అమెరికా వెళ్లాలన్నా.. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ఇంజినీర్లు కావాలనుకున్నా.. ప్రెషర్స్ ఉద్యోగాలు పొందాలన్నా.. ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంచుకోవాలన్నా.. అందరికీ మొదట గుర్తుకువచ్చేది అమీర్‌పేటే. హైదరాబాద్ నగరంలో సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ కోచింగ్ కేంద్రాలకు కేరాప్ అడ్రస్‌గా విరాజిల్లుతోంది ఈ ప్రాంతం.
ట్రెండ్‌కు అనుగుణంగా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ డిమాండ్‌కు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్తకొత్త కోర్సులు అందించే ఇక్కడ రద్దీకి కొదవలేదు. కోటి ఆశలతో నగరంలో అడుగుపెట్టే చాలామంది ఎప్పటికప్పుడు అమీర్‌పేట్‌లో తమ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకొని.. తమ కలలను సాకారం చేసుకునే దిశగా సాగుతున్నారు.
రాష్ట్ర విభజన ప్రభావం అమీర్‌పేటపై కూడా ఉంటుందని అప్పట్లో ఊహాగానాలు వెల్లువెత్తాయి. రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడి కోచింగ్ సెంటర్లకు డిమాండ్ పడిపోవచ్చునని, ఇవి మూతపడొచ్చునని, ఒకప్పుడు ఉన్నంత డిమాండ్ ఇకముందు ఉండదని రకరకాలుగా ఊహించారు. కానీ వాస్తవానికి చూసుకుంటే అమీర్‌పేట్ పరిస్థితి ఏమీ మారలేదు. అక్కడ రద్దీ మారలేదు. ఎన్నో ఆశలతో కోచింగ్ సెంటర్లలో చేరే ఆశావహుల సంఖ్య తగ్గలేదు. నిత్యం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకొని కెరీర్‌లో దూసుకుపోవాలనుకునే వారికి ఇదొక కార్యక్షేత్రం. ట్రెయినింగ్ సెంటర్. కోచింగ్ సెంటర్.
బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, బీఎస్సీ మొదలు.. సీ, సీ++, జావా, డాట్‌నెట్, ఒరాకిల్, టెస్టింగ్ టూల్స్, నెట్‌వర్కింగ్ కోర్సులతోపాటు ఆండ్రాయిడ్, ఐఫోన్ మొబైల్ అప్లికేషన్ ఇలా సకల టెక్నాలజీ కోర్సులకు ఇక్కడ కోచింగ్ లభిస్తోంది. అందుకే ఇక్కడ కోచింగ్ తీసుకోవడానికి వచ్చేవారు తగ్గడం లేదు. ఇక్కడ వేలల్లో కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. కనీసం వాటికి బోర్డు పెట్టుకోవడానికి కూడా తగినంత చోటు లేదంటే అతియోశక్తి కాదేమో. అలాంటి అమీర్‌పేట్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తాజాగా హల్‌చల్ చేస్తోంది. అమీర్‌పేట్‌లోని మైత్రీవనం కూడలిలోని భవనాలు కిక్కిరిపోయిన కోచింగ్ సెంటర్ల బోర్డులతో వీసమెత్తు స్థలం కూడా వదలకుండా.. అక్కడి పరిస్థితిని చాటుతున్నాయి. ఇక్కడి కోచింగ్ సెంటర్లకు కనీసం బోర్డు పెట్టుకునే స్థలం కూడా దొరకడం లేదంటే ఇక్కడి రద్దీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
అమెరికాకు వయా ఇక్కడి నుంచే..!
Published Mon, Dec 26 2016 7:00 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement