. రూ.236 కోట్ల అంచనా వ్యయంతో విద్యుత్, మంచినీరు, రహదారులు, మురుగు నీటి పారుదల వ్యవస్థలను ఏర్పాటు చేశామన్నారు. ఈ పార్క్‌లో అంతర్భాగంగా 194 ఎకరాల్లో టౌన్షిప్ ఏర్పాటు చేయడంతోపాటు ఇందులో పాఠశాలలు, కమర్షియల్ మార్కెట్లు, ఎంటర్టైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ పార్క్‌కు డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ సంస్థనుంచి పలు అంశాల్లో ప్రశంసలు దక్కినట్లు పేర్కొన్నాయి. ఈ పార్క్‌లో సుమారు 40 వేల మొక్కలు నాటి హరితహారానికి చర్యలు తీసుకున్నామన్నాయి. (క్లిక్ చేయండి: ఇది బెంగళూరు కాదు సార్.. హైదరాబాదే!) -
ఈ ఏడాది నుంచే స్కిల్ కాలేజీలు
సాక్షి, అమరావతి: ఈ విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలో 26 స్కిల్స్ కాలేజీలు అందుబాటులోకి రానున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) వెల్లడించింది. కొత్త కాలేజీల నిర్మాణాలు పూర్తయి అందుబాటులోకి వచ్చేవరకూ తాత్కాలికంగా 26 స్కిల్ కాలేజీలను తక్షణమే ప్రారంభించబోతున్నట్లు సంస్థ ఎండీ ఎస్. సత్యనారాయణ తెలిపారు. స్కిల్ కాలేజీల నిర్మాణాలపై ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చిన కథనాల్లో ఏమాత్రం నిజంలేదని సోమవారం ఆయన ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ కాలేజీలు, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయన్నారు. ఇప్పటికే పులివెందులలో మొదటి స్కిల్ కాలేజి నిర్మాణం ప్రారంభమైందని.. ఈ పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్ ఇక వీటికి అదనంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో స్కిల్ హబ్‌ను కూడా ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని సత్యనారాయణ తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడతలో 86 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 89 స్కిల్ హబ్స్ కేంద్రాలను ఇప్పటికే గుర్తించారని.. వీటి ఏర్పాటుకు 194 పరిశ్రమలను సంప్రదించి డిమాండ్‌కు అవసరమైన 185 కోర్సుల్లో శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక సిద్ధంచేశారని పేర్కొన్నారు. ఈ శిక్షణా కేంద్రాల మ్యాపింగ్, పరిశ్రమల్లో ఎలాంటి ఉద్యోగాలకు డిమాండ్ ఉంది అన్న అంశాలపైనా సర్వే కూడా పూర్తయిందన్నారు. కోర్సుల ఎంపిక, సిలబస్ రూపకల్పన, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్, అసెస్మెంట్, ధృవీకరణ పత్రాల అందజేత లాంటి విషయాల్లో నేషనల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఎస్క్యూఎఫ్)కు అనుగుణంగానే కోర్సులను ఎంపిక చేస్తున్నామన్నారు. ఇందులో పరిశ్రమలు, వివిధ సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్, విద్యారంగ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకునేందుకు ఇటీవలే విజయవాడలో ఒక సదస్సు నిర్వహించామని సత్యనారాయణ చెప్పారు. కోవిడ్ సమయంలో కూడా శిక్షణ ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శిక్షణా కార్యక్రమాలు నిలిచిపోయాయంటూ ఈనాడులో వచ్చిన కథనాన్ని సత్యనారాయణ ఖండించారు. కోవిడ్ సమయంలో శిక్షణా కార్యక్రమాలకు బ్రేక్ పడిందని.. కానీ, ఇప్పుడు తిరిగి శ్రీకారం చుట్టినట్లు ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. గడచిన రెండేళ్లలో 13 లక్షల మంది నైపుణ్య శిక్షణ పొందారన్నారు. కోవిడ్ సమయంలో ఆన్లైన్ ద్వారా రెండు లక్షల మంది లబ్ధిపొందారని వివరించారు. కోవిడ్ సమయంలోనూ శిక్షణ ఇచ్చినందుకుగాను జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డుతో ఏపీఎస్ఎస్డీసీకి గుర్తింపు లభించిందన్నారు. ఇక ఈ ఏడాది జనవరి 4 నుంచి 10 వరకు ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి నైపుణ్య పోటీల్లో ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన యువత ఏడు బంగారు, నాలుగు వెండి, రెండు రజతాలు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన కేటగిరిలో నాలుగు.. మొత్తం 17 పతకాలు సాధించారని సత్యనారాయణ గుర్తుచేశారు. అలాగే, గతంలో స్కిల్ ఇండియా పోటీల్లో 13వ స్థానంలో ఉన్న ఏపీ ఈ ఏడాది 5వ స్థానంలో నిలిచిందన్నారు. -
Career pedia: నేర్చుకుంటే సాధించవచ్చు
గతంతో పోల్చితే ఈ రోజుల్లో చదువుకున్నవారి సంఖ్య బాగా పెరుగుతోంది. మంచి కంపెనీలలో ఉద్యోగమూ సంపాదిస్తున్నారు. ‘కానీ, ఆ ఆనందం వారిలో కొన్నాళ్లలోనే ఆవిరైపోతుంది..’ అంటున్నారు జ్యోత్సా్నరెడ్డి. నైపుణ్యాల లేమి కారణంగా నవతరం ఎదుర్కొంటున్న ఒత్తిడిని గమనించి, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను ఏర్పాటు చేసి, వారిలో అవగాహన కలిగిస్తున్నారు. కాలేజీలలో వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నారు. ‘ప్రపంచానికి ఇప్పుడు మార్కులు, పర్సెంటేజీలు కాదు నైపుణ్యాలు కావాలి’ అని చెబుతున్న ఈ కెరీర్ గైడ్ హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ‘కెరీర్ పీడియా’ ద్వారా తన సేవలను అందిస్తున్నారు. మల్టిపుల్ కంపెనీలలో ఉద్యోగం చేసిన అనుభవం సొంతం చేసుకున్న జ్యోత్స్న తను తీసుకున్న నిర్ణయం గురించి, యువతరం ఎదుర్కొంటున్న ఒత్తిడి గురించి, వాటి పరిష్కారాల దిశగా తాము చేస్తున్న ప్రయాణం గురించి వివరించారిలా... ‘‘ఎంబీయే పూర్తయ్యాక బెంగళూరు, హైదరాబాద్‌లో అనేక కంపెనీలలో ఉద్యోగాలు చేశాను. అక్కడ గమనించిన వాటిలో ముఖ్యమైనది యువత ఎంత ఎక్కువ శాతంలో ఉద్యోగంలో చేరుతున్నారో.. అంతే శాతంలో రిజెక్ట్ కూడా అవడం. కారణం... వారు చదువుకున్న కాలేజీలలో పాఠ్యాంశాలే తప్ప ఇతర నైపుణ్యాలు నేర్పించరు. విద్యార్థులు కూడా వాటి మీద దృష్టి పెట్టరు. కొందరు మాత్రమే రాణించడానికి, మిగతావాళ్లు వెనకబడటానికి గల కారణాలేంటో కొన్నాళ్లు గమనించాను. ఉద్యోగంలో చేరినా.. పని సకాలంలో పూర్తిచేసే సామర్థ్యం చాలా మందిలో ఉండటం లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు, టెక్నికల్ నాలెడ్జ్ అంతంత మాత్రమే. ఇలాంటప్పుడు కంపెనీలపై కూడా వీరి వల్ల ఒత్తిడి ఉంటుంది. కొన్నాళ్లు కొత్తగా చేరిన ఉద్యోగుల పనితీరును గమనించి, వారి ఫైల్స్ పక్కన పెట్టేస్తుంటారు. ఒక్క ఐటీ రంగమే కాదు, ఇతర రంగాల్లోనూ నైపుణ్యాల లేమి అనే సమస్య ఉంది. దీనికి కోవిడ్ కూడా ఒక అడ్డంకి అయ్యింది. కంపెనీలు చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్‌ను ఎడాప్ట్ చేసుకున్నాయి. క్యాంపస్ సెలక్షన్స్ లేవు. దీంతో విద్యార్థుల్లో సంస్థలకు కావల్సిన క్వాలిటీ శాతం బాగా తగ్గింది. సంస్థలు ఇప్పుడు క్వాలిటీ ఎంప్లాయీస్ కోసం అన్వేషిస్తున్నాయి. ఉద్యోగులకు నైపుణ్యాలు కల్పిస్తే కంపెనీలకు కావాల్సిన టెక్నికల్ మాన్ పవర్‌ను అందించగలం అనుకున్నాం. మావారు రాహుల్‌రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవడంతో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు. మా ఇద్దరిదీ ఒకే రంగం అవడం వల్ల తీసుకున్న నిర్ణయాలను త్వరగా అమలు చేయగలుగుతున్నాం. మార్కులు కాదు ముఖ్యం.. నిజానికి ఇదొక ప్రయోగాత్మక కార్యక్రమమనే చెప్పవచ్చు. విద్యార్థులు–సంస్థల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలనుకున్నాను. అయితే, ఇందుకు కావల్సిన వనరుల గురించి కూడా ఆలోచించాం. అప్పటికే మాకున్న మాతృసంస్థ ‘ఇన్ప్రాగ్’ ద్వారా ఆర్థికసాయం తీసుకుంటున్నాం. పేద విద్యార్థులకు ఉచిత సేవలు అందించడానికి, అలాగే ఇతరులకూ నామమాత్రపు ఫీజుతో స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వడానికి సాధ్యమయ్యింది. ‘చిన్న వయసులోనే పెద్ద బాధ్యతను తీసుకున్నారు’ అని తెలిసిన వారంటుంటారు. కష్టమైనా ఇష్టంతో చేస్తున్న పని. ఎంతో మందికి ఉపయోగపడే పని’ అని చెబుతుంటాను. అత్యాధునిక నైపుణ్యాలకు అన్ని రంగాల్లోనూ అధిక డిమాండ్ ఉంది. అందుకని విద్యార్థులు ముందుగా స్పెషలైజేషన్‌లో భాగంగా వారి నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది’ అని వివరించారు ఈ కెరీర్ప్లానర్. చదువుకుంటూనే నైపుణ్యాలు ‘ఇది కొంచెం కష్టమైన పనే. కానీ, విద్యార్థులు తమ డిగ్రీ స్థాయిలోనే నైపుణ్యాలను అలవర్చుకుంటే, తర్వాత ఉద్యోగావకాశాలకు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఇది గుర్తించి కాలేజీల్లో వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నాం. డిగ్రీస్థాయివారి మాత్రమే కాదు ఇతర డిప్లొమా కోర్సులు చేసిన వారికి కూడా వారి కెరీర్ లక్ష్యాలను సాధించడానికి ప్రోత్సహిస్తున్నాం. ఫలితంగా విద్యార్థి డిగ్రీ నాలుగేళ్లలోనే స్కిల్స్ పెంచుకుంటే, నేరుగా సంస్థల్లో తమ నైపుణ్యాలను చూపవచ్చు. విద్యార్థులు ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు సంపాదన మొదలుపెట్టడానికి ఫ్రీలాన్స్ అవకాశాలను కూడా సెట్ చేస్తున్నాం. ఇందుకు ఆన్‌లైన్‌ను వేదికగా చేసుకున్నాం.’ – నిర్మలారెడ్డి -
