ఐసీటీ బోధన పద్ధతులు అమలు చేయాలి | Exclusive Interview with the University of California-Davis CIO: VG Murali | Sakshi
Sakshi News home page

ఐసీటీ బోధన పద్ధతులు అమలు చేయాలి

Published Mon, Aug 25 2014 12:14 AM | Last Updated on Tue, Nov 6 2018 5:08 PM

ఐసీటీ బోధన పద్ధతులు అమలు చేయాలి - Sakshi

ఐసీటీ బోధన పద్ధతులు అమలు చేయాలి

విజి మురళి,  చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా
 
ఇప్పుడంతా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) మయం. ఐటీ అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోతోంది. ఐటీ ప్రమేయం లేని విభాగాన్ని ఊహించడం కష్టమే. అందుకే ప్రస్తుతం విద్యార్థి లోకంలో అత్యంత క్రేజీగా మారింది.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఐటీ కోర్సులు చదివినంతనే అద్భుతాలు సాధ్యం కావని.. కెరీర్‌లో రాణించాలంటే నేటి యువత మరెన్నో నైపుణ్యాలు సొంతం చేసుకోవాలంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-డేవిస్.. చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ విజి మురళి. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో కెమిస్ట్రీలో బ్యాచిలర్ డిగ్రీ నుంచి పీహెచ్‌డీ వరకు చదివిన మురళి.. కెరీర్‌లో అనూహ్యమైన మలుపుతో ఐటీ రంగంలో ప్రవేశించారు. ఇదే విభాగంలో ఉన్నతంగా ఎదుగుతూ ఐటీ వెటరన్‌గా పేరు సంపాదించుకున్న మురళి.. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-డేవిస్‌కు సీఐఓగా నియమితులైన నేపథ్యంలో ప్రత్యేక ఇంటర్వ్యూ..
 
పనితీరుకు గుర్తింపు  

అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీల్లో ఒకటిగా గుర్తింపు పొందిన యూసీ-డేవిస్‌కు సీఐఓగా ఎంపిక కావడం నా పనితీరుకు లభించిన గుర్తింపుగా భావిస్తున్నాను. ఇప్పటికే పలు యూనివర్సిటీల్లో ఐటీ విభాగంలో విధులు నిర్వర్తించాను. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీలో సీఐఓగా చేస్తున్న సమయంలోనే తాజా నియామకం ఖరారైంది. ఈ స్థాయికి ఎదగడం ఎంతో ఆనందంగా ఉంది.
 
కెమిస్ట్రీ నుంచి కంప్యూటర్ సైన్స్ వైపు
 
ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ, ఆ తర్వాత అదే విభాగంలో 1981లో పీహెచ్‌డీ పూర్తి చేశాను. అదే సమయంలో వివాహం కావడంతో అమెరికా వచ్చాను. అప్పుడు.. కెమిస్ట్రీలో కొనసాగాలా? ఇతర రంగాలు ఎంచుకోవాలా? అని ఆలోచిస్తుండగా.. నాన్న ‘ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్’లో కాలు పెట్టావు. రానున్న రోజుల్లో కంప్యూటర్, ఐటీ రంగాలకు భవిష్యత్తు ఖాయం’ అని చెప్పి కంప్యూటర్ సైన్స్‌వైపు దృష్టి సారించేలా ప్రోత్సహించారు. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి త్రీ-డీ మూలకాల గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత, పజిల్స్ రూపకల్పన వెనుక దాగున్న అంశాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. వీటన్నిటికీ కంప్యూటర్ సైన్స్, ఐటీ నైపుణ్యం ద్వారా అవకాశం లభిస్తుందని భావించాను. దాంతో లోవా స్టేట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్, ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనాలో ఎంఎస్ పూర్తి చేశాను. అదే యూనివర్సిటీలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా కెరీర్ ప్రారంభించాను.  
 
