ఐటీ కోర్సులకు కేరాఫ్ అమీర్‌పేట!!
ఇంజనీరింగ్ స్పెషల్
బీఎస్సీ, బీసీఏ, బీటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంటెక్ విద్యార్హత ఏదైనా... సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్.. చేరాలనుకున్న కోర్సు ఏదైనా అన్నింటికి ముఖ్య కూడలి.. హైదరాబాద్‌లోని అమీర్‌పేట. ఇది నేడు ఐటీ కోర్సుల శిక్షణా శిబిరంగా మారింది. నేటి ఆధునిక ప్రపంచానికి అవసరమైన సాంకేతిక నిపుణులను తీర్చిదిద్దుతోంది. ఈ నేపథ్యంలో అమీర్‌పేటలోని ఐటీ శిక్షణ సంస్థలు.. కోర్సులు..
సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ఇంజనీర్లు కావాలని కలలు కనే వారికి పరిచయం అక్కర్లేని ప్రాంతం అమీర్‌పేట. ఫ్రెషర్స్ ఉద్యోగాలు పొందాలన్నా, ఉద్యోగులు తమ స్కిల్‌ను డెవలప్ చేసుకోవాలన్నా అమీర్‌పేటని ఆశ్రయించవలసిందే. ఇక్కడి కోచింగ్ సంస్థలు.. ట్రెండ్‌కు అనుగుణంగా..సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ డిమాండ్‌కు తగిన కోర్సుల్లో శిక్షణ ఇస్తూ సగటు విద్యార్థుల సమున్నత కెరీర్‌కు బాసటగా నిలుస్తున్నాయి.
ఎవరెవరికి ఏ కోర్సులు
బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, బీఎస్సీ.. విద్యార్థులు.. సీ, సీ++, జావా, డాట్‌నెట్, ఒరాకిల్, హడూప్, షేర్‌పాయింట్, లైనక్స్, టెస్టింగ్ టూల్స్, నెట్‌వర్కింగ్ కోర్సులతోపాటు ఆండ్రాయిడ్, ఐఫోన్ మొబైల్ అప్లికేషన్‌లనూ నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. బీకామ్ విద్యార్థులు ట్యాలీ వంటి అకౌంటింగ్ కోర్సుల్లోనూ చేరుతున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ విద్యార్థుల కోసం వీఎల్‌ఎస్‌ఐ డిజైన్, క్యాడ్/క్యామ్ తదితర కోర్సులూ అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్, హిమాయత్‌నగర్, కుకట్‌పల్లిలో కూడా మంచి ఇన్‌స్టిట్యూట్‌లు, కోర్సులు అందుబాటులో ఉన్నప్పటికీ విద్యార్థులు అమీర్‌పేటకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారు.
గతంలో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్‌క ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ), (హైదరాబాద్) అమీర్‌పేటలోని మైత్రివనంలో ఉండేది. ఎస్‌టీపీఐ అనుమతి పొందిన సంస్థలు అక్కడే చుట్టుపక్కల ఇన్‌స్టిట్యూట్స్ ప్రారంభించాయి. దాంతో విద్యార్థులు ఇక్కడకు వచ్చి వివిధ ఐటీ కోర్సుల్లో శిక్షణ పొందేవారు. అలా అమీర్‌పేట ఐటీ శిక్షణ సంస్థలకు కేంద్రంగా మారింది. అమీర్‌పేటలో సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న అన్ని రకాల టెక్నాలజీలకు కోచింగ్ లభిస్తుంది. ఇక్కడ ఇన్‌స్టిట్యూట్ల మధ్య పోటీ ఉండటంతో తక్కువ ఫీజులకే కోచింగ్‌ను అందిస్తున్నాయి.
ఫీజులు
ఒక్కో ఇన్‌స్టిట్యూట్ ఒక్కో కోర్సుకు ప్రసిద్ధి. ఫీజులు కూడా ఇన్‌స్టిట్యూట్‌లను, కోర్సులను బట్టి మారుతుంటాయి. రూ.500 నుంచి రూ.50000 వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. అభ్యర్థులు తమ అర్హతలు, అనుభవం, అభిరుచులకు తగిన కోర్సులను ఎంపిక చేసుకోవాలి.
ఇతర విద్యార్థులే ఎక్కువ
ప్రస్తుతం ఇన్‌స్టిట్యూట్‌లల్లో ఇతర రాష్ట్రాల వారు, విదేశీయులు ఎక్కువగా ఉంటున్నారు. జావా నేర్చుకునే వారిలో 40 శాతం మంది తెలుగు విద్యార్థులు ఉండగా, ఇతర రాష్ట్రాల వారు 50 శాతం మంది, విదేశీయులు 10 శాతం వరకు ఉన్నారు.
ఇన్‌స్టిట్యూట్, కోర్సు ఎంపికలో జాగ్రత్తలు
* మార్కెట్ ట్రెండ్‌కనుగుణంగా డిమాండ్ ఉన్న కోర్సును ఎంచుకోవాలి. అయితే అన్ని టెక్నాలజీలు, టూల్స్ కానీ మార్కెట్‌లో ఎక్కువ కాలం ఉన్న దాఖలాలు లేవు. కొన్ని టెక్నాలజీలు మాత్రమే నిలకడగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. అభ్యర్థులు వాటివైపు మొగ్గు చూపాలి.
* కోర్సు పూర్తయ్యాక ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఎలాంటి కంపెనీలు నిపుణులను నియమించుకుంటున్నాయో తెలుసుకోవాలి.
* కోర్సు కాలపరిమితిని దృష్టిలో ఉంచుకోవాలి. సదరు కోర్సును తక్కువ కాలవ్యవధుల్లో ఆఫర్ చేసే ఇన్‌స్టిట్యూట్‌లో చేరేముందు, ఆ పరిమిత కాలంలో పూర్తి నైపుణ్యాలు సాధించగలరో లేదో
విశ్లేషించుకోవాలి.
* ఇన్‌స్టిట్యూట్‌లో ల్యాబ్స్, ఇతర సౌకర్యాలనూ దృష్టిలో ఉంచుకోవాలి.
* అన్నింటి కంటే ముఖ్యంగా చేరాలనుకుంటున్న ఇన్‌స్టిట్యూట్ పాటించే ప్రమాణాలు, ఫ్యాకల్టీ అనుభవం, వారు ఎప్పటి నుంచి అక్కడ పనిచేస్తున్నారు తదితర అంశాలను స్నేహితులు, సీనియర్ల ద్వారా తెలుసుకోవాలి. కొన్ని ఇన్‌స్టిట్యూట్లు అనుభవం లేని, ల్యాబ్ కోఆర్డినేటర్‌లతో కూడా క్లాసులు నిర్వహిస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు ఇన్‌స్టిట్యూట్ల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలి.
* కొన్ని ఇన్‌స్టిట్యూట్లు తమ ప్రకటనలతో విద్యార్థులను బుట్టలో వేసుకుంటాయి. ఇంకా ఆకర్షణీయంగా డెమో క్లాసులు నిర్వహించి అభ్యర్థులను తమ వైపు తిప్పుకుంటాయి. అలాంటి ఇన్‌స్టిట్యూట్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
అమీర్‌పేటలో కోర్సుల ఫీజులు చాలా తక్కువ. పుణే, బెంగళూర్ లాంటి నగరాల్లో జావా నేర్చుకోవాలంటే దాదాపు రూ. 25 వేల వరకు ఖర్చు చేయాల్సిందే. కానీ ఇక్కడ రూ. 3 వేల నుంచి రూ.5 వేల లోపే పూర్తవుతుంది.
- ఎన్.దుర్గా ప్రసాద్, డెరైక్టర్, దుర్గాసాఫ్ట్