ఎల్బీ శాస్త్రి ట్రస్ట్ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పేరిట ఏర్పాటైన ఎల్బీ శాస్త్రి ట్రస్టు హైదరాబాద్‌లో నైపుణ్యాభివృద్ది సంస్థ (స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్)ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ట్రస్టు చైర్మన్, ఎల్బీ శాస్త్రి కుమారుడు అనిల్ శాస్త్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో మంగళవారం బీఆర్కే భవన్లో భేటీ అయ్యారు. సింగపూర్‌కు చెందిన ప్రతిష్టాత్మక సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ) భాగస్వామ్యంతో ఈ సంస్థను నిర్వహిస్తామని అనిల్ శాస్త్రి ప్రకటించారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు విద్యారంగంలో ఆవిష్కరణలకు ప్రభుత్వం అందిస్తున్న చేయూతను దృష్టిలో పెట్టుకొని ఈ సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. విద్యార్థులు, యువతకు నైపుణ్య శిక్షణ.. రాష్ట్రంలో వివిధ రంగాలకు చెందిన విద్యార్థులు, యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ కోసం వివిధ కోర్సులను ఈ సంస్థ ద్వారా అందిస్తామని, తమ కార్యకలాపాలకు హైదరాబాద్ అనువైనదిగా గుర్తించామని అనిల్ శాస్త్రి వెల్లడించారు. నైపుణ్యాభివృద్ది సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వపరంగా అన్ని రకాల సాయం అందిస్తామని వినోద్ కుమార్ హామీ ఇచ్చారు. జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు కానుండటంపట్ల సీఎస్ హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో ట్రస్టు బాధ్యులు శ్రీవాస్తవ, పాండురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యువతకు 'కార్పొరేట్' నైపుణ్యం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నైపుణ్య శిక్షణలో భాగస్వామ్యం కావడానికి దేశీయ కార్పొరేట్ సంస్థలతో పాటు అంతర్జాతీయ సంస్థలు ముందుకొస్తున్నాయి. విద్యార్థులకు ఈ శిక్షణ ఇచ్చేందుకు ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)తో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్ఆర్) ఫండ్ నిధులతో ఈ కార్యక్రమం చేపట్టేందుకు వీలుగా పలు సంస్థలతో జరిపిన చర్చలు సత్ఫలితాలు ఇచ్చాయని ఏపీఎస్ఎస్డీసీ ఎండీ ఎన్. బంగార్రాజు ‘సాక్షి’కి వివరించారు. దీంతో ఐబీఎం, ఒరాకిల్, టెక్ మహీంద్రా, ఎల్అండ్టీ, అపోలో, బయోకాన్, హెచ్‌సీఎల్ వంటి 24 కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా మరికొన్నింటితో చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా.. ఇప్పటికే కొన్ని కోర్సులు ప్రారంభించామని, మిగిలిన వాటికి ప్రణాళికలు సిద్థంచేస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయ సంస్థలు కూడా.. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధిలో పాలుపంచుకోవడానికి పలు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ► అమెరికాకు చెందిన వాధ్వాని ఫౌండేషన్, బ్రిటన్‌కు చెందిన లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ యూనివర్సిటీ, సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేషనల్, జీఐజెడ్ వంటి అంతర్జాతీయ సంస్థలు నైపుణ్య శిక్షణనివ్వడానికి ముందుకొచ్చాయి. ► లాభాపేక్ష లేని వాధ్వాని ఫౌండేషన్ రాష్ట్రంలోని 100 కాలేజీల్లో విద్యార్థులు ఉద్యోగానికి ఎలా సిద్ధం కావాలి, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటర్వ్యూలు ఎదుర్కోవడమెలా వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనుంది. ► లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ సైన్స్ ఆసుపత్రులకు చెందిన ఐసీయూ, ఆక్సిజన్ ప్లాంట్, జనరల్ డ్యూటీ అటెండెన్స్, నర్సింగ్ అసిస్టెంట్ వంటి కోర్సులు అందించనుంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న నైపుణ్య శిక్షణా కేంద్రాల్లో ఈ కోర్సులు నిర్వహించడానికి స్థలాలను కేటాయిస్తున్నామని, సీఎస్ఆర్ నిధులతో చేపడుతున్న ఈ కోర్సులు చాలా వరకు ఉచితంగా అందిస్తున్నట్లు బంగార్రాజు తెలిపారు. హైఎండ్ సర్టిఫైడ్ కోర్సులకు కొన్ని సంస్థలు నామమాత్రపు రుసుమును వసూలు చేస్తున్నాయని, ఈ కోర్సుల్లో చేరాలా వద్దా అన్నది పూర్తిగా విద్యార్థుల ఇష్టానికే వదిలేస్తున్నట్లు తెలిపారు. నైపుణ్య శిక్షణకు ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు ► వాధ్వాని ఫౌండేషన్ ► సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేషనల్ (ఎస్పీఐ) ► లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ► జీఐజెడ్ ► డెల్ టెక్నాలజీస్ ► ఐబీఎం ఇండియా ► టెక్ మహీంద్రా ఫౌండేషన్, ► ఓరాకిల్ అకాడమీ ► డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ► టీసీఎస్ ఐయాన్ ► ఎల్ అండ్ టీ ఎడ్యు స్కిల్స్ ► అపోలో మెడి స్కిల్స్ ► హెచ్‌సీఎల్ ఫౌండేషన్ ► స్నైడర్ ఎలక్ట్రిక్ ► ఎల్వీప్రసాద్ ఫిల్మ్ అకాడమీ ► జేబీఎం ఇండియా లిమిటెడ్ ► ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ► నేషనల్ సాŠట్క్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ) అకాడమీ ► సీఐఐ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లాజిస్టిక్స్ ► దాల్మియా భారత్ ఫౌండేషన్ ► గ్రీన్కో టెక్నాలజీస్ ► బయోకాన్ అకాడమీ ► సేల్స్‌ఫోర్స్ ఇండియా ► ఎస్ఎంసీ కార్పొరేషన్ చదువు పూర్తికాగానే ఉపాధి ఇంజనీరింగ్, ఇతర డిగ్రీ కోర్సులు పూర్తికాగానే ఉపాధి లభించే విధంగా టాప్ ఎండ్ ఐటీ సర్టిఫైడ్ కోర్సులను ఈ కార్పొరేట్ సంస్థలు అందిస్తున్నాయి. ► వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో ఐబీఎం 150, 200 గంటల వ్యవధి ఉండే హై ఎండ్ కోర్సులను అందిస్తుండగా.. ఓరాకిల్ అకాడమీ తొలి విడత కింద 50 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ నెలలో సర్టిఫికేషన్ కోర్సులను అందించనుంది. ► అలాగే, ఎల్ అండ్ టీ నిర్మాణ రంగానికి చెందిన వివిధ కోర్సులను అందించడానికి ముందుకు వచ్చింది. ► పాత సినిమాల పునరుద్ధరణ, రీ ప్రొడక్షన్, ఫిల్మ్ ఎడిటింగ్ వంటి సినిమా సంబంధిత స్కిల్స్‌ను ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అకాడమీ అందించనుంది. ఈ సంస్థ తొలుత ఆంధ్రా యూనివర్సిటీలో తన స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తోందని, ఆ తర్వాత వివిధ జిల్లాల్లో పదిచోట్ల శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు బంగార్రాజు తెలిపారు. ..ఇలా వివిధ కోర్సుల డిమాండ్‌ను బట్టి ప్రతీ కోర్సు నుంచి 10వేల నుంచి 30 వేల మందికి శిక్షణ ఇచ్చే విధంగా ఏపీఎస్ఎస్డీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. -
నైపుణ్య కాలేజీలకు వేగంగా స్థల సేకరణ
సాక్షి, అమరావతి: ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నైపుణ్య కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. ఇందుకోసం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల వద్ద ఉన్న మిగులు భూములను సేకరించి ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ నైపుణ్య కళాశాలలను ఏర్పాటు చేయనుంది. ఒక్కో నైపుణ్య కళాశాల నిర్మాణం కోసం ఐదెకరాలు సేకరిస్తున్నట్టు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో ఎన్.బంగారురాజు చెప్పారు. 25 కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు రావడంతో జూలై నెలాఖరులోగా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఒక్కో కాలేజీ నిర్మాణానికి గరిష్టంగా రూ.20 కోట్లు వ్యయం చేయడానికి అనుమతిస్తూ మే 30న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. వీటితో పాటు తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ, నాలుగు ట్రిపుల్ ఐటీలతో పాటు పులివెందులలో మరో నైపుణ్య కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. కాలేజీల్లో వసతులివి.. స్థానిక పరిశ్రమలు, వాటికి అవసరమైన నైపుణ్యాలు తెలుసుకుని వాటికి అనుగుణంగా కోర్సులను రూపొందిస్తున్నారు. ఇందుకోసం పరిశ్రమల శాఖ చేపట్టిన సమగ్ర పారిశ్రామిక సర్వే నివేదికను ఏపీఎస్ఎస్డీసీ వినియోగించుకుంటోంది. ప్రతి నైపుణ్య కళాశాలలో ఆరు తరగతి గదులు, రెండు ల్యాబ్‌లు, వర్క్‌షాప్ నిర్వహణకు ప్రాంగణం ఉండేలా వీటిని నిర్మిస్తారు. స్థానికంగా ఉండే ఒకటి లేదా రెండు పరిశ్రమలతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కేంద్రాలను వీటిలో ఏర్పాటు చేస్తారు. ఆయా కంపెనీలకు అవసరమైన కోర్సులను ప్రవేశపెట్టి కోర్సు పూర్తికాగానే నేరుగా ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటారు. ఈ కోర్సుల కాలపరిమితి మూడు నెలలు ఉండేలా చూస్తున్నారు. -
ఏపీ విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ మణిహారం..