టెక్నాలజీ-విద్యార్థి దృక్పథం
 
టెక్నాలజీ.. అకడమిక్ అధ్యయనాలకు వేగవంతమైన చోదకంగా ఉంటుంది. అదే సమయంలో.. హార్డ్ వర్క్, ఆసక్తి కూడా చాలా అవసరం. ఏ డొమైన్ అయినా ఈ రెండూ ఉంటేనే సదరు సబ్జెక్ట్‌పై పట్టు లభిస్తుంది. ఆసక్తి ఉంటేనే కొత్త విషయాలు, అంశాలు తెలుసుకోవాలనే ఉత్సుకత మొదలవుతుంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఫలితంగా విద్యార్థులకు అకడమిక్ అధ్యయనం ఎంతో సులభంగా మారింది. మేం చదువుకునే రోజుల్లో లాగరిథమ్ టేబుల్స్, స్లైడ్ రూలర్స్ వంటివి పెన్, పేపర్ లేనిదే సాధ్యమయ్యేవి కావు. కానీ ఇప్పుడు క్షణాల్లో వాటిని రూపొందించొచ్చు. టెక్నాలజీని వినియోగించుకునే దృక్పథంపైనే విద్యార్థి సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు.. టెక్నాలజీ సహాయంతో క్షణాలు లేదా నిమిషాల్లో ఒక సమస్యను పూర్తి చేసేయొచ్చు. మిగతా సమయాన్ని కొత్త అంశాల అధ్యయనానికి కేటాయించుకోవచ్చు. ఇలా బ్రెయిన్ పవర్‌ను సద్వినియోగం చేసుకుంటే ఎన్నో అర్థవంతమైన ఫలితాలు, అద్భుతాలు సాధించొచ్చు.
 
ఐటీతోపాటు మరెన్నో స్కిల్స్

 
కెరీర్‌లో విజయం సాధించాలంటే .. కేవలం ఐటీ డొమైన్ పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు. దీనికి అదనంగా ఎన్నో స్కిల్స్ అవసరం. ప్రాబ్లమ్ సాల్వింగ్, టీం వర్క్, టెక్నాలజీ అప్‌డేషన్, కమ్యూనికేషన్ వంటి నైపుణ్యాలు జత కలిస్తేనే ఐటీ కెరీర్‌లో ఉన్నతంగా రాణించగలరు.
 
ఐసీటీ బోధనతో
 
మన దేశంలో ప్రధాన సమస్య గ్రామీణ ప్రాంతాలకు సైతం విద్యావకాశాలు అందించడం. దీనికి ఐటీతో పరిష్కారం కనుగొనొచ్చు. వైర్‌లెస్ కమ్యూనికేషన్ పద్ధతుల్లో గ్రామీణ ప్రాంత పాఠశాలలకు బోధన సదుపాయాలు కల్పించాలి. దీనివల్ల విద్యార్థుల నమోదు సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. చదువుకు దూరమవుతున్న విద్యార్థినులను దృష్టిలో పెట్టుకుంటే.. ఐసీటీ (ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) బోధన పద్ధతులు తప్పనిసరిగా అమలు చేయాలి.
 
మరిన్ని ఆవిష్కరణలు
 
ఒక్కసారి ‘వెబ్’ అనే యుగానికి ముందు.. ఇప్పుడు.. మన వ్యక్తిగత, సామాజిక జీవనశైలులను గమనించండి. ఎంతో తేడా కనిపిస్తోంది. ఔషధ ఉత్పత్తి, సైన్స్ ఆవిష్కరణలు, సామాజిక శాస్త్ర పరిశోధనల్లో సైతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. రోబోటిక్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, బయలాజికల్ ఆర్గాన్స్; ప్రోస్థెటిక్స్ వంటివి కొన్ని ఉదాహరణలు. ఈ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని సరైన దిశలో.. సమర్థంగా వినియోగిస్తే మరిన్ని ఆవిష్కరణలు చేయొచ్చు.
 
అమ్మాయిలు రాణించగలరు
 
ముందుగా.. మహిళలు, పురుషులు అనే బేధభావాన్ని వీడాలి. పురుషులతో దీటుగా రాణించగలమనే ఆత్మవిశ్వాసంతో అమ్మాయిలు అడుగు ముందుకు వేయాలి. ఉన్నత స్థానాలకు చేరుకుని కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహిళలను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇక.. విద్యార్థులందరికీ నా సలహా.. అకడమిక్స్ ఎంపిక నుంచే జాగ్రత్తగా వ్యవహరించాలి. క్రేజ్ లేదా కెరీర్ ష్యూర్ అనే ఆలోచనలకంటే ఆసక్తికి అనుగుణంగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకు తగిన కోర్సుల్లో చేరాలి. ఒకసారి కోర్సులో చేరిన తర్వాత పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రాక్టికల్ అప్రోచ్‌కు ప్రాధాన్యమిస్తూ అధ్యయనం సాగించాలి. అప్పుడే.. ప్రతి ఒక్కరి లక్ష్యమైన జాబ్.. దానికి అవసరమైన స్కిల్స్ లభిస్తాయి!!
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement