IT courses
-
జాబ్ వచ్చేసినట్టేనని ఆనందపడ్డ విద్యార్థులకు షాకిస్తున్న ఐటీ కంపెనీలు
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఐటీ కోర్సులు చేసిన విద్యార్థులకు ఉద్యోగాల అంశం కలవరపెడుతోంది. క్యాంపస్ నియామకాల్లో ఎంపికై ఆఫర్ లెటర్లు వచ్చినా.. ఉద్యోగాల్లో చేరడానికి ఇంకా ఎదురుచూపులు తప్పడం లేదు. చిన్న సంస్థల నుంచి ఐటీ దిగ్గజాల దాకా ఇలాగే వ్యవహరిస్తుండటం.. ఆఫర్ లెటర్లు ఇచ్చి ఏడాది దాటిపోతున్నా ఉద్యోగాల్లో చేర్చుకోకపోవడం తీవ్ర ఆందోళన రేపుతోంది. పారిశ్రామిక వర్గాల లెక్కల ప్రకారం.. గత ఏడాది ఆగస్టులో తెలంగాణలో బహుళజాతి సంస్థలు, అంకుర సంస్థలు, చిన్న ఐటీ కంపెనీలు కలిపి 24,500 మందిని క్యాంపస్ నియామకాల ద్వారా ఎంపిక చేసుకున్నాయి. కానీ ఇందులో ఇప్పటివరకు 2,300 మందికి మాత్రమే నియామక ఉత్తర్వులు వచ్చినట్టు అంచనా. రాష్ట్రంలోని టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజీల్లో జరిగిన నియామకాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఉద్యోగం వచ్చేసినట్టేనని ఆనందపడ్డ విద్యార్థులు.. క్రమంగా ధైర్యం కోల్పోతున్నారు. గత ఏడాది ఆగస్టులో సాఫ్ట్వేర్ కంపెనీలు దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ నియామకాలు చేపట్టాయని.. పలురకాల పరీక్షల తర్వాత ఆఫర్ లెటర్లు కూడా ఇచ్చాయని, ఆ తర్వాత మరే స్పందనా లేదని ఎంపికైన విద్యార్థులు వాపోతున్నారు. అపాయింట్మెంట్ ఇవ్వలేదు నన్ను బీటెక్ 4వ సంవత్సరం మొదటి సెమిస్టర్‌లోనే ఓ కంపెనీ సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ఎంపిక చేసింది. రెండో సెమిస్టర్ కాగానే అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుందని.. అప్పట్నుంచే శిక్షణ మొదలవుతుందని, వేతనం కూడా ఇస్తామని చెప్పారు. కానీ 10 నెలలు గడిచింది. ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. – ప్రవీణ్ వర్మ, హైదరాబాద్, క్యాంపస్ రిక్రూటీ చిన్న కంపెనీలు తీసుకుంటున్నా.. అంకుర సంస్థలు, చిన్న కంపెనీలు మాత్రం క్యాంపస్ నియామకాల్లో ఎంపిక చేసుకున్నవారిని ఉద్యోగాల్లోకి ఆహా్వనిస్తున్నాయి. కానీ అవసరమైన మేర తక్కువ సంఖ్యలోనే సిబ్బందిని తీసుకుంటున్నాయి. కోవిడ్ తర్వాత ఆశించిన మేర ప్రాజెక్టులు రావడం లేదని.. అందుకే ఆఫర్ లెటర్ ఇచ్చినా ఉద్యోగాల్లోకి పిలవలేక పోతున్నామని కొన్ని కంపెనీల నిర్వాహకులు చెప్తున్నారు. మరికొన్ని కంపెనీలు కొత్తగా నియామకాలను నిలిపేయడమేగాక.. ఉన్న ఉద్యోగుల వేతనాలు తగ్గించుకుంటున్నాయని అంటున్నారు. గత ఏడాది కాలంలో ప్రపంచవ్యాప్తంగా 570 కంపెనీలు 1.70 లక్షల మంది ఐటీ ఉద్యోగులను తొలగించినట్టు లేఆఫ్స్ ఎఫ్‌వైఐ సంస్థ తమ నివేదికలో వెల్లడించింది. మాంద్యం ప్రభావంతోనే! ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మంద గమనం కొనసాగుతోంది. దీనితో ఐటీ కంపెనీలు కొత్త నియామకాల విషయంలో వెనుకాడుతున్నాయి. అమెరికాలో అత్యధిక ద్రవోల్బణం, స్థిరాస్తి, బ్యాంకింగ్ సంక్షోభం నేపథ్యంలో.. అక్కడ ఆర్థిక వ్యవస్థ గాడిన పడటానికి కనీసం రెండేళ్లు పడుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యూరప్ దేశాలు, జపాన్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే దిగ్గజ కంపెనీలు కూడా ఇటీవల ఉద్యోగులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కొత్త నియామకాలు వాయిదా వేస్తూ వస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లే. మాది వరంగల్. ఓ ప్రముఖ కాలేజీలో ఇంజనీరింగ్ చేశాను. చివరి సెమిస్టర్లో ఉండగా.. మల్టీ నేషనల్ కంపెనీ ఉద్యోగానికి ఆఫర్ లెటర్ ఇచ్చింది. ఇప్పటికీ అపాయింట్మెంట్ రాలేదు. ఎన్ని మెయిల్స్ చేసినా స్పందన లేదు. బంధువులకు ముఖం చూపించలేక.. హైదరాబాద్‌లోనే ఉండి కోర్సులు నేర్చుకుంటున్నాను. – అఖిలేశ్ గౌడ్, క్యాంపస్ రిక్రూటీ, హైదరాబాద్ స్పెషల్ స్కిల్స్ ముఖ్యం ఇంకో ఏడాది పాటు ఇంజనీరింగ్ విద్యార్థులు క్యాంపస్ నియామకాలపై ఆశలు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆఫర్ లెటర్స్ ఇచ్చిన వారికే నియామకాలు జరగలేదు. ఏఐ, ఎంబెడ్డెడ్ సిస్టమ్స్, మెషీన్ లెరి్నంగ్, డేటా అనలిటిక్స్ వంటి నైపుణ్యాలు అభివృద్ధి చేసుకున్న వారికి మాత్రం మార్కెట్ బాగానే ఉంటోంది. – మిత్రాసేథ్, ఓ ఎంఎన్సీ కంపెనీలో ఉన్నతస్థాయి ఉద్యోగి -
ఐటీ జాబ్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారా? విద్యార్ధుల కోసం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ కెరీర్ ఔత్సాహికులకు నైపుణ్యాల్లో శిక్షణనిచ్చే ఎడ్టెక్ సంస్థ బైట్‌ఎక్స్‌ఎల్ .. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలపై మరింతగా దృష్టి పెడుతోంది. ప్రస్తుతం 90 పైచిలుకు కాలేజీలతో టై–అప్లు ఉన్నాయని, ఈ సంఖ్యను మరింతగా పెంచుకుంటున్నామని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో కరుణ్ తాడేపల్లి తెలిపారు. అలాగే 163 మంది ఉద్యోగులు, కన్సల్టెంట్లు ఉండగా.. వచ్చే 6–9 నెలల్లో 350 వరకు పెంచుకోనున్నట్లు ఆయన వివరించారు. ఆదాయాన్ని 4 రెట్లు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు కొత్తగా నిర్మించిన కార్యాలయంలోకి కార్యకలాపాలు మార్చిన సందర్భంగా విలేకరులకు చెప్పారు. ఇప్పటివరకూ ఏడు రాష్ట్రాల్లో 1,20,000 మంది విద్యార్థులకు క్లౌడ్, ఏఐ, ఎంఎల్ వంటి కొత్త టెక్నాలజీలపై తమ లెర్నింగ్ ప్లాట్‌ఫాం, ఎక్సలరేట్ ప్రోగ్రాంల ద్వారా శిక్షణనిచ్చినట్లు కరుణ్ వివరించారు. కరోనా తర్వాత దాదాపు అందరూ కాలేజీలు, ఆఫీసుల బాటపట్టిన నేపథ్యంలో ఇటీవలి కాలంలో ఎడ్టెక్ కంపెనీలపై కొంత ప్రభావం పడిందని ఆయన చెప్పారు. అయితే, కొత్త పరిస్థితులకు అనుగుణంగా వినూత్న సర్వీసులు అందించడంపై దృష్టి పెడుతున్నట్లు కరుణ్ చెప్పారు. -
ఐటీ కోర్స్.. హైటెక్ జాబ్స్
సాక్షి, సిటీబ్యూరో: జాబ్ మార్కెట్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్న సాంకేతిక కోర్సులకు నగరంలో డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ మార్గదర్శకాల ప్రకారం నగరంలో జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీల పరిధిలోని సుమారు 30 అటానమస్ కళాశాలలు 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ కోర్సులు ప్రవేశ పెట్టాల్సిన ఆవశ్యకతపై ఇటీవల ఉన్నత విద్యాశాఖ కౌన్సిల్.. ఆయా కళాశాలలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీల్లో విద్యార్థులు ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన సాంకేతిక కోర్సులు తమ కళాశాలల్లో పరిచయం చేయాలని ఆదేశించింది. వీటిలో ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్, బిజినెస్ అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ తదితర కోర్సులు ఉన్నాయి. కాగా, ప్రస్తుతం ఆయా కళాశాలల్లో అందుబాటులో ఉన్న నూతన సాంకేతిక కోర్సులు... వాటికి విద్యార్థుల నుంచి లభిస్తున్న ఆదరణ, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, నూతనంగా ప్రవేశపెట్టబోయే కోర్సులపై అటానమస్ కళాశాలలు తమకు నివేదిక సమర్పించాలని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆదేశించింది. టెకీల చూపు.. హైటెక్ కోర్సుల వైపు విశ్వవ్యాప్తంగా సాఫ్ట్వేర్ రంగాన్ని ఇటీవల గడగడలాడించిన ర్యాన్సమ్వేర్.. వానా క్రై వైరస్ వంటి ఉపద్రవాలతోపాటు డిజిటల్ యుగంలో పెరుగుతోన్న సైబర్ నేరాలను అడ్డుకునేందుకు, సేవారంగంలో విప్లవాత్మక సంస్కరణలు, పలు రకాల సేవల సరళీకరణకు ఉద్దేశించిన సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర కోర్సులకు ఇటీవలికాలంలో డిమాండ్ బాగా పెరుగుతోంది. హైటెక్‌సిటీగా పేరొందిన గ్రేటర్ నగరంలోనూ ఇప్పుడిప్పుడే టెకీలు ఈ కోర్సులవైపు దృష్టిసారిస్తున్నారు. బీటెక్,ఎంటెక్ పూర్తిచేసినవారు..ఇప్పటికే ఐటీ,సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నవారు సైతం సైబర్ సెక్యూరిటీ కోర్సులను నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఈ కోర్సులు నేర్చుకున్నవారికి ఆయా కంపెనీలను బట్టి అనుభవాన్ని బట్టి జీతభత్యాలు లభిస్తుండడం విశేషం. నూతనంగా ఉద్యోగంలో చేరిన టెకీ కంటే హైటెక్ కోర్సులు పూర్తి చేసినవారికి రెట్టింపు వేతనాలు లభిస్తున్నట్లు తెలిసింది. ఇంజినీరింగ్ విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నాం ఇటీవలికాలంలో సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్సెస్, బిజినెస్ అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులకు ప్రాధాన్యత పెరిగింది. దీంతో తెలంగాణ అకాడమీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్,నాస్కామ్,జేఎన్టీయూ నిపుణుల ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు విడతల వారీగా పలు అంశాలను నేర్పిస్తున్నాము. ఇటీవలి కాలంలో ఈ కార్యక్రమాలకు విద్యార్థులు,టెకీలు,కంపెనీల నుంచి డిమాండ్ అధికంగా ఉంది. – జయేష్‌రంజన్, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి -
అమెరికాకు వయా ఇక్కడి నుంచే..!
అమెరికా వెళ్లాలన్నా.. సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ఇంజినీర్లు కావాలనుకున్నా.. ప్రెషర్స్ ఉద్యోగాలు పొందాలన్నా.. ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంచుకోవాలన్నా.. అందరికీ మొదట గుర్తుకువచ్చేది అమీర్‌పేటే. హైదరాబాద్ నగరంలో సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ కోచింగ్ కేంద్రాలకు కేరాప్ అడ్రస్‌గా విరాజిల్లుతోంది ఈ ప్రాంతం. ట్రెండ్‌కు అనుగుణంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డిమాండ్‌కు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్తకొత్త కోర్సులు అందించే ఇక్కడ రద్దీకి కొదవలేదు. కోటి ఆశలతో నగరంలో అడుగుపెట్టే చాలామంది ఎప్పటికప్పుడు అమీర్‌పేట్‌లో తమ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకొని.. తమ కలలను సాకారం చేసుకునే దిశగా సాగుతున్నారు. రాష్ట్ర విభజన ప్రభావం అమీర్పేటపై కూడా ఉంటుందని అప్పట్లో ఊహాగానాలు వెల్లువెత్తాయి. రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడి కోచింగ్ సెంటర్లకు డిమాండ్ పడిపోవచ్చునని, ఇవి మూతపడొచ్చునని, ఒకప్పుడు ఉన్నంత డిమాండ్ ఇకముందు ఉండదని రకరకాలుగా ఊహించారు. కానీ వాస్తవానికి చూసుకుంటే అమీర్‌పేట్ పరిస్థితి ఏమీ మారలేదు. అక్కడ రద్దీ మారలేదు. ఎన్నో ఆశలతో కోచింగ్ సెంటర్లలో చేరే ఆశావహుల సంఖ్య తగ్గలేదు. నిత్యం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకొని కెరీర్లో దూసుకుపోవాలనుకునే వారికి ఇదొక కార్యక్షేత్రం. ట్రెయినింగ్ సెంటర్. కోచింగ్ సెంటర్. బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, బీఎస్సీ మొదలు.. సీ, సీ++, జావా, డాట్నెట్, ఒరాకిల్, టెస్టింగ్ టూల్స్, నెట్వర్కింగ్ కోర్సులతోపాటు ఆండ్రాయిడ్, ఐఫోన్ మొబైల్ అప్లికేషన్ ఇలా సకల టెక్నాలజీ కోర్సులకు ఇక్కడ కోచింగ్ లభిస్తోంది. అందుకే ఇక్కడ కోచింగ్ తీసుకోవడానికి వచ్చేవారు తగ్గడం లేదు. ఇక్కడ వేలల్లో కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. కనీసం వాటికి బోర్డు పెట్టుకోవడానికి కూడా తగినంత చోటు లేదంటే అతియోశక్తి కాదేమో. అలాంటి అమీర్‌పేట్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తాజాగా హల్చల్ చేస్తోంది. అమీర్‌పేట్‌లోని మైత్రీవనం కూడలిలోని భవనాలు కిక్కిరిపోయిన కోచింగ్ సెంటర్ల బోర్డులతో వీసమెత్తు స్థలం కూడా వదలకుండా.. అక్కడి పరిస్థితిని చాటుతున్నాయి. ఇక్కడి కోచింగ్ సెంటర్లకు కనీసం బోర్డు పెట్టుకునే స్థలం కూడా దొరకడం లేదంటే ఇక్కడి రద్దీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. -
ఐటీ కోర్సులకు కేరాఫ్ అమీర్‌పేట!!
ఇంజనీరింగ్ స్పెషల్ బీఎస్సీ, బీసీఏ, బీటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంటెక్ విద్యార్హత ఏదైనా... సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, నెట్వర్కింగ్.. చేరాలనుకున్న కోర్సు ఏదైనా అన్నింటికి ముఖ్య కూడలి.. హైదరాబాద్‌లోని అమీర్‌పేట. ఇది నేడు ఐటీ కోర్సుల శిక్షణా శిబిరంగా మారింది. నేటి ఆధునిక ప్రపంచానికి అవసరమైన సాంకేతిక నిపుణులను తీర్చిదిద్దుతోంది. ఈ నేపథ్యంలో అమీర్‌పేటలోని ఐటీ శిక్షణ సంస్థలు.. కోర్సులు.. సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ఇంజనీర్లు కావాలని కలలు కనే వారికి పరిచయం అక్కర్లేని ప్రాంతం అమీర్‌పేట. ఫ్రెషర్స్ ఉద్యోగాలు పొందాలన్నా, ఉద్యోగులు తమ స్కిల్‌ను డెవలప్ చేసుకోవాలన్నా అమీర్పేటని ఆశ్రయించవలసిందే. ఇక్కడి కోచింగ్ సంస్థలు.. ట్రెండ్‌కు అనుగుణంగా..సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డిమాండ్‌కు తగిన కోర్సుల్లో శిక్షణ ఇస్తూ సగటు విద్యార్థుల సమున్నత కెరీర్‌కు బాసటగా నిలుస్తున్నాయి. ఎవరెవరికి ఏ కోర్సులు బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, బీఎస్సీ.. విద్యార్థులు.. సీ, సీ++, జావా, డాట్నెట్, ఒరాకిల్, హడూప్, షేర్‌పాయింట్, లైనక్స్, టెస్టింగ్ టూల్స్, నెట్వర్కింగ్ కోర్సులతోపాటు ఆండ్రాయిడ్, ఐఫోన్ మొబైల్ అప్లికేషన్లనూ నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. బీకామ్ విద్యార్థులు ట్యాలీ వంటి అకౌంటింగ్ కోర్సుల్లోనూ చేరుతున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ విద్యార్థుల కోసం వీఎల్ఎస్ఐ డిజైన్, క్యాడ్/క్యామ్ తదితర కోర్సులూ అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్, హిమాయత్‌నగర్, కుకట్‌పల్లిలో కూడా మంచి ఇన్స్టిట్యూట్లు, కోర్సులు అందుబాటులో ఉన్నప్పటికీ విద్యార్థులు అమీర్పేటకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. గతంలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ), (హైదరాబాద్) అమీర్‌పేటలోని మైత్రివనంలో ఉండేది. ఎస్టీపీఐ అనుమతి పొందిన సంస్థలు అక్కడే చుట్టుపక్కల ఇన్స్టిట్యూట్స్ ప్రారంభించాయి. దాంతో విద్యార్థులు ఇక్కడకు వచ్చి వివిధ ఐటీ కోర్సుల్లో శిక్షణ పొందేవారు. అలా అమీర్‌పేట ఐటీ శిక్షణ సంస్థలకు కేంద్రంగా మారింది. అమీర్‌పేటలో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న అన్ని రకాల టెక్నాలజీలకు కోచింగ్ లభిస్తుంది. ఇక్కడ ఇన్స్టిట్యూట్ల మధ్య పోటీ ఉండటంతో తక్కువ ఫీజులకే కోచింగ్‌ను అందిస్తున్నాయి. ఫీజులు ఒక్కో ఇన్స్టిట్యూట్ ఒక్కో కోర్సుకు ప్రసిద్ధి. ఫీజులు కూడా ఇన్స్టిట్యూట్లను, కోర్సులను బట్టి మారుతుంటాయి. రూ.500 నుంచి రూ.50000 వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. అభ్యర్థులు తమ అర్హతలు, అనుభవం, అభిరుచులకు తగిన కోర్సులను ఎంపిక చేసుకోవాలి. ఇతర విద్యార్థులే ఎక్కువ ప్రస్తుతం ఇన్స్టిట్యూట్లల్లో ఇతర రాష్ట్రాల వారు, విదేశీయులు ఎక్కువగా ఉంటున్నారు. జావా నేర్చుకునే వారిలో 40 శాతం మంది తెలుగు విద్యార్థులు ఉండగా, ఇతర రాష్ట్రాల వారు 50 శాతం మంది, విదేశీయులు 10 శాతం వరకు ఉన్నారు. ఇన్స్టిట్యూట్, కోర్సు ఎంపికలో జాగ్రత్తలు * మార్కెట్ ట్రెండ్‌కనుగుణంగా డిమాండ్ ఉన్న కోర్సును ఎంచుకోవాలి. అయితే అన్ని టెక్నాలజీలు, టూల్స్ కానీ మార్కెట్లో ఎక్కువ కాలం ఉన్న దాఖలాలు లేవు. కొన్ని టెక్నాలజీలు మాత్రమే నిలకడగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. అభ్యర్థులు వాటివైపు మొగ్గు చూపాలి. * కోర్సు పూర్తయ్యాక ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఎలాంటి కంపెనీలు నిపుణులను నియమించుకుంటున్నాయో తెలుసుకోవాలి. * కోర్సు కాలపరిమితిని దృష్టిలో ఉంచుకోవాలి. సదరు కోర్సును తక్కువ కాలవ్యవధుల్లో ఆఫర్ చేసే ఇన్స్టిట్యూట్లో చేరేముందు, ఆ పరిమిత కాలంలో పూర్తి నైపుణ్యాలు సాధించగలరో లేదో విశ్లేషించుకోవాలి. * ఇన్స్టిట్యూట్లో ల్యాబ్స్, ఇతర సౌకర్యాలనూ దృష్టిలో ఉంచుకోవాలి. * అన్నింటి కంటే ముఖ్యంగా చేరాలనుకుంటున్న ఇన్స్టిట్యూట్ పాటించే ప్రమాణాలు, ఫ్యాకల్టీ అనుభవం, వారు ఎప్పటి నుంచి అక్కడ పనిచేస్తున్నారు తదితర అంశాలను స్నేహితులు, సీనియర్ల ద్వారా తెలుసుకోవాలి. కొన్ని ఇన్స్టిట్యూట్లు అనుభవం లేని, ల్యాబ్ కోఆర్డినేటర్లతో కూడా క్లాసులు నిర్వహిస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు ఇన్స్టిట్యూట్ల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలి. * కొన్ని ఇన్స్టిట్యూట్లు తమ ప్రకటనలతో విద్యార్థులను బుట్టలో వేసుకుంటాయి. ఇంకా ఆకర్షణీయంగా డెమో క్లాసులు నిర్వహించి అభ్యర్థులను తమ వైపు తిప్పుకుంటాయి. అలాంటి ఇన్స్టిట్యూట్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అమీర్‌పేటలో కోర్సుల ఫీజులు చాలా తక్కువ. పుణే, బెంగళూర్ లాంటి నగరాల్లో జావా నేర్చుకోవాలంటే దాదాపు రూ. 25 వేల వరకు ఖర్చు చేయాల్సిందే. కానీ ఇక్కడ రూ. 3 వేల నుంచి రూ.5 వేల లోపే పూర్తవుతుంది. - ఎన్.దుర్గా ప్రసాద్, డెరైక్టర్, దుర్గాసాఫ్ట్ -
ఐసీటీ బోధన పద్ధతులు అమలు చేయాలి
విజి మురళి, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇప్పుడంతా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) మయం. ఐటీ అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోతోంది. ఐటీ ప్రమేయం లేని విభాగాన్ని ఊహించడం కష్టమే. అందుకే ప్రస్తుతం విద్యార్థి లోకంలో అత్యంత క్రేజీగా మారింది.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఐటీ కోర్సులు చదివినంతనే అద్భుతాలు సాధ్యం కావని.. కెరీర్లో రాణించాలంటే నేటి యువత మరెన్నో నైపుణ్యాలు సొంతం చేసుకోవాలంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-డేవిస్.. చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ విజి మురళి. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో కెమిస్ట్రీలో బ్యాచిలర్ డిగ్రీ నుంచి పీహెచ్డీ వరకు చదివిన మురళి.. కెరీర్లో అనూహ్యమైన మలుపుతో ఐటీ రంగంలో ప్రవేశించారు. ఇదే విభాగంలో ఉన్నతంగా ఎదుగుతూ ఐటీ వెటరన్‌గా పేరు సంపాదించుకున్న మురళి.. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-డేవిస్‌కు సీఐఓగా నియమితులైన నేపథ్యంలో ప్రత్యేక ఇంటర్వ్యూ.. పనితీరుకు గుర్తింపు అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీల్లో ఒకటిగా గుర్తింపు పొందిన యూసీ-డేవిస్‌కు సీఐఓగా ఎంపిక కావడం నా పనితీరుకు లభించిన గుర్తింపుగా భావిస్తున్నాను. ఇప్పటికే పలు యూనివర్సిటీల్లో ఐటీ విభాగంలో విధులు నిర్వర్తించాను. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీలో సీఐఓగా చేస్తున్న సమయంలోనే తాజా నియామకం ఖరారైంది. ఈ స్థాయికి ఎదగడం ఎంతో ఆనందంగా ఉంది. కెమిస్ట్రీ నుంచి కంప్యూటర్ సైన్స్ వైపు ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ, ఆ తర్వాత అదే విభాగంలో 1981లో పీహెచ్డీ పూర్తి చేశాను. అదే సమయంలో వివాహం కావడంతో అమెరికా వచ్చాను. అప్పుడు.. కెమిస్ట్రీలో కొనసాగాలా? ఇతర రంగాలు ఎంచుకోవాలా? అని ఆలోచిస్తుండగా.. నాన్న ‘ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్’లో కాలు పెట్టావు. రానున్న రోజుల్లో కంప్యూటర్, ఐటీ రంగాలకు భవిష్యత్తు ఖాయం’ అని చెప్పి కంప్యూటర్ సైన్స్వైపు దృష్టి సారించేలా ప్రోత్సహించారు. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి త్రీ-డీ మూలకాల గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత, పజిల్స్ రూపకల్పన వెనుక దాగున్న అంశాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. వీటన్నిటికీ కంప్యూటర్ సైన్స్, ఐటీ నైపుణ్యం ద్వారా అవకాశం లభిస్తుందని భావించాను. దాంతో లోవా స్టేట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్, ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనాలో ఎంఎస్ పూర్తి చేశాను. అదే యూనివర్సిటీలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా కెరీర్ ప్రారంభించాను. టెక్నాలజీ-విద్యార్థి దృక్పథం టెక్నాలజీ.. అకడమిక్ అధ్యయనాలకు వేగవంతమైన చోదకంగా ఉంటుంది. అదే సమయంలో.. హార్డ్ వర్క్, ఆసక్తి కూడా చాలా అవసరం. ఏ డొమైన్ అయినా ఈ రెండూ ఉంటేనే సదరు సబ్జెక్ట్‌పై పట్టు లభిస్తుంది. ఆసక్తి ఉంటేనే కొత్త విషయాలు, అంశాలు తెలుసుకోవాలనే ఉత్సుకత మొదలవుతుంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఫలితంగా విద్యార్థులకు అకడమిక్ అధ్యయనం ఎంతో సులభంగా మారింది. మేం చదువుకునే రోజుల్లో లాగరిథమ్ టేబుల్స్, స్లైడ్ రూలర్స్ వంటివి పెన్, పేపర్ లేనిదే సాధ్యమయ్యేవి కావు. కానీ ఇప్పుడు క్షణాల్లో వాటిని రూపొందించొచ్చు. టెక్నాలజీని వినియోగించుకునే దృక్పథంపైనే విద్యార్థి సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు.. టెక్నాలజీ సహాయంతో క్షణాలు లేదా నిమిషాల్లో ఒక సమస్యను పూర్తి చేసేయొచ్చు. మిగతా సమయాన్ని కొత్త అంశాల అధ్యయనానికి కేటాయించుకోవచ్చు. ఇలా బ్రెయిన్ పవర్‌ను సద్వినియోగం చేసుకుంటే ఎన్నో అర్థవంతమైన ఫలితాలు, అద్భుతాలు సాధించొచ్చు. ఐటీతోపాటు మరెన్నో స్కిల్స్ కెరీర్లో విజయం సాధించాలంటే .. కేవలం ఐటీ డొమైన్ పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు. దీనికి అదనంగా ఎన్నో స్కిల్స్ అవసరం. ప్రాబ్లమ్ సాల్వింగ్, టీం వర్క్, టెక్నాలజీ అప్డేషన్, కమ్యూనికేషన్ వంటి నైపుణ్యాలు జత కలిస్తేనే ఐటీ కెరీర్లో ఉన్నతంగా రాణించగలరు. ఐసీటీ బోధనతో మన దేశంలో ప్రధాన సమస్య గ్రామీణ ప్రాంతాలకు సైతం విద్యావకాశాలు అందించడం. దీనికి ఐటీతో పరిష్కారం కనుగొనొచ్చు. వైర్లెస్ కమ్యూనికేషన్ పద్ధతుల్లో గ్రామీణ ప్రాంత పాఠశాలలకు బోధన సదుపాయాలు కల్పించాలి. దీనివల్ల విద్యార్థుల నమోదు సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. చదువుకు దూరమవుతున్న విద్యార్థినులను దృష్టిలో పెట్టుకుంటే.. ఐసీటీ (ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) బోధన పద్ధతులు తప్పనిసరిగా అమలు చేయాలి. మరిన్ని ఆవిష్కరణలు ఒక్కసారి ‘వెబ్’ అనే యుగానికి ముందు.. ఇప్పుడు.. మన వ్యక్తిగత, సామాజిక జీవనశైలులను గమనించండి. ఎంతో తేడా కనిపిస్తోంది. ఔషధ ఉత్పత్తి, సైన్స్ ఆవిష్కరణలు, సామాజిక శాస్త్ర పరిశోధనల్లో సైతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. రోబోటిక్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, బయలాజికల్ ఆర్గాన్స్; ప్రోస్థెటిక్స్ వంటివి కొన్ని ఉదాహరణలు. ఈ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని సరైన దిశలో.. సమర్థంగా వినియోగిస్తే మరిన్ని ఆవిష్కరణలు చేయొచ్చు. అమ్మాయిలు రాణించగలరు ముందుగా.. మహిళలు, పురుషులు అనే బేధభావాన్ని వీడాలి. పురుషులతో దీటుగా రాణించగలమనే ఆత్మవిశ్వాసంతో అమ్మాయిలు అడుగు ముందుకు వేయాలి. ఉన్నత స్థానాలకు చేరుకుని కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహిళలను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇక.. విద్యార్థులందరికీ నా సలహా.. అకడమిక్స్ ఎంపిక నుంచే జాగ్రత్తగా వ్యవహరించాలి. క్రేజ్ లేదా కెరీర్ ష్యూర్ అనే ఆలోచనలకంటే ఆసక్తికి అనుగుణంగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకు తగిన కోర్సుల్లో చేరాలి. ఒకసారి కోర్సులో చేరిన తర్వాత పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రాక్టికల్ అప్రోచ్‌కు ప్రాధాన్యమిస్తూ అధ్యయనం సాగించాలి. అప్పుడే.. ప్రతి ఒక్కరి లక్ష్యమైన జాబ్.. దానికి అవసరమైన స్కిల్స్ లభిస్తాయి!! -
వినూత్న యాప్స్‌తో ధనార్జన
గుడ్లవల్లేరు : వినూత్న యాప్స్ ధనార్జ దోహదపడేలా చేసుకోవచ్చునని ఎ.ఎ.ఎన్.ఎం అండ్ వి.వి.ఆర్.ఎస్.ఆర్ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎన్.ఎస్.ఎస్.వి.రామాంజనేయులు తెలిపారు. స్థానిక కాలేజీలో మైక్రోసాఫ్ట్‌చే ధృవీకరించబడిన కంప్యూటర్ విద్యా నిపుణుల బృందం ‘కాంపసిఫై’వారు విండోస్-8 యాప్ డెవలప్మెంట్పై రెండు రోజుల వర్క్‌షాపును మంగళ, బుధవారాలు నిర్వహించారు. పాలిటెక్నిక్ చివరి సంవత్సరం కంప్యూటర్, ఐటీ కోర్సులు చదువుతున్న 76మంది విద్యార్థులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. తొలి రోజు యాప్స్‌కు సంబంధించిన విండోస్-8ఓఎస్, విండోస్-8 స్టోర్ యాప్స్, విండోస్-8అప్లికేషన్స్, విజువల్ స్టూడియో వంటి అంశాల్ని విద్యార్థులు ఆసక్తిగా నేర్చుకున్నారు. రెండో రోజు టూల్ బాక్స్‌ను ఉపయోగించి మైక్రోసాఫ్ట్ బ్లెండ్‌తో యానిమేషన్ ఎఫెక్ట్‌ను జత చేయడం, యాప్స్‌ను విండోస్ స్టోర్‌కు అప్లోడ్ చేయడం వంటి విషయాలపై ప్రయోగాలను నిర్వహించారు. ఈ విద్యార్థులందరూ ఈనెల 30న జిల్లాలోని వివిధ ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులతో పాటు ఏకబిగిన 24గంటల పాటు సాగే నూతన యాప్స్ ఆవిష్కర పోటీల్లో పాల్గొంటారని ప్రిన్సిపాల్ తెలిపారు. రెండు రోజుల వర్క్‌షాప్‌లో శిక్షణ పొందిన విద్యార్థులందరికీ ధ్రువపత్రాల్ని ముగింపు సభలో జీఈసీ అకడమిక్ డీన్ డాక్టర్ ప్రసాద్ అందజేశారు. కాంపసిఫై నిపుణుడు జంపని చైతన్య, రాజశేఖరరెడ్డి, శ్రావణ్‌కుమార్, రూపేష్ గుప్తా శిక్షణ ఇచ్చారు. వర్క్‌షాప్‌ను కంప్యూటర్, ఐటీ శాఖాధిపతులు జి.వి.వి.సత్యనారాయణ, ఎన్.రాజశేఖర్ పర్యవేక్షించారు.