అమరావతి: ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా, తన చరిత్రలో మొదటి సారిగా మైక్రోసాఫ్ట్ సంస్థ ఒక వినూత్న, విప్లవాత్మక కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగస్వామ్యంతో ఆరంభించింది. రాష్ట్రంలోని విద్యావంతులైన యువతకు డిజిటల్ నైపుణ్యాలు మెరుగుపరచి, నైపుణ్య మానవ వనరుల కోసం ప్రపంచవ్యాప్తంగా అన్వేషిస్తున్న సంస్థలు, కంపెనీలకు ఒక చిరునామాగా ఏపీని తీర్చిదిద్దే బృహత్ కార్యక్రమానికి మైక్రోసాఫ్ట్ శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్య, ఉన్నత విద్యారంగంలో తీసుకొస్తున్ విప్లవాత్మక మార్పులు మైక్రోసాఫ్ట్ సంస్థను ఆకట్టుకుంది. దాంతో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఆ సంస్థ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య శుక్రవారం వర్చువల్ విధానంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య హేమచంద్రారెడ్డి, సీఎం కార్యాలయ విదేశీ విద్యావ్యవహారాల అధికారి డాక్టర్ హరికృష్ణ, రాష్ట్ర ప్రభుత్వ విదేశీ విద్య కో ఆర్డినేట్ డాక్టర్ కుమార్ అన్నవరపు, మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో అవగాహన ఒప్పందంపై సంతకాల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో కలిసి పనిచేయడానికి మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థ ముందుకు రావడం ముదావహమన్నారు. రాష్ట్రంలోని విద్యా యువతకు మైక్రోసాఫ్ట్ అందించరే డిజిట్ నైపుణ్య సాధన ఎంతో ఊతమిస్తుందాని, ఈ శిక్షణ పొందడం ద్వారా యువత ఉద్యోగం పొందే అవకాశాలు తప్పకుండా వస్తాయన్నారు. డిజిటల్ కనెక్ట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికీ చేరువ కానుందని, దాదాపు 80 లక్షల గృహాలకు డిజిటల్ కనెక్షన్లు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్ సంస్థలో జరిగిన ఈ అవగాహన ఒప్పందం వల్ల రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యార్థులు వృత్తి విద్యా కశాళాల విద్యార్థులకు ఎంతగానో ఉపయోకరంగా ఉంటుందన్నారు. కళాశాలల నుంచి బయటకు వచ్చే విద్యార్థులకు ముందగానే మైక్రోసాఫ్ట్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇవ్వడం సర్టిఫికెట్ ఇవ్వడం ద్వారా వారు మంచి అవకాశాలు పొందడానికి మార్గం సుగమమవుతుందన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ రాష్ట్ర విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారని, ఉన్నత విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను యువతకు అందించాలనే సంకల్పంతో పనిచేస్తున్నారని తెలిపారు. ఈ ప్రయత్నాలకు ఇప్పడు మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు జతకలవడం మరింత ఉపయుక్తంగా ఉంటుందన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆచార్య హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు 42 రకాలకు పైగా నైపుణ్య శిక్షణలు ఇవ్వడం వల్ల విద్యార్థుల్లో నైపుణ్యాలు మెరుగై వారు మంచి అవకాలు పొందడానికి ఇది ఊతమిస్తుంది అన్నారు. మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత మహేశ్వరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేయడానికి తాము ఎంతో ఉత్సుకతతో ఉన్నామన్నారు. దేశంలో డిజిటల్ ఎకానమీలో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలంటే ఈ డిజిటల్ స్కిల్లింగ్ అనేది ఒక పునాదిలాగా పనిచేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని యువతలో నైపుణ్యాలకు పదునుపెట్టి వారు మంచి ఉద్యోగావకాశాలు పొందడానికి సహకరించేలా పనిచేయడానికి తాము కంకణబద్ధులైనామని తెలిపారు. ఏపీతో కలిసి పనిచేయడానికి తమకు సహకరించిన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఏమిటీ కోర్సులు మైక్రోసాఫ్ట్ సంస్థ తన చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి వినూత్న విప్లవాత్మక కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వృత్తి విద్యా కళాశాలల్లోని విద్యార్థులకు వివిధ రకాల నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వనుంది. సమకాలీన ప్రపంచంలో వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాలకు పదునుపెట్టి ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఇందుకోసం ప్రత్యేకించి 42 రకాల కోర్సులను విద్యార్థులకు అందించనుంది. 1.60లక్షల మందికిపైగా ఈ కోర్సులు అందించనున్నారు. మొత్తం 42 రకాల కోర్సులుంటాయి. కోర్సులను బట్టి మొత్తం 40 గంటల నుంచి 160 గంటల వ్యవధి శిక్షణ ఇస్తారు. మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఏడు రకాల అజ్యూర్ (Azure DevOps)టెక్నాలజీ కోర్సులు, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365, పవర్ యాప్ ఫండమెంటల్స్, అజ్యూర్ డాటా అనలిటిక్స్, డాటాబేస్ తదితర 42 రకాల సాంకేతిక నైపుణ్య కోర్సులు ఇందులో ఉంటాయి. వీటికి మైక్రోసాఫ్ట్ నుంచి సుశిక్షితులైన నిపుణుల ద్వారా ఆన్లైన్, ఆఫ్ లైన్ శిక్షణా తరగతులను అందిస్తారు. అలాగే ఉద్యోగాలకు జరిగే ఇంటర్వ్యూలకు ఎలా సంసిద్ధం కావాలి, వేష భాషలతో పాటు, నైపుణ్యాలపైనా శిక్షణ ఇస్తారు. ఈ తరగతుల నిర్వహణకు సంబంధించిన స్థానికంగా వనరుల సహకారం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. కోర్సులు పూర్తి చేసిన విద్యార్థి ప్రొఫైళ్లను లింక్డిన్లో అప్డేట్, అప్లోడు చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఆ నైపుణ్యాలున్న వారికోసం అన్వేషిస్తున్న సంస్థలకు లింక్డిన్ ద్వారా ఈ ప్రొఫైళ్లను పంపి, తద్వారా విద్యార్థులు దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా మంచి ఉద్యోగాలు పొందే వీలు కల్పిస్తారు. 75 శాతం ఉద్యోగాలు నైపుణ్యులకే రోజురోజుకీ సాంకేతిక ప్రపంచం కొత్తపుంతలు తొక్కుతోంది. రోజుకో కొత్త టెక్నాలజీ పుట్టుకొస్తోంది. పోటీతత్వం పెరిగిపోతోంది. ప్రస్తుతం సాఫ్ట్వేర్ సంస్థలను, పరిశ్రమలను నైపుణ్యమున్న మానవ వనరుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల విద్యార్హతలకంటే వారిలోని నైపుణ్యార్హతలకే సంస్థలు పెద్దపీఠవేస్తున్నాయి. సాంకేతిక మానవ వనరుల కొరతైతే మరింత తీవ్రంగా ఉంది. రాబోయే పది సంవత్సరాల్లో సంస్థలు, పరిశ్రమల్లోని ఉద్యోగాల్లో 75 శాతం ఉద్యోగాలకు సాంకేతిక నైపుణ్యం ఉన్నవారే అవసరం. ప్రస్తుత అవసరాలకు సరిపడా నైపుణ్యాలున్న మానవ వనరులు కనీసం 50శాతం మంది కూడా లభించడం లేదు. ఇందులోనూ 71 శాతం స్టెమ్ జాబ్స్ అన్నీ కూడా కంప్యూటింగ్ రంగంలోనే ఉన్నాయి. ఈ డిమాండును కేవలం 8శాతం కంప్యూటింగ్ పట్టభద్రులు మాత్రమే పూర్తి చేయగలుగుతున్నారు. దీన్ని బట్టీ రంగంలో నైపుణ్యాలున్న అభ్యర్థులకు ఎంతటి డిమాండు ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులకు ఎంతో మేలు మైక్రోసాఫ్ట్ చేపట్టబోయే ఈ కార్యక్రమం ద్వారా మన రాష్ట్ర విద్యార్థులకు అనేక అవకాశాలున్నాయి. పోటీ ప్రపంచంలో అవకాశాలను అందిపుచ్చుకోవడంలో మనవాళ్లు ముందుండే అవకాశాన్ని మైక్రోసాఫ్ట్ సంస్థ కల్పించనుంది. కోర్సులు నిర్వహించడమే కాకుండా కోర్సు పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి పరీక్షలు నిర్వహిస్తారు, అనంతరం విద్యార్థికి మైక్రోసాఫ్ట్ సంస్థ సర్టిఫికెట్ అందజేస్తుంది. ఈ సర్టిఫికెట్ కలిగి ఉండటమనేది ఉద్యోగాలు పొందడానికి ఆ విద్యార్థికి అదనపు అర్హతవుతుంది. ఉద్యోగాలకు నిర్వహించే ఎంపిక ప్రక్రియలో ఈ సర్టిఫికెట్ పొందిన విద్యార్థులకు సంస్థలు అత్యధిక ప్రాధాన్యమిస్తాయి. ప్రతి విద్యార్థికీ వంద డాలర్ల బహుమతి ఈ కోర్సులు చేసే ప్రతి విద్యార్థికీ మైక్రోసాఫ్ట్ సంస్థ వంద డాలర్ల బహుమతి కూడా అందించనుంది. దానికి సంబంధించి ప్రతి విద్యార్థికీ బహుమతి కూపన్ ఇవ్వనుంది. దీనిద్వారా వారు తమ నైపుణ్యాలను మరింత లోతుగా పదునుపెట్టుకోవడానికి వీటిని ఉపయోగించుకునే వీలు కలుగుతుంది. -
ఏపీఎస్ఎస్డీసీతో ఎస్పీఐ కీలక ఒప్పందం
సాక్షి అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనున్న నైపుణ్య కళాశాలల్లో భాగస్వామ్యం అవడానికి ప్రముఖ ఐటి సంస్థ ఐబీఎం, సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేషనల్( ఎస్పీఐ), ఎల్వీప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీ, ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ముందుకు రావడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపీఎస్ఎస్డీసీ) చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఎపీఎస్ఎస్డీసీ కార్యాలయంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము సమక్షంలో ఆన్ లైన్ వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ఎపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్, ఐబీఎం ఇండియా డైరెక్టర్ జగదీశభట్, సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేనల్ (ఎస్.పి.ఐ) సంస్థ డైరెక్టర్ జార్జినా ఫువా, ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐటీడీసీ) ఎండీ జి.కమలవర్థన్ రావు, ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీ డైరెక్టర్ ఎ.సాయిప్రసాద్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఐబీఎం ఇండియా ఐటీ రంగంలో ఏర్పాటు చేయబోయే “సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్”లో ఐటి రంగంలో పనిచేయడానికి అవసరమైన నైపుణ్యాలు అందించే సాప్ట్ వేర్ కోర్సుల సంబంధించిన కోర్సులకు అయ్యే ఖర్చులను ఐబీఎం భరిస్తుంది. ఒప్పందంలో భాగంగా కోర్సులు, పాఠ్యాంశాలు, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, గెస్ట్ లెక్చర్స్, ఐటి డొమైన్ లై హైఎండ్ ట్రైనింగ్స్, కోడింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్‌చెయిన్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటం కంప్యూటింగ్, బిగ్ డేటా మరియు ఫుల్ స్టాక్ విభాగాల్లో శిక్షణ ఇస్తుంది. ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీ విశాఖపట్నంలో మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీ.ఓ.ఈ)ని ఏర్పాటు చేసేందుకు ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీ ముందుకు వచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా కోర్సులు మరియు పాఠ్యాంశాలను రూపకల్పన చేస్తారు. ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ప్రోగ్రామ్స్, 2డీ యానిమేషన్ బేసిక్ ట్రైనింగ్, డిజిటల్ ఫొటోగ్రఫీ, ఎడిటింగ్ లో బేసిక్స్, వీఎఫ్ఎక్స్ అండ్ డిజిటల్ రిస్టోరేషన్, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, గెస్ట్ లెక్చర్స్, నేషనల్ అప్రెంటీస్ షిప్ ప్రోగ్రామ్ (న్యాప్స్) కింద అప్రెంటీస్ సపోర్ట్ ఇస్తారు. సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేనల్ (ఎస్.పి.ఐ) అడ్వాన్స్ మాన్యుఫ్యాక్చరింగ్, ఫుడ్ ఇన్నోవేషన్ & ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విభాగాల్లో అంతర్జాతీయస్థాయి పరిశ్రమల నేతృత్వంలోని కోర్సులను నైపుణ్య కళాశాలల్లో అందించడానికి అవసరమైన సాంకేతిక సహకారం, నిర్వహణకు సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేషనల్ (ఎస్.పి.ఐ) ముందుకు వచ్చింది. ఈ మేరకు వారు పరిశ్రమల్లో పనిచేయడానికి అవసరమైన విధంగా ల్యాబ్స్, కోర్సులను అభివృద్ధి చేయడం, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ప్రోగ్రామ్స్, ప్రతిపాదించిన కోర్సుల్లో ఎపిఎస్‌ఎస్‌డిసితో కలిసి సర్టిఫికేషన్, అక్రిడేషన్ ఇవ్వడం, టీచింగ్, లెర్నింగ్ మాడ్యూల్స్ ఫ్రేమ్‌వర్క్‌ను మరింత అభివృద్ధి చేస్తారు. ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) హాస్పిటాలిటీ సెక్టార్లో ఏపీఎస్ఎస్డీసీ ఏర్పాటు చేయబోయే “సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్”కు అవసరమైన సహాయ సహకారాలను అందించడానికి ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా హాస్పిటాలిటీ రంగంలో కోర్సులు మరియు పాఠ్యాంశాలు, అధ్యయన అంశాలను ఐటిడిసి రూపొందిస్తుంది. హాస్పటాలిటీ ట్రేడ్స్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్స్, హౌస్ కీపింగ్, ఫుడ్ అండ్ బేవరేజ్ ఆపరేషన్స్, ఎంట్రప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్స్ లో ఎపిఎస్ఎస్డిసి ద్వారా నమోదు చేసుకున్న విద్యార్థులు / నిరుద్యోగ యువతకు ఐటిడిసి శిక్షణ ఇస్తుంది. నైపుణ్య శిక్షణ మరియు ఎంట్రప్రెన్యూర్షిప్ విభాగాల్లో రాష్ట్రాన్ని అత్యుత్తమస్థాయిలో ఉన్నత ప్రమాణాలను పెంపొందించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం. ఇందులో భాగంగా ఏర్పాటు చేయనున్న స్కిల్ కాలేజీల్లో భాగస్వామ్యం అయ్యేందుకు ఇప్పటి వరకు 13 సంస్థలు ముందుకు రావడం సంతోషంగా ఉంది. దేశంలోనే రెండో అతిపెద్ద తీరప్రాంతం మన రాష్ట్రానికి ఉంది. ఇక్కడ టూరిజం, హాస్పటాలిటీ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయి. - చల్లా మధుసూదన్ రెడ్డి, ఎపీఎస్ఎస్డీసీ చైర్మన్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే స్కిల్ కాలేజీల్లో జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో నైపుణ్య శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగానే సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలతో భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. -జి. అనంతరాము, నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి -
'ఐఎస్బీ ఒప్పందం దేశంలోనే తొలిసారి'
సాక్షి, అమరావతి: దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వంతో ఐఎస్బీ ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శనివారం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - ఐఎస్ బీ ఎంవోయూపై శనివారం అధికారులతో మంత్రి గౌతమ్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఐ.టీ శాఖ కార్యదర్శి యేటూరి భాను ప్రకాశ్, ఐటీ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి తదితరులు ఈ భేటిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆగస్ట్ 5న ఐఎస్బీ ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఎంవోయూ జరగనుందన్నారు. ఐఎస్బీ భాగస్వామ్యంతో ప్రభుత్వ పాలనలో కీలక సమస్యలకూ వెంటనే పరిష్కారం లభించనుందని తెలిపారు. విశాఖ, రాయలసీమ కేంద్రంగా పెట్టుబడుల ఆకర్షణ, భారీ పరిశ్రమలను తీసుకురావడం, ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడంలో ఐఎస్బీ కీలకపాత్ర పోషించనుందని పేర్కొన్నారు. ఎంఎన్ సీ కంపెనీలను ఏపీకి తీసుకువచ్చి నిరుద్యోగ సమస్యను తీర్చడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు వెల్లడించారు. మహిళా సాధికారత, గ్రామీణ యువతకు స్థానికంగా ఉద్యోగాలందించేందుకు ఐఎస్బీ తోడ్పాటు అందించనుందని తెలిపారు. మూడేళ్ల ఒప్పందంలో రాష్ట్రాభివృద్ధికి సహకరించేందుకు ఐఎస్బీ సిద్ధంగా ఉందన్నారు. అక్టోబర్ కల్లా నైపుణ్య కాలేజీల ఏర్పాటు అంతకముందు నైపుణ్య కాలేజీల ఏర్పాటుపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్టోబర్‌లో నైపుణ్య కాలేజీలను ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంలో ఏ అవకాశాన్ని వదలకూడదన్నారు. ఈ సందర్భంగా నైపుణ్య శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు రుణాలందించడానికి ఏయే బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని ఆరా తీశారు. దీనికి సంబంధించి బ్యాంకులు ఎంత మొత్తంలో రుణాలందించేందుకు సుముఖంగా ఉన్నాయో ఎండీ అర్జా శ్రీకాంత్ మంత్రికి వివరించారు. ప్రభుత్వ పూచికత్తుతోనే మరిన్ని నిధులు సాధ్యమని నైపుణ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము మంత్రికి వివరించారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో స్కిల్ కాలేజీ ఏర్పాటు అవుతున్నందున స్థానిక ఎంపీల నిధుల నుంచి కొంత సాయం పొందవచ్చని ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. యువత భవిష్యత్ ను మార్చే స్కిల్ కాలేజీల ఏర్పాటులో ప్రతీ రూపాయి అవసరమేనని, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లక్ష్యాలను చేరాలని గౌతమ్‌రెడ్డి తెలిపారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లి మరింత లోతుగా చర్చిద్దామని మంత్రి మేకపాటి అధికారులతో పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ కు నైపుణ్యాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి జి.అనంతరాము, ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో అర్జా శ్రీకాంత్ హాజరయ్యారు. -
'నైపుణ్య కేంద్రాల్లో అంతర్జాతీయ స్థాయి శిక్షణ'
సాక్షి, అమరావతి : అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్పై గురువారం పరిశ్రమలు, ఐటీ శాఖల అధికారులతో క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ యునివర్సిటీ ఏర్పాటు, భవనాల నిర్మాణం, ప్రవేశ పెట్టాల్సిన కోర్సులపై చర్చించారు. కోర్సులు, పాఠ్యప్రణాళిక తయారీలో అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం తీసుకోవాలన్నారు. ఐటీఐ, డిప్లమో, ఇంజినీరింగ్ సహా ఇతర కోర్సులు పూర్తిచేసినవారి నైపుణ్యాలను మరింత మెరుగుపరచాలన్నారు. (విద్యార్థుల మృతదేహాలను రప్పించండి) ఇప్పటికే ఆ తరహా కోర్సులు చేస్తున్న వారికి ఏడాది అప్రెంటిస్ ఇవ్వడమే యూనివర్శిటీ, నైపుణ్య కేంద్రాల ప్రధాన ఉద్దేశం అని సీఎం స్పష్టం చేశారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు అభివృద్ధి చేయడం, అంతర్జాతీయ స్థాయి శిక్షణను ఇవ్వడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి నైపుణ్య కేంద్రంలో కూడా ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ తదితర కోర్సుల విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ది చేయడంతో పాటు జీవనోపాధి కోసం ఇతరులకు చిన్న చిన్న పనులు నేర్పించడానికి శిక్షణా తరగతులు నిర్వహించాలని వెల్లడించారు. ఈ మొత్తం కార్యక్రమాలను ఎన్ఐసీ ద్వారా నిర్వహించాలని జగన్ పేర్కొన్నారు. ఇందుకోసం ఒక్కో ఫ్యాకల్టీలో ప్రముఖ సంస్థల భాగస్వామ్యాలు తీసుకోవాలన్నారు. దీనివల్ల ఈ కోర్సులకు మరింత విలువ ఉంటుందని, వైద్య రంగంలో అందించే సర్వీసులకు కూడా ఈ నైపుణ్య కేంద్రాల్లోనే శిక్షణ అందించాలని తెలిపారు. హై ఎండ్ స్కిల్స్ కోసం విశాఖలో మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థకోసం ప్రయత్నాలు ముమ్మరం చేయాలని జగన్ అధికారులను కోరారు. ఏ కోర్సుకైనా కనీస కాల వ్యవధి 6 నెలలు ఉండాలన్నారు. ఇప్పటివరకూ పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ లాంటి వివిధ కోర్సులు చదువుతున్న వారే కాదు, కోర్సులు పూర్తైన వారు కూడా ఈ కేంద్రాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. అలాగే అధ్యాపకులను అప్‌గ్రేడ్ చేసేందుకు వారికి సంబంధించిన శిక్షణా తరగతులు కూడా నైపుణ్య కేంద్రాల్లోనే నిర్వహించాలని జగన్ వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గౌతంరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ప్రతిభా శిక్షణ
‘జనాభాతో పాటు దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతూనే ఉంది..’ఈ వాక్యం మనం తరచూ వింటున్నాం. చదువుతున్నాం. తిరిగి మన పనుల్లో మనం పడిపోతున్నాం. ప్రతిభ పులిజాల అందరిలా ఆ వాక్యాన్ని వదిలేయలేదు. నిరుద్యోగ సమస్యనే తన ఉద్యోగంగా మలుచుకుంది. ఖాళీగా ఉన్నవారు ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ రంగంలో తగు శిక్షణ ఇస్తుంటుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు కార్డు ఇప్పిస్తుంది. చదువులేనివారికి, ప్రభుత్వ పథకాలపై అవగాహన లేనివారి దగ్గరకు వెళ్లి వాటి గురించి వివరిస్తుంటుంది. అవకాశాలు అందిపుచ్చుకొని మెరుగైన జీవనం పొందేలా సహాయం చేస్తుంటుంది. ఇరవై ఏళ్లుగా దాదాపు డెబ్భై ఐదు వేల మందికి పైగా వారెంచుకున్న రంగంలో నైపుణ్యం పెంచి, శిక్షణ అందించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు ప్రతిభ. తన మొదటి అడుగు నుంచీ ఇప్పటి వరకు సాగించిన పయనం గురించి ఇలా వివరించారు... ‘‘నిన్న ఉదయం రిసీవ్ చేసుకున్న ఓ ఫోన్ కాల్ గురించి చెబుతాను. ‘మేడమ్.. బాగున్నారా! ఏడాది క్రితం నేను మీ ఇంట్లో పనిచేసిన అనితను’ అంటూ పలకరించింది ఓ అమ్మాయి. ఇప్పుడు తను జూబ్లీ హిల్స్‌లోని ఓ పేరున్న బ్యూటీ స్పాలో మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తు్తన్నానని చెప్పింది. ఆర్థిక పరిస్థితులు సరిగా లేనికారణంగా ఏడవ తరగతితో చదువు ఆపేసిన అనిత తన తల్లితో కలిసి ఇళ్లలో పనులు చేసేది. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగామ్లో చేరి, బ్యుటీషియన్‌గా పనులు నేర్చుకొని ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది. ఇలా జీవితాన్ని మెరుగుపరుచుకున్నవారి గురించి తెలిసినప్పుడల్లా చాలా ఆనందపడుతుంటాను. చదువు లేని వారే కాదు చదువున్నవారు కూడా తమ కెరియర్ను బిల్డ్ చేసుకునే క్రమంలో ఇబ్బందులు పడుతుంటారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చదువు తర్వాత సాఫ్ట్వేర్లోనో.. మరేదైనా కంపెనీలోనో విద్యార్హతతో జాబ్‌లో చేరుతారు. ఆ తర్వాత సరైన నైపుణ్యం లేదని ఆ కంపెనీలు ‘రిజక్ట్’ చేసే పరిస్థితులు ఎదురవుతుంటాయి. అక్కణ్ణుంచి వెనక్కి వచ్చేస్తే జీవితంలో ఇంకా వెనకబాటుకు లోనవుతారు. ఇలాంటి పరిస్థితి నుంచి యువతను తప్పించడానికే ఈ రంగాన్ని ఎంచుకున్నాను. సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలో మా ఆఫీస్ ఉంది. హైదరాబాద్‌లో ఏయే ప్రాంతాల్లో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కౌన్సెలింగ్ ఇవ్వాలో ముందే నిర్ణయించుకుంటాను. వారంలో అన్ని రోజులూ శిక్షణాకార్యక్రమాల కోసం తిరుగుతూ ఉంటాను. చిన్న చిన్న బస్తీలు మొదలుకొని కాలేజీ క్యాంపస్‌ల వరకు నా ప్రోగ్రామ్స్ ఉంటాయి. మన దేశంలో చదువు ఉంది. కానీ, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన సమస్యలే అధికంగా ఉన్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతిభ ఆధ్వర్యంలో జరిగిన వర్క్‌షాప్‌లో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు ఇస్తున్న దృశ్యం ఇరవై ఏళ్లుగా.. ఉస్మానియా యూనివర్శిటీలో ఇంగ్లిష్ లిటరేచర్‌లో పీజీ పూర్తి చేశాను. రెండేళ్లు లెక్చరర్‌గా ఉద్యోగం చేశాను. అప్పుడే అర్ధమైంది చదువుకు కొదవ లేదు, నైపుణ్యాలకు సంబంధించిన లోటు అంతటా ఉందని. అప్పుడే ‘కెరియర్ హైట్స్’పేరుతో కౌన్సెలింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశాను. ఇక్కడ నుంచే విద్యార్థులకు జాబ్ ప్లేస్మెంట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాను. అక్కణ్ణుంచి ఆలోచనా విస్తృతి పెరిగింది. కొన్ని ఫార్మా కంపెనీలు, జీడిమెట్ల ప్రాంతంలో ఉండే ఫ్యాక్టరీలకు వెళ్లినప్పుడు అక్కడి యాజమాన్యం పనివాళ్లను వేరే రాష్ట్రాల నుంచి తీసుకురావడం గమనించాను. దాంతో ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న జనాభా గురించి వాకబు చేశాను. పనిలేకుండా ఖాళీగా ఉండేవారి సంఖ్యను బేరీజు వేసుకున్నాను. వారిని కలిసి, సమావేశాలు ఏర్పాటు చేసి, వారికి శిక్షణ ఇచ్చాను. ఫలితంగా అక్కడి కంపెనీలలో ఆ ప్రాంతంలో నివాసం ఉన్నవారికే పని అవకాశాలు పెరిగాయి. గతంలో ఇళ్లలో పనులు చేసుకునేవారు సైతం ఇప్పుడు పేరున్న కంపెనీలలో పనిచేసే స్థాయికి చేరినవారున్నారు. ఇలాగే మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేశాను. ప్రభుత్వంతో కలిసికట్టుగా.. ప్రపంచంలో మన దేశాన్ని స్కిల్ క్యాపిటల్‌గా మార్చాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అన్ని రంగాలకు అవసరమే. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచి నిరుద్యోగ యువతకు సరైన పని కల్పించాలన్న లక్ష్యంతో స్కిల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్‌ను ప్రభుత్వమూ నిర్వహిస్తుంది. అయితే వాటి గురించిన అవగాహన ప్రజల్లో లేకపోవడంతో సరైన ఫలితాలు రావడం లేదు. దీంతో ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి సౌత్ రీజియన్ అడ్వైజర్‌గా ప్రభుత్వంతో కలిసి వర్క్ చేస్తున్నాను. మీడియా, సినిమా, ఫొటోగ్రఫీ, బ్యూటీ, ఫ్యాషన్ డిజైనింగ్.. ఇలా 14 రంగాలలో స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన కౌన్సెలింగ్ చేస్తున్నాను. కుటుంబ ప్రోత్సాహం పుట్టి పెరిగింది, చదువుకున్నది హైదరాబాద్‌లోనే. నాన్న లింగయ్య వైమానిక దళ ఉద్యోగి. అమ్మ ఫణిబాయి. ఇద్దరు అన్నయ్యలు. మా పెంపకంలో ఎక్కడా వివక్ష లేదు. తాతయ్య పోలీస్ డిపార్ట్మెంట్లోనూ, నాన్న ఎయిర్‌ఫోర్స్‌లోనూ పనిచేయడంతో స్వీయ క్రమశిక్షణతోపాటు సమాజం పట్ల బాధ్యత కూడా చిన్నతనం నుంచే అలవడింది. మా వారు దినేశ్ డెంటిస్ట్. అత్తింటివారూ బాగా చదువుకున్నవారు కావడంతో నా తపనకు ఎక్కడా ఆంక్షలూ, అడ్డంకులూ లేవు. మనం చేసే పని పదిమందికి ఉపయోగపడాలన్నదే మా కుటుంబం నుంచి వచ్చిన మాట. అదే నన్ను ఎంతోమందిని కలిసేలా, ఎన్నో విషయాలు నేర్చుకునేలా, మరెన్నో విషయాలు నలుగురికి తెలియజేప్పే అవకాశాన్ని ఇచ్చింది. స్వచ్ఛత – శుభ్రత స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం మురికివాడలకు వెళ్లినప్పుడు అక్కడి వాతావరణం, పరిస్థితులు చాలా బాధ కలిగించాయి. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా.. ఈ టెక్నాలజీ యుగంలోనూ కనీస వసతులు లేకుండా జీవిస్తున్న దుర్భరమైన జీవితాలను చూసినప్పుడు ఇదేనా మనం సాధించిన ప్రగతి అన్న ఆవేదన కలిగింది. స్వచ్ఛభారత్ అంటున్న కేంద్రప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం గురించి, వారి ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదని గమనించాను. పారిశుద్ధ్య కార్మికుల్లోనూ వృత్తి నైపుణ్యాలు పెంచడంతో పాటు వారి సంక్షేమం గురించీ ఆలోచించాను. వారికీ శిక్షణ ఇవ్వాలని, ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాను. అందుకోసం ముందుగా నేను ట్రెయిన్ కావాలని ‘సఫాయి కర్మచారి’ సర్టిఫికెట్ కోర్సు చేశాను. ఫండ్స్ కోసం 5కె, 10 కె రన్స్ నిర్వహించినా ఫలితం లేకపోయింది. అప్పుడు జీహెచ్ఎంసి కమిషనర్‌ను కలిసి నా ఆలోచన చెప్పాను. వారి సహకారంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బులిటిగా ‘కర్తవ్య ఫౌండేషన్’ ఏర్పాటు చేసి చందానగర్ ఏరియాలో మూడువందల మందికి శిక్షణ ఇచ్చాం. వారికి నా పనితీరు, నిబద్ధత నచ్చడంతో ఆ తర్వాత ‘సాఫ్ హైదరాబాద్ – షాన్‌దాన్ హైదరాబాద్’, ‘వాటర్ లీడర్షిప్ కన్జర్వేషన్’లో భాగస్వామిగా పనిచేసే అవకాశం ఇచ్చారు. దేశం మారాలంటూ పథకాలు రూపొందిస్తే ఫలితం ఉండదు ఆయా పథకాల ద్వారా దేశం ప్రగతి పథంలో పయనించాలంటే మార్పు అనేది అట్టడుగు స్థాయి నుంచి మొదలు కావాలి’ అని వివరించారు ప్రతిభ పులిజాల. ఒకవైపు స్కిల్ డెవలప్మెంట్ దిశగా సాగుతున్న శిక్షణాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ మరోవైపు మురికివాడల్లో పరిశుభ్రమైన జీవనం కోసం, స్వచ్ఛమైన పరిసరాల కోసం కృషి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.– నిర్మలారెడ్డిఫొటోలు: అనీల్‌కుమార్ -
ఎస్టీపీఐ సహకారంతో విశాఖలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం: పల్సస్
సాక్షి, విశాఖపట్నం: సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) సహకారంతో విశాఖలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పల్సస్ గ్రూప్ తెలియజేసింది. పల్సస్ హెల్త్టెక్కు హైదరాబాద్‌తో పాటు చెన్నై, విశాఖ, గుర్గావ్లో కేంద్రాలున్నాయి. విశాఖలో డిజిటల్ మార్కెటింగ్‌కు సంబంధించి నైపుణ్యాలను అభివృద్ధి పరిచే శిక్షణ ఇవ్వటానికి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ తెలియజేసింది. ‘‘డిజిటల్ మార్కెటింగ్‌తో ఆన్లైన్లోనే వినియోగదారుల దగ్గరకు వస్తువులు వెళుతున్నాయి. ప్రపంచంలో ఏ మూలో ఉన్నవారికి ఇక్కడి నుంచే మనం ఉత్పత్తిని ప్రజెంట్ చేయొచ్చు. మా సంస్థ ఇప్పటికే 50కి పైగా దేశాల్లో మెడికల్ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తోంది. మా ఓపెన్ యాక్సెస్ హెల్త్ జర్నల్స్ ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులకు, వర్సిటీ విద్యార్థులకు అందుతున్నాయి. వీటి ద్వారా డిజిటల్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నాం. అందుకే విశాఖ కేంద్రంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. శిక్షణ పొందిన వారిలో చాలామందికి మేమే ఉద్యోగాలు కల్పిస్తాం. విశాఖలో దశల వారీగా 25 వేల మందికి ఉద్యోగాలిచ్చేలా ప్రణాళిక వేస్తున్నాం. రాబోయే పదేళ్లలో ఐటీని మించి ఉద్యోగాలు కల్పించే స్థాయి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు మాత్రమే ఉంది’’ అని పల్సస్ గ్రూప్ సీఈఓ శ్రీనుబాబు గేదెల చెప్పారు. సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ విషయాలు తెలియజేశారు. ఎంసీఏ, ఎంబీఏ, ఎం.ఫార్మా కోర్సులు చేసినవారు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై రాణించడానికి అవకాశం ఉందన్నారు. -
కడప జైలులో దేశంలోనే తొలిసారిగా..
సాక్షి, వైస్సార్ కడప: రాష్ట్రంలోని అన్ని జైళ్లలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఉన్నత ఆశయంతో పనిచేస్తోందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. జైళ్లలో ఖైదీలకు సన్న బియ్యం కావాలని అడుగుతున్నారని, ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తామమని చెప్పారు. కడప కారాగారంలో స్కిల్ డెవవలప్‌మెంట్ సెంటర్‌ను శుక్రవారం ఆమె ప్రారంభించారు. (చదవండి : చంద్రబాబు తీరుపై పోలీసుల సంఘం ఆగ్రహం) డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, కొరుముట్ల శ్రీనివాస్, కలెక్టర్ హరి కిరణ్, జైళ్ల డీజీ మొహమ్మద్ అషన్ రజా, ఎస్పీ అన్బురాజన్, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తయారుచేసిన వివిధ రకాల వస్తువులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను హోంమంత్రి పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘4 కోట్ల 70 లక్షల రూపాయలతో మోడ్రన్ స్కిల్ డెవలప్మెంట్ యూనిట్‌కు నేడు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ స్విట్జర్లాండ్‌లో మాత్రమే ఉంది. దేశంలోనే మొదటిసారిగా కడప జైలులో ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టాం. జైలులో ఏళ్ల తరబడి శిక్ష అనుభవిస్తూ.. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసే అంశంపై ముఖ్యమంత్రితో చర్చిస్తాం. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు బయటకు వెళ్లిన తరవాత స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉన్నత జీవితం గడపాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. (చదవండి: ఇద్దరు కుమార్తెలతో బావిలో దూకి తండ్రి ఆత్మహత్య) ఖైదీలు తయారు చేస్తున్న వస్తువులు బహిరంగ మార్కెట్లోని వస్తువులతో పోటీ పడుతున్నాయి. జైళ్లలో నాణ్యతతో కూడిన వస్తువులు తయారు చేస్తున్నారన్న గుర్తింపు వచ్చింది. కడప జైలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్‌లో క్వాలిటీ పెట్రోల్ లభిస్తోందని చెబుతున్నారు. జైలులో ఇప్పటికే డైరీ యూనిట్, బ్రిక్స్ తయారీ, ఫినాయిల్, సోప్, డిటర్జెంట్స్, బేకరీ ఫుడ్ ఐటమ్స్, టైలరింగ్, అగరబత్తీలు తయారు చేస్తున్నారు’అని హోంమంత్రి పేర్కొన్నారు. -
సీరియళ్లను చూస్తూ కాలాన్ని వృథా చేసుకోకుండా..
ముషీరాబాద్: టీవీల్లో వచ్చే చెత్త సీరియళ్లను చూస్తూ కాలాన్ని వృథా చేసుకోకుండా నైపుణ్యాభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి మహిళలకు పిలుపునిచ్చారు. సోమవారం ముషీరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ సతీమణి కోవ ఉమా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అక్షర స్కిల్ డెవలప్మెంట్’సంస్థను లక్ష్మణ్‌తో కలిసి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కుట్రలు, కుతంత్రాల తో నిండి ఏమాత్రం సామాజిక చైతన్యం లేని టీవీ సీరియళ్లను చూస్తూ మహిళలు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారని, అదే సమయంలో ఆర్థిక చేయూతనిచ్చే నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ తీసుకుని కుటుంబానికి చేదోడువాదోడుగా నిలవాలని మహిళలను కోరారు. మహిళలపై ఉన్న గౌరవంతో ప్రధాని మోదీ ఎన్నో సంక్షేమ పథకాలను, స్ఫూర్తిదాయక కార్యక్రమాలను చేపడుతున్నారని తెలిపారు. ఈ కోవలోదే ‘బేటీ పడావో, బేటీ బచావో’కార్యక్రమమన్నారు. గతంలో మహిళలకు ఉద్యోగాలంటే సూపర్ బజార్లలో, రిసెప్షనిస్టులుగా ఉండేవని కానీ నేడు వారు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని కొనియాడారు.ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను ఒక మహిళ చేతిలో పెట్టడమనేది సాహసోపేతమైన నిర్ణయం అన్నారు. ఇటీవల జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌కు ఒక మహిళ నేతృత్వం వహించడం గమనార్హమన్నారు. కార్యక్రమంలో సేవా భారతి సంస్థ ప్రతినిధి శేఖర్, అప్సా ప్రతినిధి ప్రవీణ్, సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్, నెహ్రూ యువ కేంద్ర ప్రతినిధి ప్రమోద్, రామానందతీర్థ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకు ముందు శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానం చేశారు. -
విద్యా వ్యవస్ధలో సంస్కరణలు
-
యువతకు ఉపాధి కల్పించడమే సీఎం ఆకాంక్ష
సాక్షి, విజయవాడ: క్రీస్తు రాజపురంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీ) ప్రెసిడెంట్ మేడపాటి వెంకట్ మంగళవారం ప్రారంభించారు. టైమ్స్ గ్రూప్, ఏపీఎన్ఆర్టీ సౌజన్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. యువతలో నైపుణ్యాలను మెరుగుపరిచి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే సీఎం జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష అని తెలిపారు. ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏపీఎన్ఆర్టీతో టైమ్స్ గ్రూప్ ఎంఓయూ కుదుర్చుకుందని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఏపీలో టైమ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో మొదటి నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని విజయవాడలో ప్రారంభించడం శుభపరిణామన్నారు. తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో సైతం నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలను టైమ్స్ గ్రూప్ ఏర్పాటు చేయాలని కోరారు. -
ఉద్యోగార్థులకు నైపుణ్య సోపానం
చేతిలో పట్టా ఉంది.. కానీ తగినంత నైపుణ్యం లేదు.. ఇదీ స్థానిక నిరుద్యోగ యువత ఆవేదన. సరిగ్గా ఇదే కారణంతో పరిశ్రమల యాజమన్యాలు స్థానికేతరులకు ఉద్యోగాలు కట్టబెట్టేస్తున్నాయి. ఇప్పటివరకు జరుగుతున్న ఈ తతంగం స్థానిక యువతను నిరుద్యోగులుగానే మిగిల్చేస్తోంది. ఈ దుస్థితిని గమనించిన వైఎస్ జగన్ సర్కార్ దేశంలోనే సంచలనాత్మకమైన.. ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుంది. అదే పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు.. నిర్ణయం తీసుకున్నదే తడవుగా అసెంబ్లీలో బిల్లు ఆమోదింపజేసి చట్టబద్దం చేసింది. అది సరే.. నైపుణ్యం లేకుండా స్థానికులను ఉద్యోగాల్లోకి ఎలా తీసుకుంటారు?.. దీని వల్ల పరిశ్రమలు రాష్ట్రానికి రాకుండా పోతాయన్న ప్రతిపక్షం వాదనను ప్రభుత్వం మరో కీలక నిర్ణయంతో తిప్పికొట్టింది. నోటమాట రాకుండా చేసింది. అదే నియోజకవర్గానికో నైపుణ్యాభివృద్ధి కేంద్రం(స్కిల్ డెవలప్మెంట్ సెంటర్) ఏర్పాటు.. ఇలా ఏర్పాటు చేసే కేంద్రాల్లో సాంకేతిక, ఇతరత్రా అర్హతలున్న నిరుద్యోగులు ఆయా రంగాల్లో తమ నైపుణ్యాన్ని మరింత మెరుగుపర్చుకునే అవకాశం కల్పించి.. వారిని పరిశ్రమల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యేలా సహరించనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విశాఖ జిల్లాలో 15 స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. విశాఖ లాంటి పారిశ్రామిక జిల్లాలోని నిరుద్యోగులకు ఈ చర్యలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని.. ఉద్యోగాలు పొంది స్థానికంగానే నిలదొక్కుకునేందుకు దోహదపడుతాయని యువత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్షనేతగా... ప్రజా సంకల్పయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు పాదయాత్రలో ఏవైతే హామీలిచ్చారో... వాటిని పక్కాగా అమలు చేసే దిశగా కార్యాచరణ ప్రారంభించారు. ఈ క్రమంలో యువతకు ఉపాధి కల్పించేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. ఓవైపు పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉపాధితో పాటు వాటిని అందిపుచ్చుకునేందుకు అవసరమైన నైపుణ్యం పొందేందుకు అవసరమైన శిక్షణ తీసుకునే ఏర్పాట్లు చేస్తుండటంతో నిరుద్యోగ యువతలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో ఉన్న నిరుద్యోగ సమస్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. తాను చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే గ్రామ వలంటీర్ల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేశారు. మరికొద్ది రోజుల్లో గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడనుంది. ఇది కాకుండా రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు అందించే బిల్లు కూడా ప్రవేశపెట్టారు. పోటీ ప్రపంచంలో యువతకు చదువు మాత్రమే సరిపోదని, తగిన నైపుణ్యాలు ఉన్నప్పుడే మంచి ఉద్యోగాలు వస్తాయన్న విషయాన్ని గుర్తించి ప్రతి నియోజకవర్గంలో నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. వివిధ కోర్సుల్లో చదువు పూర్తి చేసి ఉద్యోగాలు సాధించాలనే తపన, ఆకాంక్షతో బయటకు వస్తున్న యువతకు సరైన మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల ఉపాధి లేకుండా పోతోంది. ముఖ్యంగా ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో అధిక శాతం విఫలమవుతున్నారు. నిరుద్యోగ యువతకు సరైన మార్గనిర్దేశం చేసేందుకు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థను పకడ్బందీగా నడిపేందుకు దృష్టి సారించింది. యువత భవితకు భరోసా.. నిరుద్యోగుల్లో నైపుణ్యాలను పెంచేందుకు వివిధ యూనివర్సిటీలు, సంస్థలతో కలిసి అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసుకుని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను నిర్వహించనున్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాల్ని పెంపొందింపజేయడమే కాకుండా వారి దృక్పథం లో మార్పును తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనుంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు జాబ్‌మేళాలు నిర్వహించి, స్కిల్ కనెక్ట్, ఎంఎన్సీడ్రైవ్ ద్వారా ఉపాధి కల్పించనున్నారు. ఇవి కాకుండా యువతీ, యువకులకు వారి ఆసక్తి మేరకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తారు. ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేస్తూ, రాష్ట్రంలోని యువతీ యువకులకు ఉద్యోగం పొందేందుకు అవసరమైన కోర్సులను అందించే విధంగా పథకానికి రూపకల్పన చేస్తున్నారు. శిక్షణ కేంద్రాలకు వివిధ కంపెనీల ప్రతినిధులను రప్పించి అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించే బిల్లుకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. ఇకపై పీపీసీ ప్రాజెక్టుల క్రింద చేపట్టిన పరిశ్రమలు లేదా ఫ్యాక్టరీలు, జాయింట్ వెంచర్లు, ప్రాజెక్టుల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయి. స్కిల్స్ లేక ఇబ్బందులు.. డిగ్రీ పట్టా చేతిలో ఉంది. దానికి అనుబంధంగా మరికొన్ని క్వాలిఫికేషన్లు ఉంటేనే ఉద్యోగం ఇస్తామని చాలా కంపెనీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గానికో స్కిల్ డెవలప్‌సెంటర్ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించడంతో మాకు కొత్త ఊపిరి పోసినట్లయింది. – కె. బాలు, డిగ్రీ విద్యార్థి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు ఉత్తరాంధ్ర యువతకు అన్ని అర్హతలున్నా.. సంబంధిత ఉద్యోగానికి కావాల్సిన స్కిల్స్ లేక చతికిల పడిపోతున్నారు. ఫలితంగా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. నిరుద్యోగుల కష్టాల్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆయనకు మా నిరుద్యోగులందరి తరఫున ధన్యవాదాలు. – శ్యామ్, పీజీ విద్యార్థి. -
‘నై’పుణ్యాభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: నైపుణ్యాభివృద్ధిలో ఎస్సీ కార్పొరేషన్ వెనుకబడింది. నిరుద్యోగ యువతకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు రాయితీ రుణకల్పనతో పాటు విద్యార్హతలకు తగిన నైపుణ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కోటాలో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ యువత కోసం భారీమొత్తంలో నిధులు కేటాయిస్తోంది. ఈక్రమంలో గత ఐదేళ్లలో పెద్ద మొత్తంలో నిధులిచ్చినప్పటికీ, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఉదాసీనంగా వ్యవహరించింది. దీంతో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం 2,463 మందికి మాత్రమే వివిధ అంశాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చారు. అంతకుముందు ఐదేళ్లతో పోలిస్తే ప్రస్తుతం నైపుణ్యాభివృద్ధి శిక్షణ తీసుకున్న వారి సంఖ్య మూడోవంతు కూడా లేకపోవడం గమనార్హం. వ్యయం ఎక్కువ... లబ్ధి తక్కువ... ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలు తగ్గిపోతున్నాయి. ప్రైవేటు రంగంలో అవకాశాలున్న కేటగిరీలను ఎంపిక చేసుకుని గతంలో శిక్షణలు ఇవ్వడంతోపాటు ఉపాధి అవకాశాలు సైతం కల్పించేవారు. ప్రస్తుతం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఉపాధి కల్పించడం కత్తిమీద సాములా మారింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం శిక్షణతో పాటు కచ్చితంగా ఉపాధి క ల్పించాల్సి ఉంది. దీంతో లక్ష్యసాధన ఆశాజనకంగా లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఐదేళ్ల కాలంలో రూ.7.06 కోట్లు ఖర్చు చేసి ఏకంగా 6,992 మందికి శిక్షణతో కూడిన ఉపాధిని కల్పించారు. రాష్ట్రఏర్పాటు తర్వాత ఇప్పటివరకు రూ.10.40 కోట్లు ఖర్చు చేసి కేవలం 2,463 మందికి మాత్రమే శిక్షణ ఇచ్చినట్లు ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ఉద్యోగాలు దక్కించుకున్న వారి సంఖ్య తక్కువే. నిర్దేశిత లక్ష్యాన్ని సాధించడంలో వెనుకబాటు నమోదవుతుండటంతో ఇటీవల ఎస్సీ కార్పొరేషన్ కార్యక్రమాల్లో వేగం పెంచుతోంది. ఇటీవల సేవల రంగంలో ఆరోగ్య సహాయకులు, ఎయిర్‌హోస్టెస్ కేటగిరీలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఉపాధి అవకాశాలు అతి తక్కువ మందికే దక్కాయి. మరికొన్ని కేటగిరీల్లో శిక్షణకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తోంది. -
పని కావాలంటే..‘పని’ రావాలి!
సాక్షి, హైదరాబాద్ : ఉద్యోగం రావాలంటే కేవలం డిగ్రీలు ఉంటే సరిపోవని, నైపుణ్యం కూడా ముఖ్యమని ‘టైమ్స్‌జాబ్స్’ నిర్వహించిన ప్రత్యేక సర్వేలో వెల్లడైంది. కంపెనీలకు పనితనమే ప్రధాన కొలమానం అని తేలింది. స్వాతంత్య్రానంతర ఉద్యోగ నియామక ధోరణులపై జరిగిన ఈ సర్వే విద్యార్హత కన్నా నైపుణ్యమే మిన్న అనే విషయాన్ని రుజువు చేసింది. ఈ సర్వే ప్రకారం దేశంలో నైపుణ్యాల స్థాయి మెరుగుపడింది. నైపుణ్యం ఉంటే నౌకరీ దక్కుతుందని 53 శాతం మంది మానవ వనరుల (హెచ్ఆర్) విభాగ మేనేజర్లు అభిప్రాయపడ్డారు. ఉద్యోగపరంగా పరిగణనలోకి తీసుకునే అంశాల్లో విద్యార్హతను వారు ఆఖరికి నెట్టేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి ఉద్యోగం సంపాదించాలంటే ప్రొఫెషనల్ డిగ్రీ లేదా సర్టిఫికెట్ కోర్సు అవసరమని 72 శాతం మంది అభిప్రాయపడ్డారు. విశ్లేషణా సామర్థ్యమే ముఖ్యం.. ‘టైమ్స్‌జాబ్స్’ తన సర్వేలో భాగంగా మొత్తం వెయ్యి మందికి పైగా హెచ్ఆర్ మేనేజర్ల అభిప్రాయాలు సేకరించింది. సర్వే ప్రకారం విశ్లేషణా నైపుణ్యాలకు సంస్థలు పెద్ద పీట వేస్తున్నాయి. ఇక మేధోజ్ఞానం, సామాజికాంశాలపై పట్టు, ఈఐ (ఎమోషనల్ ఇంటెలిజెన్స్) వంటి వాటిని ద్వితీయాంశాలుగానే పరిగణిస్తున్నాయి. బహుళజాతి కంపెనీలు ఉద్యోగ కల్పనలో ముందున్నాయి. దేశానికి మరిన్ని బహుళ జాతి కంపెనీలు తరలిరావడం వల్ల ఉద్యోగావకాశాలు పెరిగాయని అత్యధికులు (49 శాతం) అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం మౌలిక సదుపాయాల రంగంలో పెట్టిన పెట్టుబడులు (24 శాతం), ఉద్యోగాల కల్పన దిశగా చేపట్టిన సంస్కరణలు (14 శాతం) ఉపాధికి దోహదపడ్డాయని కొందరు భావిస్తున్నారు. నైపుణ్యం ఉన్నా మానవ వనరులు అందుబాటులోకి రావడం కూడా ఉద్యోగాలు పెరిగేందుకు దోహదపడిందని ఆరు శాతం మంది భావిస్తున్నారు. మరో ఆరు శాతం మంది ఇతర కారణాలు చూపుతున్నారు. ఇక వృత్తి సంబంధిత పోటీ తీవ్రమైనట్లు సర్వేలో వెల్లడైంది. నైపుణ్యాలకు ఎప్పటికప్పుడు పదును పెట్టుకోవడం, ‘కెరీర్ రొటేషన్’ (వివిధ రకాల విధులు చేపడుతుండటం) వంటి అంశాలను ప్రస్తావించింది. గత 71 ఏళ్లలో ఉద్యోగాల కల్పనపరంగా, విస్తృతిపరంగా జాబ్ మార్కెట్ మెరుగైందనే అభిప్రాయం వ్యక్తమైంది. స్వాతంత్య్రానంతరం భారత్ మరిన్ని ఉద్యోగావకాశాలను ఇచ్చిందని 65 శాతం మంది అభిప్రాయపడ్డారు. స్త్రీల పట్ల అనుకూలత.. స్త్రీలకు సంబంధించి సంప్రదాయ ఆలోచనల్లో మార్పులు చోటు చేసుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. కార్పొరేట్ రంగంలో స్త్రీలు సృష్టించిన మార్పులను గుర్తించింది. నాయకత్వ స్థానాల్లో కొనసాగుతున్న పురుషాధిపత్యాన్ని స్త్రీలు తిప్పి కొట్టగలుగుతున్నారనే అభిప్రాయాన్ని 41 శాతం మందికి పైగా వ్యక్తం చేశారు. ఇక వృత్తుల ఎంపిక విషయంలో స్త్రీలు తమ పరిధిని విస్తరించుకుంటున్నారని 37 శాతం మంది అభిప్రాయపడ్డారు. -
ఇదేం ‘శిక్ష’ణ..?
భద్రాచలం : జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాలు సవ్యంగా కొనసాగటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యూత్ ట్రైనింగ్ సెంటర్లను(వైటీసీ) ప్రైవేటు సంస్థలకు అప్పగించటంతో సరైన ఫలితాలు రావటం లేదు. శిక్షణ పేరుతో నిధులు హారతి కర్పూరంలా కరిగిపోతున్నా యువతకు ఉపాధి లభించటం లేదు. ఈ కేంద్రాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవటంతో నామమాత్రంగానే సాగుతున్నాయి. ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన వివిధ శిక్షణ కేంద్రాలను ‘సాక్షి’ పరిశీలించగా అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో గ్రామ్ తరంగ్ సంస్థ ద్వారా నిర్వహిస్తున్న కేంద్రంలో ఒక్క జేడీఏ(జనరల్ డ్యూటీ అసిస్టెంట్) కోర్సులో మాత్రమే విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ఆదివారం ఈ కేంద్రాన్ని పరిశీలించగా 10 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. అయితే ఇక్కడ ఇప్పటి వరకు 360 మందికి వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చినట్లు కేంద్రం కో– ఆర్డినేటర్ రవితేజ తెలిపారు. కానీ ఇందులో సేంద్రియ వ్యవసాయ సాగు, కోళ్ల పెంపకం వంటి అంశాల్లోనే సుమారు 240 మందికి శిక్షణ ఇచ్చారు. ట్రైనింగ్ తర్వాత ప్లేస్మెంట్(ఉద్యోగం) చూపించాలనే నిబంధన ఉండటంతో ఇటువంటి వాటికే ఎక్కువ శ్రద్ధ చూపుతన్నారనే విమర్శ ఉంది. ఐటీడీఏ ఆధ్వర్యంలో కేంద్రం నడిచిన సమయంలో దీనికి ఫర్నిచర్, ఇతర సామగ్రి పెద్ద ఎత్తున సరఫరా చేయగా, అవన్నీ గదుల్లో వృథా గా కనిపిస్తున్నాయి. జిల్లాలో 50 వేల మందికిగా పైగా నిరుద్యోగ అభ్యర్థులు ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో నమోదు చేసుకున్నప్పటికీ, ఇక్కడికి మాత్రం అభ్యర్థులు రాకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. అయితే గతంలో వచ్చిన అభ్యర్థులే మళ్లీ మరో కోర్సుకు వస్తుండటం గమనార్హం. అంటే శిక్షణ అనంతరం ప్లేస్మెంట్ సవ్యంగా జరగడం లేదని దీన్ని బట్టి తెలుస్తోంది. కేంద్రం నిర్వహణపై కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు దృష్టి సారించాలని గిరిజన సంఘాల వారు కోరుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం అస్తవ్యస్తం... మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాగా ఉన్న సమయంలో మంజూరైన నిధులతో భద్రాచలం, కొత్తగూడెం, వాజేడులో టైలరింగ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ బాధ్యతలను ఆయా ప్రాంతాల్లో గల ఐటీఐ ప్రిన్సిపాల్స్‌కు అప్పగించారు. ఒక్కో కేంద్రానికి రూ.50 లక్షలు మంజూరు కాగా, ఇందులో రూ.35 లక్షలతో భవనాలు నిర్మించారు. మిగతా నిధులతో టైలరింగ్ యూనిట్లను ఏర్పాటు చేశారు. అయితే ఆ భవనాన్ని వృథాగానే వదిలేసి భద్రాచలం డిగ్రీ కాలేజీ సమీపంలోని గిరిజన బాలికల సెల్ఫ్ మేనేజ్మెంట్ హాస్టల్ ప్రాంగణంలో ఓ మూలకు ఉన్న రేకుల షెడ్లలో టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న వారిలోనూ ఎక్కువ మంది ఉద్యోగుల కుటుంబసభ్యులు, గృహిణులు, వివిధ కోర్సుల్లో ప్రస్తుతం చదువుతున్న వారే ఉన్నారు. కొత్తగూడేనికి భవిత సెల్... గిరిజన యువతకు అండగా నిలిచేందుకు ప్రత్యేకంగా ఐటీడీఏలో ‘భవిత సెల్’ ఏర్పాటు చేశా రు. నిరుద్యోగ గిరిజన యువత ఇక్కడ పేరు నమోదు చేసుకుంటే చాలు, వారి చెంతకే ఉపా ధి, ఉద్యోగ అవకాశాల సమాచారం చేరేలా ప్ర త్యేక ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఐటీడీఏ ప్రాంగణంలోనే ఉన్న యూత్ ట్రైనింగ్ సెంట ర్లో వివిధ పోటీ పరీక్షల కోసం గిరిజన అభ్యర్థులకు వరుసగా ఉచిత శిక్షణలు ఇప్పించారు. కానీ నేడు సీన్ మారిపోయింది. యూత్ ట్రైనింగ్ సెంటర్లు ప్రైవేటు సంస్థలకు అప్పగించటంతో ‘భవిత సెల్’ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న జాబ్ రిసోర్స్ పర్సన్(జేఆర్పీ)లకు పనిలేకుండా పోయింది. దీంతో ఈ కేంద్రాన్ని నేడో, రేపో భద్రాచలం నుంచి కొత్తగూడెం తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. దీని బాధ్యతలను పర్యవేక్షించే ఏపీఎం స్థాయి అధికారి ఇప్పటికే కొత్తగూడెం నుంచి విధులు నిర్వహిస్తున్నారు. దీంతో దీనిని ఇక్కడి నుంచి మార్చేందుకు అంతా సిద్ధమైంది. ఇదే జరిగితే శిక్షణలపై ఇక పూర్తిగా ప్రైవేటు పెత్తనం సాగనుంది. గిరిజన నిరుద్యోగులు 50 వేలకు పైనే.. భద్రాచలం ఐటీడీఏలో ఏర్పాటు చేసిన ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో తాజా లెక్కల ప్రకారం 50 వేల మందికి పైగానే పేర్లు నమోదు చేసుకున్నారు. ఏజెన్సీ ప్రాంత గిరిజన అభ్యర్థులు తమ విద్యార్హతలను భద్రాచలంలోని ఎంప్లాయిమెంట్ కార్యాలయంలోనే నమోదు చేసుకోవాలి. జిల్లాలోని దాదాపు అన్ని మండలాలు ఏజెన్సీ పరిధిలోనే ఉండటంతో ఇక్కడ నమోదయ్యే గణాంకాలనే అధికారులు పరిగణలోకి తీసుకుని, నిరుద్యోగుల లెక్క చూపుతారు. ఇలా నమోదు చేసుకున్న వారిలో పదో తరగతి విద్యార్హతతో సుమారు 21 వేల మంది, ఇంటర్‌తో 13,500 మంది, డిగ్రీ పట్టభద్రులు 7,800 మంది ఉన్నారు. పదో తరగతి లోపు చదువుకున్న వారు 3 వేల మంది ఉండగా, వీరితో పాటు నర్సింగ్, వివిధ రకాల టెక్నికల్ కోర్సులు చేసిన వారు కూడా వేలల్లోనే ఉన్నారు. కానీ ఇక్కడ పేరు నమోదు చేసుకోవటమే తప్ప అర్హులైన వారికి, కనీసం ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై సమాచారం కూడా రావటం లేదు. ఉపాధి చూపని కోర్సులు... యువతకు సత్వర ఉపాధి దొరికేలా ఆయా ప్రాంతాల్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లోనే గతంలో శిక్షణ ఇచ్చేవారు. ప్లంబింగ్ అండ్ రాడ్ బైండింగ్, వెల్డింగ్, ఎలక్ట్రీషియన్ అండ్ హౌస్వైరింగ్, బోర్ వెల్ రిపేర్, ఎంబ్రాయిడరీ అండ్ టైలరింగ్, కంప్యూటర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మెబైల్ సర్వీసు, రిపేరింగ్ వంటి కోర్సుల్లో శిక్షణ ఇచ్చే వారు. మూడు నెలల పాటు ఉచిత భోజన వసతి సదుపాయాలను కల్పించి, శిక్షణ ఇవ్వటంతో పాటు, కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత స్వయంగా ఉపాధి పొందేలా ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా రుణ సదుపాయం కూడా కల్పించేవారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక్కో కేంద్రం నుంచి ఏడాదికి 400 మందికి పైగా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చే వారు. కానీ ప్రస్తుతం ప్రైవేటు సంస్థల ద్వారా నిర్వహిస్తున్న కేంద్రాల్లో నిర్వాహకులకు అనువుగా ఉన్న కోర్సుల్లోనే శిక్షణ ఇస్తున్నారు. ఈ కారణంగా నిరుద్యోగ యువత వీటిపై ఆసక్తి చూపటం లేదు. -
నిరుద్యోగ యువతకు శిక్షణ
తాండూరు రూరల్ : నిరుద్యోగ యువతకు విభిన్నరంగాల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని జినుగుర్తి గేటు సమీపంలో రూర్బన్ నిధులు రూ.2 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణానికి ఆయన శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాండూరు ప్రాంతంలో యువతకు స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. నిరుద్యోగ యువతీయువకులకు ఉచితంగా శిక్షణ ఇప్పించేందుకు ఈ సెంటర్‌ను ప్రారంభిస్తున్నామని ఆయన వివరించారు. పెళ్లికోసం అప్పు చేయొద్దు కూతురు పెళ్లి కోసం తల్లిదండ్రులు అప్పులు చేయొద్దని మంత్రి మహేందర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన 79 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, ఎంపీపీ లక్ష్మమ్మ, జెడ్పీటీసీ రవిగౌడ్, తహసీల్దార్ రాములు, జినుగుర్తి సర్పంచ్ పాపమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు బాలమణి, నాయకులు రాంలింగారెడ్డి, శ్యామప్ప, శ్రీనివాస్‌గౌడ్, అమృత్‌రెడ్డి ఉన్నారు. -
ముద్రా యోజనకు రూ.3 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: స్వయం ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్రా యోజన పథకంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వరాల జల్లు కురిపించారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి ముద్రా పథకం కింద రూ.3 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. 2015 ఏప్రిల్‌లో ప్రారంభించిన ముద్రా యోజన పథకం ద్వారా రూ.4.6 లక్షల కోట్ల రుణాలను ఇచ్చారు. ఈ పథకం కింద 10.38 కోట్ల మంది లబ్ధిపొందారు. రుణ ఖాతాలు ఉన్న వారిలో 76 శాతం మంది మహిళలు ఉండగా, 50 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఉన్నారని జైట్లీ తెలిపారు. ప్రధాన మంత్రి ముద్రా యోజన(పీఎమ్ఎమ్వై)లో శిశు, కిషోర్, తరుణ్ అనే పథకాల కింద రుణాలను ఇస్తారు.